భారతదేశంలో జెన్ జీ తరహా ఉద్యమాలు తక్కువని కొందరంటున్నారు. సాధ్యం కాదని మరికొందరి వాదన.
ప్రస్తుత కాక్రోచ్ జనతా పార్టీ కలిగిస్తున్న సంచలనం సరికొత్త ఆలోచనలకు దారి తీస్తుందనేది కొందరి అభిప్రాయం.
వాస్తవానికి భారతదేశంలో ప్రతీ తరమూ డెబ్భై ఏళ్లుగా ఏదో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నది.
డెబ్భై ఏళ్ల కిందటి తరం స్వాతంత్ర్య పోరాటం చేసింది. తర్వాత డెబ్బైలనాటి ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించింది.
కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితమై పోరాట బావుటాను ఎగరేసిన తరమూ ఉన్నది. అంతెందుకు, 2011 నాటి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వెనుకున్నది కొత్త తరమే.
గత దశాబ్దన్నర కాలంలో సామాజిక ఉద్యమాలు, రాజకీయ వేడిని రగిలించే పరిణామాలు సమాజాన్ని బలంగా తాకలేదు.
మునుపెన్నడూ లేని విధంగా హిందూ జాతీయవాద ప్రభావం కారణంగా చాలా సమస్యలు తెరపైకి రావడం లేదు.
ప్రభుత్వ విధానాల గురించి, వాటి పరిణామాల గురించి కనీసం పైపై చర్చ కూడా లేదు.
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉన్నా, అవి ప్రధాన ఎజెండా కావడం లేదు.
దీనికి, ప్రశ్నించే వారిపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే ప్రధాన కారణమని విపక్షాలు, మేధావులు అంటున్న మాట.
సరిగ్గా ఈ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోషల్ మీడియాలో కలిగిస్తోన్న సంచలనం అందరికీ తెలిసిందే.
భారత్‌లో ఎందుకు భిన్నం? ఓటే ప్రధాన ఆయుధమా..
ఈజిప్ట్‌లో వచ్చిన తహ్రీర్ స్క్వేర్ ఉద్యమం, ఆ అనంతరం వచ్చిన ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ఉద్యమం సోషల్ మీడియా ఆధారంగా వచ్చినవే. ఆయా దేశాలలోని ప్రభుత్వ విధానాలే ఈ స్పందనకు ప్రధాన కారణం. మన దగ్గర ఈ తరహా ఉద్యమాలు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని మనవాళ్లు చెబుతున్న మాట.
ఓటు, దాని ప్రభావశీలత ప్రజాగ్రహానికి వ్యక్తీకరణగా కనిపిస్తున్నది. ఇష్టం లేని పార్టీని తర్వాతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా భావోద్వేగ అంశాలు ఎంత ప్రబలంగా ఉన్నప్పటికీ ప్రజలు వాస్తవాన్ని గుర్తిస్తున్నారు.
అంతేకాదు, భారత రాజకీయాలలో ఆర్థిక అంశాలతో పాటు కులమూ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నది. అందువల్ల ప్రజాగ్రహం బలమైన సామూహిక శక్తిగా, తక్షణ వ్యక్తీకరణగా ఉండడం లేదు.
ఎమర్జెన్సీ సమయంలో జేపీ భారీ ఉద్యమాన్ని నిర్మించి ఇందిరను ఓడించారు. ఆ సమయానికి ఆమె తిరుగులేని నాయికగా భారత రాజకీయాలలో వెలుగుతున్నారు. ప్రజలు తమ కోపాన్ని ఇందిరా గాంధీకి అధికారాన్ని దూరం చేసి చల్లార్చుకున్నారు.
సీజేపీ అజెండా ఏమిటి? ఎవరిని లక్ష్యంగా చేసుకుంది?
వర్తమానంలో ఒక అసంతృప్తి స్వరంగా వినిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా ఉండబోతున్నది? దానికి ఎజెండా ఏమిటి? ఏ అంశాలను పార్టీల ముందు పెట్టబోతున్నది? వ్యంగ్య రూపకంగా వ్యక్తీకరించిన కొన్ని అంశాల తాకిడి అన్ని పార్టీలతో పాటు ప్రధానంగా బీజేపీకి బలంగానే తాకింది. ఆ పార్టీ అధినాయకత్వం దీని గురించి బాహాటంగా ఏం చెప్పలేదు.
ఒక కేంద్రమంత్రి పరోక్షంగా దీనిపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. దీనికి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రతిస్పందించారు.
అంతేకాదు, కొన్ని ప్రశ్నలను కూడా ఆ కేంద్రమంత్రి ముందు పెట్టారు. ఇరువైపులా ప్రశ్నలతో ఉన్న అంశాలే ఇప్పుడు భారతీయ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతుదారుగా ఉన్న అభిజిత్ దీప్కే సున్నితమైన అంశాన్ని వ్యంగ్యంగా వ్యక్తీకరించారు. 2009-10 నాటి అవినీతి ఉద్యమంలో ఇలాంటి వారే సరికొత్త ఆలోచనలను, సందేహాలను, సమాధానాలను సమాజం ముందు పెట్టారు.
విచిత్రమేమిటంటే, అవినీతి వ్యతిరేక ఉద్యమ లక్ష్యాలలో ప్రధానమైనది కాంగ్రెస్‌ను గద్దె దించడం. రెండవది, అవినీతిని నిర్మూలించడం. మొదటిది జరిగింది కానీ, రెండవ దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు.
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవుతుందా?
తాజాగా సీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలుగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ఉంటుందా? రాజకీయ నిర్మాణం ఉంటుందా? ఇవే ఇప్పుడు అందరినీ తొలుస్తోన్న ప్రశ్నలు.
నిర్దిష్టంగా వీటి గురించిన సమాచారం ఎవరి దగ్గరా లేదు. దీప్కే సైతం దీని గురించి ఏమీ చెప్పడం లేదు. ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నదనే అభిప్రాయాన్ని ఈ సీజేపీ వ్యక్తీకరించిందని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్న మాట.
నిరుద్యోగం, మహిళా రిజర్వేషన్లు, పారదర్శకత వంటి అంశాలు చర్చకు వచ్చాయి. అన్నింటికంటే, పెరుగుతోన్న ధరలు, వాటి ప్రభావం ప్రధాన ఎజెండా అయ్యింది.
ఒకానొక ఆవేశానికి, అసంతృప్తికి తక్షణ ప్రతిస్పందనగా సీజేపీ వచ్చిందని కొందరి మాట. ఇదే రాబోయే రోజుల్లో ఒక కొత్త ఆలోచనకు దారి చూపుతుందని మరికొందరి ఆలోచన.
భారతదేశంలో ప్రభుత్వ విధానాలను విమర్శించే వారు, మద్దతు ఇచ్చేవారు – ఈ రెండు శిబిరాలుగా జనాభిప్రాయం ఉన్నట్టుగా అనిపిస్తున్నది. కానీ కోటానుకోట్ల మంది సర్దుకుపోవడం అలవాటు చేసుకోవడం కారణంగా ఆగ్రహాన్ని నేరుగా వ్యక్తీకరించడం లేదు. ఓటు సమయంలో వారి అభిప్రాయం ఏంటో తెలుస్తుంది.
వర్ధమాన రాజకీయాలకు కొత్త సంకేతం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయి. మార్పు కోసమని టీవీకే అధినేత చెప్పిన మాట అక్కడ బాగా పని చేసింది.
కొత్తతరం ఓటర్లు, దళితులు, ఓబీసీలు ఈ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు. అంబేద్కర్ ఫొటోలను బాగా వాడుకోవడం వలన దళితులను తనవైపు తిప్పుకున్నాడు విజయ్. కొత్త తరం ఓటర్ల అసంతృప్తి ఏ అంశాల్లో ఉన్నదో దాన్ని గుర్తించడంలో టీవీకే విజయవంతమైంది. అలవికాని హామీల కంటే, ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచనే బహుశా ఓటర్లకు ఉన్నట్టు ఉన్నది.
నేపాల్, శ్రీలంక తదితర దేశాల మాదిరిగా యువత ఉద్యమించే అవకాశాలు చాలా తక్కువని రాజకీయ పండితుల భావన. సీజేపీ ఒక నిర్మాణ రూపంతో పాటు వర్ధమాన రాజకీయాలపై సరైన నరేషన్‌ను సృష్టించగలిగితే రాజకీయాలలో సంచలనం ఉండొచ్చు.
కాక్రోచ్ పార్టీ నిలబడుతుందో లేదో తెలియదు కానీ, పార్టీలు, నాయకులు తమ విధానాలు మార్చుకోవాలని, ప్రజాసమస్యలు గుర్తించాలని ఒక బలమైన సంకేతాన్ని మాత్రం పంపిస్తున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
