‘విధేయత లేకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం వంటివి ఉద్యోగం నుంచి తీసేయడానికి తగినంత కారణాలు కావు.’
సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగిని క్రమశిక్షణా రాహిత్యం, అవిధేయత వంటి కారణాలతో సర్వీస్ నుంచి తొలగించలేమని, అవినీతి, నైతిక పతనం లేదా యజమానికి నష్టం కలిగించే దురుద్దేశపూర్వక చర్యల కేసులకే సర్వీస్ నుంచి తొలగించే క్రమశిక్షణ చర్యను పరిమితం చేయాలని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.
తాము పని ప్రదేశంలో క్రమశిక్షణ ప్రాముఖ్యతను తక్కువ చేసి చూపడం లేదని, అయితే “అవినీతి, అక్రమ పారితోషికం, నైతిక పతనం, నిధుల దుర్వినియోగం, యజమానికి నష్టాన్ని నిరూపించడం, బహిరంగ నింద లేదా సంస్థకు అప్రతిష్ట తెచ్చే ప్రవర్తన” లేనప్పుడు, ఉద్యోగిపై తొలగింపు వంటి తీవ్రమైన శిక్షను ప్రయోగించలేమని జస్టిస్ సంజయ్ కరోల్, ఎన్‌కె సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
“శిక్ష అనేది దుష్ప్రవర్తన తీవ్రతకు, గత సర్వీస్ రికార్డుకు, పరిసర పరిస్థితులకు, సంస్థపై ఆ దుష్ప్రవర్తన చూపిన ప్రభావానికి తగినట్లుగా(సమతుల్యంగా) ఉండాలి” అని ధర్మాసనం తెలిపింది.
ఉద్యోగం నుంచి తొలగించబడటం అనేది ఒక వ్యక్తి సర్వీస్ రికార్డ్‌పై ‘శాశ్వత కళంకం’గా మిగిలిపోతుందని, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఉద్యోగం తీసేయడం కుటుంబానికి నష్టం..
మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒక ఉద్యోగిని తొలగిస్తూ 2017లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, “ఉద్యోగం నుంచి తొలగించడం అనేది యజమాని-ఉద్యోగి సంబంధాన్ని శాశ్వతంగా తెంచివేస్తుందని, ఉద్యోగిని వారి పదవీ విరమణ ప్రయోజనాల నుంచి దూరం చేస్తుంద”ని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది.
“ఇది ఉద్యోగికి ప్రస్తుత ఆదాయ వనరును కోల్పోయేలా చేయడమే కాకుండా, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా నష్టం కలిగిస్తుంది” అని కోర్టు జోడించింది.
ఉద్యోగం నుంచి తొలగించబడటం అనేది ఒక వ్యక్తి సర్వీస్ రికార్డ్‌పై “శాశ్వత కళంకం”గా మిగులుతుందని, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని, “ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, చట్టబద్ధమైన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పూర్వచరిత్ర, సర్వీస్ రికార్డులు ప్రాధాన్యత కలిగిన ఇతర నియంత్రిత సంస్థలలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది” అని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు.
“ఈ కారణంగా, సర్వీస్ నుంచి తొలగింపు అనేది అత్యంత తీవ్రమైన స్వభావం కలిగిన దుష్ప్రవర్తన కేసులకే పరిమితం కావాలి. ఎక్కడైతే సానుభూతితో కూడిన పరిశీలన అవాంఛనీయం, అనుచితం అవుతుందో అక్కడ మాత్రమే దీనిని ఉపయోగించాలి” అని జస్టిస్ సింగ్ అన్నారు.
మహారాష్ట్ర విద్యుత్ సంస్థకు ఆదేశాలు..
ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు దాటిన సదరు ఉద్యోగి అందించిన 21 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుని, ఆమెపై మోపబడిన క్రమశిక్షణా రాహిత్యం, అవిధేయత, ధిక్కరణ, అధికారిక పత్రాల ధ్వంసం వంటి ఆరోపణల స్వభావాన్ని బట్టి విధించాల్సిన శిక్షను పునఃసమీక్షించాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
