సీపీఐ-ఎం సీనియర్ నాయకులు, రైతాంగ ఉద్యమ నిర్మాత, రైతు సంఘం అఖిల భారత నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి ఈరోజు ఉదయం మూడు గంటలకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సారంపల్లి మల్లారెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి ఆయన విప్లవ జోహార్లు అర్పించారు.
నలభై ఏళ్ల అనుబంధం..
కామ్రేడ్ మల్లారెడ్డితో తనకు సుమారు 40 సంవత్సరాల అనుబంధం ఉందని బీ వెంకట్ గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా, తాను వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా కలిసి పనిచేశామని తెలిపారు.
రైతాంగ, వ్యవసాయ కార్మిక ఉద్యమాల నిర్మాణంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఎన్నటికీ మరచిపోలేనిదని వివరించారు.
ఉద్యమానికి తీరని లోటు..
రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, పేద రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడటంలో కామ్రేడ్ మల్లారెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఆయన మరణం రైతాంగ ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రగాఢ సానుభూతి.. విప్లవ జోహార్లు..
కామ్రేడ్ మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, సహచరులకు, రైతాంగ ఉద్యమ కార్యకర్తలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) తరఫున, తన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు బీ వెంకట్ వెల్లడించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
