దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత “చదవడం లేదు, పని చేయడం లేదు, లేదా శిక్షణ పొందడం లేదు” అని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.
న్యూఢిల్లీ: భారత్‌లో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న ఎనిమిది కోట్ల తొంభై లక్షల(8.9 కోట్ల) మంది యువకులు “చదవడం లేదు, పని చేయడం లేదు, శిక్షణ పొందడం లేదని” నీతి ఆయోగ్ తాజా నివేదికలో పేర్కొన్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం తెలియజేసింది.
“రీ ఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047” (వికసిత్ భారత్ కోసం నైపుణ్యాల పునరాలోచన) శీర్షికతో 2021లో నిర్వహించిన 78వ నేషనల్ శాంపిల్ సర్వేలో కనుగొన్న విషయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
ఐదు విభాగాలుగా యువత వర్గీకరణ..
15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న యువతను ఐదు విభాగాలుగా వర్గీకరించారు.
పాఠశాల విద్య, ఉన్నత విద్య, అధికార-అనధికార పనులు, ఉపాధి-శిక్షణ-విద్యలో లేని (నీట్) యువత, మహిళలు అని విభజించారు.
“శ్రామిక శక్తి, నీట్ యువత అవసరాలు మారుతున్నాయి. కొత్తగా పుట్టుకొస్తున్న రంగాలు, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా స్వయం ఉపాధి మార్గాలు, వృత్తి జీవితపు మధ్య దశలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే వైపు యువత మారాల్సిన అవసరం ఉంది” అని నీతి ఆయోగ్ నివేదిక అభిప్రాయపడింది.
పెరుగుతున్న నిరుద్యోగం..
ఈ ఏడాది మార్చి 2026లో అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన “స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026” నివేదిక ప్రకారం, 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు 40 శాతం యువకులు నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది.
గ్రాడ్యుయేట్లలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే సంవత్సరం లోపు శాశ్వత వేతన ఉపాధిని పొందుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది.
సీజేపీ ఆందోళనల నేపథ్యం..
నీట్(జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) పరీక్షల్లో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనల ఫలితంగా అప్పటి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
ఈ ఆందోళనలు ముగిసిన కొద్ది రోజులకే నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది.
సీజేపీ నిరసనల ప్రభావంపై ఇటీవల ‘ది వైర్’ వ్యాసకర్త సీపీ రాజేంద్రన్ వ్యాఖ్యానిస్తూ, “గత ఉద్యమాల మాదిరిగానే సీజేపీ ఉద్యమం కూడా 2026 నీట్ పేపర్ లీక్ అనే ఒక నిర్దిష్టమైన సాధారణ సమస్యతో మొదలై, వ్యవస్థాగత లోపాలపై ఒక విస్తృతమైన తిరుగుబాటుగా పరివర్తన చెందింది” అని అన్నారు.
ప్రధాని ప్రసంగంలో ప్రస్తావన లేమి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 13వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో “దిమాగీ నక్సల్స్” లేదా “మేధావి నక్సల్స్”కు వ్యతిరేకంగా హెచ్చరించారు.
యువతకు ఏఐ (కృత్రిమ మేధ)లో శిక్షణ, పోటీ పరీక్షలకు కోచింగ్ తరగతుల గురించి ప్రకటించారు.
కానీ ఇటీవల జరిగిన యువత నిరసనల గురించి ఆయన ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
