1847లో శాండ్బ్యాక్, టిన్నె అండ్ కంపెనీ లివర్‌పూల్ కార్యాలయానికి రాసిన ఒక లేఖ కీలక విషయాన్ని వెల్లడించింది.
పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో పరిహారం పొందిన తర్వాత కూడా ఆ సంస్థ బానిసల అక్రమ రవాణాలో పాలుపంచుకున్నట్లు ఆ లేఖ స్పష్టం చేస్తోందని పుస్తకం పేర్కొంది.
బ్రిటన్ బానిసత్వాన్ని రద్దు చేసినప్పుడు, అప్పటి శక్తివంతమైన కుటుంబాలకు చెందిన తోటల యజమానులు భారీ మొత్తంలో పరిహారం పొందారు.
అయితే, బానిసలుగా మగ్గిన వారికి మాత్రం ఎలాంటి పరిహారం దక్కలేదు.
ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఆధారాలు మరో విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో అత్యధిక పరిహారం పొందిన వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంస్థ అయిన శాండ్బ్యాక్, టిన్నె అండ్ కంపెనీ, బానిసత్వం రద్దయిన తర్వాత కూడా దక్షిణ అమెరికాలోని గయానాకు ఆఫ్రికన్ బానిసలను అక్రమంగా తరలించడం కొనసాగించినట్లు ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ విషయాన్ని తన కుటుంబ చరిత్రపై పరిశోధన చేస్తున్న రచయిత మాలిక్ అల్ నాసిర్ రాసిన ‘సెర్చింగ్ ఫర్ మై స్లేవ్ రూట్స్’ అనే పుస్తకంలో వివరంగా వెల్లడించారు.
పరిశోధనలో వెలుగులోకి వచ్చిన అంశాలు ‘ఓవర్రైటింగ్–అండర్‌రైటింగ్’ అనే కొత్త పరిశోధనా ప్రాజెక్ట్‌కు స్ఫూర్తినిచ్చాయి.
బానిసత్వ వ్యవస్థ వెనుక పనిచేసిన ఆర్థిక సంబంధాలు, నిధుల ప్రవాహాలు, వ్యాపార నెట్‌వర్క్‌లను వెలికితీయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
బానిస వాణిజ్యం, దాని రద్దును స్మరించుకునే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.
1807లో అమల్లోకి వచ్చిన ‘స్లేవ్ ట్రేడ్ యాక్ట్’ బ్రిటిష్ పాలనలోని ప్రాంతాల్లో మనుషుల బానిస వాణిజ్యాన్ని రద్దు చేసింది.
అనంతరం, 1833లో అమలులోకి వచ్చిన ‘స్లేవరీ అబాలిషన్ యాక్ట్’ బ్రిటిష్ సామ్రాజ్యంలోని చాలా ప్రాంతాల్లో బానిసత్వ వ్యవస్థనే నిషేధించింది.
ఆ లేఖలో ఏముంది?
అయితే, 1847లో గయానాలోని డెమెరారా ప్రాంతంలో సంస్థ వ్యవహారాలను పర్యవేక్షించిన పీటర్ మిల్లర్ వాట్సన్, శాండ్బ్యాక్ టిన్నె సంస్థ లివర్‌పూల్ కార్యాలయానికి రాసిన ఒక లేఖలో కీలక విషయం వెల్లడైంది.
సంస్థకు చెందిన నౌకాదళంలోని ఒక నౌక “నల్లజాతీయుల సరుకుతో” వచ్చిందని, ఆ సరుకులో డజన్ల కొద్దీ చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖలో ‘ది పార్కర్’ అనే నౌకలో 115 మంది వయోజన పురుషులు, 86 మంది వయోజన మహిళలు, 14 ఏళ్లలోపు 82 మంది పిల్లలు, 4 ఏళ్లలోపు 41 మంది చిన్నారులు ఉన్నట్లు వివరించారు.
“ప్రయాణంలో కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు—ఒక పురుషుడు, ఇద్దరు పిల్లలు. వారు ఒడ్డున అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవించినందువల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని కెప్టెన్ ఆర్ పేర్కొన్నారు” అని ఆ లేఖలో ఉంది.
అప్పటికే బానిసత్వం రద్దయింది.
మరి ‘ది పార్కర్’ నౌకలో ఉన్నవారు ఒప్పంద కార్మికులు కాదని, లేదా బ్రిటిష్ రాయల్ నేవీ బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన ఆఫ్రికన్లు కాదని మనకు ఎలా తెలుసు?
మొదటగా, వాట్సన్ వారిని ప్రయాణికులు అని కాకుండా, స్పష్టంగా ‘సరుకు’ అని పేర్కొన్నారు.
విముక్తి పొందిన ఆఫ్రికన్లను సరుకుగా పరిగణించేవారు కాదు; బానిసలుగా ఉన్న ప్రజలను మాత్రం ‘సరుకు’గా పేర్కొనేవారు.
“వారు ఒడ్డున జీవించిన ‘దయనీయమైన పరిస్థితి’ గురించి వాట్సన్ ప్రస్తావించిన తీరు గమనించాలి. వారు అప్పటికే అలాంటి దుస్థితిలో ఉన్నవారనే భావనను కలిగించేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకవేళ వారు గతంలో బానిసలుగా ఉండి ఉంటే, వారి దుర్భర పరిస్థితికి వారి మాజీ యజమానులే బాధ్యులని చెప్పేవారు. అంతేకాదు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను ఎవరూ కొనుగోలు చేయరు. అలాగే, వాట్సన్ ‘మరణాలు’ గురించి ప్రస్తావించినప్పుడు, వాటిని మనుషుల ప్రాణనష్టంగా కాకుండా తనకు జరిగిన ఆస్తి నష్టంగా పరిగణిస్తున్నాడు. ఈ ఆధారాలన్నింటినీ కలిపి పరిశీలిస్తే, ‘ది పార్కర్’ నౌకలో ఉన్నవారు ఆఫ్రికా నుంచి అక్రమంగా బానిసలుగా తరలించబడినవారేనని నిర్ధారించవచ్చు” అని మాలిక్ వివరిస్తూ అన్నారు.
పీటర్ మిల్లర్ వాట్సన్ బ్రిటన్ మాజీ ప్రధాని విలియం గ్లాడ్స్టోన్కు దూరపు బంధువు.
ఆయన కుమారుడు ఆండ్రూ వాట్సన్ 1880లలో స్కాట్లాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆడిన తొలి నల్లజాతీయుడిగా చరిత్రలో నిలిచాడు.
వ్యాపారులకు అందిన భారీ పరిహారం..
ఇక 1975లో సంస్థను మూసివేసిన శాండ్బ్యాక్ టిన్నె, శాండ్బ్యాక్, టిన్నె కుటుంబాలకు చెందిన వ్యాపార సంస్థ.
ఈ కుటుంబాలు తమ వ్యాపార భాగస్వాములు, అలాగే గ్లాడ్‌స్టోన్ కుటుంబంలోని బంధువులతో కలిసి డెమెరారా ప్రాంతపు చక్కెర వ్యాపారంపై గట్టి ఆధిపత్యం చెలాయించాయి.
1847లో ఆ లేఖ రాసే సమయానికి, శాండ్బ్యాక్ టిన్నె సంస్థ, దాని అనుబంధ సంస్థలు బానిసత్వం రద్దుకు ముందు తాము బానిసలుగా ఉంచుకున్న ప్రజలను “కోల్పోయినందుకు” పరిహారంగా, నేటి విలువ ప్రకారం కోట్లాది పౌండ్లకు సమానమైన మొత్తాన్ని ఇప్పటికే పొందాయి.
ఆ సంస్థలో కుటుంబ పెద్ద శామ్యూయెల్ శాండ్బ్యాక్ 1833లో భాగస్వామ్యం నుంచి వైదొలిగినప్పటికీ, 1847 నాటికి ఆయన కుమారుడు విలియం రాబర్ట్సన్ శాండ్బ్యాక్, అల్లుడు చార్లెస్ స్టువర్ట్ పార్కర్ జూనియర్ సంస్థలో ప్రధాన వాటాదారులుగా ఉన్నారు.
బానిస యజమానులకు ఇచ్చిన పరిహారం కోసం బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడిన అప్పు కూడా 2015లోనే పూర్తిగా తీరింది.
“గయానా, జమైకాల్లో తోటలను కలిగి ఉన్న విలియం గ్లాడ్‌స్టోన్ తండ్రి జాన్ గ్లాడ్‌స్టోన్, ఒక వ్యక్తిగా అత్యధిక పరిహారం పొందాడు. మొత్తంగా చూస్తే, శాండ్బ్యాక్ టిన్నె సంస్థ రెండో అత్యధిక పరిహారం పొందింది. ఈ పరిహారం పథకాన్ని రూపొందించిన వారిలో వారిద్దరూ కూడా ఉన్నారు”అని మాలిక్ అన్నారు.
కొనసాగిన అక్రమ రవాణా..
బానిసత్వ నిర్మూలనను కోరిన బానిసలే 1823లో డెమెరారాలో చేపట్టిన తిరుగుబాటు, బానిసత్వాన్ని రద్దు చేయాలనే పోరాటంలో కీలక మలుపుగా నిలిచింది.
జాన్ గ్లాడ్స్టోన్కు చెందిన ఒక తోటలోనే ఈ తిరుగుబాటు ప్రారంభమైంది.
అయితే అల్ నాసిర్ తెలిపిన ప్రకారం, 1847లో ఒక మిషనరీ రాసిన నివేదికలో “రేఖకు దక్షిణంగా” బానిసల అక్రమ వాణిజ్యం ఎలాంటి నియంత్రణ లేకుండా కొనసాగుతున్నట్లు వివరించారు.
ఇక్కడ “రేఖ” అంటే భూమధ్యరేఖ. అంటే, రాయల్ నేవీ విధించిన నౌకా దిగ్బంధనాన్ని తప్పించుకుంటున్న బానిస యజమానులు, భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అంగోలా వంటి దేశాల నుంచి ప్రజలను బానిసలుగా పట్టుకుని అక్రమంగా తరలించడం కొనసాగించారని ఆ నివేదిక వెల్లడించింది.
1808 నుంచి బానిసలను అక్రమంగా తరలించే నౌకలను అడ్డుకోవడం రాయల్ నేవీకి చెందిన ‘వెస్ట్ ఆఫ్రికా స్క్వాడ్రన్’కు అప్పగించారు.
ఈ చర్యల్లో దాదాపు 1,600 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు.
అయితే, బానిసల అక్రమ రవాణాలో పాల్గొన్న నౌకల్లో 10 శాతానికి కూడా తక్కువ నౌకలను మాత్రమే అధికారులు అడ్డుకోగలిగినట్లు అంచనా.
నౌకలను విజయవంతంగా అడ్డుకున్న సందర్భాల్లో కూడా పరిస్థితి పెద్దగా మారలేదు.
విముక్తి పొందిన ఆఫ్రికన్లు అని పిలిచిన వారికి సైన్యంలో బలవంతపు నియామకం, అలాగే ‘అప్రెంటిస్‌షిప్’, ఒప్పంద కార్మిక వ్యవస్థల కింద కఠినమైన, వేతనం లేని శ్రమ తప్పలేదు.
చరిత్రను తవ్వితీస్తున్న కొత్త ప్రాజెక్ట్..
ఓవర్రైటింగ్–అండర్‌రైటింగ్ ప్రాజెక్ట్ లివర్‌పూల్ మ్యూజియంలో ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ జమైకన్ విద్యావేత్త ప్రొఫెసర్ వెరీన్ షెపర్డ్ ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు.
అనంతరం అల్ నాసిర్, లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన లూసీ మోయినిహాన్ పాల్గొనే చర్చా కార్యక్రమం జరగనుంది.
ఈ చర్చకు ఇంటర్నేషనల్ స్లేవరీ మ్యూజియం అధిపతి మిషెల్ చార్టర్స్ అధ్యక్షత వహించనున్నారు.
జాన్ గ్లాడ్స్టోన్కు చెందిన బీమా “రిస్క్ బుక్స్”పై లూసీ మోయినిహాన్ చేసిన పరిశోధన, అలాగే శాండ్బ్యాక్ టిన్నె సంస్థపై అల్ నాసిర్ చేసిన పరిశోధనలు ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచాయి.
ఇది ‘కనెక్టర్’ ప్రాజెక్ట్‌కు ప్రయోగాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం.
నేషనల్ మ్యూజియమ్స్ లివర్‌పూల్ ఆధ్వర్యంలోని ఈ ప్రాజెక్ట్, అట్లాంటిక్ సముద్రం అవతల సాగిన బానిసత్వం వల్ల నేటికీ మిగిలి ఉన్న ప్రభావాలు, వారసత్వాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్ నుంచి 10 లక్షల పౌండ్ల గ్రాంట్ లభించింది.
అట్లాంటిక్ బానిసత్వంలో చారిత్రకంగా తమ సంస్థ పోషించిన పాత్రకు మారిటైమ్ సంస్థ లాయిడ్స్ రిజిస్టర్ గత ఏడాది క్షమాపణలు చెప్పింది.
శాండ్బ్యాక్ కుటుంబం, గ్లాడ్‌స్టోన్ కుటుంబానికి చెందిన వారసులు కూడా తమ పూర్వీకులు బానిసత్వంలో భాగస్వాములైనందుకు ఇప్పటికే క్షమాపణలు తెలిపారు.
క్రిష్ ఓషు, గార్డియన్ కమ్యూనిటీ అఫైర్స్ ప్రతినిధి.
అనువాదం: మనోహర రాజు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
