కొంచెం ఆలస్యం అయినా ‘నావిగేషన్’ మాత్రం సరిగ్గా జరిగింది. దేన్నీ అయినా ‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి…’ అంటుంటారు కదా.. అలాగన్న మాట.
ఎప్పుడు… ఏమి పోయింది, ఎక్కడ పోయింది, దాన్ని ఎక్కడ వెతుకుతున్నాము? అంటే.. అంతా ‘పర్ఫెక్ట్’గా జరుగుతూ ఉంది, ఆ విషయం మాత్రం స్పష్టం అవుతూ ఉంది.
మొదట వాళ్లను ‘జెన్ జీ’ అన్నారు. ఆ తర్వాత వాళ్లను ‘పరాన్నజీవులు’, ‘కాక్రోచ్’లు అంటే- “అవును మీరన్నది నిజమే మేము బొద్దింకలం, పరాన్నజీవులం మాది ‘కాక్రోచ్ జనతా పార్టీ’” అని వారే అన్నారు.
ఇంత అయ్యాక, ఇప్పుడు వాళ్లు ‘కాక్రోచ్ సీజన్-2’ అంటున్నారు.
కాక్రోచ్ల ఆక్రోశం వెనుక..
సరే, పేరు ఏదైనా కావొచ్చు, కానీ వారి గొంతుల్లో నిజాయితీ ఉందా? దాని మాట ఏమిటి? అవును, నిజమే మొదటి నుంచి ఆ సమస్య స్వభావాన్ని ‘గ్రాస్ రూట్స్’ వద్ద నుంచి చూస్తున్నవారికి ఆ ‘గ్రామర్’ ఏమిటో తెలుసు.
అక్కడ సమస్య ఉన్నట్టుగా స్పష్టంగా చానాళ్లుగా వారికి అర్థమవుతూనే ఉంది.
ఎందుకంటే, గడచిన మూడు నాలుగు దశాబ్దాలుగా మన చదువులు ఎలా మారాయి- అనే విషయ కాల పరిణామక్రమ స్పృహ ఉన్నవారికి… ఇప్పుడు చూస్తున్నవి ఎందుకు ఇలా జరుగుతున్నాయో స్పష్టమే.
ఎదురు చూసి, చూసి, విసిగి చివరికి “అవును మేము ‘కాక్రోచ్’లమే…” అని పిల్లలు అంటుంటే, ఆ ‘కాక్రోచ్’ల ఆక్రోశం వెనుక ఉన్న మనదైన నిష్క్రియాపరత్వాన్ని ఆలస్యంగా అయినా అర్థం చేసుకుంటున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది.
“అమ్మానాన్నలుగా ఇందులో మన తప్పు ఎంత?” అని వారు ఇప్పుడు గతాన్ని ‘రీక్యాప్’ చేసుకుంటున్నారు.
ప్రైవేట్ ట్రాప్లో తల్లిదండ్రులు..
మన పిల్లల ఆసక్తులు ఏమిటి? వాళ్ల ‘ఐక్యూ’ స్థాయి ఏమిటి? అనే ఆరా లేకుండా… కేవలం పత్రికల్లోని ఫుల్ పేజీ ప్రకటనలు చూసి, మనకు స్తోమతు లేకపోయినా అప్పులు చేసి మరీ కార్పొరేట్ కాలేజీల్లో ఎందుకు చదివించామా- అని; తీరా బీటెక్ చదివి కూడా, ఐటీఐ చదివిన వాళ్లతో సమానంగా పాతికవేల జీతాల ‘జాబ్స్’ తో పిల్లలు జీవితాల్ని నెట్టుకొస్తుంటే, వారి తల్లిదండ్రులు హతాశులవుతున్నారు.
ఇరుగు పొరుగును చూసి ఆశపడి అమెరికా కలలు కని, ఆస్తులు అమ్మి పిల్లల్ని అక్కడికి పంపితే, అక్కడి అమెరికా రాజకీయాలు, ఇక్కడ ఊళ్లో ఉన్న మన కుటుంబ ఆర్థిక రాతల్ని మార్చే నడమంత్రపు రోజుల్లో ఉన్నట్టు ఆలస్యంగా అర్థమవుతూ ఉంది.
రేపు ఏమిటో? అనేది సగటు కుటుంబానికి భరోసా ఇవ్వలేని బలహీన స్థితిలో మన నాయకత్వం ఉంటే, వీళ్లను నమ్మి ‘ప్రైవేట్ ట్రాప్’లో పడి మంచాలు ఎక్కే మధ్యతరగతి అమ్మనాన్నలు; అర్ధ ఆయుష్కులు కావడము చూస్తున్న ఇంటింటి కథే.
అసలు అదొక- ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ సూత్రంతో, చౌక ‘లేబర్’ కోసం ప్రపంచ మార్కెట్ మన వంటి దేశాలపై విసిరే ‘పొలిటికల్ ఎకానమీ’ వల అనే ఎరుక మనకు లేదు.
సకాలంలో వాటికి ప్రత్యామ్నాయం మన సర్కారులు చూపవు. కడాన ఏవో డిగ్రీలు తెచ్చుకున్నా, చివరికి ఇళ్లవెంట తిరిగే ఉద్యోగాలతో పిల్లలు సరిపెట్టుకోవలసి వస్తున్నదే- అని గుర్రుగా ఢిల్లీ వైపు చూస్తే.
“ఏమి రోడ్డు పక్కన పకోడీలు వేసుకోవడం ఉపాధి కాదా?” అని నేతలు తిరిగి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. పైగా ఒకప్పటి ‘రోజు వారీ కూలి’ పనులకు- ‘గిగ్ ఎకానమీ’ అని కొత్త పేరు పెడుతున్నారు.
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన..
‘కాక్రోచ్ సీజన్-2’ అంటూ బయటకు వస్తున్న ‘జెన్ ఆల్ఫా’ ఏకరువు పెడుతున్న అనుభవాలు వింటున్నప్పుడు, మన పిల్లలకు హైస్కూల్ చదువులు అయ్యే లోపే, ఈ దేశంలో ప్రాథమిక హక్కులు కోల్పోవడం అంటే ఏమిటో, ఓటు హక్కు రాకముందే అర్థమయ్యేట్టు తర్ఫీదు ఇస్తున్నట్టుగా ఉంది.
అదేంటి… అవును మరి- ‘నేచర్ కాల్స్’ అనే ప్రకృతి సహజ మల-మూత్ర విసర్జన అవసరాలు, పిల్లలు ప్రభుత్వ బడిలో కనుక ఉంటే, బలవంతంగా వాటిని ఆపుకోవాలి. ఇక అది ఆడపిల్లల అవసరాలు కనుక అయితే, బడి అయ్యాక వాళ్లు ఇంటికి వెళితేనే అవి తీరేది.
గత నలభై ఏళ్లలో చదువుల సంస్కరణలు గురించి పలు నిపుణుల కమిటీలు ఢిల్లీ సర్కారులకు సమర్పించిన నివేదికలు నిరర్థకం అయ్యాయి.
ఆర్థిక సంస్కరణలతో వచ్చిన ‘ప్రైవేట్’ రంగ వ్యాప్తికి అడ్డు అదుపు లేకపోవడంతో, అది చదువుకు చెద పట్టించింది. సామాజిక శాస్త్రాల చదువులు అక్కరలేదనే విధానం ఎటువంటి (‘విజన్’) భవిష్యదృష్టి అనేది, 1995లో అది మొదలయినప్పుడు అర్థమయిన వారు తక్కువ.
ముప్పై ఏళ్ల తర్వాత… “తెలుగువారికి చర్మ స్పృహ తక్కువ, అది దేనికీ స్పందించదు..” అని ‘జంతర్ మంతర్’ తర్వాత కొందరు మనల్ని కొత్తగా ‘డయాగ్నైజ్’ చేస్తుంటే, దాని మూలాలు తెలిసినవారు, ఇంటిగుట్టు బయటకు ఎందుకు అని మౌన మునులుగా ఉంటున్నారు.
పబ్లిక్ పాలసీల్లో లోపాలు..
ఎన్నికల్లో 18 ఏళ్లకు తొలి ఓటు వేస్తున్న యువత వయస్సులో తమకంటే రెట్టింపు వయస్సు ఉన్నవారిని తమ ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు. వాళ్లు తమకంటే మరో పదేళ్లు పెద్ద వయస్సు ఉన్నవారిని తమ లెజిస్లేచర్, పార్లమెంటు నాయకులుగా ఎన్నుకుంటున్నారు.
అటువంటప్పుడు దేశంలోని ‘జెన్ జీ’ లేదా ‘జెన్ ఆల్ఫా’ మనోభావాలు వారి ప్రాధాన్యతలు; మన ప్రభుత్వ పాలసీలుగా ఎలా మారతాయి? ఇటువంటి భిన్న సమూహాల మధ్య ‘టూ వే కమ్యూనికేషన్స్’కు ఆస్కారమిచ్చే మానవ సంబంధాలను ప్రోది చేసే సామాజిక శాస్త్రాల చదువుల్ని అటక ఎక్కించి, “దేశం నాడి దొరకడం లేదు..” అంటే, అది ఎలా దొరుకుతుంది? ఏ పరిష్కారానికి అయినా ఉపరితలంలో ఉన్నవే కారణాలు అని దబాయించే మేధోవర్గం, ఎప్పటిలా ఈ సమస్య మూలాలు దేశ సరిహద్దుల బయట ఉన్నవని, వాటి కోసం అది అక్కడ వెతుకుతూ ఉంది.
కానీ ఇక్కడ విషయం ఏమంటే, ఒకానొక కాలంలో ఒకానొక ఖండంలోని యువత సహజ ప్రవర్తన, అక్కడి దేశాల భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఒకే తీరుగా ఉంటుంది, అనే అతి సాధారణ మానవీయ జ్ఞాన గ్రహింపు లేకుండా “ఇండియా ‘కాక్రోచ్’ లకు ‘చైనా ఎలుకలు’ ప్రేరణ..” అంటూ కొందరు మాట్లాడుతున్నారు.
దశాబ్దాల తరబడి ఏడాది పొడవునా ‘ఎన్నికల రాజకీయమే’ ఊపిరిగా ‘పబ్లిక్ పాలసీ’ ఉండాలని, కోరుకునే అర్ధజ్ఞాన నాయకులకు ఇటువంటి సున్నిత సమస్యల మూలాలను వెతికే ‘చదువు’ లేకపోవడమే- ‘జంతర్ మంతర్’ ధర్నా అది ఇక్కడ మనకు బోధపడకపోయినా ప్రపంచ వార్త కావడానికి మూల కారణం.
సామాజిక స్పృహ పెంచుతున్న జెన్ ఆల్ఫా..
ఇప్పుడు ఇంకా విషయం సద్దుమణగకుండా ‘కాక్రోచ్ సీజన్-2’ అంటూ కొత్తగా బయటకు వస్తున్న ‘జెన్ ఆల్ఫా’ తరం 2010 తర్వాత పుట్టిన పిల్లలు.
పదిహారేళ్ల వయస్సులో వాళ్లు తమ చదువుతున్న లేదా చదివి బయటకొచ్చిన ప్రభుత్వ బడుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం గురించి- ఎటూ సందర్భం వచ్చింది కదా అని వారూ మాట్లాడుతున్నారు.
పైగా తమ చేతిలోని ఫోన్ కెమెరాతో తీసిన తమ బడి పరిసరాల ఫోటోలు, వీడియోలు మా ఫిర్యాదుకు ‘ఆడియో-విజువల్ ప్రూఫ్’ అంటూ, వాళ్లు వాటిని ‘ఆన్లైన్లో’ చెలామణిలో ఉంచుతున్నారు.
‘స్కూల్స్ ఠీక్ కరో’, ‘ఫిక్స్ రూరల్ గవర్నమెంట్ స్కూల్స్’ నినాదంతో మూడు అంశాలతో వాళ్లు దేశమంతా సామాజిక స్పృహ కల్పిస్తున్నారు.
తమ స్కూళ్లలో మంచినీళ్లు, టాయ్లెట్ సౌకర్యాలు, స్కూల్కు కరెంటు, క్లాస్ రూమ్లు వాటి భద్రత, ప్రహరీ గోడలు స్కూలు పరిసరాల భద్రత ఉండాలని ఇప్పుడు వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
అలా తమ సౌకర్యాల విషయంలో స్థానిక సంస్థల ప్రతినిధులు లేదా ఎమ్మెల్యేల వైఫల్యాలను బడి పిల్లలు బజారులో పెడుతున్నారు.
ముందుచూపుతో ఏపీ సర్కార్ జీవో..
ఈ మాట అంటున్నప్పుడు, ఇక్కడే ఆగి కాస్త వెనక్కి వెళ్లి చూస్తే, చీకటి గుహ చివర కన్పిస్తున్న వెలుగు కిరణంలా 16 జూన్ 2023 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 55లోని విషయాలు కనిపిస్తున్నాయి.
అందులో రూ 280 కోట్లతో 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రన్నింగ్ వాటర్ ఫెసిలిటీతో ‘టాయ్లెట్’ సౌకర్యాలు, త్రాగునీరు సౌకర్యం, మేజర్ మైనర్ రిపేర్లు, కరెంట్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, విద్యార్థులు లెక్చరర్లకు ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డ్, కాంపౌండ్ వాల్, నైట్ వాచ్మెన్ నియామకం ఇన్ని సౌకర్యాలకు ప్రభుత్వం ఆ ఒక్క జీవోలో అనుమతి ఇచ్చింది.
అయితే, అందుకేనా జూన్ నెలలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి- “అలా అయితే, మేము కూడా ‘కాక్రోచ్’లమే..” అన్నది అని ఇప్పుడు అనిపిస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
