స్మార్ట్ మీటర్లు, అధిక విద్యుత్ బిల్లులు, విద్యుత్ ఛార్జీల పెంపుపై త్రిపుర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో అసాధారణంగా పెరిగిన విద్యుత్ బిల్లుల వసూళ్లను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
అగర్తలా: త్రిపుర రాష్ట్రంలో మే 2026 నుంచి అసాధారణంగా పెరిగిన విద్యుత్ బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
కొన్ని వారాల పాటు జరిగిన జాతీయ రహదారుల దిగ్బంధనాలు, విద్యుత్ కార్యాలయాల ఘెరావ్, మాస్ అరెస్టుల వల్ల రాష్ట్ర అధికార కూటమిపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. దాంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
ఆగస్టు 10న ఒక్క రోజే అగర్తలాలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) దాని అనుబంధ సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చిన “జైల్ భరో” నిరసన సందర్భంగా సుమారు 6,000 మందిని అరెస్టు చేసినట్లు రైతుల సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.
సమస్యాత్మకమైన స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ ఛార్జీల భారీ పెంపుపై జరుగుతున్న విస్తృత ఆందోళనలో భాగమే ఈ నిరసన.
ఈ వివాదం త్రిపుర ప్రస్తుత, మాజీ విద్యుత్ మంత్రుల మధ్య బహిరంగ వాగ్వాదానికి దారితీసింది. ప్రస్తుత మంత్రి రతన్ లాల్ నాథ్, ఆయన పూర్వగామి మాణిక్ దే ఒకరి తర్వాత ఒకరు విలేకరుల సమావేశాలు నిర్వహించి, పరస్పరం విమర్శలకు దిగారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ కొన్ని నెలల్లోనే పనిచేయకుండా పోయిందని రాష్ట్ర ఆడిట్లో తేలింది. ప్రజలు నిజంగా వాడే విద్యుత్‌కు, వస్తున్న బిల్లులకు ఎలాంటి సంబంధం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు నెలలుగా, చిన్న షాపుల యజమానుల నుంచి సోలార్ విద్యుత్ వాడుతున్న ఇళ్ల వరకు అనేక మంది వినియోగదారులు తమ అసలు వినియోగం కంటే చాలా ఎక్కువ మొత్తంలో బిల్లులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు.
‘ది వైర్’ వీరిలో ఇద్దరితో నేరుగా మాట్లాడింది. వారికి మొదట లక్ష రూపాయల బిల్లు వచ్చిందని, దానిపై ఫిర్యాదు చేయగా తర్వాత తగ్గించారని తెలియజేశారు.
మొదట లక్షల్లో బిల్లులు.. ఆ తరువాత సవరణ..
ఇలాంటి మొదటి బిల్లు కుమార్ ఘాట్ సబ్‌డివిజన్‌లోని సైదాబారిలో ఉన్న మెసర్స్ షెఫాలీ పెట్రోలియం ఏజెన్సీ అనే కమర్షియల్ కనెక్షన్‌కు వచ్చింది. అందులో ఒప్పంద లోడ్(కాంట్రాక్టెడ్ లోడ్) 1,740 కేడబ్ల్యూ, ఫిక్స్డ్ ఛార్జీలు రూ 3,48,000, ఎనర్జీ ఛార్జీలు రూ 6,136.78, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ 26,552.42గా నమోదయ్యాయి. గడువు తేదీ తర్వాత చెల్లించాల్సిన నికర మొత్తం రూ 3,96,075గా చూపించింది.
ఆగస్టు 13న ఏజెన్సీ యజమాని తపష్ దాస్ ‘ది వైర్’తో మాట్లాడుతూ, “స్థానిక త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఈసీఎల్) కార్యాలయంలో నేను ఫిర్యాదు చేసిన తర్వాత బిల్లు సవరించబడింది. సవరించిన బిల్లు నికర మొత్తం రూ 16,400గా నాకు తరువాత వచ్చింది” అని ధ్రువీకరించారు.
మొదట 1,740 కేడబ్ల్యూ అని చూపించిన లోడ్ వివరాలు సవరణ తర్వాత కేవలం 8 కేడబ్ల్యూ కి తగ్గాయి.
రెండో బిల్లు అగర్తలాలోని ఈస్ట్ బార్జాలాలో బినోయ్ భూషణ్ చక్రవర్తి పేరిట ఉన్న గృహ విద్యుత్ కనెక్షన్ది. అందులో అసలు వినియోగం కేవలం 151.17 యూనిట్లు మాత్రమే. ఒప్పంద లోడ్ 2,796 కేడబ్ల్యూగా చూపించింది.
కేవలం ఫిక్స్డ్ ఛార్జీ మాత్రమే రూ 3,49,500 కాగా, మొత్తం చెల్లించాల్సిన బిల్లు రూ 3,74,098కి చేరింది. బిల్లు చెల్లింపులో జాప్యానికి పెనాల్టీతో కలిపి మొత్తం రూ 3,81,224కి పెరిగింది.
బిల్లింగ్ వ్యవహారాలు చూసే ఆశిష్ చక్రవర్తి మాట్లాడుతూ, ఆ ఇంటి అసలు లోడ్ 7 కేడబ్ల్యూ మాత్రమే అని చెప్పారు. “కానీ అక్కడ లోడ్ 2,000కి పైగా ఉన్నట్లు చూపించింది. అంటే నా ఇంటి పేరిట ఒక పెద్ద ఫ్యాక్టరీ లోడ్‌ను వేశారన్నమాట” అని ఆగస్టు 13న ‘ది వైర్’తో అన్నారు. ఆయన ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాత, అదే రోజు సవరించిన బిల్లు “రూ 8,000కు దగ్గరగా” వచ్చింది.
త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీఈఆర్సీ) ప్రకారం- గృహ, మెజారిటీ కమర్షియల్ వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీలను కనెక్ట్ చేసిన లోడ్ ఆధారంగా(నెలకు కేడబ్ల్యూకి రూ) మార్చారు. ఫలితంగా తప్పుగా నమోదైన ఒప్పంద లోడ్ లెక్కలతో ముడిపడి బిల్లులు రావడంతో ఆందోళనలకు దారితీసింది.
విద్యుత్ ఛార్జీల కంటే అదనపు ఛార్జీలే ఎక్కువ..
బిశాల్గఢ్లో సామాజిక కార్యకర్త నాని గోపాల్ దేబ్నాథ్ 2026 మే 23న ప్రీపెయిడ్ రీఛార్జ్ కోసం రూ 4,000 చెల్లించారు(రసీదు నంబర్ 6626502). ఆయనకు కేవలం 185.6 యూనిట్లు మాత్రమే విద్యుత్ వినియోగం అయింది. తాను ముందుగా చెల్లించిన రూ 4,000లలో రూ 2,674 వాడుకున్న విద్యుత్ బిల్లు కాగా మిగిలిన మొత్తం రీకన్సిలియేషన్ బిల్లు, పాత బాకీ కింద సర్దుబాటు చేయబడినట్లు తెలియజేశాడు.
రసీదును చూపుతూ దేబ్నాథ్, “యూనిట్‌కు రూ 8, రూ 9 లేదా రూ 10 వసూలు చేయండి, అంతే కానీ బిల్లుల పేరుతో ఈ హిడెన్ ఛార్జీలను వెంటనే ఆపండి” అని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. అమర్పూర్ సబ్‌డివిజన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ ప్రియాంక దత్తా ఆగస్టు 8న తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఆమె కుటుంబానికి కేవలం 26 యూనిట్లకు రూ 1,000 బిల్లు వచ్చిందని చెప్పారు. “అసలు స్పృహ ఉన్నవారెవరైనా 26 యూనిట్లకు రూ 1,000 చెల్లిస్తారా?” అని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి విపరీతమైన తప్పులు బయటపడ్డాయి. ఇవి చిన్న వ్యాపారాలను, సాధారణ గృహ వినియోగదారులను సమానంగా దెబ్బతీశాయి.
బిశాల్గఢ్, అమర్పూర్, ధర్మనగర్లలోని చాలా మంది వినియోగదారులు రూ 1,000 కంటే ఎక్కువ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసినప్పటికీ ఒకే అంకె(సింగిల్ డిజిట్) యూనిట్లు మాత్రమే వచ్చాయని నివేదించారు.
అనేక సందర్భాల్లో, అతి తక్కువ వినియోగం ఉన్న వ్యాపారాలకు, మూతపడిన దుకాణాలకు కూడా రూ 500 కంటే ఎక్కువ బిల్లులు వచ్చాయి. ఇందులో ఫిక్స్డ్ ఛార్జీలు, ఇతర అనవసరమైన ఫీజులే వారి డబ్బును పూర్తిగా మింగేశాయి.
సోలార్ విద్యుత్ వినియోగదారులు కూడా దీని నుంచి మినహాయింపు పొందలేదు. ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద దీప్తో పాల్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి వచ్చిన బిల్లులో అంతకుముందు నెలకు ప్రస్తుత నెలకు మధ్య వ్యత్యాసం లేదు. అంటే ఆయన గ్రిడ్ నుండి ఏమీ విద్యుత్ వాడుకోలేదు.
అయినప్పటికీ ఆయనకు రూ 861 బిల్లు వచ్చింది. సుబ్రదీప్ భౌమిక్ అనే మరొక వినియోగదారుడు మాట్లాడుతూ- తన ఇంటి సోలార్ ప్లాంట్ ఎగుమతి చేసిన మొదటి 100 యూనిట్లకు ఎటువంటి క్రెడిట్ రాదని, అదే సమయంలో దిగుమతి చేసుకునే ప్రతి యూనిట్‌కు పన్నులు, ఫిక్స్డ్ ఛార్జీలకు ముందే రూ 7-8 చొప్పున వసూలు చేస్తున్నారని చెప్పారు.
నెట్వర్క్ సర్వర్ వైఫల్యాలు సంక్షోభాన్ని మరింత పెంచాయి. సర్వర్ సమస్యల కారణంగా సుమారు 1.5 లక్షల మంది ప్రీపెయిడ్ వినియోగదారులు రీఛార్జ్ చేయలేకపోయారని నాథ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ధర్మనగర్లో ఆన్లైన్ కౌంటర్ రీఛార్జ్‌లు రెండూ దాదాపు వారం రోజుల పాటు నిలిచిపోయాయి. సెకెర్ కోట్, దరోగబరి, తేలియామురాలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ మూడు రోజుల పాటు రీఛార్జ్ కాకపోవడంతో రాష్ట్రంలోనే అతిపెద్ద జాతీయ రహదారి దిగ్బంధనం ఈ ప్రాంతంలో జరిగింది.
జాతీయ రహదారుల దిగ్బంధనం.. విద్యుత్ మంత్రి రాజీనామాకు డిమాండ్..
2026 అంతటా జాతీయ రహదారుల దిగ్బంధనాలు, విద్యుత్ కార్యాలయాల ఘెరావ్‌లు, విద్యుత్ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఆందోళనలు సాగాయి.
ఈ వేసవిలో తీవ్రమైన ఘర్షణ జూలై 6, 7 తేదీల్లో తేలియామురాలో జరిగింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ సర్వర్ మూడు రోజుల పాటు పనిచేయకపోవడంతో వేలాది మంది రీఛార్జ్ చేసుకోలేకపోయారు.
స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తేలియామురా పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారి దిగ్బంధనానికి దారితీసింది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఎలక్ట్రిసిటీ డీజీఎం, పోలీసు అధికారులతో జరిపిన పలు విడతల చర్చలు తక్షణ పరిష్కారాన్ని చూపలేకపోయాయి.
ఆ తర్వాత పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఆగస్టు నెలలో ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆగస్టు 7, 8 తేదీల్లో దలై జిల్లాలోని లాంగ్థరాయ్ వ్యాలీలో వందలాది మంది గిరిజన రైతులు మను ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి ముట్టడించారు.
వారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను శాశ్వతంగా తొలగించాలని, పాత అనలాగ్ మీటర్లను పునరుద్ధరించాలని, పెంచిన బిల్లులను తగ్గించాలని, విద్యుత్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మను ఘాట్ వద్ద నిరవధిక జాతీయ రహదారి దిగ్బంధనాన్ని ప్రారంభించారు.
వినియోగదారుల ఫిర్యాదులను టీఎస్ఈసీఎల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హామీ ఇవ్వడంతో, మూడు గంటలకు పైగా సాగిన ఈ దిగ్బంధనం తాత్కాలికంగా విరమించబడింది.
ఆగస్టు మూడో వారం వరకు ఆందోళనలు వ్యాపిస్తూనే ఉన్నాయి. జిరానియాలో, సిస్టమ్ భారీ రీఛార్జ్‌లను బ్లాక్ చేసి, ఉన్న బ్యాలెన్స్‌ను ఖాళీ చేయడంతో మహిళా వినియోగదారులు స్థానిక విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు.
కొద్ది రోజుల తర్వాత, ఆగస్టు 12న కమలా సాగర్‌లోని మధుపూర్ హయ్యర్ సెకండరీ స్కూల్ వద్ద నూటయాభై మందికి పైగా నివాసితులు విద్యుత్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలకు పైగా రహదారిని దిగ్బంధించారు.
బిల్లింగ్ వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు కొత్త బిల్లులు జనరేట్ చేయబోమని, ఎవరి కనెక్షన్ల పునరుద్ధరణ నిలిపివేయమని టీఎస్ఈసీఎల్ సీనియర్ మేనేజర్ రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే నిరసన ముగిసింది.
స్మార్ట్ మీటర్లు, ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాల దాడి..
ఆగస్టు 10న, రాష్ట్రవ్యాప్త “జైల్ భరో” ప్రచారంలో భాగంగా సీపీఐ(ఎం), దాని అనుబంధ సంఘాలు భారీ ఎత్తున ప్రజలను సమీకరించాయి. ఆగస్టు 17న, పార్టీ అగర్తలాలోని విద్యుత్ భవన్ వెలుపల మరొక నిరసన ర్యాలీని నిర్వహించింది. అక్కడ సభను ఉద్దేశించి మాణిక్ దే మాట్లాడుతూ, విద్యుత్ అనేది ప్రగతి, జీవనోపాధి ఆధారపడి ఉన్న అత్యవసర రంగమని ఉద్ఘాటించారు.
ఏడాదికి రెండుసార్లు ఛార్జీలు పెంచుతున్నారని, కేంద్ర ప్రభుత్వ “ఫ్యూయల్ ఛార్జ్” నిబంధనను లొసుగుగా వాడుకుంటూ అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఛార్జీలు పెంచుతున్నారని, దీంతో బిల్లు వచ్చే వరకు వినియోగదారులకు పెంపు గురించి తెలియకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఫిక్స్డ్ ఛార్జీల భారీ పెంపును కూడా దే తీవ్రంగా విమర్శించారు. జూన్‌లో రూ 60-80 ఉన్న గృహ ఫిక్స్డ్ ఛార్జీలు జూలై-ఆగస్టు బిల్లుల్లో రూ 210-280కి, కమర్షియల్ ఛార్జీలు రూ 450-600కి పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది ఇంధన సమస్య కాదు, గ్యాస్ సమస్య కాదు” అని ఆయన అన్నారు.
విద్యుత్ చట్టం, 2003 ప్రకారం స్మార్ట్ మీటర్లు నిర్బంధం కాదని, అవి ఐచ్ఛికం మాత్రమే అని ఇటీవల కేంద్ర విద్యుత్ మంత్రి పార్లమెంటులో కూడా స్పష్టం చేశారని దే గుర్తు చేశారు.
“మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బలవంతంగా ప్రజలపై వీటిని రుద్దుతోంది?” అని ఆయన ప్రశ్నించారు.
ప్రైవేట్ కంపెనీలు మీటర్లు బిగించి, డబ్బులు వసూలు చేసి వెళ్లిపోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోందని, వాటి స్థానంలో కొత్తవి వేయడానికి వినియోగదారులు రూ 7,500 నుంచి రూ 10,000 చెల్లించాల్సి వస్తోందని, ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన వందల కోట్ల బాకీలను వసూలు చేయకుండా సామాన్య వినియోగదారులపై ఆ భారాన్ని వేస్తున్నారని దే ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా 2025 చివరి నుంచి ఈ అంశంపై తీవ్రంగా పోరాడుతోంది. దే విమర్శలను సమర్థిస్తూ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్బంధంగా ఎందుకు చేస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 12న కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రబీర్ చక్రవర్తి స్మార్ట్ మీటర్ విధానాన్ని రద్దు చేయాలని, అదనపు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, టీఎస్ఈసీఎల్ బిల్లింగ్ విధానాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ మంత్రిని ఉద్దేశించి ఆయన, “బీజేపీ పాలనలో అసత్యాలను పెంచి పోషిస్తున్నారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు విద్యుత్ మంత్రి రతన్ లాల్ నాథ్‌కు స్వర్ణ పతకం ఇవ్వవచ్చు” అని ఎద్దేవా చేశారు.
కూటమి భాగస్వామి ‘టిప్రా మోతా’ జవాబుదారీతనం.. లేదా రాజీనామా డిమాండ్..
అధికార కూటమి పార్టీ నుంచి వచ్చిన వ్యతిరేకతే ప్రజా ఆగ్రహం ఎంతగా ఉందో చెప్పడానికి స్పష్టమైన ఉదాహరణ. ఆగస్టు 11న, టిప్రా (టిప్రాహా ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్) మోతా పార్టీకి చెందిన మైనారిటీ సెల్, టీఎస్ఈసీఎల్ బనమాలిపూర్ విద్యుత్ కార్యాలయానికి వెళ్లిన ప్రతినిధి బృందంలో చేరింది. ఆ తర్వాత విద్యుత్ భవన్లో అధికారులతో సమావేశమైంది.
సర్వర్ లోపాలను అంగీకరించే ముందు ప్రజా ఆగ్రహం పరాకాష్టకు చేరే వరకు ప్రభుత్వం ఎందుకు నిరీక్షించిందని సెల్ ఛైర్మన్ మహమ్మద్ సాహా ఆలం మియా ప్రశ్నించారు.
ఆయన మాట్లాడుతూ, “సర్వర్ లోపభూయిష్టంగా ఉంటే, త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తినప్పుడు, మీరు ఇప్పుడు మాత్రమే సర్వర్ లోపభూయిష్టంగా ఉందని ఎందుకు చెబుతున్నారు? దీనిపై మీరు ముందే ప్రకటన ఇచ్చి ఉండవచ్చు కదా? అప్పుడు ప్రజలు ఈ వేధింపులకు గురయ్యేవారు కాదు కదా” అని ప్రశ్నించారు.
ఈ ప్రతినిధి బృందం రెండు స్పష్టమైన డిమాండ్లను లేవనెత్తింది. ఇతర రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకాలను ప్రస్తావిస్తూ మియా, “భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, ఢిల్లీలో 200, పంజాబ్‌లో 300 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం తెలిసిందే. త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఉచిత విద్యుత్‌ను అందించాలి” అని వాదించారు.
పార్టీ సేకరించిన ఒక నిర్దిష్ట బిల్లును కూడా ఆయన ప్రస్తావించారు. కేవలం 75 యూనిట్లు మాత్రమే వినియోగించగా రూ 2,000 చెల్లించిన వినియోగదారునికి, అంటే యూనిట్‌కు రూ 27 పడింది. రాష్ట్ర విద్యుత్‌ను బంగ్లాదేశ్‌కు విక్రయిస్తున్నప్పుడు త్రిపుర ప్రజలు ఈ భారాన్ని ఎందుకు మోయాలని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా, ప్రతినిధి బృందంతో పాటు వెళ్లిన త్రిపుర మాజీ రాజ కుటుంబ సభ్యురాలు కుమారి ప్రజ్ఞా దేబ్ బర్మన్ మాట్లాడుతూ, ఈ సంక్షోభం నెలల తరబడి సాగుతోందని అధికారులకు తెలిపారు.
“ఇంత ఎక్కువ కాకూడదు. గ్రామాల్లో విద్యార్థులు ఉన్నారు, ఆసుపత్రులు ఉన్నాయి, ఇతర ఇబ్బందులు ఉన్నాయి. ఈ సర్వర్, స్మార్ట్ మీటర్ల వల్ల మా ఏడీసీ ప్రాంతాలలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి” అని దేబ్ బర్మన్ అన్నారు.
“నాయకులు, ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ఉన్నారు. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని వర్ణించడానికి మాటలు లేవు” అని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఎక్కువ చెల్లించిన ఏ వినియోగదారుడికైనా ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామని(రిఫండ్), 10 నుంచి 15 రోజుల్లోగా ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఛైర్మన్ పార్టీ పరిధిని దాటి ఒక హెచ్చరికతో ముగించారు.
“రాజకీయాలు ఐదేళ్లు ఉంటాయి, కుర్చీ ఐదేళ్లు ఉంటుంది. ప్రతి ఐదేళ్లకు రాజకీయం వస్తుంది, పోతుంది, కుర్చీ మారుతుంది. దానివల్ల తేడా ఏమీ లేదు” సామాన్య ప్రజల పక్షాన నిలబడటమే ముఖ్యమని మియా అన్నారు. స్పందన సరిగ్గా లేకపోతే, “రాష్ట్ర ప్రజలు, ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వస్తారని” ఆయన హెచ్చరించారు.
‘విద్యుత్ మంత్రి ప్రతి విషయంలోనూ విఫలమయ్యారు’.. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నాథ్..
ఆగస్టు 17న చేసినట్లుగా చెప్పబడుతున్న “విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగితే బిల్లు భారం అంత పెరుగుతుంది” అనే వ్యాఖ్య బీజేపీ అంతర్గతంగా కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రణజోయ్ కుమార్ దే ఈ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ, బిల్లుల్లో కనిపిస్తున్న వివిధ ఛార్జీలను బట్టబయలు చేశారు.
ఫిక్స్డ్ ఛార్జ్, మీటర్ అద్దె, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఫ్యూయల్ ఛార్జ్, “సుంద్రీస్”(ఇతర ఛార్జీలు). సేవలు అధ్వానంగా ఉన్నప్పటికీ వినియోగదారుల నుండి డబ్బు గుంజడానికి ఇవి “ఒక దోపిడీ రాకెట్” తప్ప వేరేమీ కాదని ఆయన మండిపడ్డారు.
“ప్రస్తుత విద్యుత్ మంత్రి ప్రతి విషయంలోనూ విఫలమయ్యారు. ఆయన రాజీనామా చేయాలి” అని దే రాశారు. ఇలాగే కొనసాగితే 2028 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
రకరకాల ఛార్జీలను రద్దు చేసి, సరళమైన యూనిట్ ఆధారిత ఛార్జీల విధానానికి తిరిగి రావాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాకీలు చెల్లించని ప్రభుత్వ శాఖలపై, విద్యుత్ దొంగతనంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వసూళ్లపై స్టే ప్రకటించిన ప్రభుత్వం.. లెఫ్ట్ ఫ్రంట్‌పై విద్యుత్ మంత్రి నిందలు..
ఆగస్టు 8న, ఢిల్లీ కోర్ కమిటీ సమావేశం నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా, నాథ్, సీనియర్ టీఎస్ఈసీఎల్ అధికారులు, శాఖ కార్యదర్శులతో అర్థరాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కార్పొరేషన్ మరింత చురుగ్గా, వినియోగదారుల ఆధారిత విధానంలో పనిచేయాలని సాహా ఆదేశించారు. అలాగే సర్వర్ వైఫల్యాలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
సర్వర్ సమస్యలతో ఇబ్బంది పడిన సుమారు 1.5 లక్షల మంది ప్రీపెయిడ్ వినియోగదారులకు పెండింగ్‌లో ఉన్న రీఛార్జ్ మొత్తాలను ఆరు నెలల వారీ వాయిదాలలో చెల్లించే అవకాశాన్ని టీఎస్ఈసీఎల్ అందించడం ప్రారంభించింది.
ఇంతలో, ఆగస్టు 11న తన విలేకరుల సమావేశంలో నాథ్ ప్రజల ఆగ్రహాన్ని అంగీకరించారు. “మే నెల తర్వాత జారీ చేసిన బిల్లుకు సంబంధించి, ఆ బిల్లుపై వినియోగదారులలో అసంతృప్తి వ్యక్తమైంది. ఇది చూసిన తర్వాత, మా ప్రభుత్వం ప్రజానుకూల, వినియోగదారుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి, మేము మౌనంగా ఉండలేము.”
ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శి, విద్యుత్ కార్యదర్శితో ప్రభుత్వ ‘వార్ రూమ్’లో సమావేశం జరిగినట్లు ఆయన చెప్పారు.
“ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిగా ఉండలేదు. ఎందుకంటే వినియోగదారుల పట్ల మాకు జవాబుదారీతనం ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోసం మేమొకటి చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
ప్రతి కేసును పరిశీలించేంత వరకు మే నెల నుంచి అసాధారణంగా ఎక్కువగా వచ్చిన బిల్లులను వసూలు చేయవద్దని అన్ని స్థాయిల అధికారులను ఆదేశించినట్లు నాథ్ ప్రకటించారు.
విద్యుత్ ఛార్జీలను స్వతంత్ర టీఈఆర్సీ నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణ బిల్లులోని మూడు అంశాలను (ఫిక్స్డ్ ఛార్జ్, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్[ఎఫ్‌పీపీసీఏ], ఎనర్జీ ఛార్జ్) ఆయన వివరించారు.
విలేకరుల సమావేశంలో ఎక్కువ భాగం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికే కేటాయించారు. ప్రత్యర్థులు “కలకల నీటిలో చేపలు పడుతున్నారని”, అసలు స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ లెఫ్ట్ ఫ్రంట్ హయాంలోనే ప్రారంభమైందనే విషయాన్ని మరిచిపోతున్నారని నాథ్ ఆరోపించారు.
2015 వర్క్ ఆర్డర్‌ను, రాష్ట్ర ఆడిట్‌ను ప్రస్తావిస్తూ, కాంట్రాక్టర్లు డెడ్లైన్లను దాటేశారని, కేవలం 34,300 మీటర్లు మాత్రమే కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమయ్యాయని, రెండు మూడు నెలల్లోనే అవి కూడా కనెక్టివిటీని కోల్పోయాయని ఆయన పేర్కొన్నారు.
“వాటిలో, కేవలం 34,300 స్మార్ట్ మీటర్లు మాత్రమే కంట్రోల్ సెంటర్‌తో కమ్యూనికేట్ చేయగలవని తేలింది. 11,000 మీటర్లు అసలు అమర్చనే లేదు” అని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల రూ 42.76 కోట్ల వృథా ఖర్చు జరిగిందని, కాంట్రాక్టర్‌కు అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ పేర్కొన్నట్లు చెప్పారు.
ఆగస్టు 21న నాథ్ ఒక ప్రధాన ఉపశమన చర్యను ప్రకటించారు. 2026-27 సంవత్సరానికి టీఈఆర్సీ ఆమోదించిన అదనపు ఛార్జీల పెంపుపై 100 శాతం సబ్సిడీని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనర్థం కొత్త టారిఫ్ ఆర్డర్ నుండి వచ్చే అదనపు భారాన్ని వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదు. ఈ సబ్సిడీ మే 2026 నుంచి వర్తిస్తుంది. ఇప్పటికే ఎక్కువ బిల్లులు చెల్లించిన వారికి, ఆ అదనపు మొత్తాన్ని సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ బిల్లులలో సర్దుబాటు చేస్తారు.
ఈ నిర్ణయం కోసం ప్రభుత్వం అదనంగా రూ 117.13 కోట్లు ఖర్చు చేస్తుందని, దీనివల్ల ఈ ఏడాది మొత్తం సబ్సిడీ భారం రూ 194.70 కోట్లకు చేరుతుందని నాథ్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అపూర్వమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు.
ఆరోపణలను తిరస్కరించిన మాజీ విద్యుత్ మంత్రి.. ప్రైవేటీకరణపై దాడి..
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆగస్టు 12న కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను దే నిర్వహించారు. లెఫ్ట్ ఫ్రంట్ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ ఆ సమయంలో ఫిర్యాదులను మూటగట్టుకుందనే ఆరోపణను ఆయన తిరస్కరించారు.
సాంకేతికత కాదు, దీని యాజమాన్య నమూనానే(ఓనర్షిప్ మోడల్) ప్రస్తుత సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు.
లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో, టీఎస్ఈసీఎల్ స్వయంగా పోటీ టెండర్ ద్వారా మీటర్లను అమర్చి నిర్వహణ బాధ్యతను కూడా చూసుకుంది.
2018 తర్వాత ఈ ప్రాజెక్ట్ తయారీ, ఇన్స్టలేషన్, నిర్వహణను టాటా, అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారని ఆయన విడమర్చి చెప్పారు.
“ఇక్కడ ఒక పెద్ద ఆట జరుగుతోంది” అని దే అన్నారు. టీఎస్ఈసీఎల్ షేర్లలో 100 శాతం రాష్ట్ర ప్రభుత్వానివే అని, దాని బోర్డును కూడా ప్రభుత్వమే నామినేట్ చేస్తుందని, కాబట్టి తన సొంత నామినీలు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించకుండా తప్పించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
రికార్డుల్లో తన స్థానాన్ని స్పష్టం చేసిన టీఈఆర్సీ..
టీఈఆర్సీ కూడా రికార్డుల్లో తన అధికారిక వైఖరిని తెలియజేసింది. గత రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి టీఎస్ఈసీఎల్ రూ 1,709.04 కోట్లను కోరిందని, ఇది సగటు విద్యుత్ ఛార్జీలలో దాదాపు 147 శాతం పెంపునకు దారితీస్తుందని తెలిపింది.
అయితే కమిషన్ తక్కువ రెవెన్యూ లోటు అయిన రూ 479.24 కోట్లను మాత్రమే ఆమోదించింది. అకస్మాత్తుగా ప్రజలపై భారం పడకుండా ఉండటానికి రూ 117.77 కోట్లను మాత్రమే తాత్కాలికంగా కోలుకోవడానికి అనుమతించింది.
ఇటీవలి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, వినియోగదారుల సమ్మతితో మాత్రమే స్మార్ట్ మీటర్లను అమర్చాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల వచ్చే బిల్లింగ్ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని, సౌకర్యవంతమైన వాయిదాల ద్వారా బాకీలను వసూలు చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని టీఈఆర్సీ, టీఎస్ఈసీఎల్ను ఆదేశించింది.
మూడు అంచెల వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలని, క్రమం తప్పకుండా ప్రజా విచారణలు/సమావేశాలు నిర్వహించాలని కూడా కార్పొరేషన్‌ను ఆదేశించింది.
అయితే, అసాధారణ బిల్లింగ్‌కు గల కారణాలపై వివరణ కోరుతూ ‘ది వైర్’ ఆగస్టు 18న టీఎస్ఈసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బిశ్వజిత్ బసును సంప్రదించినప్పుడు, ప్రశ్న అడుగుతుండగానే ఆయన ఫోన్ కట్ చేశారు.
ఇది కేవలం ఒక్కసారి మాత్రమే జరిగిన ఘటన కాదని సమాచారం. అగర్తలాలోని స్థానిక రిపోర్టర్లు తమకు కూడా ఇలాగే జరిగిందని చెప్పారు.
మీడియా ప్రశ్నించినప్పుడు టీఎస్ఈసీఎల్ డైరెక్టర్ గతంలో కూడా నిర్లక్ష్యంగా మాట్లాడారని లేదా ఫోన్ కట్ చేశారని ఆరోపించారు.
విస్తృత పరిష్కారం కోసం ఇప్పటికీ ఎదురుచూపులు..
త్రిపుర విద్యుత్ సంక్షోభం పాక్షికంగా మాత్రమే పరిష్కారమైంది. చెల్లింపులపై స్టే, వాయిదాల సౌకర్యం కొనసాగుతుండగా, టీఈఆర్సీ ఆమోదించిన అదనపు ఛార్జీల పెంపును పూర్తిగా సబ్సిడీ చేస్తామని ఆగస్టు 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కాబట్టి కొత్త టారిఫ్ నుంచి వచ్చే అదనపు మొత్తాన్ని వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్మార్ట్ మీటర్ ప్రోగ్రామ్‌ను వెనక్కి తీసుకోవడంపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
సీపీఐ(ఎం) సెప్టెంబరులో అగర్తలాలో మరో భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. విస్తృత పరిష్కారాన్ని అందించడానికి టిప్రా మోతా ఆగస్టు 11న తన ప్రతినిధి బృందం భేటీ ప్రభుత్వానికి ఇచ్చిన 10 నుండి 15 రోజుల సమయం ముగియనుంది.
రాహుల్ నమశూద్ర, ది వైర్ ఇంగ్లీష్‌కు రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
