రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేనాని పక్షం రోజులుగా సంచలనమయ్యారు. జూన్ 2న హైదరాబాద్‌లో మీటింగ్ అంటూ మరింత హైప్ క్రియేట్ చేశారు.
తెలంగాణవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. భావోద్వేగాలు అన్ని సందర్భాల్లో పనిచేయవనే విషయం పవన్‌కు ఇంకా అర్థం కాలేదని మరోసారి రుజువయ్యింది.
సమాజాన్ని మారుస్తామని, ప్రశ్నిస్తామని దశాబ్దకాలంగా ఆయన చెప్తున్నారు. స్థిరమైన ఆలోచన, రాజకీయ విధానం ఆయనకు లేవు.
అందువల్లే జూన్ 2న తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని అపహాస్యం చేశారనే విమర్శను మూటకట్టుకున్నారు.
సీమాంధ్ర నాయకత్వ రాజకీయ పార్టీల నుంచి తాము విముక్తులయ్యామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
నాలుగు దశాబ్దాల తెలుగు దేశం ప్రస్థానం తెలంగాణను వెనుకపట్టేలా చేసిందనే ఆరోపణ బలంగా ఉన్నది. ఆ పార్టీతో పొత్తులో ఉన్న పవన్ అదే దారిలో ఉన్నారనే భావన తెలంగాణలో ఉన్నది.
అంతేకాదు, నాడు ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన విధానాన్ని మార్చుకున్న తీరును ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ “తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ”అంటూ సంచలనాలు చేయడం తెలంగాణ ప్రజానీకానికి సుతరామూ నచ్చడం లేదు.
తెలంగాణ అస్తిత్వం.. సగటు పౌరుడి ఆత్మగౌరవం..
పవన్ కళ్యాణ్ సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనంతరం పవన్ కళ్యాణ్ తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని అంతర్గత సమావేశం ద్వారా వ్యక్తీకరించారు.
‘తెలంగాణ ఎవడి అయ్య జాగీరు కాదు’ అని తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తీవ్రంగా అవమానించేలా, రెచ్చగొట్టేలా మాట్లాడారు.
ఆయన మాటలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. మరోసారి తెలంగాణ ప్రజల భావోద్వేగం పతాక సన్నివేశంగా ఆవిష్కృతమైంది.
సీమాంధ్ర పార్టీల పెత్తందారీ, పెట్టుబడిదారీ రాజకీయ గుత్తాధిపత్యం తెలంగాణలో చెల్లదని తిప్పికొట్టింది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు పాలిస్తున్నా తెలంగాణ అస్తిత్వమే అతి ప్రధానమని మరోసారి రుజువయ్యింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటింది, ఇక తెలంగాణవాదం ఉండదని భ్రమించేవారి కళ్లు బైర్లు కమ్మేలా ఇక్కడి ప్రజానీకం స్పందించింది.
అమరావతిలో మహానాడు వేదికపై తెలంగాణ తెలుగు దేశం నాయకుడు తెలంగాణ పదమే డిక్షనరీలో లేదని తేల్చేశాడు.
దీనికి తోడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం కూడా తెలంగాణ వారి ఆగ్రహానికి మరో కారణం.
గత చరిత్ర – సీమాంధ్ర పార్టీలపై అపనమ్మకం..
తెలంగాణలో కూటమి ప్రభుత్వం రాబోతున్నదనే సోషల్ మీడియా ప్రచారాలు మరోసారి ఆలోచించేందుకు కారణమయ్యాయి.
బీజేపీ పెద్ద నాయకులకు తెలంగాణ చరిత్ర, ఉనికి, అస్తిత్వాలపై అవగాహన లేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.
దీనికి తోడు సీమాంధ్ర పార్టీల అవకాశవాద రాజకీయాల వల్ల వందలాది మంది తెలంగాణ యువత బలైంది.
తెలుగు దేశం పార్టీ తాను తొలుత తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటే తెలంగాణ యువకులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదని ఇప్పటికీ తెలంగాణ సమాజం బలంగా నమ్ముతున్నది.
వచ్చిన తెలంగాణను వెనక్కి నెట్టింది, తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నది కొందరు సీమాంధ్ర నాయకులే అన్నది తెలంగాణ ప్రజల మనోభావన.
రాష్ట్ర విభజన అయిన వెంటనే ఇక్కడి నుంచి గ్రౌండ్ ఖాళీ చేసి ఆంధ్రాకు వెళ్లిన రాజకీయ నాయకులకు, ఇప్పుడే ఎందుకు తెలంగాణపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని ఇక్కడి ప్రజలు వేస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పకుండా ప్రజలకే సవాలు విసరడం పవన్ రాజకీయ అవివేకానికి ఒక ఉదాహరణ.
తాను తెలంగాణవాదుల వల్లనే తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పారు – వాస్తవానికి ఆయన పార్టీ గతంలోనూ పోటీ చేసింది, డిపాజిట్లను కూడా గల్లంతు చేసుకున్నది.
ఆ విషయాన్ని కూడా ఆయన మర్చిపోయారో లేదా కావాలని చెప్పారో గానీ, సినిమా రేంజ్ డైలాగ్ విసిరారు.
ఒత్తిడిలో పవన్ కళ్యాణ్.. పెరిగిన అయోమయం..
ఇదే సందర్భంలో తన మాటలను తానే ఖండించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ చేయలేకపోతున్నానని, ఇక్కడ మాత్రం ఏం చేస్తానని చెప్పుకున్నారు.
తీవ్రమైన ఒత్తిడి కారణంగా పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతున్నారని రాజకీయ పండితుల విశ్లేషణ.
తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ పెట్టడం, అధికారంలోకి రావడం వెనువెంటనే జరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, విజయ్‌తో పవన్ కళ్యాణ్‌ను పోలిక చేస్తున్నారు.
ఇద్దరు సినిమా రంగ హీరోల నిర్ణయాలను, పని తీరును తులనాత్మకంగా తూకం వేసి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టుగా అనిపిస్తోంది – అందుకే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకాని అయోమయానికి గురవుతున్నారేమో..!
గతంలో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచిన సందర్భాన్ని ఆయనను పలువురు ప్రశ్నించారు.
పదకొండు రోజుల పాటు భోజనం ముట్టలేదని చెప్పిన మాట సంగతేమిటన్నప్పుడు – ఆయన గతంలో చంద్రబాబు చెప్పిన సమాధానాన్నే మళ్లీ వల్లె వేశారు. అదే, ‘రాష్ట్రం విభజించిన తీరు’ అని సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజున విభజన తీరు గురించి మాట్లాడి, వందలాది మంది యువతీయువకుల బలిదానాలను తీవ్రాతితీవ్రంగా అవమానించి, తనకు మరోపేరు ‘తెలంగాణ వ్యతిరేకి’ అని నిరూపించుకున్నారని తెలంగాణవాదులు బహిరంగంగా చేస్తున్న విమర్శ.
ప్రాంతీయ మనోభావాలు – ప్రజాదరణ..
భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేరు, భారత రాజ్యాంగం ఆ హక్కును పౌరులకు ప్రసాదించింది.
ఇదే సందర్భంలో తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నామో ఆ ప్రాంత ప్రజల పట్ల గౌరవాభిమానాలు ఉండాలి.
ప్రజా ఆలోచనకు భిన్నంగా ఉన్న పార్టీలకు, నాయకులకు ఆదరణ లభించదు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో వెనుకబడే ఉన్నారు.
తెలంగాణ వాళ్ల దిష్టి తగిలే కోస్తాలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయని సునాయాసంగా చెప్పి, ఇక్కడి ప్రజల మెప్పు ఎట్లా పొందుతారో పవన్‌కే తెలియాలి.
హైదరాబాద్ నుంచి తాను ఆంధ్రాకు వెళ్లిన తర్వాత ఒక సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో భావోద్వేగాలు ఇంకా బలంగా ఉన్నాయని, ఏపీలో అవి లేవని చెప్పారు.
ప్రాంతీయవాదానికి, కుల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్తున్న పవన్, 24 గంటలు గడవకముందే ఏపీ ప్రజలకు ఆంధ్ర భావన ఉండాలని కోరుకోవడం కొసమెరుపు.
అయితే, తెలంగాణ అంటే ఏంటో బహుశా ఆయనకు ఇప్పుడు అర్థమయ్యే ఉండవచ్చు.
తెలంగాణ ఉనికి, అస్తిత్వాలను గౌరవించేవారి పట్ల ఇక్కడి ప్రజలు అంతే ఆదరణ చూపిస్తారు. ఇది చారిత్రకంగా రుజువవుతున్న వాస్తవం.
గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న విషయాలు రచయిత అభిప్రాయాలు మాత్రమే. దీనికి సంబంధించి ది వైర్ సంపాదకీయ వర్గం ఎటువంటి బాధ్యతవహించదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
