ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ ఆకర్షణీయమైన నినాదాలు రూపొందించే యంత్రాంగం అమోఘంగా ఉంది. ఆ నినాదాలు అన్నీ ఆచరణలో అమలు చేయడానికా? లేక అది ఒక “జుమ్లా” అని అవహేళన చేయడానికా?
99 శాతం నినాదాలు రాజకీయ ప్రత్యర్థులను, లౌకిక ప్రజాతంత్రవాదులను హేళన చేయడానికి, కాలం గడిపి అధికారాన్ని పొడిగించుకోవడానికి మాత్రమే రూపొందించబడ్డాయని 12 సంవత్సరాల అనుభవంలో రుజువు అవుతున్నది.
మచ్చుకు ఓ నినాదం గురించి చెప్పుకుందాం: 2013-14లో అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, అందులో పాల్గొన్న యువతను ఆకర్షించడానికి తాము అధికారానికి వస్తే ప్రతి ఓటరు బ్యాంకు ఖాతాలోనూ 15 లక్షలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేశారు.
తర్వాత మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, “మేము అలాంటి నినాదం ఇచ్చినా జనం ఎలా నమ్మారు, అది జుమ్లా కదా” అని స్వయంగా కేంద్ర హోంమంత్రి నవ్వేశారు.
అలాంటి మరో జుమ్లా “బేటీ బచావో-బేటీ పఢావో” నినాదం. దేశాన్ని ఓ కుదుపు కుదిపిన నిర్భయ కేసు నేపథ్యంలో ఈ నినాదానికి బీజేపీ ఊపిరి పోసింది.
అందులోనే మహిళలపై హత్యలు, అత్యాచారాలకు పేరుమోసిన హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ ప్రభుత్వం ఈ నినాదం ఇచ్చింది. “ఆడపిల్లల్ని కాపాడు-ఆడపిల్లలను చదివించు” ఇది ఎంతగా పాపులర్ అయిందంటే ఆటోలు, టాక్సీలు తదితర వాహనాలను వ్యక్తిగతంగా కొనుక్కొని జీవనోపాధిగా వాటిని నడుపుతున్న వాళ్లు సైతం వాళ్ల వాహనాల మీద ఈ నినాదం రాసుకున్నారు. ఈ వాహనాలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం.
అడుగడుగునా పెరుగుతున్న అకృత్యాలు..
కానీ మిగిలిన నినాదాలు, పథకాల లాగానే ఈ నినాదం విషయంలో కూడా ఆచరణ అందుకు భిన్నంగా ఉండటమే కాదు, ఆడపిల్లల మీద అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కింది పట్టికలోని గణాంకాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.




అధికారికంగా రికార్డులలోకి ఎక్కిన నేరాలే ఈ 12 సంవత్సరాల కాలంలో విపరీతంగా పెరిగాయి. 2014లో 80,904 కేసులు పోక్సో కింద రికార్డు కాగా, 2024-25 సంవత్సరానికి ఆ కేసుల సంఖ్య 1,75,000కు పెరిగింది.
రికార్డులకు ఎక్కని అలాంటి ఘోర కృత్యాలు లెక్కలేనన్ని. రికార్డయిన కేసులలో శిక్షలు పడిన కేసులు కేవలం 34 శాతం మాత్రమే. 91 శాతం కేసులు పెండింగ్లో ఉన్నాయి.
యూపీలో కుల్దీప్ సెంగార్, బెంగళూరులో ప్రజ్వల్ రేవన్న, హైదరాబాద్లో బండి భగీరథ్ వంటి ఉదంతాలు దేశం, అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకునే పరిణామాలు. అయినా వాళ్లను పార్టీ వెనకేసుకురావడం కన్నా సిగ్గుచేటు ఏముంటుంది?
రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడితే ఇంతవరకు ఎలాంటి చర్య లేదు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించి దేశ పరువును మంటగలిపారు.
స్వయంగా సుప్రీమ్ కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పైన కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి. మహిళా సాధికారికత గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నేతలకు ఉందా?
పట్టికలోని సెక్షన్ 3ని గమనిస్తే సంవత్సరాల వారీగా మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు ఎలా పెరిగాయో అర్థమవుతుంది.
బాల్యవివాహాలు 2014లో 280 జరిగినట్లు రికార్డు కాగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 2,500కు పెరిగింది. పట్టికలోని సెక్షన్ 8లో సంవత్సరాల వారీగా వివరాలు పరిశీలించండి.
ఇది మోదీ నినాదం “బేటీ బచావో”(ఆడపిల్లల్ని రక్షించండి). ఈ నినాదం ఆచరణలో ఆడపిల్లల్ని అవమానపరిచిందా? లేక గౌరవంతో సత్కరించిందా?
‘బేటీ పఢావో’ – చదువులకు దూరమవుతున్న చిన్నారులు..
ఇక “బేటీ పఢావో” నినాదం పరిశీలిస్తే, 15 సంవత్సరాల వయస్సు దాటిన బాలికలలో అక్షరాస్యత 2014లో 68% కాగా, తర్వాత క్రమంగా కొంత పెరిగి 83%కి చేరింది. అసలు సమస్య అంతా 15 సంవత్సరాలలోపు పిల్లల విషయంలోనే. వీరిలో అత్యధికులు, ముఖ్యంగా మైనారిటీలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువులకు దూరంగా ఉన్నారు.
మహిళా సాధికారత: రిజర్వేషన్లు వర్సెస్ రియాలిటీ..
మహిళల ఉద్ధరణకు తాము మాత్రమే నిజాయితీగా ఉన్నామని, మిగిలిన వారు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఇటీవల కాలంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం.
మరీ ముఖ్యంగా డీలిమిటేషన్తో ముడిపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, ప్రతిపక్షాలు మహిళా విరోధులు అని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలు జరిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా మే 10వ తేదీ హైదరాబాద్లో అలాంటి ఒక సభలో పాల్గొన్నారు.
2014 సంవత్సరంలో సెక్షన్ 498A ప్రకారం గృహహింస(డొమెస్టిక్ వయలెన్స్) కింద రిజిస్టర్ అయిన కేసులు 1,22,877 కాగా, 2022లో 1,39,956 కు పెరిగి, 2024-25లో 1,35,000 కు చేరుకుంది.
రిజిస్టర్ అయిన కేసులలో శిక్షలు పడిన వాళ్లు 2014లో 15%. కాగా 2017, 2018, 2019, 2021, 2022 సంవత్సరాలలో అది 14 శాతానికి తగ్గి, మరల 2024-25 నాటికి 15%కి మాత్రమే పెరిగింది. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా, శిక్ష పడినవాళ్లు కేవలం 15% మాత్రమే ఉన్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీనికి కారణాలు కోర్టు విచారణలో పరువు పోతుందని, చంపుతామని బెదిరిస్తారని, ఇంకా రకరకాల కారణాలతో నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారని రికార్డులు తెలియజేస్తున్నాయి. పట్టికలోని సెక్షన్ 1లో వివరాలు చూడండి.
వరకట్న హత్యలు, లైంగిక దాడులు మరియు ఉపాధి..
వరకట్న వేధింపుల కారణంగా 2014లో 845 మంది హత్య చేయబడినట్లుగా రికార్డు కాగా, 2024-25 కి ఆ సంఖ్య 6 వేలకు పెరిగిపోయింది. ఇందులో కూడా రికార్డులకు ఎక్కని కేసులు ఎన్నో ఉన్నాయి. ఇందులో శిక్షలు పడినవాళ్ల శాతం 2014లో 17% కాగా, 2024-25 నాటికి 11%కి పడిపోయింది. వివరాలు పట్టికలోని సెక్షన్ 2లో చూడండి.
ఇక మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయానికొస్తే, 2014లో 57 కేసులు రిజిస్టర్ కాగా 2025 నాటికి ఆ సంఖ్య 500 కు పెరిగింది.
పట్టికలోని సెక్షన్ 4లో వివరాలు చూడండి. ఈ విషయంలో మహిళలు అవమానభారంతో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కేసులు నమోదు చేయనివి భారీ సంఖ్యలో ఉంటాయి.
కార్మిక రంగంలో మహిళా భాగస్వామ్యం అర్బన్ ప్రాంతాలలో 2014లో 14.7% ఉండగా 2025 నాటికి అది 22 శాతానికి చేరింది.
సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం 2014లో 8 శాతం కాగా 2025 నాటికి కేవలం 10 శాతానికి మాత్రమే చేరింది. పట్టికలోని సెక్షన్ 7లో వివరాలు చూడండి.






మొత్తంగా మహిళలలో 76 శాతం మంది వ్యవసాయ పనులలోనూ, 12 శాతం మంది ఉత్పత్తి రంగంలోనూ, 8 శాతం సర్వీస్ రంగంలోనూ, ఇతర రంగాలలో 4 శాతం పనిచేస్తున్నారు. చివరి పట్టికలో వివరాలు చూడండి.
ఈ మొత్తం వివరాలు పరిశీలించినప్పుడు బేటీ బచావో-బేటీ పఢావో, మహిళా సాధికారత నినాదాలు అన్నీ ప్రజలను ఆకర్షించి మోసం చేయడం తప్ప, ఆచరణలో పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని అనేక గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
