ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారంతో ముడిపడి ఉన్న పర్యటనలే ఎక్కువ.
ఈ కాలంలో కేవలం 16% మాత్రమే అధికార విధులకు సంబంధించి ప్రధాన మంత్రి పర్యటనలు ఉన్నాయి.
ముంబై/నాగ్‌పూర్: పొదుపును పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 10న ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, ప్రైవేటు వాహనాల వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణాను వాడాలని కోరారు.
చమురు దిగుమతులు తగ్గాలంటే వంట నూనె వినియోగాన్ని కూడా తగ్గించాలని ప్రజలను ఆయన కోరారు.
అయితే యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ప్రధాన మంత్రి పర్యటన వివరాలను విశ్లేషిస్తే, మోదీ పొదుపు కోసం పిలుపునిచ్చిన మే 12కి ముందు (మార్చి 1 నుంచి), ఢిల్లీ బయట ప్రధాన మంత్రి 81 ప్రజా వేడుకలను నిర్వహించారు.
యుద్ధం మొదలైన తర్వాత 70 రోజుల వ్యవధిలో వివిధ 12 రాష్ట్రాలు, 53 పట్టణాలు, నగరాలలో పర్యటించారు.
ఈ మొత్తం పర్యటనల్లో కేవలం 13 లేదా 16% పర్యటనలు మాత్రమే అధికార విధులతో సంబంధం కలిగి ఉన్నాయి.
నోయిడాలో జెవర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంఖుస్థాపనలు చేయడం జరిగింది.
పరస్పర విరుద్ధత..
అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రచారానికే ఆయన పర్యటనలు ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాయి.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి పర్యటనల వివరాలను సేకరించినట్లు వారు చెప్పారు.
గ్లోబల్‌గా ఇతర దేశాలు అనుసరించిన పద్ధతులు, ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు, ఆయన సొంత పర్యటనలకు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
మార్చి ఆఖరిలో ఫిలిప్పీన్స్ దేశంలో ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించింది.
ఆ సమయంలోనే ఇంధన పొదుపు ప్రచారాన్ని ప్రారంభించి, రోజువారీ జీవితంలో విద్యుత్‌ను సంరక్షించాలని దక్షిణ కొరియా ప్రజలకు పిలుపునిచ్చింది.
ఇంధనం పొదుపు చేసేందుకు ఇంటి నుంచే పని చేస్తూ కార్‌పూలింగ్(ఒకే కారును కలసి ఉపయోగించడం) వాడాలని ఏప్రిల్ 6న థాయిలాండ్ ప్రధాన మంత్రి అనుటిన్ చార్న్విరాకుల్ పౌరులను కోరారు.
దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం పలు మార్లు చెప్పినప్పటికీ వంట గ్యాస్ సరఫరాలో జాప్యం, పెట్రోల్ పంపుల్లో ఇంధనం కొరతను అనుభవిస్తున్న దానిపై పౌరులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
అయితే, రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఐదు రోజుల తర్వాత మే 4న ఇంధన సంరక్షణ గురించి మోదీ ప్రజలను కోరారు.
ఆయన పిలుపు ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత, 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెట్రోలియం కంపెనీలు పెంచాయి.
ప్రధాని పర్యటన: ఒక స్నాప్‌షాట్..
యుద్ధం మొదలైన వెంటనే ఆ కాలంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) విడుదల చేసిన ప్రకటనలతో పాటు ప్రధాన మంత్రి ప్రజల ముందుకు వచ్చిన విధానంపై ఆయన యూట్యూబ్, ఎక్స్ ఖాతాలను ‘ది వైర్’ పరిశీలించింది.
మోదీ పాల్గొన్న ప్రతి వ్యక్తిగత కార్యక్రమాన్ని, ఆయన ఒకే నగరంలో ఉన్నప్పటికీ వేర్వేరుగా లెక్కించారు. ఎందుకంటే ప్రతి వేడుకకూ వేర్వేరు లాజిస్టికల్ సవాళ్లు ఉంటాయి.
ఉదాహరణకు, రోడ్డుషోలను నిర్వహించడానికి అవసరమైన వనరులు, ఒకే నగరం, ఒకే రోజు జరిగినప్పటికీ బహిరంగ సభల వనరుల కంటే భిన్నంగా ఉంటాయి.
ఆయన పాల్గొన్న ఆన్లైన్(రిమోట్) వేడుకలను ఇందులో కలపలేదు. కేవలం ఢిల్లీ బయట ఆయన ప్రయాణించిన వేడుకలపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు.
పర్యటనలు- వేడుకలు- ఎన్నికలు..
ఈ ప్రాతిపదికను ఉపయోగించగా, మార్చి 1 నుంచి మే 12 వరకు ఢిల్లీ బయట ప్రధాన మంత్రి తరచుగా దేశాన్ని చుట్టి వచ్చారు.
11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 53 నగరాలు, పట్టణాలలో పర్యటించి, మోదీ మొత్తం 81 కార్యక్రమాలలో పాల్గొన్నట్లు కనుగొనడం జరిగింది.
ఈ కాలంలో మోదీ 37 బహిరంగ సభలు, 25 రోడ్ షోలలో ప్రసంగించగా- రాబోయే ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు సంబంధించి 13 వేడుకల్లో పాల్గొన్నారు.
వీటితో పాటు అస్సాంలో టీ తోట కార్మికులతో సమావేశం, గుజరాత్లో సోమనాథ్ దేవాలయ సందర్శన, “ది ఆర్ట్ ఆఫ్ లివింగ్” 45వ వార్షికోత్సవ ఉత్సవాలలో పాల్గొనడానికి బెంగళూరు పర్యటన వంటి ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
మోదీ పాల్గొన్న మొత్తం 81 కార్యక్రమాలలో 53 లేదా 65% కార్యక్రమాలు ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగాయి.
అందులో పశ్చిమ బెంగాల్లో 26, అస్సాంలో 11, కేరళలో 8, తమిళనాడులో 6, పుదుచ్చేరిలో 2 వేడుకలు జరిగాయి.
ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో మోదీ నిర్వహించిన వివిధ రకాల వేడుకల్లో- మూడు ప్రారంభోత్సవాలు, 31 బహిరంగ సభలు, అలాగే 15 రోడ్‌షోలు ఉన్నాయి. ఆయన పర్యటనల్లోని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులు తరచుగా ఈ వేడుకల స్థాయి గురించి గొప్పగా చెప్పుకున్నాయి.
రోడ్‌షో అనంతరం ర్యాలీ..
సిలిగురి పట్టణంలో ఏప్రిల్ 11న మోదీ 15 కిలోమీటర్ల పొడవైన రోడ్‌షోను నిర్వహించి, ఎక్స్ ఖాతాలో దాన్ని “అత్యంత గుర్తుండిపోయేదిగా” పేర్కొన్నారు.
రోడ్‌షోను చూడడానికి వచ్చిన ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేసిన మోదీ వాహనం వెనకాల పాము ఆకారంలో వంకర్లు తిరుగుతూ ఉన్న వాహనాల క్యూ దృశ్యాలు ఆయన తన యూట్యూబ్ అకౌంట్లో పెట్టిన పోస్టుల్లో కనిపించాయి.
పశ్చిమ బెంగాల్‌లోని ఝార్గ్రామ్ను ఏప్రిల్ 19న మోదీ సందర్శించగా, అక్కడి ప్రజల్లో “ఉత్సాహాన్ని” చూసి “అప్పటికప్పుడే రోడ్‌షోను” నిర్వహించినట్లు ఒక ఎక్స్ ఖాతా పోస్టు తెలియజేసింది.
ఈ రోడ్‌షోలో మోదీ కారు వెనకాల కనీసం 11 వాహనాలు ఉన్నట్లు పోస్టుతో పాటు ఉన్న వీడియోలో చూపించబడింది.
హెలిప్యాడ్ నుంచి ర్యాలీ వేదిక వరకు 2-3 కిలోమీటర్ల మార్గంలో ప్రజలు ఎలా వరుసలో నిలబడ్డారో రోడ్‌షో అనంతరం ర్యాలీ నుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ వివరించారు.
“ఎంతో బ్రహ్మాండమైన రోడ్‌షో ఉండింది, నా కారు ఫుట్‌బోర్డ్(బయట అడుగుపెట్టే స్టెప్) మీద నిల్చోవాల్సి వచ్చింది” అని ప్రసంగానికి ముందు ఆయన అన్నారు.
అలాగే ఏప్రిల్ 26న తన కోల్‌కతా రోడ్‌షోను “మెగా రోడ్‌షో”గా వర్ణిస్తూ 84 నిమిషాల రోడ్‌షో వీడియోను యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు.
పరస్పర విరుద్ధంగా మాటలు- చేతలు..
ఇలాంటి రోడ్‌షోలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కాలేదు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల తర్వాత మోదీ ఎక్కువగా తన సమయాన్ని సొంత రాష్ట్రం గుజరాత్లో గడిపారు. 70 రోజుల కాలంలో అక్కడ ఆయన 10 కార్యక్రమాలలో పాల్గొనగా అందులో నాలుగు రోడ్‌షోలు ఉన్నాయి.
ఇంధనం పొదుపుపై పౌరులకు ఇచ్చిన పిలుపు రోజునే ప్రధాన మంత్రి రెండు రోడ్‌షోలను నిర్వహించారు -ఒకటి సికింద్రాబాద్‌లో, అదేరోజు రాత్రి జామ్‌నగర్‌లో. ఆ మరుసటి రోజు ఉదయం గుజరాత్‌లోని సోమనాథ్ నగరంలో మూడవ రోడ్‌షోను నిర్వహించి, తర్వాత సోమనాథ్ దేవాలయం పునర్నిర్మించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుకలో పాల్గొన్నారు.
దేవాలయం వద్ద మోదీ సమక్షంలో, భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఎయిరోబాటిక్ జట్టుకు చెందిన ఆరు బీఏఈ సిస్టమ్స్ హాక్ ఎంకే-132 అడ్వాన్స్డ్ జెట్ శిక్షణ విమానాలు దేవాలయం పైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చని పొగ వదులుతూ విన్యాసాలతో కూడిన ఎయిర్‌షోను నిర్వహించాయి.
దీని తర్వాత వైమానిక దళ హెలికాప్టర్ దేవాలయం ప్రాంగణంపై పూల వర్షం కురిపించింది.
ఏవియేషన్ ఇంధన సరఫరాలో ఇప్పటికే కొరత ఏర్పడిందని, ఇలాంటి సమయంలో ఈ రకమైన షోలను నిర్వహించడానికి ఎంతో ఇంధనం అవసరం ఉంటుందని, పొదుపుపై మోదీ ప్రజలకు ఇచ్చిన సందేశంతో ఇది “తీవ్రమైన వైరుధ్యంగా” కనిపిస్తోందని కొంత మంది వైమానిక దళ ప్రముఖులు ‘ది వైర్’కు చెప్పారు.
శంఖుస్థాపనలు – ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు..
బహిరంగ సభలు, రోడ్‌షోలే కాకుండా మోదీ అభివృద్ధి పనుల శంఖుస్థాపనలు లేదా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు సంబంధించి కనీసం 13 వేడుకల్లో పాల్గొన్నారు.
ఇలాంటి ప్రారంభోత్సవాలు ఆఫ్‌లైన్‌లో కాకుండా(వర్చువల్‌గా కూడా) చేయవచ్చు అని మార్చి 7న కోటా విమానాశ్రయానికి ఆన్లైన్ ద్వారా శంఖుస్థాపన చేసి మోదీ సంకేతమిచ్చారు.
ప్రయాణాలను తగ్గించి ఉన్నచోట నుంచే పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పిలుపు ఇచ్చిన వెంటనే, ప్రభుత్వ సలహా మండలి నీతి ఆయోగ్ సదస్సులు, వర్క్‌షాప్‌లు, సమావేశాలతో పాటు వ్యక్తిగతంగా పాల్గొనే అన్ని వేడుకలను రద్దు చేసినట్లు సమాచారం.
సుమారు అదే సమయంలో, తన కాన్వాయ్‌ని సగానికి సగం తగ్గించాలని మోదీ ఆదేశించినట్లు వార్తా కథనాలు సూచించాయి.
మోదీ ఇచ్చిన పిలుపుకు భిన్నంగా, రెండు రోజుల తర్వాత మే 12న రాబోయే ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఆయన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ వేడుక కోసం అస్సాం ప్రభుత్వం భారీ ఏర్పాట్టు చేసింది.
ఈ “కన్నుల పండువైన” వేడుకకు కనీసం లక్ష మంది వస్తారని స్థానిక బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు మీడియా కథనాలు తెలియజేశాయి.
భారీ ఖర్చులు..
మోదీ దేశీయ పర్యటనలన్నీ ఎక్కువగా విమానాలలోనే జరుగుతాయి, చివరి మజిలీ రోడ్డు లేదా ఛాపర్ల ద్వారా జరుగుతుంది.
ఆయన ఎక్కువగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన బోయింగ్ బిజినెస్ జెట్ 737లో ప్రయాణించడం కనిపిస్తుంది.
భారత వైమానిక దళం 2009లో తీసుకున్న ఇలాంటి మూడు జెట్లలో ఇదొకటి.
పశ్చిమ బెంగాల్ కొత్త మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ మే 9న తన కోల్‌కతా పర్యటనలో ఈ జెట్‌లోనే ప్రయాణించినట్లు కనిపించింది.
ఇలాంటి జెట్ల ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో కచ్చితంగా తెలియదు కానీ, 2016లో ఒక సమాచార హక్కు(ఆర్టీఐ) ప్రశ్నకు ఐఏఎఫ్ ఇచ్చిన సమాధానం సూచనాత్మకంగా ఉంది.
అధికార విధుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉప-రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణించే దానికి ఇది ఛార్జీలను మినహాయించినప్పటికీ, 1999లో ఖరారు చేసిన రేట్ల ప్రకారం బోయింగ్ 737 వంటి జెట్‌లో ప్రయాణించాలంటే గంటకు రూ 5,42,000లను ఛార్జీగా వైమానిక దళం విధిస్తుంది.
అప్పటి నుంచి ఈ రేట్లను సవరించారా అన్న దానిపై స్పష్టత లేదు.
వీటితో పాటు రాష్ట్రం లోపల తక్కువ దూరపు ప్రయాణాల కోసం ప్రధాన మంత్రి ఛాపర్లను కూడా వాడుతారు.
ఉదాహరణకు మే 12న, జామ్‌నగర్ నుంచి సోమనాథ్‌కు వెళ్లడానికి మోదీ ఛాపర్లో ప్రయాణించారు, పై నుంచి సోమనాథ్ దేవాలయాన్ని చూపిస్తున్న వీడియోను ఆయన పంచుకున్నారు కూడా.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

