రక్తప్రసరణ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్త విలియం హార్వే. జూన్ 3వ తేదీ ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ- ఆయన గురించి, ఆయన పరిశోధనలతోపాటు వైద్యశాస్త్రానికి ఆయన చేసిన కృషిని గురించి తెలుసుకుందాం.
ఆధునిక వైద్యశాస్త్ర చరిత్రలో కొన్ని ఆవిష్కరణలు మానవ నాగరికత దిశనే మార్చాయి. అటువంటి మహత్తర మార్పులకు కారణమైన శాస్త్రవేత్తల్లో ప్రముఖుడు విలియం హార్వే.
గుండె ఎలా పనిచేస్తుంది? రక్తం శరీరంలో ఎలా ప్రవహిస్తుంది? అనే ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానం చెప్పిన వ్యక్తి ఆయనే.
జననం – కుటుంబ నేపథ్యం..
విలియం హార్వే 1578 ఏప్రిల్ 1న ఇంగ్లాండ్ దేశంలోని ఫోక్స్స్టోన్ పట్టణంలో జన్మించారు.
ఆయన తండ్రి థామస్ హార్వే ఒక వ్యాపారి. తల్లి జోవాన్ హాల్క్. మొత్తం తొమ్మిది మంది పిల్లలున్న కుటుంబంలో పెరిగిన హార్వే, చిన్నప్పటి నుంచే తన తెలివితేటలతో ప్రసిద్ధి చెందారు. కుటుంబంలో విద్యకు ప్రాధాన్యత ఉండటం ఆయన భవిష్యత్తును ఎంతగానో ప్రభావితం చేసింది.
బాల్యం – విద్య..
చిన్నతనంలోనే ఆయన పరిశీలనా శక్తిని, ప్రకృతిపై ఆసక్తిని, శరీర నిర్మాణంపై కుతూహలాన్ని పెంచుకున్నారు.
మొదట కాంటర్బరీలోని కింగ్స్ స్కూల్లో చదివి, ఆ తరువాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. తదనంతరం ఉత్తమ వైద్య విద్య కోసం ఇటలీ దేశంలోని పాదువా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రముఖ శరీర నిర్మాణ శాస్త్రవేత్త ఫాబ్రిసియస్ వద్ద శిక్షణ పొందారు. 1602లో వైద్య పట్టా సంపాదించారు.
హార్వేకు ముందు వైద్య ప్రపంచం..
హార్వేకు ముందు ప్రపంచ వైద్యశాస్త్రం గాలెన్ సిద్ధాంతాల ఆధీనంలో ఉండేది. అప్పట్లో ప్రజల నమ్మకాలు ఎలా ఉండేవంటే.. రక్తం కాలేయంలో ఉత్పత్తి అవుతుంది, శరీరం దానిని వినియోగిస్తుంది, ఆ రక్తం తిరిగి రాదు అని భావించేవారు. ఈ అభిప్రాయాలు దాదాపు పద్నాలుగు శతాబ్దాల పాటు కొనసాగాయి.
పరిశోధనల ప్రారంభం..
హార్వే జంతువులపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. గుండె కొట్టుకునే విధానాన్ని పరిశీలించారు. శరీరంలోని రక్త పరిమాణాన్ని లెక్కించారు. రక్తనాళాల నిర్మాణాన్ని అధ్యయనం చేశారు.
“గుండె ఒక పంప్ లాంటిది. రక్తం నిరంతరం శరీరంలో తిరుగుతూనే ఉంటుంది” అని ఈ పరిశోధనల ద్వారా ఆయన విప్లవాత్మక నిర్ణయానికి వచ్చారు.
రక్తప్రసరణ సిద్ధాంతం..
హార్వే నిరూపించిన ప్రధాన అంశాలు:
♦ గుండె రక్తాన్ని పంపిస్తుంది.
♦ ధమనులు రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తాయి.
♦ శిరలు రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువస్తాయి.
♦ రక్తం ఒక మూసివున్న వలయంలో(చక్రంలో) నిరంతరం తిరుగుతుంది.
ఈ సిద్ధాంతం వైద్యశాస్త్రంలో పెద్ద విప్లవానికి దారితీసింది.
ప్రసిద్ధ గ్రంథం..
1628లో ఆయన తన ప్రసిద్ధ గ్రంథాన్ని ప్రచురించారు. దాని పేరు “Exercitatio Anatomica de Motu Cordis et Sanguinis in Animalibus”. ఈ గ్రంథం వైద్య చరిత్రను పూర్తిగా మార్చివేసింది.
హార్వే సిద్ధాంతాన్ని మొదట్లో చాలామంది అంగీకరించలేదు. ఎందుకంటే, ఆయన పాత విశ్వాసాలను సవాలు చేశారు. అది అప్పటి వైద్య సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది. ఆయన ప్రయోగాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చారు. వీటన్నింటి వల్ల కొంతకాలం ఆయన వైద్య వృత్తి (ప్రాక్టీస్) కూడా ప్రభావితమైంది.
చర్చి – సమాజ స్పందన..
హార్వేకు ఎదురైన ప్రతిఘటన ప్రధానంగా సంప్రదాయవాద వైద్య వర్గాల నుండే వచ్చింది. చర్చి నేరుగా తీవ్ర వ్యతిరేకత చూపకపోయినా, పాత భావనలను సమర్థించే వర్గాలు ఆయన సిద్ధాంతాన్ని అనుమానంతో చూశాయి. అయితే ఆయన చేసిన ప్రయోగాలు, చూపించిన ఆధారాలు చివరకు ఆయన చెప్పిందే సరైనదని నిరూపించాయి.
ఆధునిక వైద్యశాస్త్రంపై ప్రభావం..
హార్వే ఆవిష్కరణల వల్ల:
♦ కార్డియాలజీ విభాగం అభివృద్ధి చెందింది.
♦ హార్ట్ సర్జరీ సాధ్యమైంది.
♦ రక్త మార్పిడి పద్ధతులు అభివృద్ధి చెందాయి.
♦ శరీర నిర్మాణ పరిశోధనలు మరింత వేగవంతమయ్యాయి.
మొత్తంగా చెప్పాలంటే ఆధునిక వైద్యశాస్త్రానికి ఆయనే గట్టి పునాది వేశారు.
హార్వే తన జీవితాంతం పరిశోధనలు కొనసాగిస్తూనే, 1657 జూన్ 3న మరణించారు.
విలియం హార్వే కేవలం ఒక వైద్యుడు మాత్రమే కాదు. నిశిత పరిశీలన, కచ్చితమైన ప్రయోగం, శాస్త్రీయ నిరూపణల ద్వారా ప్రపంచం దృష్టిని మార్చిన విప్లవాత్మక శాస్త్రవేత్త.
మానవ శరీరం గురించి మనం నేడు తెలుసుకున్న ప్రాథమిక సత్యాలలో ఒకటైన ఈ ‘రక్తప్రసరణ సిద్ధాంతం’, ఆయన మేధస్సుకు నిలువెత్తు నిదర్శనం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
