హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం అభ్యుదయ సాహిత్య లోకానికి తీరని లోటని పలువురు రచయితలు, కవులు విచారం వ్యక్తం చేశారు.
ఆయన సాహిత్యానికి చేసిన కృషిని ప్రస్థావిస్తూ కొనియాడారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఏటుకూరి సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయడానికి యువ రచయితలు కృషి చేయాలని వారు కోరారు.
ఇటీవల మృతి చెందిన అభ్యుదయ సాహితీవేత్త డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ సంస్మరణ సభ ఆదివారం జరిగింది.
తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం, నవచేతన ప్రచురణ సంస్థ, తెలంగాణ ప్రజానాట్య మండలి సంయుక్తంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభకు ‘విశాలాంధ్ర’ పత్రిక సంపాదకులు ఆర్వీ రామారావు అధ్యక్షత వహించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తొలుత ఏటుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎప్పుడూ చురుకుగా, సమయస్ఫూర్తితో ఉండే ఏటుకూరి అభ్యుదయ సాహిత్య రంగానికి చేసిన సేవలను గుర్తుచేస్తూ, ఆయనతో తమకున్న పరిచయాలను వక్తలు మననం చేసుకున్నారు.
విరసం నాయకులు, రచయిత నిఖిలేశ్వర్; తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు వేల్పుల నారాయణ; ప్రధాన కార్యదర్శి వీరస్వామి; ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి బీ శివప్రసాద్; జాతీయ అధ్యక్షులు లక్ష్మినారాయణ తదితర రచయితలతో పాటు- సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ, సీనియర్ నాయకులు డాక్టర్ కే నారాయణ, అజీజ్ పాషా, చాడా వెంకట్ రెడ్డి, కే ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
