రోమిలా థాపర్ ఎప్పుడూ ఊహించని ఒక వేసవి కాలం అది.
ఆమె అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ముగిసే సమయానికి, తన వద్ద డబ్బులు అయిపోయాయని ఆమె తండ్రి ఆమెకు లేఖ రాశారు.
ఆమె ఇంటికి తిరిగి వస్తే— ఇక్కడ ఆమె కాసేపు ఆగారు— “నాన్నగారు నా పెళ్లి ప్రస్తావన తెచ్చారు” అని చెప్పారు.
దాంతో తీవ్ర గందరగోళంలో పడిన థాపర్ తన అన్నయ్య రమేష్‌కు లేఖ రాశారు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని ఆమె ఇప్పటికీ సంతోషంగా గుర్తుచేసుకుంటారు.
“నీకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తే చేసుకో, కానీ కేవలం ముల్లంగి దుంపలు (సరిపోని సంబంధాలు) దొరుకుతున్నాయని మాత్రం పెళ్లి చేసుకోవద్దు” అని సలహా ఇచ్చారు ఆ అన్నగారు.
“ఆ సలహా నా నిర్ణయాన్ని మార్చేసింది. సాంప్రదాయాన్ని పక్కన పెట్టడానికి నాకు ఒక కారణం దొరికింది. అశోకునిపై పరిశోధన చేయడానికి ఒక డాక్టోరల్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్నా—అది నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. కమిటీలోని కొందరు ఈ సబ్జెక్ట్ ఎప్పుడో పాతబడిపోయిందని భావించారు. అయినప్పటికీ నాకు డాక్టోరల్ అవార్డు వచ్చింది”- ఆమె ఆ వార్తను చెప్పడానికి ‘బాష్'(ప్రొఫెసర్ బాషమ్) వద్దకు వెళ్లారు.
ఆయన నా ముఖం చూసి “ఎందుకు అంత నిరాశగా కనిపిస్తున్నావు? నేనెప్పుడూ నిన్ను ఇంత నిరాశగా ఉండడం చూడలేదే” అనడిగారు.
“నాకు ఫెలోషిప్ వచ్చింది, నేను చరిత్రకారిణిని కావాల్సి వస్తోంది” అని నేను నిరాశ నిండిన స్వరంతో చెప్పాను.
చరిత్రకారిణిగా అడుగులు – అశోకుడి శాసనాలపై పరిశోధన..
అశోకుని రూపంలో, థాపర్‌కు సమకాలీన సమాజం, దాని ప్రాధాన్యాలతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్ దొరికింది.
రాతి బండలపై, స్తంభాలపై చెక్కబడిన అశోకుని శాసనాలు—ఎక్కువగా బ్రాహ్మి, ఖరోష్ఠి లిపులలో, కొన్ని గ్రీక్- అరామిక్ భాషలలో ఉన్నాయి—ఇవి ఉపఖండంలో కనుగొనబడిన పురాతన చదవగలిగే రాతలలో కొన్ని.
ఇతర విషయాలతోపాటు, అవి ఈ పురాణాన్ని చెబుతాయి: కళింగ(ఆధునిక ఒడిశా) యుద్ధంలో జరిగిన తీవ్ర రక్తపాతాన్ని చూసిన తర్వాత అశోకుడు తన సామ్రాజ్యకాంక్షా యుద్ధాల పట్ల పశ్చాత్తాపపడ్డాడు.
బుద్ధుని బోధనలకు ప్రభావితమై, అతను అహింసా మార్గమైన బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేయడం ప్రారంభించాడు.
అతని శాసనాల ద్వారా ‘బ్రాహ్మణ-శ్రమణుల’ మధ్య పరస్పర సహనానికి పిలుపునిచ్చాడు.
అంటే, యజ్ఞయాగాదులు, వంశపారంపర్య పూజారులతో కూడిన వైదిక బ్రాహ్మణ సాంప్రదాయానికి, నైతిక నియమావళి ద్వారా మోక్షాన్ని పొందే బౌద్ధులు, జైనుల వంటి కొత్త నమ్మకాలకు మధ్య సమన్వయాన్ని కోరాడు.
శాసనాలు, ప్రాచీన పరిశోధనలకు ఆధారమైన భాషాశాస్త్రం(ఫిలాలజీ)లో థాపర్ పూర్తిగా నిమగ్నమయ్యారు.
ఆమె ఇతర సామాజిక శాస్త్రాల నుంచి అందుబాటులోకి వస్తున్న కొత్త పద్ధతుల పట్ల కూడా శ్రద్ధ వహించారు.
చరిత్ర పరిశోధన, రచనల కచ్చితత్వం “నా స్వయంప్రతిపత్తి(స్వేచ్ఛ) గొప్ప అవసరానికి ఒక దిశను ఇస్తుందని” తెలుసుకుని, ఆమె ఒక చరిత్రకారిణిగా తన గుర్తింపుతో స్థిరపడ్డారు.
[ఆ మఠాన్ని, భూమిని చూస్తున్నప్పుడు, ఆమెకు ఒక వింత అనుభూతి కలిగింది: “గత శతాబ్దాల ప్రవాహం” తన చుట్టూ స్పష్టంగా గోచరిస్తున్నట్లు అనిపించింది.]
చైనా పర్యటన – గత శతాబ్దాల ప్రవాహంలో…
ఆమెకు శారీరక సాహసాల పట్ల ఆసక్తి ఉండేది. ఒక చరిత్రకారుడు వాస్తవ భౌగోళిక ప్రాంతం నుంచి ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకునే దృష్టి కూడా పెరిగింది.
1957లో, తన థీసిస్ రాసే ప్రక్రియ మధ్యలో, మైజిషన్- దున్హువాంగ్లోని బౌద్ధ గుహ ప్రాంతాలకు వెళ్లే ఒక యాత్రలో సహాయకురాలిగా ఆమెకు ఆహ్వానం అందింది.
ఆమె విప్లవ చైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణించారు, రష్యన్ ఇంజనీర్లతో ఫాక్స్‌ట్రాట్ డాన్స్ చేశారు, బౌద్ధ భిక్షువులు, రెడార్మీ గార్డులతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు.
చైనా ప్రధాని చౌ ఎన్లై, ఛైర్మన్ మావో జెడాంగ్లతో కరచాలనం చేశారు.
జియాన్‌లో, ఆమె 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన యాత్రికుడు యువాన్ చ్వాంగ్ మఠాన్ని సందర్శించారు.
ఆయన తన ప్రయాణాల గురించి రాసిన అమూల్యమైన గ్రంథం కారణంగా ఆధునిక చరిత్రకారులకు గొప్ప మిత్రుడయ్యాడు.
థాపర్, ఒంటరిగా ఒక ఎత్తైన బాల్కనీలో నిలబడి, ఆ మఠాన్ని, భూమిని చూస్తున్నప్పుడు, ఆమె ఒక వింత అనుభూతికి లోనయ్యింది. “గత శతాబ్దాల ప్రవాహం” తన చుట్టూ స్పష్టంగా గోచరిస్తున్నట్టు అనిపించింది.
బీజింగ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, తాను చూసిన విషయాల గురించి చర్చించడానికి చైనా విద్యావేత్తలను కలవడానికి ఆసక్తి చూపారు.
“పురాతన ప్రదేశాలను పరిరక్షించడానికి వారు ఏం చేస్తున్నారు, విప్లవం తర్వాత వారు నిర్మిస్తున్న కొత్త సమాజం వారు అనుకున్నట్లే ఉందా అనే విషయాల గురించి అడిగి తెలుసుకోవాలనుకున్నాను. వారు మాట్లాడటానికి సంకోచించారు. అంతకుముందు సంవత్సరం, మావో “నూరు పువ్వులు వికసించనివ్వండి, వంద భావజాలాలను సంఘర్షించనివ్వండి” అని పిలుపునిచ్చారు. కానీ అప్పటికే అసమ్మతి వ్యక్తం చేసే అవకాశం మూసుకుపోతోంది.
ఈ విషయమై తన డైరీలో ‘పార్టీ లైన్‌ను అమలు చేయడానికి పార్టీ చేపట్టిన దిద్దుబాటు చర్యల పేరిట అమలవుతున్న క్రమశిక్షణా చర్యల ప్రతిధ్వనులను వినగలిగాను’ అని రాసుకున్నారు.
చరిత్రకారుల మీద మితవాదులు అన్న ముద్ర పడింది.(దున్‌హువాంగ్ కుడ్యచిత్రాలపై పట్టున్న జియాంగ్ దా అనే విద్వాంసుడు, చైనా చరిత్రలో నూరు పువ్వులు వికసించడం లేదని, కేవలం ఐదు మాత్రమే వికసిస్తున్నాయని, అవి కూడా ఒకే విషయాన్ని చెబుతున్నాయని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి.)
థాపర్‌కు, విద్యా రంగంలో వచ్చిన ఈ మార్పు విచారకరంగా, దిగ్భ్రాంతికరంగా అనిపించింది. “ఇప్పటికయితే ట్యాంకులు, రక్తపాతం లేదు. కానీ ఇది ఇక్కడితోనే ఆగుతుందా?” అన్న ప్రశ్న ఎదురయ్యింది.
కొత్త చరిత్ర రచనకు శ్రీకారం..
1961లో అశోకుడు – మౌర్యుల పతనం(Aśoka and the Decline of the Mauryas) పేరిట థాపర్ థీసిస్ ప్రచురించబడింది.
ఆ సమయంలో ప్రాచీన భారతదేశ అధ్యయనంలో ఆధిపత్యం చలాయించిన చరిత్ర రచనా పద్ధతుల నుంచి భిన్నంగా ఉన్నందున ఇది ఒక మైలురాయిగా నిలిచింది.
అశోకుని ధమ్మ సహన నియమావళిని ఆమె నైతికమైనదిగానే కాకుండా ఒక సామ్రాజ్య భావజాలంగా కూడా వివరించారు: ఇది “బౌద్ధ, హిందూ ఆలోచనల నుంచి తీసుకోబడింది” కానీ ఒక భారీ సామ్రాజ్యాన్ని ఒకటిగా ఉంచడానికి ఉపయోగపడింది.
1950, 60లలో నెహ్రూ నేతృత్వంలోని భారతదేశం—తీవ్ర అలజడులతో కూడిన ఒక పెద్ద, పేద ప్రజాస్వామ్యం—ఇలాంటి కృషే చేపట్టడానికి ప్రయత్నిస్తుంది; దేశం ముక్కలు కాకుండా చూడడం, రాజ్యాధికారాన్ని, అసమ్మతిని సమతూకంలో ఉంచడం ఆనాడు నెహ్రూ ఎంచుకున్న లక్ష్యం. థాపర్ ఆ ప్రాజెక్ట్‌లో సహజంగా భాగస్వామి అయ్యారు.
డాక్టరేట్ పూర్తికావడంతో, ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చారు. పెద్ద కుటుంబం కావడంతో వాళ్ళంతా ఆమె విదేశీ చదువును ఒక రకమైన “ఫినిషింగ్ స్కూల్”(పెళ్లికి ముందు నేర్చుకునే పద్ధతులు) గా చూశారు.
‘ఇప్పుడు ఏం చేస్తున్నావు’ అని అందరూ వాకబు చేసేవాళ్ళే. “నేను బోధనా వృత్తిని ఎంచుకున్నా” అని చెబితే “ఓహో, అంటే నువ్వు స్కూల్ టీచర్ అవుతావన్నమాట” అని సరిపెట్టుకునేవాళ్ళు.
ఆమెను చూడటానికి సోదరుడు రమేష్ బాంబే నుంచి వచ్చినప్పుడు, ఆయన తన తండ్రితో- “నానా, మీరు దయచేసి తనని పెళ్లి కాని కూతురిలా చూడకండి. వృత్తిపరంగా అర్హత కలిగిన కొడుకులా చూడండి”అని చెప్పారు. రమేష్ నన్ను ఎప్పుడూ చాలా బాగా అర్థం చేసుకునేవాడనీ థాపర్ చెప్పారు. “ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి” అని గుర్తు చేసుకున్నారు.
[చరిత్రలో చోటు చేసుకున్న మార్పులకు, పరిణామాలకు గల కారణాలను, అలాగే చరిత్రకారులు ఆ నిర్ధారణలకు ఎలా వస్తారనే విషయాలను పాఠశాలల్లో బోధించాలని థాపర్ భావించారు.]
బోధన, పరిశోధన – పాఠ్యపుస్తకాల రూపకల్పన..
గడిచిన 60 ఏళ్లలో థాపర్ చేసిన పరిశోధనల విస్తృతిని అంత సులభంగా వివరించలేము. అశోక అండ్ ద డిక్లైన్ ఆఫ్ ద మౌర్యాస్ తో మొదలుపెట్టి రెండు డజన్లకు పైగా పుస్తకాలను వెలువరించారు.
ఈ రచనలే ఆమెను ప్రాచీన భారతదేశ చరిత్ర రంగంలో అగ్రగణ్యురాలిగా నిలిపాయి.
కేవలం రాజవంశాల చరిత్రను దాటి, ఆమె ప్రాచీన భారతీయ సామాజిక నిర్మాణాలైన రాజరికం, కుల సమూహాలు, మత తెగలు, తొలి రాజ్యాలు, వాటి ఆర్థిక నమూనాలను పరిశోధించారు.
సాంప్రదాయ – సంస్కృత – గ్రంథాల అధ్యయనంతో పాటు, ఆమె తరానికి చెందిన చరిత్రకారులు పురావస్తు – సామాజిక-శాస్త్రీయ పద్ధతుల అధ్యయనంతో చరిత్ర రచనకు పూనుకునేవారు.
1960, 70లలో భారతీయ చరిత్ర “ఇండాలజీ నుంచి సామాజిక శాస్త్రంగా మారింది”. థాపర్ పరిశోధనా పద్ధతులు ఈ రంగంలో ప్రామాణికంగా మారాయి.
1970లో ఆమె న్యూఢిల్లీలో నూతనంగా స్థాపించబడిన విశ్వవిద్యాలయంలో చేరారు. అదే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఇది విభిన్న రంగాల బోధన, విమర్శనాత్మక పరిశోధనలలో మార్గదర్శిగా నిలిచింది. నేడు ఇది భారతదేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది.
అదే సమయంలో, భారతీయ పాఠశాలల కోసం కొత్త పాఠ్యపుస్తకాలను రాయడం కోసం థాపర్ తన విమర్శనాత్మక విధానాన్ని అన్వయించారు. అప్పటి వరకు ఉన్న పాఠ్యాంశాలు చరిత్రను ఒక నిర్దిష్ట సంఘటనల క్రమంగా బోధించేవని, విద్యార్థులు వాటిని ఒక మంత్రంలా కంఠస్థం చేసేవారని ఆమె వివరించారు.
చరిత్రలో జరిగే మార్పులకు, పరిణామాలకు గల కారణాలను, అలాగే చరిత్రకారులు ఆ నిర్ధారణలకు ఎలా వస్తారనే విషయాలను పాఠశాలల్లో బోధించాలని థాపర్ భావించారు.
“ఇది వినడానికి చాలా సులువు అనిపించినా ఆచరణలోకి తీసుకురావడం అంత సులభం కాదు— పిల్లల కోసం మరొక పాఠ్యపుస్తకం రాయడం కంటే నేను మళ్లీ ఒక పీహెచ్డీ థీసిస్ రాయడానికే ఇష్టపడతాను—కానీ పాఠ్య పుస్తకాల రూపకల్పన ముఖ్యమైన, దేశభక్తితో కూడిన పని. అందుకే నేనీ పని చేపట్టేందుకు సిద్ధపడ్డాను” అని చెప్పారామె.
వ్యక్తిగత జీవితం – స్త్రీవాద దృక్పథం..
థాపర్ అవివాహితగా మిగిలిపోయారు. ఒకానొక సమయంలో, ఆమెకు 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఆమె తల్లి ‘ఒక బిడ్డను దత్తత తీసుకోవచ్చుగా, అదీ ఆడపిల్లను దత్తత తెచ్చుకుంటే రేపు నువ్వు ముసలిదానివయినప్పుడు బాగా చూసుకుంటుంది’ అని సలహా ఇచ్చారు.
“నేను దాని గురించి చాలా సీరియస్‌గా ఆలోచించాను. కానీ నా వృత్తిలో భాగంగా లెక్చర్స్ ఇవ్వడానికి ఇక్కడికని అక్కడికని తిరగాల్సి వచ్చేదాన్ని, నేను దత్తత తీసుకున్న బిడ్డని సాకగలనా అనిపించింది. అప్పటికీ బిడ్డను పెంచడానికి తాను సాయం చేస్తానని అమ్మ నచ్చచెప్పడానికి చూసింది. అన్ని విధాలా ఆలోచించి చివరికి నేను వద్దనుకున్నాను, ఎందుకంటే నేను ఒక బిడ్డకు ఇవ్వాల్సినంత సమయాన్ని, శ్రద్ధను ఇవ్వలేను. అలాంటప్పుడు దత్తత తీసుకుని ఆ బిడ్డకు అన్యాయం చేసినట్లు అవుతుంది. అందుకే వద్దనుకున్నాను” అని చెప్పారామె.
1980లలో భారతదేశంలో స్త్రీవాద ఉద్యమం బలంగా వచ్చే నాటికి థాపర్ యాభయ్యవ పడిలో ఉన్నారు. ఆమె ఒక నిబద్ధత కలిగిన స్త్రీవాది. (పారిస్ సందర్శించినప్పుడు, ఆమె సిమోన్ డి బోవర్ సమాధిపై పూలు ఉంచేవారు) కానీ ఆమె స్వయంగా “మహిళల స్థితిగతులపై పుస్తకాలు” రాయాల్సిన అవసరం ఉన్నదని ఎప్పుడూ భావించలేదు.
“మాలో కొందరం కేవలం ఒక స్వతంత్ర జీవితాన్ని జీవించగలం, మేము జీవించే విధానం, మాట్లాడే విధానం, మా హక్కులను రాబట్టుకునే విధానం ద్వారా, మేము ప్రజలను ఆలోచింపజేయగలం” అని వివరించారామె.
ఆమె జేఎన్‌యూ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్‌లో, ప్రాచీన భారతీయ చరిత్ర బోధించారు.
1991లో 60 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ పొందారు.
ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎమెరిటాగా ఉన్నారు. ఆమె కెరీర్ నెమ్మదించలేదు. పదవీ విరమణ తర్వాత, సహచరులు ఆమెను ఒక ఫెస్ట్స్క్రిఫ్ట్ (గౌరవార్థం ప్రచురించే గ్రంథం) తో సత్కరించారు: ట్రెడిషన్, డిస్సెంట్ అండ్ ఐడియాలజీ (Tradition, Dissent and Ideology – 1996).
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కూడా థాపర్ చురుగ్గా ఉండటంతో, యువ తరం మరొక గ్రంథాన్ని అందించింది: క్వశ్చనింగ్ పారాడైమ్స్, కన్‌స్ట్రక్టింగ్ హిస్టరీస్(Questioning Paradigms, Constructing Histories – 2019).
అనువాదం: కె సత్యరంజన్
Psyche వెబ్సైట్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని నాలుగు భాగాలుగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం, మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
