ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. కొంతమంది ముఖ్యమంత్రులు మోటార్‌సైకిళ్లు, మెట్రోలు, ఎలక్ట్రిక్ కార్లలో ప్రయాణించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి నామమాత్రపు చర్యలు ఎక్కువ కాలం నిలవవు.
పీఎం-కిసాన్ పథకంతో అనుసంధానించి, ఎకరానికి నిర్దిష్ట మొత్తాన్ని నగదు బదిలీ విధానం వైపు పయనించడం ద్వారా రసాయన ఎరువుల సబ్సిడీ విధానాన్ని పూర్తిగా సంస్కరించడంలోనే అంతిమ పరిష్కారం, నిజమైన ‘బ్రహ్మాస్త్రం’ ఉంది.
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడుతూనే ఉంది. ఆర్బీఐ నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకోకపోతే, మారకపు రేటు ఒక డాలర్‌కు రూ 100కి పడిపోయే అవకాశం ఉంది.
రూపాయిని స్థిరీకరించడానికి, ఆర్బీఐకి కనీసం $50-60 బిలియన్ల నిధులు అవసరం కావచ్చు. అయినా కూడా అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుంది.
ఈ సంక్షోభానికి మూల కారణాలు చాలా వరకు ఆర్బీఐ నియంత్రణకు బయట ఉన్నాయి.
బలంగా ‘ఎల్ నినో’ ప్రభావం..
మధ్యప్రాచ్య సంక్షోభం భారతదేశాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇంధనం, ఎరువుల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
ఇటీవల పెట్రోల్ ధరలు లీటరుకు సుమారు రూ 3-4 మేర పెరగడం అనేది, ప్రపంచ ధరల ప్రభావం పాక్షికంగా మాత్రమే దేశ ప్రజలపై వేయబడింది.
ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువులు, ముఖ్యంగా యూరియా విషయంలో కూడా ఇలాంటి తక్కువ ధరలే ఉన్నాయి.
ఈ ఒత్తిళ్ల వల్ల ద్రవ్యలోటు జీడీపీలో 5 శాతానికి మించి పెరిగే అవకాశం ఉంది.
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారతదేశంపై ఆసక్తి కోల్పోయి, తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.
దేశీయ పెట్టుబడిదారులు కూడా అంతే ఆందోళన చెందుతూ, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు.
‘ఎల్ నినో’ ప్రభావం బలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ఫలితంగా, భారత ఆర్థిక వ్యవస్థ వేగాన్ని కోల్పోతోంది.
నేటి పరిస్థితుల ఆధారంగా భారతదేశం 6 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసి, వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణాన్ని 6 శాతం కంటే తక్కువగా అదుపులో ఉంచగలిగితే అది అదృష్టమే.
భారీ సంస్కరణలే మార్గం..
ఒకవేళ హోర్ముజ్ జలసంధి మరో మూడు నెలల పాటు మూసివేసి ఉంటే, జీడీపీ వృద్ధి 6 శాతం కంటే దిగువకు పడిపోతుంది.
ద్రవ్యోల్బణం 6 శాతం కంటే పైకి ఎగబాకుతుంది. ఇది ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ట పరిమితి కంటే ఎక్కువ.
అప్పుడు ఆర్బీఐకి త్వరలో రెపో రేట్లను పెంచడం తప్ప మరో మార్గం ఉండదు. దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభం అంచున ఉన్నట్టు కనిపిస్తోంది.
దీనిని నివారించడానికి ఉన్న ఏకైక హేతుబద్ధమైన మార్గం, 1991లో చేపట్టినటువంటి భారీ సంస్కరణలను చేపట్టడమే.
ఐదు దేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మోదీ తన కేబినెట్ సహచరులతో సమావేశమైనారు.
వనరులను, ముఖ్యంగా ఇంధనాన్ని ఆదా చేసే, వాణిజ్య, కరెంట్ ఖాతా లోటులను తగ్గించి, భారతదేశ వృద్ధిపై విశ్వాసాన్ని పునరుద్ధరించే సంస్కరణలను చేపట్టాలని వారిని కోరారు.
ఆర్థిక సంస్కరణల సాంకేతిక బ్లూప్రింట్‌ను సిద్ధం చేయడం కష్టం కాదు. కానీ అటువంటి సంస్కరణలను చేపట్టడానికి కావలసింది రాజకీయ సంకల్పం.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉచితాలు పంపిణీ చేసే సంస్కృతి ఇప్పుడు లోతుగా పాతుకుపోయింది.
నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టడంలో ఇదే అతిపెద్ద అడ్డంకి. ఎరువులు, ఆహార రాయితీల ఉదాహరణలతో దీనిని చూడాలి.
ఎరువుల సరఫరా, వినియోగంపై ప్రభుత్వ గణాంకాలలో వ్యత్యాసం..
ముందుగా ఎరువుల విషయాన్ని తీసుకుందాం. భారతదేశం తన యూరియా అవసరాలలో 20 నుంచి 25 శాతం వరకు దిగుమతి చేసుకుంటుంది.
గత దిగుమతి టెండర్ ప్రకారం యూరియా కనీస ధర పశ్చిమ తీరంలో దిగుమతి అయ్యేప్పటికి టన్నుకు $935 డాలర్లుగా ఉండాలి.
కానీ దీనిని రైతులకు టన్నుకు $70 డాలర్ల కంటే తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు వివేకవంతమైనది?
మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇటువంటి ధరల నిర్ణయం ఒక పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది.
దీనిలో అధిక భాగం వ్యవసాయం నుంచి భారతదేశంలోని ఇతర పారిశ్రామిక అవసరాలకు మళ్లించబడుతోంది. పొరుగు దేశాలకు కూడా అక్రమంగా తరలించబడుతోంది.
బీహార్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ. ఎరువుల సరఫరా, వినియోగంపై ప్రభుత్వ గణాంకాలలో వ్యత్యాసాన్ని వెల్లడిస్తున్నాయి. అధికారిక గణాంకాలు యూరియా, డీఏపీ, ఎంఓపీ వంటివి పెద్ద సంఖ్యలో సరఫరా అవుతున్నట్లు చూపిస్తున్నాయి.
ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి ఉపయోగించే ‘సాగు వ్యయ సర్వేలు’ అనే మరో ప్రభుత్వ డేటా ప్రకారం, వాస్తవ క్షేత్ర వినియోగం సరఫరా అయిన పరిమాణం కంటే 50 శాతం కంటే తక్కువగా ఉందని తెలుస్తోంది. దీన్నిబట్టి మిగిలినది ఎక్కడికి వెళ్తోంది? అనే ప్రశ్న తలెత్తుతుంది.
బీహార్‌లోని వాస్తవ పరిస్థితులు తెలిసిన వారికి, నేపాల్‌కు ఎరువుల మళ్లింపునకు ఆ రాష్ట్రం చాలాకాలంగా సులభమైన మార్గంగా ఉందని తెలుసు.
బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం..
సరిహద్దు జిల్లాల నుంచి అందుతున్న నివేదికల ప్రకారం, రాయితీతో కూడిన ఎరువులు నిత్యం బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా తరలించబడుతున్నాయి. దీనికి మూల కారణం యూరియాపై ఇస్తున్న భారీ రాయితీ. ప్రస్తుతం ఈ రాయితీ యూరియా ఖరీదులో దాదాపు 90% గా ఉంది.
2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ 1.71 లక్షల కోట్లుగా కేటాయించిన ఎరువుల సబ్సిడీ బిల్లు ఖచ్చితంగా రూ 2.25 లక్షల కోట్లను దాటి రూ. 2.50 లక్షల కోట్లకు కూడా చేరవచ్చు. దీనికి అంతిమ పరిష్కారం అసలైన బ్రహ్మాస్త్రం పీఎం-కిసాన్ పథకంతో అనుసంధానించి, ఎకరానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం వైపు మారడం ద్వారా మొత్తం రసాయన ఎరువుల సబ్సిడీ విధానాన్ని సంస్కరించడమే.
ఒకప్పుడు జన్ ధన్-ఆధార్-మొబైల్ అనుసంధాన కార్యక్రమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, ఈ సంస్కరణకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తే, వివిధ డేటా సెట్లను త్రిభుజాకార పద్ధతిలో విశ్లేషించడం ద్వారా కౌలు రైతులకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించవచ్చు.
ఈ మార్పు పూర్తయ్యాక, ఎరువుల ధరలను మార్కెట్ శక్తులకే వదిలివేయాలి. దానివల్ల యూరియా లీకేజీలు, అక్రమ రవాణా అరికట్టవచ్చు. నత్రజని, భాస్వరం, పొటాషియం వినియోగంలో అసమతుల్యతను సరిదిద్దవచ్చు. అలాగే పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఇటువంటి సంస్కరణల వల్ల ప్రభుత్వానికి ఏటా కనీసం రూ. 40,000-50,000 కోట్లు ఆదా కావచ్చు.
ఇంతటి భారీ సంస్కరణ రాజకీయంగా కష్టమైతే, భూకమతం పరిమాణం, సాగు చేసే పంటల ఆధారంగా ఎరువుల అమ్మకాలపై పరిమాణాత్మక పరిమితులు విధించడం రెండవ ఉత్తమ మార్గం.
అది కూడా ఆచరణ సాధ్యం కాకపోతే, యూరియాను పోషకాధారిత సబ్సిడీ పథకం పరిధిలోకి తీసుకొచ్చి ధరలను క్రమంగా పెంచడం. ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువుల ధరలను తగ్గించడం మూడవ ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ క్రమంలో మొత్తం సబ్సిడీ భారాన్ని సుమారు రూ 2 లక్షల కోట్లకే పరిమితం చేయాలి.
ఆహార రాయితీల విషయంలోనూ ఇలాంటి సమస్యే తలెత్తుతుంది. ఆహార సబ్సిడీ బిల్లు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ 2.28 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు.
ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ..
అయినప్పటికీ- ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం, తీవ్ర పేదరికం 5.3 శాతానికి తగ్గిందని ప్రభుత్వం, నీతి ఆయోగ్ లెక్క ప్రకారం దాదాపు 11 శాతానికి తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నది. అలాంటప్పుడు 800 మిలియన్ల కంటే ఎక్కువ మందికి ఉచిత ఆహార ధాన్యాలను ఎందుకు పంపిణీ చేయాలి?
ఈ పథకం కింద కవరేజీని హేతుబద్ధీకరించడం లేదా పేదరిక రేఖకు పైన ఉన్నవారికి ధరలను పెంచడం ద్వారా ఏటా మరో రూ 50,000 కోట్లు ఆదా చేయవచ్చు.
ఈ సంస్కరణలను చేపట్టడంలో విఫలమయితే అది జాగ్రత్త, విధాన పిరికితనాన్ని ప్రతిబింబిస్తుంది.
అశోక్ గులాటి విశిష్ట ప్రొఫెసర్; రితికా జునేజా ఐసీఆర్‌ఐఈఆర్‌లో సీనియర్ ఫెలో. మే 25న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన వ్యాసానికి స్వేచ్ఛానువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
