2020 జనవరి చివరలో భారత దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రవేశించింది. అప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాలకు పాకింది.
చైనాలోని యుహాన్ ప్రాంతంలో మొదటగా ఈ ప్రమాదకరమైన వైరస్ ప్రారంభం అయింది. క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించింది.
కానీ మార్చి 23వ తారీకు వరకు విశ్వ గురువుగా ప్రఖ్యాతిగాంచిన మన మోదీ మౌనం వహించారు.
2020 మార్చి 24 రాత్రి అకస్మాత్తుగా, అర్ధాంతరంగా కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా, ప్రజలను సన్నద్ధం చేయకుండా నిరవధిక లాక్ డౌన్ ప్రకటించారు.
ఫలితంగా ప్రజల జీవితాలు అతలాకుతలం అయినాయి. మరీ ముఖ్యంగా వలస కార్మికులు అనుభవించిన దుర్భర పరిస్థితి వర్ణనాతీతం.
వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు.800 నుంచి 1,500 కిలోమీటర్లు నడిచిన వారున్నారు.
ఈ సాహసంలో కొందరు ప్రాణాలు వదిలారు. మరికొందరు రైల్వే పట్టాల దగ్గర సేద తీర్చుకునేందుకు ఆగి ప్రాణాలు కోల్పోయారు.
అయినా ప్రభుత్వం అధికారికంగా ఎంతమంది చనిపోయింది ప్రకటించలేదు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రకటించిన లెక్కల ప్రకారం, 971 మంది వలస కార్మికులు చనిపోయారు.
మరణాల తీవ్రత- చికిత్స ఖర్చులు..
కొంతమంది పరిశోధనల ప్రకారం 3 నుంచి 5 వేలకు పైగా మరణించారని అంచనా వేశారు. దీనికి సంబంధించిన వివరాలు సెక్షన్ 6, 7 పట్టికలో ఉన్నాయి.

ప్రైవేటు ఆసుపత్రులు ఇదే అదునుగా విచ్చలవిడిగా దోచుకున్నాయి. ప్రజలు తమ ఇల్లు, ఆస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులకు ధారపోశారు.
కోవిడ్ కాలంలో కొన్ని ప్రధాన ఆసుపత్రులు వారి ఆదాలను ఎలా పెంచుకున్నది సెక్షన్-1లోని పట్టికలో చూడండి.
అయినా కొద్దిమంది ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. కోవిడ్ కాలంలో చికిత్స నిమిత్తం ప్రజలు సుమారు 1,50,000 నుంచి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
వివరాలు సెక్షన్ రెండులోని పట్టికలో చూడండి.
ఆకాశాన్ని అంటిన మామూలు ధరలు..
ఆక్సిజన్ సరఫరా లేక ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో లెక్కలేదు. కోవిడ్‌కు మందుగా వాడిన రెమిడీస్వేర్ ఇంజక్షన్ మామూలు ధర కంటే అనేక రెట్లు ఎక్కువగా అమ్మారు.




వ్యాక్సిన్ డిప్లమసి పేరుతో ఫార్మా కంపెనీలకు లాభాలు..
ఒకవైపు దేశంలో కోట్లాదిమంది కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, మరోవైపు ప్రభుత్వం వ్యాక్సిన్ డిప్లమసి పేరుతో ఫార్మా కంపెనీలకు లాభాలు గ్యారెంటీ చేయడానికి విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసింది.
కోవిడ్ మహమ్మారి వల్ల లాక్ డౌన్ విధించిన కారణంగా ప్రజలు కోల్పోయిన ఆదాయాలలో ఎంతో కొంత భాగాన్ని భర్తీ చేయడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల బ్యాంకు అకౌంటులకు నగదు బదిలీని ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలు చేశాయి.
అయితే, భారతదేశంలో జన్ ధన్ అకౌంటు ఉన్నవారికి మాత్రమే అకౌంట్‌కు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేసింది.
కానీ మిగిలిన ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందించని ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. సెక్షన్ 8,9 లోని పట్టికలు వివరాలు చూడండి.





ఆదాయం కోల్పోయిన ప్రజలకు ఆర్థిక సహకారం అందించకపోగా, దీనికి విరుద్ధంగా పరమ కిరాతకంగా భారత ప్రభుత్వం వ్యవహరించింది.
కోవిడ్ కాలంలో ప్రపంచ – దేశ పరిస్థితి..
ఈ కాలంలో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోతే ఆ వెసులుబాటును ప్రజలకు అందకుండా 13 లీటర్లపై 13 రూపాయలు ఎక్సైజ్ సుఖాన్ని పెంచి ఖజానా నింపుకున్న ప్రభుత్వం కూడా భారతదేశం మాత్రమే.
ఇందుకు భారత ప్రజలు కాదు సిగ్గుపడాల్సింది, భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ.
భారత ప్రజలకే కాదు, ప్రపంచానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నాటి ఘోరకలి తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
మనసు కకావికలం అవుతుంది. అలాంటి ఒక ప్రళయాన్ని చైనా దేశం సమర్థవంతంగా కట్టడి చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడింది.
ప్రాణాంతక వైరస్ పుట్టింది చైనాలోనే అయినా అతి తక్కువ మంది చనిపోయిన దేశం చైనా మాత్రమే.
మన దేశంలో కేరళ రాష్ట్రం, నాటి ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ అధికార యంత్రాంగాన్ని అన్ని విధాల సన్నద్ధం చేయడమే కాక, ప్రజలలో చైతన్యాన్ని కలిగించారు.
కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం ప్రజలకు విపత్కరకాలంలో తగిన సహాయ, సహకారాలు అందించింది. ముఖ్యంగా వలస కార్మికులను తన సొంత అతిథులుగా పరిగణించి వారికి చేసిన సేవ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. కేరళ రాష్ట్రం చేసిన ఈ విశేష కృషిని మొత్తం ప్రపంచం కొనియాడింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ “పళ్ళాలు కొట్టండి-కోవిడ్ పారిపోతుంది”, “దీపాలు వెలిగించండి-ఆ వెలుతురులో కోవిడ్ తరలిపోతుంది” అని ప్రజలకు సందేశం ఇచ్చారు.


ప్రజలను భ్రమల్లో ముంచిన బీజేపీ ప్రభుత్వం..
ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ఏర్పడిన ప్రాణాంతక మహమ్మారినీ చవక బారు ప్రచారాలతో అరికడతామని ప్రజలను భ్రమల్లో ముంచి, లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ వైఖరి దారి తీసింది.
విశ్వ విఖ్యాత మెడికల్ జర్నల్ “లాన్ సెట్” 40 లక్షల మంది భారతీయులు కోవిడ్ కారణంగా చనిపోయినట్లు నిర్ధారించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దరిదాపు ఇదే అంచనాకు వచ్చింది. కానీ మన ప్రభుత్వం తాను చేసిన తప్పును, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది.
అనేక విమర్శలు వచ్చిన తర్వాత ఆ సంఖ్యను సుమారు ఐదు లక్షలకు పెంచింది.
ఈ సందర్భంగా స్పెయిన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులు అన్నింటిని ప్రభుత్వం జాతీయం చేసి “ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత” అని ఆచరణలో రుజువు చేసుకుంది. కానీ కోవిడ్ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసిన త్రిమూర్తులు ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు. ఒకరు నరేంద్ర మోదీ, రెండు డోనాల్డ్ ట్రంప్, మూడు నాటి బ్రెజిల్ అధ్యక్షులు బోల్స్‌నారో.
శాస్త్ర విజ్ఞానం, సామాజిక స్పృహ, ప్రజల గురించి, వారి ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
