గత సంవత్సరం జరిగిన చర్చల సందర్భంగా అంగీకరించిన “ముందస్తు ప్రయోజనాల” ఒప్పందంతో ముడిపెడుతూ, కీలకమైన “హద్దుల విభజన” ప్రస్తావనను ఇరు పక్షాలు ఇప్పుడు ప్రారంభించిన చర్చలు సూచిస్తున్నాయి.
న్యూఢిల్లీ: హద్దుల విభజనకు సంబంధించి “ముందస్తు ప్రయోజనాల” విధానంపై గత సంవత్సరం కుదిరిన రాజకీయ అవగాహనను అధికారిక చర్చలుగా మార్చే ప్రక్రియను భారత్-చైనా ప్రారంభించాయి.
ఇందులో భాగంగా చైనాలోని బీజింగ్‌లో విదేశాంగ శాఖ నేతృత్వంలోని సరిహద్దు వ్యవహారాల సమావేశంలో మే 27 నాడు, ప్రత్యేక ప్రతినిధుల తదుపరి దఫా చర్చలకు “వాస్తవికమైన” ఏర్పాట్లు చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
గురువారం భారత్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం– “హద్దుల విభజన, సరిహద్దు నిర్వహణ, విధాన నిర్మాణంతోపాటు సరిహద్దు సహకారానికి” సంబంధించిన అంశాలపై రెండు వైపులా చర్చలు జరిగాయి.
చైనాలో జరగనున్న ప్రత్యేక ప్రతినిధుల తదుపరి సమావేశానికి “వాస్తవికమైన ఏర్పాట్లు” చేయడానికి కలిసి పని చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు ఆసియా విభాగం సంయుక్త కార్యదర్శి సుజిత్ ఘోష్ భారత్ తరఫున ఈ సమావేశానికి నేతృత్వం వహించగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ హౌ యాంకీ ఆ దేశం తరపున నేతృత్వం వహించారు.
చర్చలు “ముందుచూపుతో, నిర్మాణాత్మకంగా” సాగాయని భారత్ తెలియజేయగా- “వాస్తవికంగా, స్నేహపూర్వక వాతావరణంలో” జరిగినట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సరిహద్దుల్లో శాంతి స్థాపన – పురోగతి..
సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి సుస్థిరంగా ఉన్నదని ఇరు పక్షాలు నొక్కి చెప్పాయి. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించిన రెండు దేశాలు, ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా సాధారణ పరిస్థితికి రావడానికి ఉపకరిస్తున్న “శాంతి, ప్రశాంతతలను” కాపాడటంలో సాధించిన పురోగతి పట్ల భారత్ సంతృప్తిని వ్యక్తం చేసింది.
సరిహద్దు ప్రాంతాల్లో “దీర్ఘకాలిక శాంతి, ప్రశాంతత” కొనసాగుతోందని చైనా కూడా తన ప్రకటనలో తెలిపింది.
హద్దుల విభజన ప్రస్తావన వెనుక నేపథ్యం..
ఈ దఫా చర్చల్లో “హద్దుల విభజన” ప్రస్తావన చాలా కీలకమైనది. ఎందుకంటే, 2025 ఆగస్టులో న్యూఢిల్లీలో జరిగిన 24వ దఫా ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో అంగీకరించిన “ముందస్తు ప్రయోజనాల” సూత్రీకరణకు ముడిపెడుతూ ఉభయ పక్షాలు ఇప్పుడు చర్చలు ప్రారంభించినట్టు ఇది సూచిస్తోంది.
ఆ సమావేశంలో “భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో హద్దుల విభజనపై వీలైనంత త్వరగా ఒప్పందాన్ని అన్వేషించడానికి” డబ్ల్యుఎంసీసీ కింద ఒక నిపుణుల గ్రూపు ఏర్పాటును భారత్ ప్రకటించింది. ఆ సమయంలో చైనా సూత్రీకరణ కొంత భిన్నంగా ఉంది, “పరిస్థితులు అనుకూలించిన ప్రాంతాల్లో హద్దుల విభజనకు జరుగుతున్న చర్చలను వేగవంతం చేసే అంశాన్ని అన్వేషిస్తామని” చైనా పేర్కొంది.
‘ది వైర్’ గుర్తుచేసినట్టుగా- పరిష్కారానికి నోచుకోని అతిపెద్ద వివాదం నుంచి సిక్కిం సెక్టార్ సరిహద్దులను వేరు చేసి పరిష్కరించాలని నాటి చైనా దౌత్యవేత్త ల్యూ జావోహుయ్ 2017లో ప్రతిపాదించినప్పుడు “ముందస్తు ఒప్పందం” అనే ఆలోచన మొదటిసారి బహిరంగంగా వెలుగులోకి వచ్చింది.
భారత్ చారిత్రాత్మకంగా ఇలాంటి విభజన(సెగ్మెంటెడ్) విధానాన్ని ప్రతిఘటిస్తూ వచ్చింది. 2005 నాటి రాజకీయ కొలమానాలు, మార్గదర్శక సూత్రాల ఒప్పందం ప్రకారం సరిహద్దుల ప్రశ్నను ఒక సమగ్ర ప్యాకేజిగా పరిష్కరించాలని భారత్ వాదిస్తోంది.
నిపుణుల ఆందోళనలు – యథాతథ స్థితిపై సందిగ్ధత..
శివ్‌నాడార్ విశ్వవిద్యాలయం హిమాలయన్ స్టడీస్ కేంద్రం డైరెక్టర్, తైవాన్‌లోని నేషనల్ చుంగ్ సింగ్ విశ్వవిద్యాలయ ప్రస్తుత విజిటింగ్ పండితుడు జబిన్ టీ జాకబ్ దీనిపై స్పందిస్తూ- 2020 నాటి సైనిక ప్రతిష్టంభన తాలూకు అపరిష్కృత అంశాలను దాటవేసేందుకే హద్దుల విభజనపై ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోందన్నారు.
“2020 నాటి చైనా అతిక్రమణలకు ముందున్న యథాతథ స్థితికి తిరిగి వెళ్లకపోవడం అనే సమస్యను దాటవేసే మార్గంగా ఉభయ పక్షాలు ఇప్పుడు హద్దుల విభజన వైపు మొగ్గుచూపుతున్నాయి” అని ఆయన ది వైర్‌తో అన్నారు.
కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల వద్ద పెట్రోలింగ్ ఏర్పాట్లను పునరుద్ధరించినప్పటికీ, వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక మోహరింపుల గురించి ఇంకా పట్టించుకోలేదని ఆయన వాదించారు.
“కేవలం బలగాల ఉపసంహరణ మాత్రమే జరిగింది – అందులో కూడా బలగాల పెట్రోలింగ్‌కు పరిమితులు విధిస్తూ బఫర్ జోన్లను సృష్టించారు తప్ప, ఉద్రిక్తతలను తగ్గించడం లేదా బలగాలను వెనక్కి రప్పించడం జరగలేదు. ఈ విషయంలో పురోగతి లేకపోవడంతో వచ్చే విమర్శల నుంచి తప్పించుకోవడానికే ఇరు పక్షాలు ఇప్పుడు హద్దుల విభజన గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక చర్చ మాత్రమే – అది ఏ దశలో ఉందో మనకు తెలియదు” అని ఆయన అన్నారు.
హద్దుల అంశంపై విస్తృతమైన రాయితీలు ఇవ్వడానికి చైనా సిద్ధమవుతున్నట్టు ఏవైనా సంకేతాలు ఉన్నాయా అని కూడా జాకబ్ ప్రశ్నించారు.
“సరిహద్దు వివాదంపై చైనా రాయితీలు ఇస్తుందన్న నమ్మకాన్ని కలిగించేలా ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? 2020 నాటి నుంచి రికార్డులను పరిశీలిస్తే, గతంలో ఉన్న యథాతథ పరిస్థితిని తిరిగి నెలకొల్పడానికి వారు నిరాకరించడమే కాకుండా, ఎగుమతుల నియంత్రణ చర్యలతో భారతీయ పారిశ్రామిక రంగాన్ని కష్టతరం చేస్తూ ఆర్థిక మూలాలను కూడా లక్ష్యంగా చేసుకోవడం పెంచారు. సాధ్యంకాని పనిని సుసాధ్యం చేయడం ఎవరి వల్లా కాదు” అని ఆయన అన్నారు.
సీమాంతర నదుల డేటా పంపిణీ – చైనా చిత్తశుద్ధికి పరీక్ష..
తాజా సరిహద్దు చర్చల భారతీయ ప్రకటన ప్రకారం, “సీమాంతర నదుల” విషయంలో నిపుణుల స్థాయి విధానంపై సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని భారత్ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఎగువ ప్రాంతాల్లో చైనీయుల మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, హైడ్రోలాజికల్ డేటా పంపిణీపై ఆందోళనలు పెరగడంతో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది.
అయితే చైనా తన ప్రకటనలో “సీమాంతర కమ్యూనికేషన్, సహకారం” అన్న భారతీయ పదజాలాన్ని ఉటంకించిందే తప్ప, ఎక్కడా సీమాంతర నదుల గురించి ప్రస్తావించలేదు.
వివాదాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో సైతం భారత ఆందోళనలను పరిష్కరించేందుకు బీజింగ్ సుముఖంగా ఉందా లేదా అనడానికి సీమాంతర నదుల అంశం ఒక పరీక్షగా మారగలదని జాకబ్ చెప్పారు.
ప్రస్తుత డేటా-పంచుకునే ఏర్పాట్లను పునరుద్ధరించడం అనేది సాపేక్షంగా చాలా సాధారణమైన విషయమని ఆయన అభివర్ణించారు. “దీనిపైనే చైనా సానుకూలంగా స్పందించకపోతే – ద్విపాక్షిక సంబంధాలు ‘సాధారణ స్థాయికి’ వస్తున్న నాటి నుంచి ఈ అంశం ప్రతి భారతీయ ప్రకటనలో కనిపిస్తూనే ఉంది – హద్దుల వివాద పరిష్కారాన్ని సూచించే ‘సరిహద్దుల విభజన’ వంటి అతిపెద్ద అంశంలో వారు రాయితీలు ఇస్తారంటే నాకు చాలా అనుమానంగా ఉంది” అని జాకబ్ పేర్కొన్నారు.
దౌత్యపరమైన పురోగతి – డబ్ల్యుఎంసీసీ పాత్ర..
వాస్తవాధీన రేఖ వెంట స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు దేశాల మధ్య సమన్వయం, సరిహద్దు వ్యవహారాల నిర్వహణకు దౌత్యపరమైన యంత్రాంగంగా 2012లో డబ్ల్యుఎంసీసీని స్థాపించారు.
2020 జూన్‌లో గల్వాన్ లోయ వద్ద 20 మంది భారతీయ సైనికుల మరణానికి కారణమైన ఘోరమైన ఘర్షణ తర్వాత, తూర్పు లడఖ్‌లోని అనేక ప్రాంతాల్లో సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది.
ఈ ప్రతిష్టంభనను తొలగించి బలగాలను ఉపసంహరించుకునేలా చేయడంలో ఈ యంత్రాంగం కీలక పాత్ర పోషించింది.
2024 అక్టోబర్‌లో, తూర్పు లడఖ్‌లో పెట్రోలింగ్ ఏర్పాట్ల ద్వారా ప్రతిష్టంభనను పరిష్కరించుకోవడానికి రెండు పక్షాలు అంగీకరించాయి.
ఆ తర్వాత కొన్ని రోజులకే, రష్యాలోని కజాన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఐదేళ్ల విరామం తర్వాత తమ తొలి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
దీంతో ప్రత్యేక ప్రతినిధుల చర్చలు పునరుద్ధరించబడ్డాయి. అప్పటి నుంచి సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకోవడానికి బాటలు పడ్డాయి.
నేరుగా విమానాల పునరుద్ధరణ, వీసాల జారీ సులభతరం, కైలాష్-మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో పాటు, 2025 ఆగస్టులో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు కోసం చైనాలోని తియాన్జిన్లో మోదీ పర్యటించడం జరిగింది. ఏడేళ్లలో మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
