కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జూన్ నాటికి 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా భారత ఇన్సూరెన్స్ రంగంపై దాని ప్రభావాన్ని పరిశీలిస్తే, 1999లో ప్రారంభమైన తిరోగమన ప్రయాణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ(ఐఆర్డీఏఐ) ద్వారా 1999లో ప్రారంభమై 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ ప్రైవేటు కంపెనీల ఆగమనానికి ఆనాటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. దాంతో అక్టోబర్ 2000 సంవత్సరం నుంచి దేశంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రస్థానం మొదలైంది.
26% ఎఫ్‌డీఐతో ప్రారంభమైన ప్రైవేటు రంగ ప్రస్థానం సరిగ్గా పాతికేళ్ల అనంతరం 2025లో 100 శాతానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేర్చింది.
ప్రైవేటు కంపెనీల ఆగమనంతో దేశంలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అప్పుడున్న 2.79 నుంచి పరుగులు పెట్టి అంతర్జాతీయ ప్రమాణమైన 10 శాతానికి పైగా చేరుతుందని, అత్యంత చవకగా ఇన్సూరెన్స్ పాలసీలు లభ్యమవుతాయని, దేశంలోని అందరికీ ఇన్సూరెన్స్‌ను అందివ్వడం సుసాధ్యమైపోతుందని; అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు యువతకు లభిస్తాయని నమ్మబలికిన మాటలన్నీ ఈ 25 ఏళ్ల కాలంలో పటాపంచలైపోయాయి.
అయితే ప్రభుత్వ రంగ ఎల్ఐసీ ప్రైవేట్ కంపెనీల ఆగమనం అనంతరం ఐదేళ్ల కాలంలో కనుమరుగయ్యే అవకాశం ఉందని జోస్యాలు చెప్పిన కొందరి అంచనాలను పటాపంచలు చేస్తూ, ఈ 25 ఏళ్ల పోటీ మార్కెట్‌ను తట్టుకొని కూడా ఇప్పటికీ 70% మార్కెట్ వాటాను ఎల్ఐసీ కలిగి ఉన్నది.
ఇది కేవలం ఏజెంట్లు, మార్కెటింగ్ సిబ్బంది; నిబద్ధత కలిగిన ఉద్యోగుల సహకారాలతో పాటు అసంఖ్యాక పాలసీదారుల మద్దతుతో సాధ్యమైంది.
ప్రస్తుతం భారత ఇన్సూరెన్స్ మార్కెటు పది లక్షల కోట్ల వార్షిక ప్రీమియం ని వసూలు చేస్తూ గణనీయమైన స్థితిలో ఉండటానికి కారణం ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీయే కారణం.
ప్రైవేట్ కంపెనీల తీరు – మార్కెట్ మాయాజాలం..
ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ప్రైవేటు కంపెనీలు మెల్లిమెల్లిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎస్బీఐ లైఫ్ తప్ప మిగతావి ఐదు శాతం మార్కెట్ వాటాను కూడా చేరుకోలేకపోతున్నాయి. ఎస్బీఐ లైఫ్ కూడా ఎస్బీఐ లోగోను వినియోగించి చట్ట వ్యతిరేకంగా లాభపడుతోంది.
ప్రైవేటు కంపెనీలు చేసే వ్యాపారాలలో అత్యధిక భాగం మార్కెట్ లింక్డ్ పాలసీల ద్వారా మాత్రమే జరుగుతున్నది.
అంటే పాలసీదారుల భవిష్యత్తు, భద్రతను కేవలం మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలి పెట్టారు.
ప్రైవేట్ కంపెనీలన్నీ పట్టణ ప్రాంతాలపై మాత్రమే ఎక్కువగా కేంద్రీకరించి ఉన్నాయి. యువతను తప్పుదోవ పట్టించేలా నూతన టెక్నాలజీ, అల్గారిథమ్స్‌ను వినియోగించి ఆకర్షించే ప్రయత్నాలు ఉన్నవి.
విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), వాటాల ఉపసంహరణ– ప్రభుత్వ వైఖరి..
నిజానికి 2004లో వామపక్ష పార్టీల బలంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వము 10 సంవత్సరాలు భారత ప్రభుత్వ రంగ ఎల్ఐసీని నష్టపరచకుండా ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
కానీ తదనంతరం 2014లో కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని చేసిన మరుసటి రోజు నుంచే భారత ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్‌ను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తూ సాగింది.
2017లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(ఎఫ్‌డీఐ)ను 26% నుంచి 49 శాతానికి ఎవరూ అడగకపోయినా పెంచింది. 2021లో ఇదే ఎఫ్‌డీఐని 49 నుంచి 74 శాతానికి పెంచడమే కాకుండా రీపాట్రియేషన్ నిబంధనను తీసేసింది.
అనగా భారతదేశంలో లాభాలను అర్జించిన విదేశీ పెట్టుబడిదారులు తమ లాభాలను విధిగా ఇదే దేశంలో పెట్టుబడులుగా పెట్టాల్సి ఉంటుందన్న నిబంధనను తొలగించి, లాభాలను ఎప్పుడైనా తమ దేశానికి తీసుకొని వెళ్లవచ్చు అన్న అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
అంతటితో ఆగక 2022లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వాటాలలో 3.5% వాటాలను స్టాక్ మార్కెట్లోకి విడుదల చేసి కేవలం 21 వేల కోట్ల రూపాయల నగదును కేంద్ర ప్రభుత్వం తమ ఖజానాకు మళ్ళించుకున్నది.
ఒక వాటాకు బదులుగా రెండు..
ఇప్పుడు మరో 6.5% వాటాలను ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా స్టాక్ మార్కెట్లో ఉంచాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది.
దీనికి ముందస్తుగా బోనస్ షేర్లు అనే పేరు మీద ఒక వాటాకు బదులుగా రెండు వాటాలను చేయబోతున్నది.
వాటాల ఉపసంహరణ ద్వారా ఎల్ఐసీ మార్కెట్ విలువ బహిర్గత పరచడం ఒకటే కాకుండా అనేకమంది ఎల్ఐసీలో వాటాలు కొనడానికి తమ పెట్టుబడులను పెట్టి లాభాలు అర్జిస్తారని చెప్పిన మాట నీటి మూటగా మిగిలింది. ఎందుకంటే:
1. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ వార్షిక నివేదిక ప్రకారం 2025 మార్చి 31నాటికి మొత్తం వాటాదారుల సంఖ్య: 24,05,533. ఇందులో 23,84,559 వాటాదారుల వద్ద ఉన్న వాటాలు 8,25,80,224. అంటే సగటున వ్యక్తిగత పెట్టుబడిదారులు 34.6 వాటాలను కలిగి ఉన్నారు.
అదే సమయంలో, 675 (వ్యక్తిగత, సంస్థాగత) పెట్టుబడిదారులు 10,95,77,799 వాటాలను కలిగి ఉన్నారు. దీని అర్థం 675 వ్యక్తిగత- సంస్థాగత పెట్టుబడిదారులు సగటున 1,62,337 షేర్ల వాటాలను కలిగి ఉన్నారు.
పైన పేర్కొన్న వాస్తవాల దృష్ట్యా, ఓఎఫ్ఎస్ ద్వారా ఎల్ఐసీలో తదుపరి పెట్టుబడుల ఉపసంహరణ రిటైల్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందా?
2. బీమా పరిశ్రమలో ఎఫ్‌డీఐలు ప్రారంభమైనప్పటి నుంచి, రూ. 83,843 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం, ప్రభుత్వ అనుకూల మీడియా పదే పదే చెప్తున్నాయి.
అయితే, భారతీయ బీమా మార్కెట్ నుంచి తొమ్మిది విదేశీ బీమా కంపెనీలు నిష్క్రమించాయి; ఏఐజీ, ఐఎన్జీ, ఆక్సా, న్యూయార్క్ లైఫ్, స్టాండర్డ్ లైఫ్, ఓల్డ్ మ్యూచువల్, రాయల్ సన్ అలయన్స్ మొదలగునవి.
గత పదేళ్లలో రెండు కొత్త జీవిత బీమా కంపెనీలు మాత్రమే ఈ రంగంలోకి ప్రవేశించాయి.
ఇటీవల, జర్మనీకి చెందిన అలియాంజ్ బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీతో తన జాయింట్ వెంచర్‌ను ముగించింది.
మన దేశం నుంచి నిష్క్రమించిన విదేశీ కంపెనీలు తమతో పాటు 68,740 కోట్ల మొత్తాలను మన దేశం నుంచి వెనుకకు తీసుకువెళ్లాయి.
ఎల్ఐసీ వాటా విలువ – మార్కెట్ వాస్తవాలు..
ఎల్ఐసీ వాటా విలువ కూడా మార్కెట్లో ఆశించినంత సానుకూల ప్రతిఫలాలను ఇవ్వలేకపోయింది.
ఎందుకంటే ఎల్ఐసీని భారత ప్రజలు ఒక నమ్మకాన్ని నిలబెట్టే సంస్థగా చూస్తున్నారు తప్ప స్టాక్ మార్కెట్ల ద్వారా లాభాలను చేకూర్చి పెట్టే సంస్థగా చూడడం లేదు.
అందుచేతనే కాబోలు గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం అతి తక్కువ రోజులు ఎల్ఐసీ వాటా 1200 రూపాయల పైన పలికినప్పటికీ, ప్రస్తుతం ఎల్ఐసీ ప్రకటించిన 949 ముఖ విలువ కన్నా తక్కువగానే మార్కెట్లో నమోదౌతున్నది.
ఎల్ఐసీ బోనస్ షేర్లు ప్రకటించినప్పటికీ కూడా మార్కెట్లో చురుకైన కదలికలు కాన రాలేదు.
ఐపీఓ ద్వారా ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలను సంపాదించి ఉండవచ్చు కానీ, ఎల్ఐసీ వాటాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్ఐసీ స్థితిగతులను దాని వాటా విలువ ఆధారంగా మార్కెట్లో లెక్కించడం మొదలయ్యింది.
నిజానికి వాటా ధరకు, ఎల్ఐసీ వ్యాపారానికి ప్రత్యక్ష సంబంధం లేనే లేదు. ఈ ఐపీఓ తర్వాత నూతన వ్యాపారాన్ని సేకరించడానికి తీసుకోవలసిన మార్కెట్ ఎత్తుగడల కన్నా ప్రభుత్వానికి, ఐఆర్‌డీఏకు, సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు సమర్పించవలసిన రిపోర్టుల పని మరింత పెరిగిపోయింది.
పర్యవేక్షణ సులభతరమవుతుందన్న వాదనలు, ఎల్ఐసీ బోర్డును ప్రభుత్వం మితిమీరి ప్రభావితం చేయడం వల్ల అర్థరహితంగా తేలాయి.
ఐపీఓ అనంతరం పాలసీదారుల ప్రయోజనాల కన్నా వాటాదారుల లాభాలకే పెద్ద పీట వేసే విధంగా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ ప్రస్థానాన్ని శాసిస్తున్నారు.
ఐఆర్డీఏఐ నిబంధనలు – వ్యవస్థాగత మార్పులు..
ఐఆర్డీఏఐ కూడా ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించే విధంగా, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యపరిచే విధంగా తమ నియంత్రణను కొనసాగిస్తున్నది.
అవసరం లేకున్నా సరే ఎల్ఐసీ అందించే పాత పాలసీలను నిలుపుదల చేసి వాటి స్థానంలోనే కొత్త పాలసీలను ప్రవేశపెట్టవలెనని శాసించింది.
తద్వారా కొంత కాలం ఇబ్బందికరమైన వాతావరణం తప్పలేదు.
అంతేకాకుండా ఏజెంట్ల కమిషన్ ప్రతి ఇన్సూరెన్స్ సంస్థ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ గరిష్ట పరిమితికి లోబడి ఉంటాయి.
కానీ, వాటిని కూడా నియంత్రించే విధంగా ఏజెంట్ల కమిషన్ పై కఠినమైన నిబంధనలను రూపొందించడంతో గత సంవత్సరం ఎల్ఐసీ ఏజెంట్లు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యారు.
అంతేకాకుండా 2047 వరకు ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ అందించాలన్న ప్రధానమంత్రి చేసిన ఒక ప్రకటనను పట్టుకొని, ఇన్సూరెన్స్ పొందాలంటే సరైన కొనుగోలు శక్తి ఉండాలన్న స్పృహను కూడా మరిచిపోయి అందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అర్థం లేని విధంగా ఇన్సూరెన్స్ ఏజెన్సీని ఇచ్చే మార్గదర్శకాలను రూపొందిస్తున్నది ఐఆర్డీఏఐ అందులో భాగంగా ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు కూడా ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మేటందుకోసం ‘బీమా వాహక్’ అనే పేరుతో ఇవ్వాలనే ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నది.
‘బీమా సుగమ్’ అనే కొత్త కాన్సెప్టును వినియోగంలోకి తీసుకువస్తూ ప్రమాదవశాత్తు సంభవించే నష్టాలకు బాధ్యతతో సమాధానం చెప్పాల్సిన ఇన్సూరెన్స్‌ను ఒక ఇంటర్నెట్ కేఫ్ స్థాయికి దిగజారుస్తున్నారు.
అంతేకాకుండా ఓపెన్ ఆర్కిటెక్చర్ అంటూ, పాలసీ పోర్టబిలిటీ, ఏజెంట్ పోర్టబిలిటీ అంటూ ప్రమాదకర పోకడలకు ఈ కాలంలోనే శ్రీకారం చుడుతున్నారు.
దురదృష్టవశాత్తు ప్రపంచాన్ని తమ ఇష్టారీతిన శాసిస్తున్న అమెరికా భారత ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.
యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రెప్రెజెంటేటివ్(యుఎస్టీఆర్) అనే సంస్థ ద్వారా భారత దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రారంభించాలంటే కనీస మూలధనంపై ఉన్న నిబంధనలను సడలించాలని ఆదేశాలు జారీ చేస్తున్నది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది.
ఈ విధంగా భారత ఇన్సూరెన్స్ ప్రాధికార సంస్థ స్వదేశీ పాలకుల, విదేశీ పెట్టుబడిదారుల ప్రభావానికి గురవుతూ ఇన్సూరెన్స్ విస్తరణలో ప్రధానంగా సాగుతున్న ప్రభుత్వ రంగ ఎల్ఐసీని నిర్వీర్యం చేసే చర్యలకే పూనుకున్నది.
పన్నుల భారం – ఎల్ఐసీపై ప్రభుత్వ ఒత్తిడి..
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ను ప్రోత్సహించకపోగా నిరుత్సాహ పరుస్తూ ఉన్నది.
ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఆదాయ పన్ను మినహాయింపును పూర్తిగా తొలగించింది. వ్యక్తిగత బీమాలపై మినహాయిస్తూ మిగతా అన్ని రకాల సర్వీస్‌లపై జీఎస్టీని విధించింది.
దేశంలో చాలా బ్యాంకులు తమకు సబ్సిడరీలుగా ఇన్సూరెన్స్ కంపెనీలను కలిగి ఉన్నాయి.
కానీ ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీకి మాట ఇస్తూ కూడా తాను సొంతంగా ఒక బ్యాంకును నడుపుకునే అవకాశాన్ని ఇవ్వలేదు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) నష్టాల్లో కూరుకుపోతే దానిని బయటపడేసేందుకు పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసీని కేంద్రం ఆదేశించింది.
సదరు ఆదేశాలను శిరసావహించి ఐడీబీఐ బ్యాంకును లాభాల్లోకి నడిపించింది ఎల్ఐసీ ఇప్పుడు ఉన్నఫలంగా ఐడీబీఐ నుంచి నిష్క్రమించాలన్న సందేశాలను పంపిస్తున్నది కేంద్రం.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఖాయిలా పడిన పరిశ్రమలను గట్టెక్కిస్తూ దేశహితంలో ఎల్ఐసీ రిస్తూ ఉంటే ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వాటాదారులకు లాభాలు సంపాదించి పెట్టమని పోరు పెట్టడం సరైనది కాదు.
నూరు శాతం ఎఫ్‌డీఐ – తెరవెనుక పరిణామాలు..
2025లో ఎఫ్‌డీఐని 74 నుంచి 100% పెంచారు.
అదే సందర్భంగా ఇన్సూరెన్స్ చట్ట సవరణలలో కుట్రపూరితంగా ఎఫ్‌డీఐ 100% మేర ఆటోమేటిక్ రూట్ ద్వారా అనగా సెబి పర్మిషన్ లేకుండానే వచ్చేందుకు నిబంధనలను సడలించారు.
అంతేకాకుండా ఇప్పుడేదైతే ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ జరిగిందో, భవిష్యత్తులో జరిగే మార్పుల సందర్భంగా, అట్టి వాటాలలో 20 శాతం మేరకు ఎఫ్‌డీఐలు ఆటోమేటిక్ రూట్ ద్వారా కూడా ప్రవేశించవచ్చు అన్న నిబంధన కూడా కొత్తగా పొందుపరిచారు.
దీనిని లోతుగా పరిశీలిస్తే కుట్ర ఎంత ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది.
నిజానికి భారతదేశంలో 100% ఎఫ్‌డీఐలకు అనుమతి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం కేవలం 37.5% మాత్రమే ఉన్నాయి.
ఇప్పటివరకు ఈ దేశంలో నుంచి 9 ప్రైవేట్ కంపెనీలు నిష్క్రమించాయి. అనేక పెద్ద మొత్తంలో కూడా ఎఫ్‌డీఐలు తరలి వెళ్లాయి.
నియామకాల లేమి – కార్పొరేట్ శక్తుల చొరబాటు..
ఒకవైపు రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల నూతన రక్తం కొరవడినప్పటికీ అనుభవం ఉన్నటువంటి స్టాఫ్ సేవలు అందిస్తున్నారు.
వేలకొలది ఖాళీలు ఉన్నవి. కానీ కేంద్ర ప్రభుత్వము మొండివైఖరితో రిక్రూట్‌మెంట్‌ను చేపట్టడం లేదు. నిర్ణయాత్మక ఎల్ఐసీ బోర్డులో ప్రభుత్వ ప్రతినిధుల ప్రభావం పెరిగిందన్న సంకేతాలు స్పష్టం.
దానికి తోడు ప్రభుత్వ విధానాలకు మాత్రమే అనుకూలంగా ఉండే ప్రైవేట్ కార్పొరేటు వ్యక్తులను ప్రభుత్వ రంగాలలోకి డైరెక్టర్లుగా చొప్పించే ప్రక్రియలో భాగంగా ఎల్ఐసీ ఆఫ్ ఇండియాలో కూడా మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో ఒకరిని నియమించాలని కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అడుగు.
జాతీయీకరణ లక్ష్యాల నుంచి మళ్లింపు..
ఎల్ఐసీ కొన్ని లక్ష్యాలతో జాతీయీకరణ చేయబడింది. ఈ 12 ఏళ్ల కాలంలో ఏదైతే లక్ష్యాలతో: గ్రామ గ్రామానికి ఇన్సూరెన్స్ కవరేజీని విస్తరించాలి, ప్రజల చిన్న మొత్తాలను సేకరించి అట్టి పొదుపులను మౌలిక వసతులు కల్పనకు వినియోగించాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మకంగా నెరవేర్చాలి, ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ సూక్ష్మ తరహా ఇన్సూరెన్స్ కవరేజ్‌ని అందించాలి అన్న ప్రధాన ఎజెండా నుండి ఎల్ఐసీ ప్రస్థానాన్ని తప్పించే ప్రయత్నం జరుగుతుంది.
దీనివలన ఎల్ఐసీ ఒక ఆర్థిక వ్యవస్థగా దాని పటిష్టతకు నష్టమేమీ ఉండకపోవచ్చు ఎందుకంటే వ్యవహారాలను చక్కదిద్దేది ఏజెంట్లు, ఉద్యోగులు కాబట్టి.
కానీ ప్రభుత్వం తమ నియంత్రణతో అడ్డంకులు సృష్టిస్తున్నది. అందుచేత ఒక సామ్యవాద రీతిలో అందరికీ ఉపయోగపడే లక్ష్యం నుంచి దూరం అవుతుంది.
ఇలాంటి పనికి ప్రభుత్వమే నాయకత్వం వహించి మరీ నడిపిస్తుండడం బాధాకరమైన విషయం.
ఇప్పటికైనా ప్రభుత్వం ఎల్ఐసీకి స్వయంప్రతిపత్తి (స్వాతంత్ర్యం) ఇస్తూ ప్రోత్సహిస్తే పాలసీదారులకు, ప్రజలకి, దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
