దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం మీద తీవ్ర ఆగ్రహాన్ని 2014 ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. తమకు అధికారం ఇస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం కూడా చేశారు.
కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసులు, రైల్వే, పోస్టల్, ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు ఈ 6 సెక్టార్లలో 2014లో మొత్తం పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య 74 ,26,000.
2025 సంవత్సరానికి ఆ సంఖ్య 70,43,000కి పడిపోయింది. ఈ కాలంలో పర్మినెంట్ 2,97,800 మంది శాశ్వత ప్రాతిపదికన కొత్తగా ఉద్యోగాలలో నియమించబడ్డారు. అయినప్పటికీ నికరంగా 3,83,000 వేల మంది ఉద్యోగులు తగ్గిపోయారు.
భిన్నంగా ఉద్యోగుల సంఖ్య..
వాస్తవంగా జనాభా పెరుగుదల, వివిధ రకాల పథకాల అమలు, తదితర పనులు ఈ 12 సంవత్సరాల కాలంలో పెరిగాయి. ఆ దామాషాలో శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగుల సంఖ్య పెరగాలి. కానీ అందుకు భిన్నంగా ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయింది.
నాన్ పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య 2014లో 7,93,000 కాగా- 2025 సంవత్సరానికి ఆ సంఖ్య 13,45,000కు చేరింది. అంటే 5,52,000 పెరిగింది.
ఎలాంటి ఉద్యోగ భద్రత, చట్టబద్ధ సౌకర్యాలు, కనీస వేతనాలు లేని నాన్ పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కంచే చేను మేసిన చందంగా- చట్టాలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించి వెట్టిచాకిరిని ప్రోత్సహించింది. ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆరు రంగాలకు సంబంధించిన సమాచారం మాత్రమే.




భారీగా పడిపోయిన ఉద్యోగుల సంఖ్య..
భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు చేసిన వాగ్దానం ప్రకారం- 12 సంవత్సరాల కాలంలో 24 కోట్ల ఉద్యోగాల కల్పన జరగాలి.
కానీ ఆచరణలో జరిగింది కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయింది.
ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని గుర్తు చేసుకోవాలి.
సుమారు 25 సంవత్సరాల క్రితం భారత దేశ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ ప్రధాని హైదరాబాద్కు వచ్చారు. అప్పుడు వారు పాల్గొన్న పత్రికా విలేకరుల సమావేశంలో విలేకరులు ఒక ప్రశ్న వేశారు. “మీ దేశంలో ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన రాజకీయ పార్టీ, ఎన్నికల అనంతరం అధికారానికి వచ్చిన తర్వాత ఆ వాగ్దానం నిలబెట్టుకుంటుందా?” అని అడిగారు.
“మా దేశంలో అయితే అలాంటి రాజకీయ పార్టీ నాయకులకు రెండే రెండు స్థావరాలు ఉన్నాయి.
ఒకటి శ్రీకృష్ణ జన్మస్థానం. రెండవది పిచ్చి ఆసుపత్రి” అని ఎలాంటి తడబాటు లేకుండా కరాఖండిగా చెప్పారు.


12 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీని వరుసగా అధికారంలో ఉన్నప్పటికీ నేటికీ అమలు చేయలేదు- అంటే స్విట్జర్లాండ్లాగా ఇక్కడ పాలకులను ఏమి చేయాలో పాఠకులే నిర్ణయించుకోవాలి.
వివిధ రంగాలలో మంజూరైన పోస్టులు..
కేంద్రప్రభుత్వ ఆధీనంలోని కేవలం ఆరు సంస్థలలోనే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, ఇక ప్రైవేటు రంగం గురించి చెప్పడానికి అవకాశం లేదు.
మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తించాలి- పైన తెలిపిన ఆరు రంగాలలో కలిపి మంజూరైన పోస్టులలో 10 లక్షల, 27 వేల పోస్టులు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయి.
ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలాంటి ఉన్నత విద్యా సంస్థలలో మంజూరైన పోస్టులు 44,750 కాగా ఇందులో 18,170 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి.
ఇది మొత్తం మంజూరైన పోస్టులలో 40.6%.
మరొకవైపున చదువుకున్న యువత ఉద్యోగాలు రాక వారి సంఖ్య మేరు పర్వతంలా పెరుగుతున్నది.
దాదాపుగా గత 40 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం నేడు ఉన్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
గందరగోళంగా గణాంకాలు..

డిగ్రీ ఆపై చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 2025 నాటికి ఒక కోటి 7 లక్షలు.


ఈ గణాంకాలు కూడా వాస్తవంగా ఉన్న నిరుద్యోగాన్ని ప్రతిబింబించడం లేదు.
ఇదే కాదు ప్రభుత్వం ప్రకటిస్తున్న అనేక గణాంక వివరాలు చాలా లోపభూయిష్టంగా, గందరగోళంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో అసలు గణాంకాలనే ప్రకటించడం ఆపేస్తున్నారు.
“పకోడీలు అమ్ముకోవడం కూడా ఉపాధి” అని స్వయంగా ప్రధాని ప్రకటించడం అత్యంత సోచనీయం.
ఇవి ప్రధాని హోదాలో మాట్లాడదగిన మాటలు కావు.
పనిచేయగలిగిన వయసులో ఉన్న యువతకు ఉపాధి కల్పించకపోతే అది ఆ యువతకు మాత్రమే నష్టం కాదు, యావత్ భారతదేశానికే పెద్ద నష్టం. ఇటీవల సోషల్ మీడియాలో తమ ఆందోళనను, ఆవేదనను, ఆక్రందనను యువత వ్యక్తం చేస్తున్న విషయం కళ్లారా చూస్తున్నాం.




Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
