పదవీ విరమణ అనంతరం థాపర్ ‘అర్లీ ఇండియా: ఫ్రమ్ ది ఆరిజిన్స్ టు AD 1300′(Early India: From the Origins to AD 1300 – 2002) పుస్తకాన్ని రాశారు.
సాధారణ పాఠకులకు అనుగుణంగా థాపర్ తన శైలిని మార్చుకోకపోయినా ఈ పుస్తకం విస్తృత పాఠక ఆదరణను పొందింది.
ఆక్స్ఫర్డ్, ప్రిటోరియా విశ్వవిద్యాలయంతోపాటు చికాగో విశ్వవిద్యాలయంతో సహా నాలుగు ఖండాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి ఆమె గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.
భారత ప్రభుత్వం అందించే ఉన్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ఆమె రెండుసార్లు తిరస్కరించారు, “నేను విద్యా సంస్థల నుంచి లేదా నా వృత్తిపరమైన పనితో ముడిపడి ఉన్న అవార్డులను మాత్రమే అంగీకరించడానికి ఇష్టపడతాను” అని చెప్పారు.
2008లో, ఆమె యుఎస్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అందించే మిలియన్ డాలర్ల క్లూజ్ ప్రైజ్‌ను పంచుకున్నారు. ఈ అవార్డును అందుకున్న మొదటి మహిళ, పాశ్చాత్య దేశాలలో నివసించని మొదటి పండితురాలు ఆమె.
ప్రజాదరణ పొందిన పబ్లిక్ లెక్చర్స్..
థాపర్ పబ్లిక్ లెక్చర్స్‌కు(బహిరంగ ఉపన్యాసాలు) ఇప్పటికీ ఆడిటోరియంలు కిక్కిరిసిపోతాయి.
గత జూలైలో ఒక సోమవారం సాయంత్రం, భారతదేశం, రోమ్ సామ్రాజ్యాల మధ్య ప్రాచీన సాంస్కృతిక సంబంధాలపై జరిగిన ఒక ప్యానెల్ చర్చా కార్యక్రమానికి నేను హాజరయ్యాను.
అక్కడ గేటు వెలుపల ఢిల్లీకి చెందిన సంపన్న వర్గాల ప్రజలు గుంపులుగా ఉండటం, వారికి లోపలికి ప్రవేశం లభించకపోవడంతో వాళ్లు ఆశ్చర్యపోవడం నేను కళ్ళారా చూశాను.
లోపల హాల్ పూర్తిగా నిండిపోయింది; ప్రజలు అప్పటికే నడవల్లో కూడా కూర్చున్నారు, కనీసం నిలబడటానికి కూడా అక్కడ చోటు లేదు.
కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అయిన నిర్వాహకుడు రతీష్ నందా, సాధారణంగా తిరస్కరణకు అలవాటు పడని ఆ ఉన్నత వర్గాల ప్రజలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
పక్కనే ఉన్న పునరుద్ధరించబడిన మొఘల్ గార్డెన్లో సూర్యాస్తమయ సమయంలో కాసేపు నడుద్దామని నందా సూచించారు.
మాలో కొందరు దానికి అంగీకరించారు. పార్కు చుట్టూ తిరుగుతూ, ఒక విద్యాసంబంధిత ప్యానెల్ చర్చకు హాజరు కావడానికి మనమెందుకు ఇంత ఆత్రుతగా ఉన్నామో అని ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుకున్నాము.
గంట తర్వాత మేము తిరిగి వచ్చేసరికి, కొద్దిమంది జనం ఇంకా వేదిక గేట్ల వద్దే ఉండి, సెక్యూరిటీ గార్డ్‌తో రకరకాల పైరవీలు చేస్తూ లోపలికి వెళ్లడానికి గొడవ పడుతున్నారు. అది కూడా చూసి తీరాల్సిన దృశ్యమే.
‘థాపర్‌కు ఇంకా ఇంతమంది అభిమానులు ఉన్నారంటే అది మంచి సంకేతమేనని భావిస్తున్నాను’ అని ఒకరన్నారు.
హిందూత్వ భావజాలంతో సైద్ధాంతిక ఘర్షణ..
థాపర్ గురించి మాట్లాడేటప్పుడు ఆమెను ఒక ‘వ్యవస్థ’ (ఇన్స్టిట్యూషన్)గా పేర్కొనడం సర్వ సాధారణం.
భారతదేశంలోని అనేక ఇతర వ్యవస్థల వలె – విశ్వవిద్యాలయాలు, కోర్టులు, రాజ్యాంగం వంటి వాటిలాగే – థాపర్ కూడా గత దశాబ్ద కాలంగా దాడులను ఎదుర్కొంటున్నారు.
చరిత్ర రచనలను సరిదిద్దాలని హిందూత్వ భావజాల ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా థాపర్ తన నిరసన స్వరం వినిపించారు, దాంతో ఆమెను వివాదాల్లోకి, తద్వారా సాంస్కృతిక యుద్ధాలలోకి లాగారు.
ఒక చరిత్రకారిణిగా, థాపర్ ప్రధాన ఘర్షణ ఎప్పుడూ హిందూ జాతీయవాదం లేదా ‘హిందుత్వ’తోనే సాగింది.
ఆమె మార్గదర్శకత్వం వహించిన చరిత్ర రచనా సంవిధానం మునుపటి చరిత్ర నిర్మాణాలను బద్దలు కొట్టింది.
ముఖ్యంగా “భారతదేశం ప్రాచీనమైన, అవిచ్ఛిన్నమైన కాలాతీత హిందూ నాగరికతకు నిలయమని, అయితే 1000 సీఈ నుంచి ముస్లిం దురాక్రమణదారులు, పాలకుల వల్ల అది ముప్పును ఎదుర్కొంది” అనే ఒక పాత మూస కథనాన్ని ఆమె సవాలు చేశారు.
గతానికి సంబంధించిన – అంటే ప్రాచీన హిందూ వైభవం, ఇస్లామిక్ మధ్యయుగంలో దాని పతనం – అన్న ద్విపద చిత్రం బ్రిటీష్ వారు మొఘలులను తొలగించి తమ పాలనను సమర్థించుకోవడానికి సృష్టించిన వలసరాజ్య సిద్ధాంతం, 20వ శతాబ్దం నాటికి, ఇది హిందుత్వకు పరమ సత్యంగా మారింది అని థాపర్ స్పష్టం చేశారు.
చరిత్ర వక్రీకరణపై పోరాటం..
1977లో, ఒక సంప్రదాయవాద కూటమి భారతదేశంలో అధికారంలోకి వచ్చింది, దీంతో తొలిసారిగా హిందూ జాతీయవాదులు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు.
ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాఠ్య పుస్తకాలు, చరిత్ర పాఠ్యపుస్తకాలపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు.
థాపర్ రాసిన పుస్తకాలతో సహా కొన్నింటిని వెనక్కి తీసుకోవడం లేదా వాటి పంపిణీని తగ్గించడం జరిగింది.
ఆ కూటమి అనతి కాలంలోనే అధికారం కోల్పోయింది. కానీ హిందూ జాతీయవాద ఉద్యమం రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) క్రమంగా బలాన్ని పుంజుకుంది.
2000వ దశకం ప్రారంభంలో తన మొదటి పూర్తి కాలపు అధికారంలో, బీజేపీ పాఠ్యపుస్తకాలలో మార్పులు తీసుకురావాలనే ప్రచారాన్ని మళ్లీ ఎత్తుకుంది. ‘హిందువులకు’ వ్యతిరేకంగా ఉన్నట్లు భావించిన చరిత్ర రచనలను సరిదిద్దాలనేది వాళ్ళ అజెండా. ఆ ప్రాచీన చరిత్ర హిందువులను బలహీనులుగా, నిరుత్సాహపరిచేలా చిత్రీకరించారు అనేది వాళ్ళ వాదన.
ఈ ప్రయత్నాలను థాపర్ తీవ్రంగా నిరసించారు, వివాదాల్లోకి లాగబడ్డారు, దీంతో సాంస్కృతిక యుద్ధాల వెలుగులోకి వచ్చారు.
‘1999లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో అకడమిక్ చరిత్రకారుల పట్ల దాని శత్రుత్వ వైఖరి మరింత పుంజుకుంది, 2014 తర్వాత నుంచి ఇది మరింత కేంద్రీకృతమైంది’ అని థాపర్ వివరించారు.
ఆ సంవత్సరంలో, నరేంద్ర మోదీ బీజేపీని మళ్లీ అధికారంలోకి నడిపించారు, ఒక దశాబ్దానికి పైగా ఆ పార్టీ పాలన కొనసాగుతోంది.
హిందూత్వ భావజాల మద్దతుదారులకు, ఆ భావజాల వ్యతిరేకులకు 2014 నాటి ఎన్నికల తీర్పు 1947 వంటి ఒక అతిపెద్ద పరివర్తనాత్మక సంఘటనగా నిలిచిపోయింది.
చరిత్ర రచనలపై యుద్ధాలను మోదీ ప్రభుత్వం బాహ్య మార్గాల ద్వారా ఎదుర్కొంది. దాని గ్రాండ్ నెరేటివ్(ప్రధాన కథనం) ముఖ్యంగా సృజనాత్మక రంగాల ద్వారా ప్రజల్లోకి వచ్చింది; హిందీ సినిమాలు, పాపులర్ పబ్లిషింగ్, టీవీ వార్తలు అన్నీ ఆ బాటలోనే పయనించాయి.
బాలీవుడ్లో చారిత్రక శైలి ఇప్పుడు భయంకరమైన ఇస్లామిక్ క్రూరత్వానికి వ్యతిరేకంగా హిందూ వీరోచిత ప్రదర్శనల చుట్టూ తిరుగుతోంది.
గత ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాలలో ఒకటైన ‘ఛావా (2025)’ ఇందుకు ఒక ఉదాహరణ. వృత్తిపరమైన చరిత్రకారులు అంత సులభంగా లొంగలేదు.
చాలా మంది మౌనంగా ఉన్నారు. మరికొందరు, చరిత్రకు సంబంధించిన ఈ వక్రీకరణలను నిలదీయడానికి సిద్ధంగా ఉన్న థాపర్ వంటి వారు హిందూత్వవాదులకు లక్ష్యాలుగా మారారు.
జేఎన్‌యూపై దాడులు, థాపర్‌పై బెదిరింపులు..
ఫోన్ ద్వారా బెదిరింపులు, దుర్భాషలాడడం మొదలయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి, ఇందుకు ఎక్కువగా ఈమెయిల్ మార్గాన్ని ఎంచుకున్నారు.
మొదట వారు జెఎన్యూపై దృష్టి పెట్టారు. ఈ విశ్వవిద్యాలయం వామపక్ష ఆలోచనలు గల విద్యార్థి సమూహానికి ప్రసిద్ధి చెందింది, వీరు చదువులలో ఎంత ఉత్సాహం ప్రదర్శిస్తారో నిరసన ప్రదర్శనలు చేపట్టడానికీ అంతే ఉత్సాహం చూపిస్తారు.
2016లో, ప్రభుత్వం ఈ రాడికల్ క్యాంపస్‌ను అణచివేయడానికి సుదీర్ఘ ప్రచారాన్ని ప్రారంభించింది.
కశ్మీర్ కోసం క్యాంపస్‌లో జరిగిన నిరసనను సాకుగా ఎంచుకుని పోలీసులు జెఎన్యూలోకి ప్రవేశించారు, ముగ్గురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు.
ఒక విద్యార్థిని కోర్టుకు తీసుకెళ్లినప్పుడు న్యాయవాదులు, కెమెరాల ముందే హిందూత్వ మద్దతుదారులు అతనిని తన్నుతూ, కొడుతూ, అవమానిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు.
ప్రైమ్‌టైమ్ టీవీల్లో, న్యూస్ యాంకర్లు మార్ఫింగ్ చేసిన వీడియో క్లిప్‌లను ఉపయోగించి జెఎన్యూ విద్యార్థులను ‘దేశద్రోహులు’గా చిత్రీకరిస్తూ ఒక నాటకాన్ని నడిపారు.
విద్యార్థులపై దేశద్రోహం మోపారు, దీనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఆ విద్యార్థులలో ఒకరైన ఉమర్ ఖాలిద్, చరిత్రలో డాక్టరేట్ పట్టా కోసం అధ్యయనం చేస్తున్నారు.
క్యాంపస్‌లో, థాపర్ వరుస నిరసన తరగతుల్లో పాల్గొన్నారు, ఇవి వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షించాయి.
ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. ఆమె నిదానమైన, పద్ధతిగల శైలి గానీ లేదా ఆమె అంతర్జాతీయ ప్రతిష్ఠ గానీ వేధింపుల నుంచి ఆమెను రక్షించలేకపోయాయి.
ఫోన్ ద్వారా బెదిరింపులు, దుర్భాషలాడడం మొదలయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి, ఎక్కువగా ఈమెయిల్ ద్వారా వస్తుంటాయి.
అదే సంవత్సరం, ఆమె ముంబై సందర్శించి ఉపన్యాసం ఇచ్చినప్పుడు ముంబై పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు.
2019 నాటికి, ఆమె 20 ఏళ్లు బోధించిన, దాదాపు మరో 30 ఏళ్లుగా ఎమెరిటాగా ఉన్న జెఎన్యూ పరిపాలన విభాగం కూడా ఆమె పదవిని సమీక్షించడానికి ఆమె అర్హతల పత్రాన్ని(సీవీ)ని పంపమని కోరింది.
ఆన్లైన్లో, ఆమెను ‘విధ్వంసకారిణి’, ‘విఫలమైన మార్క్సిస్ట్ గాజీ’(గాజీ అనేది ఇస్లాం కోసం పోరాడే యోధుడిని సూచించే మధ్యయుగ పదం) అని, లేదా ఆర్గనైజర్ పత్రిక 2025 నాటి వ్యాసంలో పేర్కొన్నట్లు ‘మేధోపరమైన దేశద్రోహానికి రూపశిల్పి’ అని నిందిస్తూ సాగించే ప్రచారం విస్తరిస్తోంది.
‘థాపర్ ముఠా భారతీయ చరిత్రను విషపూరితం చేయడం ద్వారా కనీసం మూడు తరాల మనస్తత్వాన్ని వికృతం చేసింది’ అని ఒక వెబ్ ఎడిటోరియల్ ఇటీవల పేర్కొంది.
ఇప్పటివరకు, ట్యాంకులు రంగంలోకి దిగలేదు. కానీ భారతదేశంలో ఈ బెదిరింపు శక్తులు చాలావరకు అనామకంగా, డిజిటల్‌గా, వికేంద్రీకృతంగా దాడులు చేస్తుంటాయి.
ఇంగ్లీష్ మాట్లాడే వామపక్ష ఉదారవాదుల వర్గానికి చెందిన థాపర్‌ను – నేను కూడా ఆ వర్గానికి చెందినవాడినే – ఒక విధ్వంసకర, ‘దేశద్రోహ’ ఎలైట్ (ఉన్నత వర్గ) ప్రతిరూపంగా చిత్రీకరించడం సులభమైంది. ఆమె మహిళ కావడం వల్ల ఇది మరింత సులభమైంది.
‘నేను రాస్తున్న చరిత్ర గురించి కాదు, నేను మహిళను అయినందుకే నన్ను ఇంత తీవ్రంగా దూషిస్తున్నారు. ఇది పథకం ప్రకారం చాలా పెద్ద ఎత్తున సాగుతుంది’ అని వివరించారు.
‘ఉదాహరణకు, యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఉన్నాయి – వాటి కింద కామెంట్లు ఉన్నాయి. కొన్ని నిజంగా భయంకరమైనవి, అశ్లీలమైనవి, లింగ వివక్షతో కూడినవి. ఈ విషయంలో, నేను ఒక మహిళ కావడం చాలా దుర్భరంగా అనిపిస్తుంది’ అని అన్నారామె.
నేను పైకి అనలేదు కానీ, థాపర్ తన మీద ఆన్లైన్లో జరుగుతున్న దాడిలో సగం కూడా ఆమెకు తెలిసే ఉండదని నా అనుమానం.(ఆమె సోషల్ మీడియా ఉపయోగించరు.)
మీది మొద్దు చర్మం(సహనం) అయి ఉండాలి అన్నాను. ‘మరీ అంత మొద్దుది కాదు, కానీ సరిపోయేంత అనుకో, ముందుకు సాగడానికి సరిపోయేంత మొద్దుది’ అని నవ్వుతూ అన్నారామె.
భారతదేశంలో మేధోపరమైన అసమ్మతి..
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఆమె తన వైఖరి ఏమిటో బాహాటంగానే స్పష్టం చేయడం మూలంగా తనకు జరిగిన నష్టం అంటూ ఏదైనా ఉందంటే అది కాల హరణం మాత్రమే అన్నారామె.
చేయాల్సిన పని చాలా మిగిలి ఉంది, కానీ భారతదేశపు నూతన అధికార వ్యవస్థ నకిలీ చరిత్రకారులతో నిండిపోయింది, వారు ఊహలను, పగలను పెంచి పోషిస్తున్నారు.
‘ఎప్పుడైనా వింత ప్రకటనలు వచ్చినప్పుడు, నేను ఇచ్చే తదుపరి ఉపన్యాసంలో దానిని ప్రస్తావించాల్సి వస్తుంది’ ‘దానికి ఎక్కువ సమయం తీసుకోకపోయినా, ఆ కొద్ది సమయాన్ని కూడా నేను ముఖ్యమైన పరిశోధనలపై గడపాలని అనుకుంటాను’ అన్నారామె నిట్టూరుస్తూ.
భారతదేశంలో మేధోపరమైన అసమ్మతి మూలాలను ఆమె తన కెరీర్ పొడవునా నిరంతరం అధ్యయనం చేశారు.
అశోకుడి శాసనాల నుంచి, ప్రాచీన భారతదేశంలో అసమ్మతి అనేది ఒక ముఖ్యమైన లక్షణమని థాపర్ గ్రహించారు.(నిజానికి, ఇది అన్ని చోట్లా మతాల చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంది, భారతదేశం కూడా దానికి భిన్నంగా ఏమీ లేదు అని ఆమె అన్నారు.)
ఇక్కడ అది ప్రారంభ తత్వశాస్త్రంలో పొందుపరచబడింది, ఇది గతితార్కాన్ని(డైలెక్టిక్స్) పోలిన ఒక నిర్మాణాత్మక చర్చా విధానాన్ని కూడా వివరించింది: పూర్వ-పక్ష (వాదం), ప్రతి-పక్ష (ప్రతివాదం) మధ్య ఘర్షణ, దీని నుంచి సిద్ధాంతం (పరిష్కారం) పరిణామం చెందుతుంది.
అనువాదం: కె సత్యరంజన్
Psyche వెబ్సైట్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని నాలుగు భాగాలుగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
