భారతదేశ చరిత్రలో చెరిగిపోని ఒక చీకటి రోజుగా 2016 నవంబర్ 8 మిగిలిపోయింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో 1000, 500 రూపాయల నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్టు స్వయంగా ప్రధాని ప్రకటించారు.
నల్లధనం రూపుమాపడం కోసమే పెద్ద నోట్ల చలామణిని రద్దు చేశామని, దేశ ప్రజలందరూ ఈ మహాయజ్ఞానికి సహకరించాలని దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ తెలియజేశారు.
ప్రధాని దృష్టిలో 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం అంటే నల్లధనం, అవినీతి మీద చేసే యుద్ధం లాంటిది.
తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా శాశ్వతంగా ప్రజల జీవితం మూడు పువ్వులు, ఆరుకాయలుగా విరాజిల్లుతుందనే భావనను దేశ ప్రజలకు మోదీ కలిగించారు. కాబట్టి అసలు అవినీతికి- పెద్ద నోట్ల రద్దుకు సంబంధం ఉందా? నల్లధనం అంటే నోట్లు దాచిపెట్టుకోవడమేనా? అసలు పెద్ద నోట్ల రద్దు ఏ పరిస్థితుల్లో చేయాలి? చేయాల్సి వస్తే అందుకు ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు ఏంటి? ఇవన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిందా? ఆచరణలో జరిగిందేమిటో పరిశీలిద్దాం.
మొత్తం భారతదేశంలో చలామణిలో ఉన్న వాటిలో రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లు 86%గా ఉన్నాయి.
అంటే అత్యధిక మంది ప్రజలు వినియోగిస్తున్నది ఈ నోట్లు మాత్రమే అని రుజువు అవుతున్నది.
కారణం ద్రవ్యోల్బణం రీత్యా సాధారణ ప్రజలు సైతం 500, 1000 రూపాయల నోట్ల వాడకం తప్పనిసరి అయింది.
ఇలాంటి స్థితిలో వాటిని రద్దు చేయడం అంటే మనిషి శరీరంలోని 86% రక్తం తీసేస్తే మనిషి ఏ స్థితిలో ఉంటాడో, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజలు ఆ స్థితికి నెట్టబడ్డారు.
నోట్ల రద్దు ఏ పరిస్థితుల్లో చేయాలి.. ప్రపంచ అనుభవాలు ఏమిటి?
సోవియెట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత రష్యాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ సందర్భంలో అక్కడ పెద్ద నోట్ల చలామణిని రద్దు చేశారు.
ఇతర కొన్ని దేశాలలో కూడా ద్రవ్యోల్బణం అరికట్టలేనంత ఎక్కువగా ఉన్న సందర్భాలలో పెద్ద నోట్లను రద్దు చేశారు.
అలాగే యూరప్‌లో “యూరో కరెన్సీ”ని ప్రవేశపెడుతున్న సందర్భంగా యూరప్‌లోని వివిధ దేశాలలో ఉన్న కరెన్సీని రద్దు చేశారు.
భారతదేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసే నాటికి పైన చెప్పిన రెండు కారణాలలో ఏ ఒక్కటి భారతదేశంలో లేదు.
నోట్ల రద్దు ప్రకటించడానికి ముందు ప్రపంచంలోనే అత్యంత వేగంగా 7% వృద్ధి రేటుతో దేశం అభివృద్ధి చెందుతున్నదని ప్రధానితో సహా అందరూ చెప్పారు.
ఇలాంటి పరిస్థితులలో నోట్ల రద్దు చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు.
అయినప్పటికీ ప్రభుత్వం పెద్ద నోట్ల చలామణిని రద్దు చేయాలనుకున్నప్పుడు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే రద్దు చేయాలి.
పెద్ద నోట్ల రద్దు జరిగిన అనేక దేశాలలో కూడా ఇలాగే జరిగింది. కానీ మన దేశంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేకుండా కేవలం నాలుగు గంటల వ్యవధిలో నోట్ల చలామణి రద్దుని ప్రధాని ప్రకటించారు.
బ్యాంకులకు తిరిగివచ్చిన నగదు..
డిసెంబర్ 30వ తేదీలోగా ప్రజలు తమ వద్దనున్న 500, 1000 రూపాయల నోట్లు బ్యాంకులలో జమచేయాలని, లేకుంటే ఆ తర్వాత అవి చలామణి కావని ప్రభుత్వం చెప్పింది.
2017 జూన్ 13న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో చలామణి నుంచి తొలగించిన నోట్లలో 98.8% తిరిగి బ్యాంకులలో జమైనట్లుగా ప్రకటించారు.
అంటే జమకావలసినది కేవలం 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే.
ఇందులో కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఉన్నది 8 వేల కోట్లు. దీన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిజర్వ్ బ్యాంకుకు జమ చేయాల్సిన అవసరం లేదు.
మిగిలిన బహు కొద్ది మొత్తం విదేశాలకు వెళ్ళి గడువులోగా తిరిగిరాని వాళ్లు, ఇతరత్రా కారణాలు ఉన్నాయి.
సామాన్యులపై తీవ్ర ప్రభావం..
రూపాయి విలువ ఆధారంగా, 1950 ప్రాంతాల్లో జేబులో ఒక రూపాయి ఉంటే ఒక రోజంతా గడిచేది. అదే 1970 నాటికి పది రూపాయలు అవసరమయ్యేది.
కానీ 2016కు వచ్చేటప్పటికి కుటుంబ నిర్వహణ కోసం ఒక రోజుకు కొన్ని వందల రూపాయలు తప్పనిసరిగా అవసరమైంది.
ఆ విధంగా 500, 1000 రూపాయల నోట్లు నల్లధనం కింద పెద్దలు దాచి పెట్టుకునేవి కావు.
అవి సాధారణ ప్రజల వాడకంలో ఉన్నవేనని రిజర్వ్ బ్యాంకు గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
భారతదేశంలో 94 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న, కుటీర పరిశ్రమల్లో పని చేసే వాళ్ళు చాలా ఎక్కువ. ఈ చిన్న, కుటీర పరిశ్రమలకు డబ్బు చలామణి పెద్ద అవరోధంగా పరిణమించింది.
ఫలితంగా అలాంటి చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. వారి జీవనోపాధి సమస్యతో పాటు అందులో పని చేసే వారి ఉపాధి ఊడిపోయింది.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనడానికి రైతుల చేతిలో డబ్బులు లేక నానావస్థలు పడ్డారు. ఈ కాలంలో పంటలు కూడా దెబ్బతిన్నాయి.
ఆ విధంగా ప్రజల రోజువారీ అవసరాలకు వాడుతున్న 500, 1000 రూపాయల నోట్ల రద్దు ఫలితంగా ప్రజలు నానావస్థలు పడ్డారు. కూలీ, నాలీ చేసుకొని ఏరోజుకారోజు వచ్చిన డబ్బులతో కాపురం వెళ్లదీసుకునేవాళ్లు నానా అగచాట్లు పడ్డారు.
ప్రజలు పనులు మానుకొని బ్యాంకుల దగ్గర క్యూలు కట్టారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు, ఒత్తిడిని తట్టుకోలేక వందల సంఖ్యలో బ్యాంకు సిబ్బంది మరణించారు.
అమలు అప్రజాస్వామికం..
పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయానికి ముందు మంత్రివర్గ సమావేశం జరగలేదు. నిర్ణయాన్ని ప్రకటించడానికి ఒకరోజు ముందు, అంటే నవంబరు ఏడో తేదీ మాత్రమే రిజర్వ్ బ్యాంకుకు తన నిర్ణయాన్ని ప్రభుత్వం తెలియజేసింది. హడావుడిగా ఎనిమిదో తేదీన రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశం జరిగింది. ఆ సాయంత్రమే ప్రధాని నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించారు.
ఇలాంటి ప్రధాన, కీలకమైన నిర్ణయాలను పార్లమెంటుకు తెలియజేయాలి. కానీ ఆ తర్వాత కూడా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ఏ ఒక్క ప్రశ్నకు పార్లమెంటులో ప్రధాని సమాధానం ఇవ్వలేదు.
నల్లధనం, ఉగ్రవాదం పేరిట..
నల్లధనం ఎక్కువ భాగం స్థిరాస్తులు, భవనాలు, స్థలాలు, పొలాల రూపంలో ఉంటుంది. విదేశీ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున దాచుకుంటారు- ఇది యథార్థం. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారుల మధ్య సంబంధాలతో భారీ ఎత్తున లంచగొండితనం, నల్లధనం పోగవుతోంది. దీన్ని వదిలేసి అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నామని చెప్పడం ప్రజలను మోసం చేయడం తప్ప మరోటి కాదు.
ప్రధాని చేసిన మరొక వాదన- ఉగ్రవాదులు పెద్ద నోట్లు చలామణి చేస్తున్నారని, ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే పెద్ద నోట్లు రద్దు చేయడం తప్పనిసరని అన్నారు.
ఇందులో ఉగ్రవాదులు చలామణి చేస్తున్న మొత్తం- 400 కోట్ల రూపాయలకు మించి ఉండదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా సంబంధిత మంత్రి చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో ఇది కేవలం 0.02 శాతం మాత్రమే. ఈ సమాచారం ఐఎస్ఐ, కోల్‌కతా నిర్వహించిన అధ్యయనం ఆధారంగా చెప్పినట్టుగా మంత్రి తెలియజేశారు. కాబట్టి ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం చేశామనేది తప్పని రుజువు అవుతోంది.
ఏ విధంగా చూసినా 500, 1000 నోట్ల రద్దు దేశ అభివృద్ధిని కొంతకాలం వెనక్కి నెట్టి ప్రజలను నానా అవస్థలకు గురి చేసింది, అనేకమంది ప్రాణాలు బలిగొన్నది.
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది 50 రోజులపాటు ఉండవచ్చని ప్రధాని పదే పదే చెప్పారు. ఆ తర్వాత కూడా ఇబ్బందులు ఉంటే ప్రజలు ఏ శిక్ష విధించినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని 2016 నవంబర్ 13న ప్రధాని ఆవేశపూరితంగా చెప్పారు.
50 రోజులు కాదు, నెలల తరబడి ఇబ్బందులు కొనసాగాయి. మందగించిన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి రెండు, మూడు సంవత్సరాలు పట్టింది. కాబట్టి ప్రధాని చెప్పినట్లుగా వారికి ఏ శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
