ప్రపంచీకరణ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి చైనా తన దేశీయ కార్మికులను, వినియోగదారులను మోసం చేసిందనే ఇటీవలి చర్చను వ్యతిరేకిస్తూ- చైనా అద్భుతమైన ఆర్థిక ఎదుగుదల నమూనాని, దాని కథను, దాని నుంచి నేర్చుకోవాల్సిన; వదిలించుకోవాల్సిన పాఠాలను విశ్లేషించే రెండు భాగాల శ్రేణిలో ఇది మొదటి వ్యాసం.
బీజింగ్‌లో ట్రంప్-షీ జిన్‌పింగ్ సమావేశానికి ఒక నెల ముందు, చైనా జాతీయ ప్రజా కాంగ్రెస్ 15వ పంచవర్ష ప్రణాళికను ఆమోదించింది.
అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ ప్రవేశపెట్టిన మూడవ ప్రణాళిక ఇది.
ఈ ప్రణాళిక “నాణ్యమైన” ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది . ఇది “షీ జిన్‌పింగ్ సిద్ధాంతం”ను పోలి ఉంటుంది. దీని ప్రకారం చైనా ఇకపై అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది.
వేగంగా పారిశ్రామికీకరణ చెందుతూ ఒక దేశం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మారడం అనేది అధ్యయనం చేయడానికి, దాని నుంచి నేర్చుకోవడానికి చైనా అత్యంత ఆసక్తికరమైన వృద్ధి నమూనాలలో ఒకటిగా నిలుస్తుంది.
చైనా ఆర్థిక ఎదుగుదలను ప్రపంచ విధాన రూపకర్తలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో, చాలా కాలంగా ఒక ప్రత్యేక ఆసక్తితో పరిశీలిస్తున్నారు.
ఆధునిక ఆర్థిక చరిత్రలో కొన్ని దేశాలు మాత్రమే ఇంత వేగంగా, కేవలం కొన్ని దశాబ్దాలలో, పారిశ్రామికీకరణను సాధించాయి, లేదా ఇంత పెద్ద స్థాయిలో పేదరికాన్ని తగ్గించాయి.
చైనా కేవలం ఒక తరం జీవిత కాలంలోనే, తన శ్రామిక శక్తిని వివిధ రంగాలలోకి కేటాయించడం ద్వారా ఊహించని రీతిలో ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇవన్నీ సాధించింది.
చాలా మంది ఆర్థికవేత్తలకు, నిరంతరాయంగా కొనసాగే ప్రభుత్వ రంగ పారిశ్రామికీకరణ వలన గణనీయమైన పురోగతిని సాధించగలం అనడానికి చైనా ఒక నిదర్శనంగా నిలిచింది.
చైనా నుంచి నేర్చుకోవలసిన పాఠాలు..
సుమారు గత పదేళ్లలో, భారతదేశం కూడా దేశీయంగా – అంతర్జాతీయంగా ప్రభుత్వ రంగులోకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
అయితే చైనా సాధించిన ప్రగతితో పోల్చి చూస్తే భారతదేశం చాలా తక్కువ ఫలితాలను మాత్రమే సాధించింది.
దీంతో చైనా ప్రపంచశక్తిగా ఎదగడం నుంచి నేర్చుకోవలసిన ఉపయోగకరమైన పాఠాలు ఉన్నాయి. అలాగే వదిలించుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి.
పేదరిక నిర్మూలన విషయంలో చైనా సాధించిన విజయాలపై పెద్దగా వివాదం లేదు. 1996 నుంచి 2022 మధ్య ఆ దేశంలో తలసరి వినియోగ వ్యయం సగటున సంవత్సరానికి 8% చొప్పున పెరిగింది.
ఇదే తరహా పారిశ్రామికీకరణ దశలో ఉన్న తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థలను ఇది అధిగమించింది. కేవలం ఒక తరంలోనే కోట్లాది మంది ప్రజలు ఆర్ధిక(స్వయం) సమృద్ధిని సాధించారు.
చైనా ఆర్థిక అభివృద్ధిని గురించి అధ్యయనం చెయ్యడం అక్కడి నుంచే ప్రారంభం కావాలి.
అది ఒక్కసారి జరిగిన అద్భుతంగా కాకుండా, ఆ తర్వాత వచ్చే ప్రతి అభివృద్ధి నమూనాకు అది ఒక ప్రాతిపదికగా పరిగణించాలి.
పేదరిక నిర్మూలనలో వేగం, సమాన పంపిణీ అనేవి రెండు వేర్వేరు విషయాలు.
ఒక ఆర్థిక వ్యవస్థ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తూనే, అభివృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలలో ఎక్కువ వాటాను, మూలధన సమీకరణకు, ఎగుమతుల రంగంలో, ప్రభుత్వ రంగంలోని పెట్టుబడుల వైపు మళ్లించగలదు.
(భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియం, చైనా వృద్ధి నమూనాపై ఇటీవల చేసిన ఒక విశ్లేషణాత్మక పరిశీలనలో, ఈ రెండు(పేదరిక నిర్మూలన, సమాన పంపిణీ) విషయాలు పరస్పరం మార్చుకోదగినవిగా పరిగణిస్తారు.)
వేగంగా పారిశ్రామికీకరణ కాలం..
చైనా పౌరుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా లేదా అనేది ఇక్కడ సమస్య కాదు. వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందనేది వాస్తవం.
ఆర్థిక వ్యవస్థ ద్వారా వచ్చిన అసాధారణ ఉత్పాదకత పెరుగుదలకు అనుగుణంగా గృహ ఆదాయం పెరిగిందా లేదా అన్నది ఒక సంక్లిష్టమైన ప్రశ్న.
కేవలం తలసరి వృద్ధి రేట్ల సూచిక కన్నా, చైనా జీడీపీలో గృహ వినియోగం వాటా పంపిణీకి ఒక మెరుగైన సూచిక. నేడు ఉత్పత్తిలో సుమారు 40% గా ఉన్న చైనా గృహ వినియోగ వాటా, యునైటెడ్ స్టేట్స్(68%), జపాన్ (55%), దక్షిణ కొరియా (48%), Organisation for Economic Cooperation and Development(OECD) దేశాల సగటు(దాదాపు 60%) కంటే చాలా తక్కువగా ఉంది.
వేగంగా పారిశ్రామికీకరణ చెందటానికి ప్రాంతీయ ఉదాహరణగా తరచుగా చెప్పబడే జపాన్‌లో, యుద్ధానంతర పారిశ్రామిక విస్తరణ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కూడా గృహ వినియోగం ఎప్పుడూ సుమారు 50% కంటే తక్కువకు పడిపోలేదు. కానీ చైనాలో ఈ సంఖ్య 2010 నాటికి దాదాపు 34% వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది.
2000-2020 మధ్య, చైనా వాస్తవ జీడీపీ సుమారుగా 8.7% వార్షిక రేటుతో వృద్ధి చెందినప్పటికీ, జాతీయ ఉత్పత్తిలో గృహ వినియోగం వాటా ఎప్పుడూ తక్కువగానే ఉంది.
ఉత్పత్తిలో అభివృద్ధి వలన చైనా పొందిన ప్రయోజనాలలో అధిక భాగం, వారి గృహ కొనుగోలు శక్తిని మెరుగుపరచలేదు.
అందుకు భిన్నంగా వృద్ధి వలన పొందిన అదనపు ఆదాయం కార్పొరేట్లు ఆదాయాలలో పెరుగుదలకు, ప్రభుత్వ నేతృత్వంలోని పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణకు మళ్లించబడ్డాయి.
ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక విస్తరణ వేగంగా జరుగుతున్న కాలంలో చాలా వరకు చైనా జీడీపీలో కార్మిక వాటా చాలా తక్కువగా 50 నుంచి 52% మధ్య ఉండటం అనేది మనం గమనించాలి.
ఉత్పాదకతతో పోలిస్తే వేతనాల వృద్ధి తక్కువగా ఉండటం చైనా ఎగుమతి పోటీతత్వాన్ని కాపాడటానికి సహాయపడిందని సుబ్రమణియం చెప్పారు.
ఇది ఆయన వాదనను ముందుకు తీసుకు పోవడానికి బదులు ఆయన వాదనను బలహీనపరుస్తుంది.
జీవన ప్రమాణాలు – వ్యవస్థ అనుకూలత..
ఎగుమతి ధరలను నిలబెట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఉత్పాదకత వృద్ధి కంటే వేతనాలను తక్కువగా ఉంచటం అంటే, నిర్వచనం ప్రకారం, ఆదాయాన్ని కార్మికుల నుంచి ఉత్పత్తిదారులకు పునఃపంపిణీ చేయడమే.
జీవన ప్రమాణాలు సంపూర్ణంగా మెరుగుపడినంత మాత్రాన వ్యవస్థ వారికి అనుకూలంగా ఉన్నట్లు కాదు.
చైనా గృహ మార్కెట్ ఈ పంపిణీ విధానాన్ని స్పష్టంగా తేటతెల్లం చేస్తుంది.
బీజింగ్, షాంఘై, షెన్జెన్ వంటి ప్రధాన చైనా నగరాల్లో, అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే ఇంటి ధర ఆదాయాల నిష్పత్తులు అసాధారణంగా చాలా అధికంగా ఉన్నాయి.
2008 డిసెంబర్లో 17.6%గా ఉన్న రికార్డు కనిష్ట స్థాయి నుంచి, జీడీపీలో చైనా గృహ రుణాల శాతం 2024 మార్చినాటికి 62.3%గా నమోదై సర్వకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
దీనికి ప్రధాన కారణం తనఖా ద్వారా అధికంగా గృహ రుణాలు తీసుకోవడమే.
దశాబ్దాలుగా వేతన వృద్ధి నుంచి లబ్ధి పొందిన అనేక కుటుంబాలు, పెరిగిన ఆస్తి మార్కెట్(రియల్ ఎస్టేట్) తమ కళ్ల ముందే ఆ లాభాలను మింగి వేయడాన్ని చూశాయి.
కేవలం పట్టణంలో ఆస్తిని కాపాడుకోవడం కోసం కుటుంబాలు అప్పులు చేయవలసి రావడం పెరిగింది.
ఆశాజనకంగా లేని వివరణలు..
అధిక గృహ పొదుపు రేట్లను తరచుగా చైనా అభివృద్ధికి నిదర్శనంగా, సాంస్కృతికంగా వారి కుటుంబ పొదుపునకు ప్రతిబింబంగా చూపుతారు.
కానీ దీనికి వారు ఇచ్చే వివరణ అంత ఆశాజనకంగా లేదు.
అమెరికాలో 5.8% పొదుపుతో పోలిస్తే, చైనా కుటుంబాలు తమ ఖర్చు చేయగల ఆదాయంలో సుమారు 35% పొదుపు చేస్తాయి.
దీనికి కారణం వారు సురక్షితంగా ఉండటం కాదు, వారు అధికంగా ఆర్థిక నష్టానికి – రోజు వారీ జీవితంలో అధిక వ్యయాలకు గురికావడమే.
దేశంలోని మొత్తం ఆరోగ్య వ్యయంలో సుమారు నాలుగో వంతు ఖర్చులను ఆరోగ్య సంరక్షణకు కుటుంబాలే భరిస్తున్నాయి.
ఇక్కడ పింఛను విధానంలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పిల్లల విద్యా ఖర్చులు కూడా కుటుంబాలపై భారీగా పడుతున్నాయి.
మరో మాటలో చెప్పాలంటే, చైనా పొదుపు రేటు కేవలం ఒక సాంస్కృతిక ప్రాధాన్యత మాత్రమే కాదు. ఇది అభివృద్ధి చెందని సంక్షేమ వ్యవస్థకు ప్రతిరూపం.
ఆర్థిక అణచివేత ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. డిపాజిట్ రేట్లను తరచుగా ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువగా ఉంచేవారు.
దీనివల్ల ముందుజాగ్రత్త కొరకు వారు చేసిన పొదుపును, పారిశ్రామిక విస్తరణకు సబ్సిడీగా ఖర్చు చేసి చౌక రుణాల ఇవ్వడానికి ఉపయోగించారు.
ఆర్థిక విశ్లేషణ ముసుగులో సైద్ధాంతిక సందేశాలు..
చైనా వినియోగదారులైన ప్రజలు కేవలం వృద్ధి నమూనాలో పాలు పంచుకోవడమే కాదు, దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. చైనా సాధించిన అభివృద్ధి విజయాలను కాదనడం దీని ఉద్దేశ్యం కాదు. చైనా వినియోగదారుల పట్ల శ్రద్ధ అనే ముసుగులో భౌగోళిక రాజకీయ శత్రుత్వం కారణంగా సుబ్రమణియం చేసిన హెచ్చరిక సరైనదే.
చైనా వృద్ధి నమూనాపై చేసే విమర్శలు తరచుగా ఆర్థిక విశ్లేషణ ముసుగులో ఉన్న సైద్ధాంతిక సందేశాలుగా మారిపోయాయి. కానీ దీనికి వ్యతిరేకంగా చేసే వాదనలు కూడా అంతే లోపభూయిష్టంగా ఉన్నాయి. మొత్తం ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే పంపిణీలో సమన్యాయాన్ని నెలకొల్పదు.
కార్మికుల వాటాలు, వేతన ఉత్పాదకత అంతరాలు, పొదుపు తప్పనిసరి చేయడం – గృహాల కొనుగోలు శక్తికి సంబంధించిన డేటా చైనా ఎదుగుదల పట్ల ఉన్న సైద్ధాంతిక వ్యతిరేకత నుంచి రాలేదు. అందుకు భిన్నంగా చైనా ఆర్థిక విజయాన్ని కీర్తించడానికి నిత్యం ఉపయోగించే అవే అంతర్జాతీయ డేటాబేస్‌ల నుంచే అవి వచ్చాయి.
అంతిమంగా చైనా వృద్ధి నిజమైనదా కాదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. చైనాలో జరిగిన అభివృద్ధి ఖచ్చితంగా నిజమైనదే. మరింత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఆ వృద్ధి వ్యయాలను ఎవరు అత్యంత ఎక్కువగా భరించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులే అధికంగా ఈ వ్యయాలలో సింహభాగం భరించారు.
దీపాంశు మోహన్ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో డీన్- అర్థశాస్త్ర ప్రొఫెసర్. ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ అంతర్జాతీయ అభివృద్ధి విభాగంలో విజిటింగ్ రీసెర్చ్ ఫెలోగా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
కెంట్ డెంగ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)లో ఆర్థిక చరిత్ర విభాగంలో ప్రొఫెసర్.
అంకుర్ సింగ్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్(సీఎన్ఈఎస్)లో రీసెర్చ్ అనలిస్ట్.
అనువాదం: ప్రతాపని రామ కోటేశ్వరరావు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
