కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) సమయంలో రాష్ట్రంలోని ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించడాన్ని ఉదాహరణగా చూపుతూ, 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని తాను గట్టిగా నమ్ముతున్నట్లు మాజీ ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి తెలిపారు.
ఇటీవల కోల్‌కతాలో జరిగిన హషిమ్ అబ్దుల్ హలీమ్ స్మారక ఉపన్యాసంలో ప్రసంగిస్తూ, “బెంగాల్ ఎన్నికలు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యాయా లేదా? అవి కాలేదని నేను నమ్ముతున్నాను” అని ఖురేషి అన్నారు.
“ఈ విషయాన్ని నేను బహిరంగంగా, మీడియాలో పదే పదే చెప్పాను. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉంది. సుప్రీంకోర్టు దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
అయితే ఎన్నికల ఫలితాలను పూర్తిగా రద్దు చేయాలని ఆయన అనలేదు. “బహుశా ఎన్నికలన్నీ పూర్తిగా నాశనం కాక పోవచ్చు. కానీ కనీసం ఎక్కడెక్కడ తప్పు జరిగిందనే అనుమానాలు ఉన్నాయో[సుప్రీంకోర్టు]వాటిని ఎత్తి చూపుతుంది” అని అన్నారు.
ముస్లిం ఓటర్లలో సుమారు 70 నుంచి 80 శాతం మంది పేర్లు తొలగించబడినట్లు తాను చదివిన నియోజకవర్గాల నుంచి సుప్రీంకోర్టు విచారణను ప్రారంభించాలని ఆయన అభ్యర్థించారు.
ముందు వైపు నుంచి ఎన్ఆర్సీ
2006 నుంచి ఎన్నికల కమిషనర్‌గా, 2010 నుంచి 2012 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సేవ చేసిన ఖురేషి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అస్సాం జాతీయ పౌర రిజిస్టార్‌తో పోల్చారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఆ ఎన్ఆర్సీ ప్రక్రియ 2019 నాటికి ముగిసింది. రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి సుమారు 19 లక్షల మంది తొలగించబడ్డారు.
“ఎస్ఐఆర్ అనేది వెనుక తలుపు ద్వారా ఎన్ఆర్సీ లాంటిదా అని” చాలా మంది నన్ను అడిగారు- నా సమాధానం ఏమిటంటే, ఎస్ఐఆర్ అనేది ముందు తలుపు ద్వారా వచ్చే ఎన్ఆర్సీ” అని ఆయన అన్నారు.
“నిజానికి, ఇది ఎన్ఆర్సీకి తండ్రి లాంటిది. అక్కడ (అస్సాంలో) ఒక నిర్ణయానికి రావడానికి వారు సంవత్సరాల తరబడి చట్టపరమైన ప్రక్రియలను అనుసరించారు. కానీ ఇక్కడ, కేవలం పదిహేను రోజుల్లో, బెంగాల్ అంతటా, 49 నియోజకవర్గాల్లో 70-80 శాతం మంది ముస్లింల పేర్లను వారందరినీ బంగ్లాదేశీయులుగా ముద్రవేసి తొలగించారని నేను చదివాను” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటర్లు తమ పేర్లను 2002 ఓటర్ల జాబితాతో లింక్ చేయాలనే ఎస్ఐఆర్ ప్రధాన నిబంధనను ఆయన ప్రశ్నించారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ 2002 సంవత్సరం కంటే ముందే చనిపోయారని, తాను కూడా ఆ సంవత్సరంలో ఓటు వేయలేదని ఆయన చెప్పారు.
“అలాంటప్పుడు నేను ఎక్కడికి పోవాలి? కానీ నేను భారతీయ పౌరుడినే. నేను అనేక ఎన్నికలలో ఓటు వేశాను” అని ఆయన అన్నారు.
“2002 నుంచి లెక్క గట్టాలనే ఈ చెడు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎలాంటి తర్కం లేదు” అని ఆయన అన్నారు.
ఫారం-6, తప్పుడు డిక్లరేషన్..
తొలగించబడిన ఓటర్లను అక్టోబర్‌లో ప్రకటించిన ప్రత్యేక నమోదు కార్యక్రమం కింద కొత్త ఓటర్ల దరఖాస్తు ఫారమ్ ‘ఫారం-6’ ద్వారా తిరిగి జాబితాలోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం ప్రకటించడాన్ని ఖురేషి తీవ్రంగా విమర్శించారు.
ఫారం-6 ప్రకారం, దరఖాస్తు దారు తాను కొత్త ఓటరునని, ఇంకెక్కడా తన పేరు ఇంతకుముందు నమోదు కాలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఒకవేళ తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఏడాది వరకు జైలు శిక్ష పడుతుందని ఆ ఫారమ్ హెచ్చరిస్తుంది. “పది-పదిహేను సార్లు ఓటు వేసిన నేను కొత్త ఓటరును అని ఎలా పిలుచుకోగలను? కానీ నన్ను బలవంతంగా అలా చేయిస్తున్నారు” అని ఆయన అన్నారు.
తమ పేర్లను తిరిగి జాబితాలోకి తెచ్చుకోవాలంటే ఆ ఫారమ్‌పై సంతకం చేయాలని అడుగుతున్నారని కొందరు మిత్రులు తనకు ఫోన్ చేసి చెప్పారని ఆయన తెలిపారు.
“ఒకవేళ మీరు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే దానిపై సంతకం చేయండి అని నేను వారికి చెప్పాను ” అన్నారు.
“ఎప్పటి నుంచో ఓటర్లుగా నమోదైన వారిని సాధారణంగా తొలిసారి దరఖాస్తు చేసుకునే వారిలా చూడకూడదు” అని ఆయన అన్నారు. అలాగే “తప్పుగా తొలగించబడిన పేర్లను తిరిగి చేర్చడానికి సత్వర, సమర్ధవంతమైన విధానం ఉండాలి” అని ఆయన చెప్పారు.
న్యాయస్థానాలు-అప్పీళ్లు..
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై న్యాయస్థానాల స్పందనలను కూడా ఖురేషి విమర్శించారు. తొలగించబడిన ఓటర్లను ట్రిబ్యునళ్లకు పంపడం అనేది రోజువారీ కూలీలకు సులువైన పరిష్కారం కాదని ఆయన అన్నారు.
హర్యానాలోని గురు గ్రామ్‌లో ఆయన నివాస ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు. “వారి ఓట్లను కాపాడుకోవడానికి వారి(స్థానిక నివాసితుల) సిబ్బంది అంతా బెంగాల్‌కు వెళ్లాల్సి వచ్చింది” అని ఆయన చెప్పారు.
కార్మికులను కేవలం 24 గంటల్లోపు తమ రికార్డులను సరిచేసుకోవాలని చెబుతున్నారు, కానీ “వారి నెల వారీ జీతం విమాన ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోదు” అని ఆయన అన్నారు.
ఒక అంచనా ప్రకారం, పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 25 నుంచి 27 లక్షల మంది ప్రజల అప్పీళ్లను పరిష్కరించడానికి 21 సంవత్సరాలు పడుతుందని, ట్రిబ్యునళ్ల సంఖ్యను 19 నుంచి 40కి పెంచినా కూడా 14 సంవత్సరాలు పడుతుందని ఆయన తెలిపారు.
పేర్లు తొలగించబడిన వారు “తదుపరి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు” అని జస్టిస్ జాయ్మల్య బాగ్చి చేసిన వ్యాఖ్యను, అలాగే సెప్టెంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని రెండు నియోజకవర్గాలలో జరిగిన ఉపఎన్నిక “కేవలం ఒక ఉపఎన్నిక మాత్రమే” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యను ఆయన తప్పుపట్టారు.
“ఒక ఉపఎన్నికలో గెలవకపోతే ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోవచ్చు” అని ఆయన గుర్తుచేశారు. “ఇది ఒక న్యాయపరమైన ప్రకటన కాదు, అత్యంత బాధ్యతారహితమైన ప్రకటన” అని ఆయన అన్నారు.
ఓటర్ల ధృవీకరణ కోసం న్యాయ అధికారులను పంపాలనే నిర్ణయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. “కార్య నిర్వాహక వ్యవస్థ(ఎగ్జిక్యూటివ్) తన పని తాను చేసే విధంగా బెత్తం ప్రయోగించడం కోర్టు పని” అని ఆయన అన్నారు.
“రేపు ట్రాఫిక్ సరిగా నిర్వహించబడకపోతే, మీరు సెషన్స్ జడ్జిని వెళ్లి ట్రాఫిక్ నియంత్రించమని చెబుతారా?” అని ప్రశ్నించారు.
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడం అనేది కేవలం ఓటు హక్కును మాత్రమే కాకుండా, అంతకంటే ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఖురేషి అన్నారు.
ది టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్ పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడటంతో ఆయన పాస్‌పోర్ట్ పునరుద్ధరణ నిలిచిపోయింది.
జాబితాలో లేని వారికి సంక్షేమ పథకాలను నిలిపి వేస్తామని కొందరు ముఖ్యమంత్రులు మాట్లాడారని, ఇది ఓటర్ల జాబితాల ద్వారా “వెనుక తలుపు ద్వారా” పౌరసత్వాన్ని నిర్ణయించడమేనని ఆయన గుర్తుచేశారు.
సీఈసీ అంటే ఎన్నికల సంఘం కాదు..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల సంఘం లోపల వివాదాల గురించి ఖురేషి ప్రస్తావించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పదే పదే అభ్యంతరాలు లేవనెత్తినట్టు ఆ నివేదికలు చూపించాయి.
1990లలో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ఏర్పడినప్పటి నుంచి నిర్ణయాలు సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఉండాలని, ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే మెజారిటీ ద్వారా ఉండాలని ఆయన చెప్పారు.
“ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే ఎన్నికల సంఘం కాదు. సీఈసీ ఒక్కడే మిగిలిపోతే, ఆయన ఎన్నికల సంఘం కాదు. ఆయన ముగ్గురిలో ఒకరు మాత్రమే” అని ఖురేషీ చెప్పారు.
ఇద్దరు కమిషనర్లు మౌనంగా ఉన్నందుకు తాను గతంలో వారిని ఆక్షేపించానని ఆయన చెప్పారు. “కానీ వారు వాస్తవానికి ఏదో ఒకటి చేస్తున్నారని తేలింది” అని ఆయన అన్నారు.
“వారు తమ నిరసనలను రికార్డ్ చేస్తున్నారు, నోట్స్ తయారు చేస్తున్నారు, విషయాలు సరిగ్గా జరగడం లేదనే దానికి సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. దాని వల్లనే ఈ విషయం పూర్తి సాక్ష్యాలతో సుప్రీంకోర్టుకు చేరింది” అని చెప్పుకొచ్చారు.
నాలుగు నెలలుగా ఎన్నికల సంఘం సమావేశాలు జరగకపోవడం అనేది ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు.
“నిజానికి, ఒక మనిషి నిర్ణయాలు తీసుకోవడం లేదు, కంప్యూటర్ నిర్ణయాలు తీసుకుంటోందని తేలింది” అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల కమిషర్ల మెజారిటీ ఎలా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నిలువరించవచ్చో వివరించడానికి, 2008 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆ రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉన్నప్పటికీ, అప్పట్లో ఉన్న సీఈసీ ఎన్ గోపాలస్వామికి వాదనకు వ్యతిరేకంగా తాను, మరో ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా మెజారిటీ ఓటుతో ఆ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను జరిపించామని చెప్పారు. కమిషనర్లు తమ విభేదాలను గోప్యంగా ఉంచారని, ఈసీ ఎన్నికలను నిర్వహించిందని ఆయన తెలిపారు.
కమిషనర్ల ఎంపిక విధానం..
ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను మెరుగుపరచాలని ఖురేషి తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
2023 చట్టం ప్రకారం- ప్రధానమంత్రి, ఆయన నియమించిన కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ వారిని ఎంపిక చేస్తుంది. “అంటే ఇద్దరు ప్రభుత్వ నేతలదే మెజారిటీ అవుతున్నది. కాబట్టి నిష్పక్షపాత ఎంపిక జరగదు” అని ఆయన అన్నారు.
కనీసం ఒక్క పేరుపై ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకరించేలా నిబంధన ఉండాలని ఆయన సూచించారు. నేపాల్ ఉదాహరణను ఆయన గుర్తుచేస్తూ, అక్కడ ఒక రాజ్యాంగ మండలి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుందని, ఆ తర్వాత వారు పార్లమెంటరీ కమిటీ ముందు టెలివిజన్ ద్వారా ప్రసారమయ్యే విచారణలను నిర్వహిస్తారని చెప్పారు.
ఓటర్ల జాబితాపై నమ్మకాన్ని పునరుద్ధరించే సంస్కరణలను ఆయన ప్రతిపాదించారు. ఒక్కసారే చేసే సవరణలకు బదులుగా నిరంతర సవరణలు చేయడం, ప్రతి మార్పును పారదర్శకంగా, సమయానికి ప్రచురించడం, తప్పుగా తొలగించబడిన పేర్లను త్వరగా పునరుద్ధరించే మార్గం ఉండాలని ఆయన కోరారు.
“ఏ ఒక్క ఓటరును కూడా వదిలిపెట్టకూడదు” అనేది ఎన్నికల సంఘం నినాదం. కానీ “ప్రస్తుతం అనుసరిస్తున్న సూత్రం మాత్రం ‘ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో మిగిలి ఉండకూడదు’ అనేలా ఉంది” అని ఆయన విమర్శించారు.
ఆయిషా ఘోష్-సాంస్కృతిక వైవిధ్యమే మన బలం..
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు, విద్యార్థి నాయకురాలు ఆయిషా ఘోష్ మాట్లాడుతూ, రాజ్యాంగ విలువల పరిరక్షణలో యువత పాత్ర గురించి ప్రసంగించారు.
విశ్వ విద్యాలయాలు, పాఠశాల క్యాంపస్‌లు “ఈ మతపరమైన మూఢ నమ్మకాలన్నింటికీ దూరంగా ఉండాలి” అని ఆమె అన్నారు.
ఈ వేదికపై ప్రదర్శించిన ‘ముస్లింస్ ఎగనెస్ట్ పార్టిషన్’ డాక్యుమెంటరీని ఆమె ప్రశంసించారు. క్యాంపస్‌లలో చరిత్రను “సరైన రీతిలో” బోధించని ఈ సమయంలో, ప్రజలతో మాట్లాడటానికి, అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఇలాంటివి “చాలా చాలా ముఖ్యం” అని ఆమె అన్నారు.
“భారతదేశం లౌకిక దేశంగా ఉండాలి” అని ఆమె తెలియజేస్తూ- “ఈ సాంస్కృతిక వైవిధ్యమే మన బలం.” వీధుల్లోకి వచ్చిన యువత, ” దేశంలోని ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం సమాజంలోకి చొప్పించడానికి ప్రయత్నిస్తున్న ఆ భావజాలాన్ని సవాలు చేసింది” అని ఆమె తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
