Nehru and Patel argued frequently – but every dispute ended with unity
రాజ్‌మోహన్ గాంధీ రచించిన ‘పటేల్: ఏ లైఫ్’ పుస్తకం కొత్త ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. ఆయన జీవితంపై వచ్చిన అత్యంత సమగ్రమైన, విపులమైన పుస్తకం ఇది.

1991లో రాజ్‌మోహన్ గాంధీ ‘పటేల్: ఏ లైఫ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకానికి ఏప్రిల్ 1990లో రాజ్‌మోహన్ రాసిన ముందు మాటలో ఇలా పేర్కొన్నారు:
“స్వతంత్ర భారతదేశానికి పునాది వేయడంలో, దానికి అధికారాన్ని, గుర్తింపును తీసుకురావడంలో ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల కృషి ఉంది. వారు గాంధీ, నెహ్రూ, పటేల్. అయితే, దేశ చరిత్రలో నెహ్రూ సేవలను ఎంతో గొప్పగా గుర్తించారు. గాంధీ సేవలను విధిగా ప్రస్తావించారు. కానీ పటేల్ సేవలకు మాత్రం తగిన గుర్తింపు రాలేదు.”
నెహ్రూ శతజయంతి వేడుకలను ఆయన మనవడు రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో వైభవంగా నిర్వహించిన కొద్దికాలానికే ఈ ముందుమాట రాశారు. రాజీవ్ గాంధీకి ముందు ఆయన తల్లి ఇందిరా గాంధీ దాదాపు పదిహేనేళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కూడా మరణానంతరం నెహ్రూ ప్రతిష్ఠను పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న కాలంలోనే వల్లభ్‌భాయ్ పటేల్‌పై రాజ్‌మోహన్ గాంధీ రాసిన ఈ పుస్తకం తొలిసారిగా ప్రచురితమైంది.
ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత ఈ పుస్తకం కొత్త ప్రచురణగా వెలువడింది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అప్పటితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
2014 మేలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన ప్రభుత్వం ఒకవైపు పటేల్‌ను గొప్పగా కీర్తిస్తూ, ఆయన ప్రతిష్ఠను పెంచేందుకు… మరోవైపు నెహ్రూను విమర్శిస్తూ, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.
2000వ దశకం ప్రారంభంలో నేను మొదటిసారి రాజ్‌మోహన్ గాంధీ రాసిన ఈ పుస్తకాన్ని చదివాను. ఇప్పుడు రెండోసారి చదివాను. రెండు సందర్భాల్లోనూ ఈ పుస్తకంలో చేసిన పరిశోధన నన్ను ఎంతో ఆకట్టుకుంది.
వల్లభ్‌భాయ్ పటేల్ రాసిన ఉత్తరాలు, ఆయన కుమార్తె మణిబెన్ రాసుకున్న డైరీలు, ఆయన సమకాలీనులు, సహచరులకు సంబంధించిన వ్యక్తిగత పత్రాలు, ప్రభుత్వ రికార్డులు, ఇతరుల జ్ఞాపకాలు, పాత వార్తాపత్రికలు వంటి అనేక ఆధారాలను రాజ్‌మోహన్ గాంధీ పరిశీలించారు. అంతేకాకుండా పటేల్‌ను దగ్గరగా చూసినవారిని, ఆయనతో కలిసి పనిచేసినవారిని స్వయంగా ఇంటర్వ్యూ చేసి వివరాలు సేకరించారు.
ఈ ఆధారాలన్నింటి సహాయంతో పటేల్ జీవితాన్ని అన్ని కోణాల్లో ఆవిష్కరించారు. ఆయన బాల్యం, చదువు ఆలస్యంగా ప్రారంభం కావడం, కుటుంబ జీవితం, న్యాయవాదిగా సాధించిన విజయాలు, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం, సుదీర్ఘకాలం జైలు జీవితం గడపడం వంటి అంశాలను వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హోంమంత్రిగా దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన పోషించిన పాత్రను కూడా ఎంతో శ్రద్ధగా, నిష్పక్షపాతంగా వివరించారు.
పటేల్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పెరిగారు. ఆయనతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ, మోహన్‌దాస్ గాంధీ, సుభాష్ చంద్రబోస్‌ల బాల్యంతో పోలిస్తే పటేల్ బాల్యం చాలా సాధారణమైన పరిస్థితుల్లో గడిచింది. వారిలా ఆయనకు చిన్నప్పటి నుంచి సౌకర్యాలు, ప్రత్యేక అవకాశాలు లేవు.
అయినప్పటికీ జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎదిగిన తర్వాత కూడా తన గ్రామీణ నేపథ్యాన్ని పటేల్ ఎంతో గర్వంగా భావించేవారని రాజ్‌మోహన్ రాశారు.
1920వ దశకం చివరిలో బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించినప్పుడు పటేల్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. రైతులు మాట్లాడే భాష, వారి మాటతీరు, వారి ఆలోచనా విధానం ఆయనకు బాగా తెలుసు. అందుకే రైతులతో వారి భాషలోనే మాట్లాడి, వారిని ఆకర్షించగలిగారు. ఆయన మాటలకు రైతులు ఎంతగా ప్రభావితమయ్యారంటే, వారంతా ఆయన నాయకత్వంలో ఒకే తాటిపై నిలిచారు.
రాజ్‌మోహన్ గాంధీ రచించిన ఈ పుస్తకంలోని ప్రత్యేకతల్లో ఒకటి పటేల్ వ్యక్తిగత సంబంధాల గురించి ఆయన వివరించిన తీరు. ముఖ్యంగా తన అన్నయ్య విఠల్భాయ్తో, కుమార్తె మణితో, గుజరాత్‌కు చెందిన మరో దేశభక్తుడు మహదేవ్ దేశాయ్‌తో పటేల్‌కు ఉన్న అనుబంధాలను ఆయన ఎంతో చక్కగా వివరించారు.
అయితే, పటేల్ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంబంధాలు గాంధీ, నెహ్రూలతో ఏర్పడినవే. అందుకే జీవిత చరిత్ర రచయిత ఈ ఇద్దరితో పటేల్‌కు ఉన్న అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
గాంధీ, పటేల్ తొలిసారిగా కలుసుకున్నప్పుడు ఇద్దరికీ నలభై ఏళ్లు దాటాయి. ఆ తొలి పరిచయాల గురించి గాంధీజీ తర్వాత ఇలా రాసుకున్నారు:
“పటేల్ గురించి నేను తెలుసుకున్న కొద్దీ, ఆయన సహాయం తప్పనిసరిగా పొందాలని నాకు మరింత బలంగా అనిపించింది.”
అలాగే పటేల్ కూడా “నేను గాంధీజీతో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు, నా కుటుంబం, నా వృత్తి, నా పేరు ప్రతిష్ఠలు, ఇలా అన్నింటినీ కట్టెలుగా పోగుచేసి, వాటన్నింటినీ ఒక మంటలో వేసి కాల్చేశాను” అని అంటారు.
గాంధీజీ గురించి పటేల్ అభిప్రాయాన్ని రాజ్‌మోహన్ ఇలా వివరించారు:
“వల్లభ్‌భాయ్ దృష్టికి గాంధీజీ ముగ్గురు వ్యక్తులుగా కనిపించేవారు. ఆయన ఒక సాధువు, ఒక యోధుడు, ఒక మార్గదర్శి. ఆయనను పూర్తిగా నమ్మి, ఆయన చూపిన మార్గంలో నడవవచ్చని పటేల్ భావించేవారు.”
1930వ దశకంలో బ్రిటిష్ పాలకుల చేతిలో ఖైదీలుగా ఉన్నప్పుడు గాంధీ, పటేల్ 16 నెలల పాటు కలిసి ఉన్నారు. ఆ సమయంలో మహాత్ముడిపై పటేల్‌కు ఉన్న ప్రేమ, గౌరవం ఆయన చేసే చిన్నచిన్న సేవల్లోనూ కనిపించేవి.
ప్రతిరోజూ వేపపుల్లతో గాంధీజీ పళ్లు తోముకోవడానికి సిద్ధం చేసేవారు. ఆయన తాగడానికి నిమ్మరసం పిండి ఇచ్చేవారు. గాంధీజీ రాసే ఉత్తరాలను రాసిపెట్టడం, వాటి ప్రతులు తయారు చేయడం వంటి పనులు కూడా చేసేవారు. ఇలా అనేక విధాలుగా గాంధీజీకి సేవ చేసేవారు.
రెండు కీలక అంశాలపై ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండేది.
గాంధీజీ నాయకత్వంలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమాల నిర్వహణలోనూ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలోనూ పటేల్ కీలక పాత్ర పోషించారు.
1930వ దశకం చివరి నాటికి నెహ్రూ, పటేల్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ప్రధాన నాయకులుగా ఎదిగారు. రాజకీయ వ్యూహాల విషయంలో వారిద్దరి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు వస్తూ ఉండేవి.
అయితే, రాజ్‌మోహన్ గాంధీ పేర్కొన్నట్లుగా, రెండు విషయాలపై మాత్రం వల్లభ్‌భాయ్, జవహర్లాల్ ఇద్దరికీ స్పష్టమైన ఏకాభిప్రాయం ఉండేది.
మొదటిది, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడమే అందరి లక్ష్యం. రెండోది, ఆ లక్ష్యాన్ని సాధించడంలో గాంధీజీ పాత్ర అత్యంత కీలకం.
ఈ రెండు అంశాల విషయంలో వారిద్దరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.
నెహ్రూ కూడా పటేల్‌తో తనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ, “మా మధ్య విభేదాల కంటే ఏకాభిప్రాయాలే ఎక్కువగా ఉండేవి” అని రాసుకున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత గాంధీజీ మరణించినప్పుడు ఈ ఇద్దరు నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా పక్కనపెట్టారు.
గాంధీజీ హత్య జరిగిన మూడు రోజుల తర్వాత నెహ్రూ, పటేల్‌కు ఒక ఉత్తరం రాశారు. అందులో
“బాపూ మరణంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు మనం మరింత భిన్నమైన, మరింత క్లిష్టమైన ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. గతంలో మన మధ్య ఉన్న వివాదాలకు ఇప్పుడు అంత ప్రాధాన్యత లేదు. ఈ సమయంలో మనమంతా అత్యంత సన్నిహితంగా, పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మనిద్దరం కలిసి పనిచేయడం ప్రారంభించి పావు శతాబ్ద కాలానికి పైగా గడిచింది. ఈ కాలంలో ఎన్నో కష్టాలను, ప్రమాదాలను కలిసి ఎదుర్కొన్నాం. ఈ మొత్తం కాలంలో మీపై నాకు ఉన్న ప్రేమ, గౌరవం మరింత పెరిగాయని పూర్తి నిజాయతీతో చెప్పగలను. ఇకపై జరిగే ఏ పరిణామమూ వాటిని తగ్గించలేదని నేను భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
దీనికి సమాధానంగా –
“మీరు ఎంతో భావోద్వేగంతో వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇటీవలి పరిణామాలు నన్ను ఎంతో బాధించాయి. నన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించమని కోరుతూ నేను బాపూకు ఉత్తరం కూడా రాశాను. అయితే, ఆయన మరణంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు మన దేశం ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మనం కలిసి సాధించిన విజయాలు ఎంత గొప్పవో, మన దేశ ప్రయోజనాల కోసం ఇకముందు కూడా కలిసి పనిచేయడం ఎంత అవసరమో ఈ పరిస్థితులు మనకు గుర్తుచేయాలి” అని సమాధానం ఇచ్చారు.
రాజకీయ రంగంలో కలిసి పనిచేసిన ఇద్దరు నాయకుల మధ్య జరిగిన అత్యంత హృదయాన్ని కదిలించే ఉత్తరాల్లో ఇవి కూడా ఉంటాయి.
ఈ ఉత్తరాలు వారి మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనం. వాటి ప్రభావం దీర్ఘకాలం కొనసాగింది. ఇద్దరూ తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి, ముక్కలైన దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టే మహత్తర కార్యంలో కలిసి పనిచేశారు.
హోంమంత్రిగా పటేల్, ప్రధానమంత్రిగా నెహ్రూ కలిసి పనిచేసిన సంవత్సరాల్లో నెహ్రేూకు ఉన్న నాయకత్వ ప్రాధాన్యాన్ని, ప్రజాదరణను పటేల్ పూర్తిగా గుర్తించారని రాజ్‌మోహన్ రాశారు.
1948 నవంబర్ 14న నెహ్రూ 59వ జన్మదినం సందర్భంగా …
“గాంధీజీ, పండిట్ నెహ్రూను తన వారసుడిగా, తన తర్వాత దేశానికి నాయకత్వం వహించాల్సిన వ్యక్తిగా ప్రకటించారు. గాంధీజీ మరణించిన తర్వాత ఆయన నిర్ణయం ఎంత సరైనదో మనకు అర్థమైంది” అంటూ పటేల్ వ్యాఖ్య చేయటం సముచితం.
వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ఈ వ్యాసం ప్రచురితమవుతోంది.
పటేల్‌కు గాంధీ, నెహ్రూలతో ఉన్న సంబంధాల గురించి మాత్రమే కాకుండా, ఆయన జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలు, దేశం కోసం ఆయన చేసిన సేవల గురించి తెలుసుకోవాలనుకునేవారు రాజ్‌మోహన్ గాంధీ రాసిన ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాల్సి ఉంది.
స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడిగా పటేల్ జీవితాన్ని ఇంత సమగ్రంగా, ఇంత వివరంగా, పరిశీలనాత్మకంగా రచించిన పుస్తకం మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ పుస్తకం కొత్త ప్రచురణ పాఠకులకు సులభంగా అందుబాటులోకి వచ్చింది.
ఈ వ్యాసం ప్రారంభంలో 1991లో ప్రచురితమైన ‘పటేల్: ఏ లైఫ్’ పుస్తకానికి రాజ్‌మోహన్ గాంధీ రాసిన ముందుమాటలోని కొన్ని మాటలను ప్రస్తావించాను. ఇప్పుడు 2026లో వెలువడిన కొత్త ప్రచురణకు ఆయన రాసిన ముందుమాటలోని మాటలతో ఈ వ్యాసాన్ని ముగించాలనుకుంటున్నాను.
ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు? అందులో ప్రధానంగా ఏ అంశాలను వివరించారు? అనే విషయాలను చెప్పిన తర్వాత రాజ్‌మోహన్ గాంధీ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తారు.
“రాజకీయ ప్రయోజనాల కోసం పటేల్ పేరును పదేపదే దుర్వినియోగం చేయడం లేదా ఆయనను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వంటి ప్రయత్నాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? హిందువుల ఆధిపత్యాన్ని ప్రోత్సహించే, ముస్లింలను అణగదొక్కే రాజకీయాలకు మద్దతుగా సర్దార్ పటేల్‌ను ఉపయోగించుకోవాలని కొందరు ప్రయత్నించడం బాధ కలిగిస్తోంది.”
ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ రాజ్‌మోహన్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు.
“పటేల్‌కు, నెహ్రూకు మధ్య ఉన్న విభేదాలను అతిగా చూపించడం అనేది ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడానికి ఉపయోగపడే ఒక సులభమైన మార్గం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల ముందుకు మరోసారి తీసుకొస్తున్న తన పుస్తకం గురించి రాజ్‌మోహన్ గాంధీ ఇలా రాశారు:
“పటేల్, నెహ్రూల మధ్య తరచూ వాదోపవాదాలు జరిగేవని ఈ పుస్తకంలోని పేజీలు తెలియజేస్తాయి. వారి మధ్య అభిప్రాయభేదాలు కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉండేవి. వారి కుటుంబ నేపథ్యాలు, బాల్యం, జీవితంలో వారు సాగించిన ప్రయాణం, ప్రపంచాన్ని చూసే దృక్పథాలు ఒకదానికొకటి భిన్నంగా ఉండేవి.
వ్యక్తిగత సంభాషణల్లో ఎప్పుడూ, కొన్ని సందర్భాల్లో బహిరంగంగానూ వారు తమ అభిప్రాయభేదాలను ఏమాత్రం దాచుకోకుండా స్పష్టంగా చెప్పుకునేవారు. వారి మధ్య జరిగిన ఈ విభేదాల్లోనూ కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.
అయితే, చివరకు ప్రతి వివాదం ఐక్యతతోనే ముగిసేదన్న విషయాన్ని కూడా ఈ పుస్తకంలోని పేజీలు స్పష్టం చేశాయి.”
మహాత్మాగాంధీ, పటేల్–నెహ్రూల మధ్య మార్గదర్శకుడిగా వ్యవహరించిన పాత్రను ప్రస్తావిస్తూ రాజ్‌మోహన్ ఇలా అన్నారు:
“గాంధీ–పటేల్–నెహ్రూల ముగ్గురి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని పాఠకులు గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఎన్ని తీవ్రమైన సంక్షోభాలు ఎదురైనా, చివరికి ఆ ముగ్గురూ మళ్లీ కలిసికట్టుగా పనిచేయడానికి చూపిన సంయమనం, సుముఖత భారతదేశానికి ఎంతో మేలు చేశాయని కూడా పాఠకులు గుర్తిస్తారని ఆశిస్తున్నాను.”
రచయిత: రామచంద్ర గుహా
అనువాదం: టాన్యా
మూల ఆంగ్ల కథనం: Ramachandra Guha: Nehru and Patel argued frequently – but every dispute ended with unity (Scroll.in)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
