జేఎంఐ ఉపాధ్యాయులకు అనుకూలంగా 2025లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఈ తీర్పును అమలు చేయడంలో జాప్యం చేయడానికి కారణం.. తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే వేదికను విశ్వవిద్యాలయ పరిపాలన ఉద్దేశపూర్వకంగా నిరాకరించడమేనని మాజీ, ప్రస్తుత ఫ్యాకల్టీ సభ్యులు భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: విద్యార్థి సంఘం ఎన్నికలకు జామియా మిలియా ఇస్లామియా పచ్చజెండా ఊపింది. దాంతో దీర్ఘకాలికంగా ఉన్న జామియా ఉపాధ్యాయుల సంఘం(జేటీఏ) పునరుద్ధరణ డిమాండ్ మరలా చర్చలోకి వచ్చింది.
ఒక పరిపాలనా ఆదేశం ద్వారా జేటీఏను రద్దు చేసిన మాజీ వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్ ఆదేశాన్ని కొట్టిపారేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఇంతవరకు విశ్వవిద్యాలయం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
గత ఏడాది అక్టోబరు 28న ఢిల్లీ హైకోర్టు ఆ ఆదేశాన్ని కొట్టేసింది.
“ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. అంతేకాకుండా, అంతర్గత పాలనతో నడిచేలా ఆ సంఘాన్ని కొనసాగించే హక్కును కూడా కల్పించింది” సుప్రీం కోర్టు పూర్వపు తీర్పును ఉటంకిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(4) షరతులను సంతృప్తి పరచనిదే, సంఘం కూర్పులో ఏ చట్టమైనా లేదా జోక్యం చేసుకునే చర్యలైనా ఆర్టికల్ 19(1)(సీ) కింద అసమర్థమైనవి, అర్థం లేనివి అని హైకోర్టు స్పష్టం చేసింది.
విశ్వవిద్యాలయం చట్టబద్ధమైన ఏ అధికారం కింద కూడా జేటీఏ ఏర్పాటుకు అధికారిక గుర్తింపు లేదా నమోదు కాలేదని విశ్వవిద్యాలయ పరిపాలన వాదిస్తోంది.
జామియా మిలియా ఇస్లామియా చట్టం, 1988లోని సెక్షన్ 23(జే) “విద్యార్థి సంఘం లేదా ఉపాధ్యాయుల సంఘం, విద్యా సంబంధమైన సిబ్బంది లేదా ఇతర ఉద్యోగులు” సంఘాన్ని స్థాపించి గుర్తింపును కల్పించేందుకు విశ్వవిద్యాలయం అనుమతిస్తుందని చెబుతోంది.
సంఘాలను స్థాపించడం, గుర్తింపునివ్వడం, నియంత్రించడం, అవసరమైతే రద్దు చేసే అధికారం కూడా విశ్వవిద్యాలయానికి ఉందని వాదించింది.
జేటీఏ సభ్యత్వంలో సభ్యులు జామియా మిలియా ఇస్లామియాలో ఉపాధ్యాయుడిగా ఉండాలి. కాబట్టి సంఘం పనితీరును నియంత్రించే, అవసరమైతే పునర్నిర్మాణం లేదా రద్దు చేసే అధికారం విశ్వవిద్యాలయానికి ఉంది.
సంస్థాగత క్రమశిక్షణ, చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ఉండటం కోసమే వీసీ నజ్మా అక్తర్ అలాంటి చర్యలు తీసుకున్నారని విశ్వవిద్యాలయం పేర్కొంది.
జామియా వాదనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించి, ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. “వాక్ స్వాతంత్ర్యపు హక్కు, మత స్వేచ్ఛ హక్కు లేదా సంఘ స్వేచ్ఛా హక్కు వంటి ప్రాథమిక హక్కుల అమలుపై.. పరిపాలనాపరమైన లేదా కార్యవర్గ అధికారం తమకుందని భావించి ఆ ప్రక్రియను ఇష్టానుసారంగా నిలిపివేయడం కుదరదని” కోర్టు తేల్చి చెప్పింది.
జామియా ఉపాధ్యాయ సంఘాన్ని జేఎంఐ ఎందుకు రద్దు చేసింది?
జామియా ఉపాధ్యాయుల సంఘం 1967లో ఏర్పాటైంది. ఇది విశ్వవిద్యాలయానికి చెందిన ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి గల సంఘం.
సభ్యులు ఎన్నుకున్న కార్యవర్గ కమిటీ (ఈసీ) ద్వారా నియంత్రించే స్వీయ రాజ్యాంగ పాలనతో పనిచేస్తుంది. ఈసీ ఎన్నికల గడువు 2020లో ముగిసినా నవంబరు 25, 2022 నాటి వరకు కొనసాగింది.
తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ అక్టోబరు 19, 2022న తీర్మానాన్ని ఆమోదించింది. జామియా మిలియా ఇస్లామియాలో స్పానిష్, లాటిన్ అమెరికన్ స్టడీస్ కేంద్రం వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ప్రొఫెసర్ సోన్యా గుప్తాను ఎన్నికల అధికారిగా ఉండి ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది.
ఎన్నికల తేదీని నవంబరు 23, 2022గా ప్రకటించి ఆమె నోటిఫికేషన్ జారీ చేశారు. పరిపాలనా విభాగానికి ఈ సమాచారాన్ని తెలియజేశారు.
ఎన్నికల అధికారిగా సోన్యా గుప్తా నియామకం అక్రమమని ఆరోపిస్తూ విశ్వవిద్యాలయం పరిపాలనా విభాగం నవంబరు 2022లో షోకాజ్ నోటీసును జారీ చేసింది.
నవంబరు 17-18వ తేదీల్లో జారీ చేసిన ఆదేశాలతో ఎన్నికలు పెండింగ్‌లో పడ్డాయి, జేటీఏ రద్దైంది, దాని కార్యాలయాన్ని సీల్ చేశారు. ఆ ప్రాంగణాన్ని ఉపయోగించుకోకుండా ఆఫీస్ బేరర్లను పరిమితం చేశారు.
సంఘం ఆర్థిక వ్యవహారాలపై, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా, సభ్యులు పాల్గొనకుండా కట్టడి చేశారు.
సోన్యా గుప్తాను 20 మాసాల పాటు సస్పెండ్ చేశారు. జేటీఏ పరిపాలనాపరమైన అవకతవకలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడం, వాటిని పరిష్కరించడం అప్పటి వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్‌కు ఇష్టం లేదని అనేక మంది వాదిస్తున్నారు.
ఉపాధ్యాయులకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా జేటీఏను పునరుద్ధరించలేదు.
జేటీఏ పనిచేస్తున్నట్లయితే ఇటీవల పరిపాలనా విభాగానికి, విద్యార్థులకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నివారించి ఉండేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
మధ్యవర్తిత్వం కోసం ఒక కీలక వేదిక కనబడటంలేదు
“జామియా ఉపాధ్యాయుల సంఘం ఒక వేదికగా అందుబాటులో ఉండి ఉంటే, విద్యార్థులకు, పరిపాలనా విభాగానికి మధ్య మధ్యవర్తి పాత్రను పోషించి ఉండేది” అని ప్రొఫెసర్ సోన్యా గుప్తా అన్నారు. ఆమె రిటైర్ అయ్యారు.
“మధ్యవర్తిత్వానికి ఒక కీలక ఫోరం లేకుండా పోయింది. దాని గురించి తాను బాధపడుతున్నాను. ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అది ప్రతి ఒక్కరినీ చిక్కుముడి విప్పడం నుంచి కాపాడి ఉండేదేమో” అని ఆమె చెప్పారు.
తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడానికి ఒక వేదిక ఉండరాదనే ఆలోచనతోనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విశ్వవిద్యాలయ పరిపాలనా విభాగం జాప్యం చేస్తోందని ప్రస్తుత, మాజీ ఫ్యాకల్టీ సభ్యులు భావిస్తున్నారు.
“జేటీఏను పరిపాలనా విభాగం ఏకపక్షంగా రద్దు చేసింది. ఇంతవరకు జరగని ఉపాధ్యాయ సంఘం ఎన్నికల కోసం ఎన్నికల అధికారిగా అంగీకరించిన కారణంగా ఒక సీనియర్ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఒకసారి నేను గాంధీజీ-పాలస్తీనాపై చర్చ పెట్టుకుందామంటే, పరిపాలనా విభాగం నుంచి అభ్యంతరాలు వస్తాయని భావించి దాన్ని వెంటనే మూసివేశారు. ఫ్యాకల్టీ స్వీయ సెన్సార్షిప్ పరిపాలనకు అనుకూలంగా మారుతోంది” అని చరిత్ర-సాంస్కృతిక విభాగం నుంచి ఇటీవల పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ గోపీనాథ్ రవీంద్రన్ చెప్పారు.
పరిపాలనకు కొమ్ము కాస్తున్న ఫ్యాకల్టీ గొంతుక
ఫ్యాకల్టీ గొంతుకను వైస్ ఛాన్సలర్ కార్యాలయం, పరిపాలనా విభాగం తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
“ఉపాధ్యాయుల మద్దతు అన్నది కేవలం ఊహకే పరిమితమైపోయింది. తమ కుర్చీల్లో కొనసాగాలంటే పరిపాలనా విభాగానికి మద్దతుగా విభాగాధిపతులు, డైరెక్టర్లు, డీన్లు ప్రకటనలతో ‘సర్దుబాటు’ చేసుకుంటున్నారు” అని అక్టోబరు 27వ తేదీన విశ్వవిద్యాలయం ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసిన పత్రికా ప్రకటనను ప్రస్తావిస్తూ ప్రొఫెసర్ గోపీనాథ్ రవీంద్రన్ తెలిపారు.
“రాజకీయ జోక్యం, క్యాంపస్‌ను అస్థిరపరచడానికి ‘బయటివారి’ ప్రయత్నాలను జేఎంఐ ఉపాధ్యాయులు ఖండిస్తున్నారనే” శీర్షికతో ఆ పత్రికా ప్రకటన ఉంది.
విద్యార్థులకు సంబంధించి రెండు దశాబ్దాల పాత అంశాన్ని పరిష్కరించడానికి పరిపాలనా విభాగం “ఆదర్శప్రాయమైన ప్రయత్నం” చేస్తున్నప్పటికీ, “బయటి శక్తులు, నటులు” విశ్వవిద్యాలయ అంశాన్ని “పెద్ద రాజకీయ ఘర్షణగా” మార్చడం, ఇతర పరిణామాల పట్ల ఉపాధ్యాయులు “నిరుత్సాహానికి” గురవుతున్నారని ఆ ప్రకటన ప్రస్తావించింది.
విద్యార్థుల పోరాట సందర్భంగా “కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ జామియా మిలియా ఇస్లామియా” పేరుతో జారీ చేసిన ప్రకటనల ద్వారా “విద్యార్థులు-ఫ్యాకల్టీ మధ్య గొడవలు సృష్టించడానికి” పరిపాలనా విభాగం ప్రయత్నిస్తోందని ఆరోపించినట్లు అక్టోబరు 27న విడుదల చేసిన పత్రికా ప్రకటన ఒక ఉదాహరణగా తెలియజేస్తోంది.
“జేటీఏను పునరుద్ధరించాలని బలవంతంగా డిమాండ్ చేసే సమయం ఉపాధ్యాయులకు ఆసన్నమైంది. లేకపోతే జామియా టీచర్ల అభిప్రాయాన్ని పరిపాలనా విభాగం గొంతుకగా తప్పుదోవ పట్టించవచ్చు” అని గోపీనాథ్ హెచ్చరించారు.
“ఏమైనప్పటికీ మేధావులు పరిపాలనా ఉపకరణం నుంచి కచ్చితంగా విమర్శనాత్మక దూరాన్ని పాటించాలి” అని ఆయన అన్నారు.
“పరిపాలనా విభాగం చేస్తున్న ఇలాంటి ఆలోచనలను చూసినప్పుడు, టీచర్లు బాధపడుతున్నారని అంటున్నప్పుడు.. మా గొంతుకకు మరింత పదును పెట్టాలి” అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో ఫ్యాకల్టీ సభ్యుడు అన్నారు.
గత నెలలో విద్యార్థుల నిరాహార దీక్ష కొనసాగుతుండగా, విద్యార్థులకు-పరిపాలనా విభాగానికి మధ్య చర్చల ప్రయత్నం జరిగింది.
మాజీ ప్రొఫెసర్ సయ్యద్ ఇనాయత్ అలీ జైదీతో ‘ది వైర్’ మాట్లాడింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జేటీఏను పరిపాలనా విభాగం పునరుద్ధరించలేదు. అలాంటప్పుడు పరిపాలనా విభాగం ఇస్తున్న హామీలపై తమ వర్గం ఎలా ఆధారపడగలదనే “అనుమానాలు” విద్యార్థుల్లో ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు.
“ప్రస్తుతం ఎన్నుకున్న సభ్యులకు జేటీఏ కార్యాలయం తాళాలు అందజేయడానికి బదులుగా పరిపాలనా విభాగం అడ్డంకులను సృష్టిస్తోంది” అని జైదీ విమర్శించారు.
విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ఒక గడువును కల్పించినప్పటికీ, క్యాంపస్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు ముందుగా క్షేత్ర స్థాయిలో అనేక చర్యలను జామియా పరిపాలన తీసుకోవాల్సి ఉంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
