Mass People's Movements Surge in Europe (Illustration)
గ్రీస్ నుంచి ఫ్రాన్స్ వరకు కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ మానిఫెస్టో లో యూరప్ ను నేడు ఒక భూతం ఆవరించిందని చెప్పినట్లు నేడు యూరప్ ఉద్యమాల సుడిగుండంలో ఉందని తాజా పరిణామా లు తెలియజేస్తున్నాయి.
యూరప్‌ను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల ఖండంగా, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణా లు, సామాజిక భద్రత, ఆరోగ్య సదుపాయాలు, నిరుద్యోగ భృతి, కార్మిక హక్కులు ఉన్న ప్రాంతంగా పరిగణిస్తాం. అయితే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఉన్నంత మాత్రాన అక్కడి ప్రజలందరు సుఖంగా ఉన్నారని, ఉన్నత జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారని అనుకుంటే పొరపాటు.
ఫ్రాన్స్ విద్యార్థి ఉద్యమం:
ఫ్రాన్స్ లో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమం క్రమంగా ఫ్రాన్స్ సాధారణ ప్రజల ఉద్యమంగా మారింది. ఉదృత మవుతున్న ఆందోళనలు, ప్రభుత్వ నిర్బంధంతో అట్టుడుకి పోతున్నది. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉద్యమాన్ని ఆపలేక పోయింది. ఇప్పుడు కార్మికులు, ఉపాధ్యాయులు తదితర తరగతుల వారు కూడా ప్రత్యక్షంగా రోడ్ల పైకి వచ్చారు. నవంబర్ 5వ తేదీన కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. ఈ సమ్మెలో, ప్రదర్శనలలో లక్షలాది మంది పాల్గొన్నారు.
ప్రజా ఆందోళనలు గ్రీస్, స్పెయిన్, ఇటలీ, బెల్జియం, పోర్చుగీస్,డెన్మార్క్, అల్బేనియా దేశాలకు దావానలంలా పాకాయి. ప్రజా ఆందోళనలు, సమ్మెలు, రైతుల నిరసనలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్న వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి.
యూరప్ లోని సామాన్య ప్రజలు దేని కోసం పోరాడుతున్నారు?
యూరప్ లోని వివిధ దేశాల ప్రజల సమస్యలు ఒకే రకమైనవా? లేక ప్రతి దేశంలో పరిస్థితు లు వేర్వేరుగా ఉన్నాయా? అనే సందేహం వస్తుంది. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల శుభ్రత, సంఖ్యకు మించి తరగతి గదిలో విద్యార్ధులు, ధరల పెరుగుదల, స్వంత ఇంటి కల నెరవేరక పోవడం, భరించలేని ఇంటి అద్దెలు, కొనగోలు శక్తి పడిపోవడం, తాత్కాలిక ఉద్యోగాలు, తగిన వేతనాలు లేక పోవడం, ఉద్యోగ భద్రత, పెన్షన్లు, ఉపాధి,కార్మిక హక్కులు, వ్యవసాయ సంక్షోభం ప్రధాన సమస్యలుగా ముందు కొచ్చాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే ఈ సమస్యలకు మూలం.
యూరప్‌లో ప్రస్తుత ఆందోళనల స్వరూపం:
యూరప్ లో జీవన వ్యయం, గృహాల అద్దెలు, విద్య, ప్రభుత్వ సేవలు, వేతనాలు, అవినీతి వంటి అంశాలపై నిరసనలు విస్తరించినట్లు 2026 అక్టోబర్ 19 నుంచి 24 మధ్య వెలువడిన అంతర్జాతీయ వార్తలు తెలియజేస్తున్నాయి.
ఫ్రాన్స్-విద్య, జీవన వ్యయం, ప్రభుత్వ సేవలు:
ఫ్రాన్స్‌లో 2026 సెప్టెంబరులో పాఠశాలల్లో అధిక విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల కొరత, విద్యా వనరుల సమస్యలపై విద్యార్థుల ఆందోళనలు మొదలైనాయి. ఆ తర్వాత జీవన వ్యయం, ఇంధన ధరలు, ప్రజా సేవలపై అసంతృప్తి కూడా తోడై దేశవ్యాపిత ప్రజా ఉద్యమంగా మారింది. ఇది ఒక రోజు, ఒక సంవత్సరంలో వచ్చినది కాదు. గత 10 సంవత్సరాలుగా విద్యకు(తరగతి గదులు, మరుగు దొడ్లు, వేడి/చలిని తట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు వంటి) మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకం, తదితర అంశాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆర్థిక పరిమితుల ముసుగులో ప్రభుత్వం విద్య, సంక్షేమ సేవలను తగ్గిస్తే దాని భారం మొత్తం ప్రజానీకంపై పడింది. కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు కలిసి పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. ఈ సందర్భంగా ఘర్షణలు, విధ్వంసం, అరెస్టులు జరిగాయి.
స్పెయిన్-గృహ సంక్షోభం, అధిక అద్దెలు, తక్కువ వేతనాలు:
స్పెయిన్‌లో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అద్దె ఇళ్ల కొరత, అధిక గృహ ఖర్చులు, తాత్కాలిక ఉపాధి, తక్కువ వేతనాలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం ఉద్పాదక రంగాన్ని(మాన్యుఫాక్టరీ) నిర్వీర్యం చేసి టూరిజంపై పూర్తయిగా కేంద్రీకరించింది. ఈ రంగంలో భారీ వ్యాపార సంస్థలు వచ్చి ఇళ్ల కొరతను అనూహ్యంగా పెంచాయి. పర్యాటకం, సేవల రంగాల్లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ, అవి తాత్కాలిక మైనవి లేదా తక్కువ వేతనంతో కూడినవి. ఉద్యోగం ఉన్నా స్వతంత్రంగా ఇల్లు అద్దెకు తీసుకుని జీవించడం యువతకు కష్టంగా మారింది. ఉద్యోగం సంపాదించిన యువకుడు తన కొద్దిపాటి ఆదాయంతో ఇల్లు, ఆహారం, రవాణా ఖర్చులను భరించడం దుర్లభంగా మారింది. గృహ నిర్మాణం, సరసమైన అద్దె ఇళ్లు, వేతనాల పెంపు, ఉపాధి స్థిరత్వం స్పెయిన్ లో ప్రధాన సమస్యలుగా ముందుకొచ్చాయి. ఇంటి సమస్య పరిష్కారం నెపంతో ప్రభుత్వం రెండు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ శక్తులు ఆ బిల్లులను ఓడించాయి. దాంతో ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ యూనియన్ ప్రభుత్వ వర్గాలు, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ శక్తులు ఆడుతున్న నాటకాలను ప్రజల ముందు ఎండగట్టింది. ప్రజా సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ CCOO, UGT యూనియన్లు నవంబర్ 11వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఇటలీ-వేతనాలు, ఆరోగ్యం, విద్య, ఉపాధి:
ఇటలీలో జీవన వ్యయం, కొనుగోలు శక్తి, ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి, గృహ వసతి వంటి సమస్యలపై ఆందోళనలు జరిగాయి. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ సంఘమైన USB అక్టోబర్ 30న దేశ వ్యాపిత సమ్మెకు పిలుపు నిచ్చింది. అన్ని తరగతుల ప్రజలు పెద్ద ఎత్తున సమ్మెకు మద్దతు తెలియజేశారు. దేశంలోని అన్ని నగరాలలో వేలాదిమంది ప్రదర్శనలలో పాల్గొన్నారు.
ఇటలీ వాస్తవ వేతనాల పెరుగుదల నామమాత్రంగా ఉంది. ధరల మార్పును పరిగణనలోకి తీసుకున్న తర్వాత సగటు పూర్తి-కాల వేతనం 2000–2025 మధ్య దాదాపు 5 శాతం తగ్గిందని అల్‌జజీరా వార్తా సంస్థ 2026 అక్టోబర్ 19న ప్రచురించింది. ప్రజలు కోరుతున్నది కేవలం ఉద్యోగాలు కాదు. జీవన ఖర్చులను భరించగల వేతనాలు, అందుబాటులో ఉండే వైద్యం, నాణ్యమైన విద్య కూడా.
బెల్జియం-విద్యా ఖర్చులు, జీవన వ్యయం, కార్మికుల అసంతృప్తి:
బెల్జియంలో విద్యార్థుల నిరసనలు, జీవన వ్యయంపై ఆందోళనలు చెలరేగాయి. దేశ రాజధాని బ్రస్సెల్స్, లీజ్ వంటి నగరాల్లో జరిగిన ఆందోళనల సందర్భంగా పోలీసులతో ఘర్షణలు, రహదారుల దిగ్బంధాలు, అరెస్టులు జరిగాయి. విద్యకు అయ్యే ఖర్చు, కుటుంబాలపై పెరుగుతున్న రోజువారీ వ్యయం, కొనుగోలు శక్తి, ప్రభుత్వ సేవల నాణ్యత లోపం వంటి సమస్యలు ఆందోళనలకు కారణమయ్యాయి.
గ్రీస్-ఆర్థిక సంక్షోభం, జీవన వ్యయం, ప్రజా సేవలు:
గ్రీస్ దేశాన్ని గత దశాబ్ద కాలంగా రుణ సంక్షోభం వెంటాడుతున్నది. పొదుపు చర్యలు, వేతనాలు, పెన్షన్లపై ఒత్తిడి వంటి అంశాలు ప్రధానంగా ముందుకొచ్చాయి. ఫలితంగా గ్రీస్‌లోనూ యువత విద్య, జీవన వ్యయ సమస్యలపై ఆందోళనలకు దిగారు. గత సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా ఆ అభివృద్ధి సామాన్య కుటుంబాల ఆదాయాల్లో లేదు.
అల్బేనియా-అవినీతి, పాలనపై అసంతృప్తి, జీవన వ్యయం:
అల్బేనియా లోని తిరానా సహా ప్రాంతాల్లో ప్రభుత్వ పాలన, అవినీతి ఆరోపణలు, ప్రజా ప్రయోజనాలలో కోతలు, ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా లేకపోవడం, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రయోజనాలు ప్రజలకు అందకపోవడం వంటి అంశాలపై ప్రజలలో ఆగ్రహ జ్వాలలు వెల్లు వెత్తాయి.
సెర్బియా:
సెర్బియా ఆగ్నేయ ఐరోపాలో లోని బాల్కన్ ప్రాంత దేశం. ఒకప్పటి యుగోస్లోవియా లో భాగం. యుగోస్లోవియా విచ్ఛిన్నం తర్వాత అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. 2024 నవంబర్ నోవిసాద్ నగరంలోని రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది మరణించారు. దానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ప్రభుత్వ అవినీతి, అధిక ధరలు, నిరుద్యోగం, విద్యా వసతులు, ప్రజాస్వామ్య హక్కులు తోడై దేశ వ్యాపిత ప్రజా ఉద్యమంగా మారింది. యువకులు ముందు పీఠిన ఉన్నారు. అన్ని తరగతుల ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. చివరకు 2026 అక్టోబర్ 25 న ముందస్తు ఎన్నికలు జరిగాయి. 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉచిచ్ కూటమిని కొత్తగా ఏర్పడిన “స్టూడెంట్ లిస్ట్” చిత్తుగా ఓడించింది. 250 స్థానాలున్న పార్లమెంట్ లో 140 స్థానాలలో విజయ ఢంకా మోగించింది.
ఈ దేశాలన్నింటిలో వ్యక్తం అయిన సమస్యలు:
మొత్తంగా యూరప్ లో ప్రజా ఉద్యమాలకు ధరల పెరుగుదల, కొనుగోలు శక్తి, గృహ ఖర్చులు, తరుగుతున్న ప్రజా సేవలు, ఆదాయాలు-ఖర్చుల మధ్య పెరుగుతున్న అంతరం ప్రధాన కారణాలు. 2026 అక్టోబర్ 19న అల్‌జజీరా ప్రచురించిన గణాంక విశ్లేషణలో 2000 నుంచి ధరల మార్పులను పోల్చారు. యూరోస్టాట్ వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆహారం, ఇంధనం, రవాణా, సేవల ధరల స్పెయిన్ లో 78%, పోర్చుగల్ లో 71%, ఇటలీ లో 68%, ఫ్రాన్స్59% పెరిగాయి.
ఈ గణాంకాల ఏమి తెలియజేస్తున్నాయి?
ధరలు 60–80 శాతం పెరిగితే సాధారణ వ్యక్తి ఆదాయం అదే స్థాయిలో పెరగ లేదు. తప్పుడు లెక్కలతో ద్రవ్యోల్బణం తగ్గిందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, పెరిగిన ధరలు మళ్లీ పాత స్థాయికి తగ్గలేదు. ధరలు విపరీతంగా పేరుగుతుంటే వేతనాలు నామమాత్రంగా పెరిగితే, ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కూడా గతంతో పోలిస్తే తక్కువ సరుకులనే కొంటాడు. ఇంటి అద్దె, విద్య, ఆరోగ్యం వంటి ఖర్చులు ఎక్కువైతే మిగులు లేకపోగా అప్పులు చేయాల్సి వస్తున్నది. అందువల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ధరలు పెరగడం, గౌరవప్రదంగా జీవించడానికి సరిపడే ఆదాయాలు లేకపోవడం అన్ని దేశాలలో ప్రధాన సమస్యగా ఉంది.
సైనిక వ్యయం పెరుగుదల:
2025లో యూరప్ మొత్తం సైనిక వ్యయం సుమారు 864 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2025లో సైనిక వ్యయ పరిమాణం ప్రకారం ప్రధాన దేశాలైన జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. Stockholm International Peace Research Institute (SIPRI) డేటా ఆధారంగా దేశాలవారీ జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌ల సైనిక వ్యయం పదుల బిలియన్ల డాలర్ల స్థాయిలో ఉంది.
కార్పొరేట్ లకు రాయితీలు:
మొత్తం పెట్టుబడి దారి దేశాలన్నిటిలో పన్నుల తగ్గింపు తదితర రూపాలలో ప్రభుత్వాలు కార్పొరేట్ లకు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. ఒక వైపున కార్పొరేట్ లకు రాయితీలు ఇస్తూ మరొక వైపున సైనిక వ్యయం విపరీతంగా పెంచుతున్నారు. ప్రజా ప్రయోజనాలకు మాత్రం నిధుల కొరత పేర కోతలు పెడుతున్నారు.
యువత వీధుల్లోకి వస్తోంది?
యూరప్ లోని తాజా నిరసనల్లో యువత పాత్ర కీలకంగా ఉంది. దీనికి నాలుగు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1)ఉపాధి లేకపోవడం, ఉన్నా ఆర్థిక స్వతంత్రత లేకపోవడం. తాత్కాలిక ఉద్యోగాలు, తక్కువ వేతనాలు, స్థిరమైన కెరీర్ అవకాశాల కొరత యువత భవిష్యత్తుపై ఆందోళన పెంచుతున్నాయి. 2)ఇళ్ల అద్దెల భారం. ప్రధాన నగరాల్లో అద్దె చెల్లించిన తర్వాత ఆహారం, రవాణా, ఇతర అవసరాలకు తగిన డబ్బు మిగలక పోవడం యువతకు తీవ్రమైన సమస్యగా మారింది. 3)విద్యా వ్యవస్థపై అసంతృప్తి. తరగతి గదుల్లో రద్దీ, ఉపాధ్యాయుల కొరత, విద్యా వసతుల లోపం, ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులు పెరగడం. 4)భవిష్యత్తుపై నమ్మకం తగ్గడం. తమ తల్లిదండ్రుల తరం కంటే మెరుగైన జీవితం పొందుతామనే ఆశ యువతలో నీరుగారు తున్నట్లు తాజా వార్తలు సూచిస్తున్నాయి.
ప్రభుత్వాలు, పోలీసుల స్పందన-ప్రజాస్వామ్య హక్కులు:
యూరప్‌లో జరిగిన నిరసనల సందర్భంగా కొన్ని చోట్ల పోలీసులతో ఘర్షణలు, అరెస్టులు, దుకాణాలు, ఆస్తుల ధ్వంసం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో అక్టోబర్ 17న జరిగిన ఆందోళనల తర్వాత భద్రతా చర్యలు పెంచినట్లు Reuters నివేదిక పేర్కొంది. శాంతియుత నిరసన, సమ్మె, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన హక్కులు. అయితే హింస, దహనం, దోపిడీ, వ్యక్తులపై దాడులు వంటి చర్యలు శాంతియుత నిరసన హక్కుకాదు. అదే సమయంలో, కొందరు వ్యక్తులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారనే కారణంతో మొత్తం ఉద్యమాన్ని హింసాత్మకంగా ముద్ర వేయడం కూడా తప్పు. నిరసన కారుల డిమాండ్లు, జరిగిన సంఘటనలు, పోలీసుల చర్యలు ప్రతి అంశాన్ని విడిగా పరిశీలించాలి. నిరసన కారులను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభుత్వమే పోలీసుల దుస్తుల్లో సంఘ విద్రోహ శక్తులను ఉసిగొల్పి హింసాత్మక ఘటనలకు ప్రేరేపించిందనే ఆరోపణలు కూడా వచ్చాయి; అయితే అవి ఇంకా నిర్ధారణ కాలేదు.
భారతదేశ పరిస్థితులు:
యూరప్ ప్రజల సమస్యలు భారతదేశంలో కార్మికులు, రైతులు, యువత, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకే విధంగా ఉన్నాయి. రెండు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలు, సంక్షేమ పథకాలు, వేతన స్థాయులు, ప్రభుత్వ నిర్మాణాలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే ఈ అన్నీ చోట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, భద్రత, సరైన వేతనాలు లేని తాత్కాలిక ఉపాధి, స్వంత ఇంటి కల, ఇంటి అద్దె ధరలు, విద్య, వైద్యం, పెన్షన్లు, ప్రజాస్వామ్య హక్కులు వంటి సమస్యలు ప్రజలలో తీవ్ర అసంతృప్తి, ఆందోళనలకు దారి తీస్తున్నాయి.
అభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో మెరుగుదల:
ఒక దేశ ఆర్ధిక అభివృధ్ధి ఎంత గొప్పగా ఉన్నా ఆ దేశంలోని ప్రజలందరూ ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నారని అర్ధం కాదు అని వివిధ దేశాలలో జరుగుతున్న ఆందోళనలు రుజువు చేస్తున్నాయి. ఒక వైపు ఆధునిక పరిశ్రమలు, సాంకేతిక అభివృద్ధి, అధిక ఉత్పాదకత, అంతర్జాతీయ వాణిజ్యం ఉంటే, సంపద కొద్ది మంది చేతిలో కేంద్రీకరించడం, మరో వైపు యువతకు అందుబాటులో లేని ఇళ్లు, న్యాయ బద్ధమైన వేతనాలు లేని ఉద్యోగాలు, విద్యా వసతుల కొరత, ప్రజా సేవల నిధుల కోత ఉన్నాయని అనుభవం రుజువు చేస్తున్నది.
ప్రజల జీవితాలను మెరుగు పరచని ఆర్థిక అభివృద్ధి, సామాజిక అసంతృప్తిని ఎంతోకాలం అణచి పెట్టలేదు. యూరప్‌లోని ఆందోళనలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. ప్రభుత్వాలు ఆర్థిక వృద్ధితో పాటు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సరసమైన గృహ వసతి, నాణ్యమైన విద్య, వైద్యం, సామాజిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగలిగితేనే అభివృద్ధి ఫలితాలు విస్తృత ప్రజానీకానికి అందుతాయి.
యూరప్ దేశాల ఎన్నికలు-ప్రజల తీర్పు:
ప్రజా సమస్యలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ప్రజలలో నెలకొన్న అసంతృప్తి గత ఐదు సంవత్సరాల్లో యూరప్‌లోని అనేక దేశాల్లో అధికార మార్పులు, కొత్త పార్టీల ఎదుగుదల, పాలక పార్టీల బలం తగ్గడం, సంప్రదాయ పార్టీలకు సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని దేశాల్లో వలస విధానాలు, జాతీయ గుర్తింపు, భద్రత, జీవన వ్యయం వంటి అంశాలను ముందుకు తెచ్చిన ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీల బలం పెరిగింది. ఇంకొన్ని దేశాల్లో వామపక్ష కూటములు లేదా కొత్త రాజకీయ శక్తులు బలం పుంజుకున్నాయి.
జర్మనీ:
ఫెడరల్ పార్లమెంటు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగాయి. వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలు. CDU/CSU: 28.5%, SPD: 16.4% (ఈ మూడు పార్టీలు అధికార కూటమి), AfD(ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ. స్వయంగా ఎలాన్ మస్క్ మద్దత్తు ఇచ్చిన పార్టీ) 20.8%, గ్రీన్స్: 11.6%, Die Linke(వామ పక్ష పార్టీ): 8.8%. 2021లో AfDకి 10.4% ఓట్లు రాగా, 2025లో 20.8% వచ్చాయి. SPD ఓట్ల శాతం 25.7% నుంచి 16.4%కు తగ్గింది. ఓటింగ్‌లో పాల్గొన్నవారి శాతం 82.5%కు చేరింది.
యునైటెడ్ కింగ్డమ్:
హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికలు జూలై 2024 లో జరిగాయి. లేబర్ పార్టీ 411 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు, లిబరల్ డెమోక్రాట్లు 72 సీట్లు, రిఫార్మ్ UK 5 సీట్లు(ఇది కూడా ఎలాన్ మస్క్ మద్దతు నిచ్చిన ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ). లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కన్జర్వేటివ్ పార్టీ 2019లో గెలుచుకున్న 365 సీట్ల నుంచి 121కు పడిపోయింది. జీవన వ్యయం, ఆర్థిక వ్యవస్థ, వలసలు, పన్నులు, ప్రభుత్వ ఆరోగ్య సేవలపై అసంతృప్తి ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించాయి. భారత మూలాలున్న ఋషి సునాక్ బ్రిటిష్ ప్రధాని అయ్యాడాని మొత్తం భారతీయ మీడియా ఊదర గొట్టిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాభవం పొందింది.
ఇటీవలి స్థానిక ఎన్నికల్లో రిఫార్మ్ UK (ఎలాన్ మస్క్ మద్దతు నిచ్చిన ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ) భారీ విజయాలను సాధించింది.
ఫ్రాన్స్:
ఫ్రాన్స్ పార్లమెంట్ కు 2024 జూన్, జూలై నెలలలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. జీవన వ్యయం, పెన్షన్లు, కనీస వేతనాలు, వలస విధానాలు ఈ ఎన్నికలలో ప్రధాన అంశాలుగా ముందుకొచ్చాయి. వామపక్ష న్యూ పాప్యులర్ ఫ్రంట్ సుమారు 180 సీట్లు గెలుచుకొని ప్రధమ స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు మాక్రాన్ పార్టీ కూటమి సుమారు 160 సీట్లలో గెలిచింది. నేషనల్ ర్యాలీ (ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ) ఒక్కటే 125 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
నేషనల్ ర్యాలీ యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లో ముందంజలో నిలిచిన తర్వాత అధ్యక్షుడు మాక్రాన్ ముందస్తు ఎన్నికలు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ బాగా పుంజుకోవడంతో ఫ్రాన్స్ లో వామపక్షాలన్నీ ఒకే వేదికగా ఎన్నికల్లో పాల్గొని ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ దూకుడుకు కళ్ళెం వేశాయి. వామపక్షాలు, మధ్యే వాదులు, రైట్ వింగ్ పార్టీ మధ్య విభజన స్పష్టంగా కనిపించింది. వామ పక్ష కూటమి అతి పెద్ద కూటమిగా అవతరించి నప్పటికి అధ్యక్షుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు.
ఇటలీ:
పార్లమెంటు ఎన్నికలు సెప్టెంబర్ 2022 లో జరిగాయి. జార్జియా మెలోని (నియంత ముస్సోలినీ వారసురాలు) నేతృత్వంలోని సెంటర్ రైట్ వింగ్ కూటమి రెండు పార్లమెంటు సభల్లో మెజారిటీ సాధించింది. ప్రతినిధుల సభలో కూటమికి 237 సీట్లు లభించాయి. కోవిడ్ అనంతర ఆర్థిక పరిస్థితులు, ఇంధన సంక్షోభం, జీవన వ్యయం, యూరోపియన్ యూనియన్ నిధుల వినియోగం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రాధాన్యం పొందాయి. ఈ ఫలితం ఇటలీలో సంప్రదాయ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ రాజకీయ శక్తుల ఎదుగుదలను సూచించింది.
స్పెయిన్-:
ప్రతినిధుల సభ ఎన్నికలు జూలై 2023 న జరిగాయి. పీపుల్స్ పార్టీ (PP) 137 సీట్లు, సోషలిస్ట్ పార్టీ (PSOE) 121 సీట్లు, Vox 33 సీట్లు, Sumar 31 సీట్లు సాధించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. తర్వాత సోషలిస్ట్ పార్టీ నేత పెడ్రో సాంచెజ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అత్యధిక సీట్లు గెలిచినా, దానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ రాలేదు. సంకీర్ణాలు, ప్రాంతీయ పార్టీల మద్దతు ప్రాముఖ్యతను ఈ ఎన్నిక చూపించింది. మరలా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి.
పోలాండ్:
పార్లమెంటు ఎన్నికలు అక్టోబర్ 2023 లో జరిగాయి. పాలక లా అండ్ జస్టిస్ పార్టీ (PiS) అత్యధిక ఓట్లు పొందినప్పటికీ, పార్లమెంటులో మెజారిటీని నిల బెట్టుకో లేకపోయింది. సివిక్ కూటమి, థర్డ్ వే, లెఫ్ట్ పార్టీల సహకారంతో డొనాల్డ్ టస్క్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ మార్పు కోసం విభిన్న ప్రతిపక్ష పార్టీలు కలిసి కట్టుగా పనిచేసిన ఉదాహరణ ఇది. న్యాయవ్యవస్థ, యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు, సామాజిక విధానాలు కూడా ఎన్నికల చర్చల్లో భాగమయ్యాయి.
అల్బేనియా:
పార్లమెంటు ఎన్నికలు మే 2025 లో జరిగాయి. ఎడి రామా నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీ 140 స్థానాల పార్లమెంటులో 83 సీట్లు గెలుచుకుని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమికి 50 సీట్లు వచ్చాయి. జీవన ప్రమాణాలు, అవినీతి ఆరోపణలు, యూరోపియన్ యూనియన్ సభ్యత్వ లక్ష్యం ఎన్నికల్లో ముఖ్యమైన అంశాలు. ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షం సందేహాలు వ్యక్తం చేసింది. ఎన్నికల అక్రమాల ఆరోపణలను విచారించాలని EU కోరింది.
హంగరీ:
2022 ఏప్రిల్ 3న జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బాన్ నాయకత్వంలోని ఫిడెజ్ (Fidesz), క్రిస్టియన్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ (KDNP) కూటమి మొత్తం 199 స్థానాల్లో 135 స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించింది.
2026 ఏప్రిల్ 12న జరిగిన ఎన్నికల్లో 199 స్థానాలున్న పార్లమెంటులో టిసా పార్టీ 141 స్థానాలు సాధించింది. అప్పటివరకు అధికారంలో ఉన్న ఫిడెజ్–కేడీఎన్పీ కూటమి ఘోర పరాజయం పొందింది. 135 స్థానాల నుండి 52 స్థానాలకు పడిపోయింది. టిసా పార్టీ నాయకుడు పీటర్ మాగ్యార్ మే 9, 2026న ప్రధాని అయ్యాడు. 16 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న విక్టర్ ఓర్బాన్ జాతీయ వాదం, వలస వ్యతిరేక విధానాలు, సంప్రదాయ సామాజిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చాడు. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేశాడు. పెద్ద నియంతలా వ్యవహరించాడు.
ఆయన పనితీరుపై దేశీయ ప్రతిపక్షాలు, అంతర్జాతీయ సంస్థలు కూడా విమర్శలు చేశాయి. ఫలితంగా ప్రజా ఆగ్రహానికి గురయ్యాడు. రికార్డు స్థాయిలో దాదాపు 80 శాతం ఓట్లు పోల్ అవడం ఈ ఎన్నికల్లో ప్రజల ఆసక్తి, ప్రభుత్వ మార్పు పట్ల ఉన్న ఆకాంక్షకు నిదర్శనం. అదే సమయంలో, కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా అవినీతిని అరికట్టడం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, మీడియా స్వేచ్ఛలను పునరుద్ధ రించడం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రధాన అంశాలు అయినాయి.
జర్మనీ:
2026 సెప్టెంబర్ లో జర్మనీలో కొన్ని రాష్ట్ర శాసనసభల ఎన్నికలు జరిగాయి వీటిలో రెండు రాష్ట్రాలలో ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ అయినా ఏ ఎఫ్ డి మంచి ఫలితాలను సంపాదించింది బెర్లిన్ రాష్ట్రంలో వామపక్షాలు ప్రథమ స్థానంలో నిలిచాయి.
యూరోపియన్ యూనియన్ ఎన్నికలు:
2024 జూన్‌లో జరిగిన యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలు యూరప్ ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడానికి మరో ముఖ్యమైన ఆధారం. యూరోపియన్ పార్లమెంటు అధికారిక ఫలితాల ప్రకారం, మొత్తం 720 స్థానాల్లో మధ్య-కుడి పక్ష క్రైస్తవ ప్రజాస్వామ్యవాదులు (EPP) 188 స్థానాలు (26.1% సీట్లు), సామాజిక ప్రజాస్వామ్యవాదులు (S&D) 136 స్థానాలు (18.9% సీట్లు), Patriots for Europe 84 స్థానాలు (11.7% సీట్లు), సంప్రదాయ వాదులు (ECR) 78 స్థానాలు (10.8% సీట్లు), మధ్యే వాదులు (Renew Europe) 77 స్థానాలు (10.7% సీట్లు), పర్యావరణ వాదులు (Greens/EFA) 53 స్థానాలు (7.4% సీట్లు), వామపక్ష కూటమి (The Left) 46 స్థానాలు (6.4% సీట్లు) గెలుచుకున్నాయి. మూలం: యూరోపియన్ పార్లమెంటు, 2024–2029 అధికారిక లెక్కలు.
ఈ ఫలితాలు మూడు అంశాలు తెలియ జేస్తున్నాయి. 1)సంప్రదాయ సెంటర్ రైట్ వింగ్ కూటమి EPP పార్లమెంటులో అతిపెద్ద గ్రూప్ గా నిలిచింది. 2)కొన్ని దేశాల్లో రైట్ వింగ్, జాతీయవాద పార్టీల బలం పెరిగింది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. 3)గ్రీన్స్, మధ్యేవాద Renew Europe వంటి గ్రూప్ లు కొన్ని దేశాల్లో స్థానాలు కోల్పోయాయి. అయితే అన్ని దేశాల్లోనూ పర్యావరణ వాద లేదా వామపక్ష పార్టీల మద్దతు తగ్గిందని చెప్పలేం. ఈ ఎన్నికల్లో మొత్తం EU ఓటింగ్ శాతం సుమారు 51%. అయితే దేశాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
విశ్లేషణ:
సైనిక వ్యయం, ఎన్నికలు, ప్రజా ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి. యూరప్‌లో 2022 తర్వాత రక్షణ వ్యయం వేగంగా పెరిగింది. అదే సమయంలో ఆయా దేశాల్లో జీవన వ్యయం, వేతనాలు, గృహ వసతి, ప్రజా సేవలపై అసంతృప్తి, కార్మిక సంఘాల సమ్మెలు, విద్యార్థుల నిరసనలు, రైతుల ఉద్యమాల ప్రభావం ఎన్నికల్లో వ్యక్తమైంది. కొన్ని దేశాల్లో అధికార పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా పెట్టుబడి దారి విధానం, కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన అన్ని దేశాలలో అధిక ధరలు, నిరుద్యోగం, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడంతో అధికార పార్టీలు/కూటములపై ప్రజలలో ఆగ్రహ జ్వాలలు వెల్లు వెత్తాయి. రైట్ వింగ్ పార్టీలు ఆకర్షణీయ నినాదాలు, మోసపూరిత వాగ్దానాలతో కొన్ని దేశాలలో రాజకీయంగా లబ్ది పొందాయి. ఫ్రాన్స్, బెర్లిన్ లలో వామ పక్షాలు మంచి ఫలితాలు సాధించాయి.
అర్జెంటీనా ఎన్నికల (2021–2025) అనుభవం:
దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో 2021 నవంబరులో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అప్పటి అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండెజ్‌కు చెందిన పెరోనిస్ట్ కూటమి అనేక ప్రాంతాల్లో మద్దతు కోల్పోయింది. ప్రతిపక్ష కూటమి Juntos por el Cambio బలపడింది. ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, పేదరికం, కోవిడ్ అనంతర సమస్యలపై ప్రజల ఆగ్రహానికి ఈ ఎన్నికలు నిదర్శనం. ఈ ఫలితాలు అధికార కూటమిపై ప్రజల్లో అసంతృప్తి పెరుగు తున్నదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
2023 ఎన్నికలు అర్జెంటీనా రాజకీయాల్లో పెద్ద మలుపు. మొదటి విడతలో మాస్సా ముందంజలో ఉన్నప్పటికీ, నవంబర్ 19న జరిగిన రెండో విడతలో మిలే 55.7% ఓట్లతో గెలిచారు. డిసెంబర్ 10, 2023న అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇటలీ జార్జియా మెలోని లాగే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ నేత. గత ప్రభుత్వ కాలంలో ఉన్న అధిక ద్రవ్యోల్బణం, పెసో కరెన్సీ విలువపై ఒత్తిడి పేదరికం, కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గడం, సంప్రదాయ రాజకీయ పార్టీలపై అసంతృప్తి మిలే విజయానికి కారణాలు. దీన్ని రాజకీయ ప్రయోజనం కోసం మిలే వినియోగించు కున్నాడు. ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను పరిమితం చేస్తానని మిలే హామీ ఇచ్చాడు. తనను సంప్రదాయ రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రచారం చేసుకున్నారు. ఆయన ఆర్థిక విధానాల్లో ప్రభుత్వ వ్యయాల కోత, నియంత్రణల సడలింపు, మార్కెట్ ఆధారిత సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చాడు. మిలే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడం, ప్రభుత్వ వ్యయాలను నియంత్రించడం, ఆర్థిక నియంత్రణలను సడలించడం వంటి చర్యలు చేపట్టింది. ఫలితంగా ప్రజలలో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే ఈయన పాలనలో కార్మికవర్గంపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.
బ్రెజిల్ ఇటీవల బ్రెజిల్ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్థి లోల అమెరికా బలపరిచిన ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ పార్టీ నేత లవియో బోల్సనారో ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. బోల్సనారో ను గెలిపించడానికి అమెరికా నానా అకిచాట్లు పడింది అయినా చివరికి వామపక్ష అభ్యర్థి లూల నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఓడిపోయిన బోల్సోనారో కుటుంబంతో కలిసి అమెరికాలోని మయామికి వెళ్లిపోయారు. తాను పారిపోలేదని ఆయన చెప్పగా, ఆయన నిష్క్రమణ రహస్యంగా జరిగిందని లూలా విమర్శించారు.
తాజాగా జరిగిన ఎన్నికలలో ఇజ్రాయిల్ లో బెంజిమన్ నేతన్యహు, అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ లకు ప్రజలు భారీ షాక్ ఇచ్చారు.
సోవియెట్ యూనియన్ పతనం-ప్రపంచ దేశాలపై ప్రభావం:
1989–91 మధ్య తూర్పు యూరప్ లోని సోషలిస్ట్ వ్యవస్థలు పతనం కావడం, 1991 డిసెంబర్లో సోవియెట్ యూనియన్ రద్దు కావడంతో అమెరికా ఏక ఛత్రాధిపత్యం నెలకొంది. ప్రపంచంలో పలు దేశాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల రుణాలపై ఆధార పడ్డాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ సంస్థలు విధించిన షరతులు అమలు జరిపి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలపై భారాలు మోపాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, నిలకడ లేని, ఎలాంటి హక్కులు లేని తాత్కాలిక ఉపాధి సమస్యల విషయ వలయంలో ప్రజలు చిక్కుకున్నారు. ఆర్ధిక సంక్షోభాలు ఒకదాని తర్వాత ఒకటి దేశాలను వెంటాడాయి. సముద్రంలో అలలు ఎంత సహజమో పెట్టుబడి దారి వ్యవస్థలో సంక్షోభాలు, నిరుద్యోగం అంతే సహజం. వీటి నుండి బయట పడే పేరుతో ప్రభుత్వాలు రకరకాల చిట్కాలను ఉపయోగించి కాలం నెట్టు కొచ్చాయి. ఇప్పుడు అలాంటి చిట్కాలు పనిచేసే కాలం దాటి పోయింది. ప్రజా ఉద్యమాలు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున విధుల్లోకి వస్తున్నది. ప్రభుత్వాలు ఆఖరి ఆయుధంగా ప్రజల నోళ్ళు నొక్కి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. అమెరికా, భారత దేశం, ఫ్రాన్స్ లలో నేడు జరుగుతున్నది అదే.
పరిష్కారం:
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల ఆదేశిత ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రత్యామ్నాయంగా ప్రజా నుకూల విధానాల ఆధారంగా వామ పక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలి. ప్రజలలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని నెలకొల్పాలి.
ఐక్య రాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా సామాజిక అభివృద్ధి సూచికలను నిర్ణయించి వాటిని 2030 లోగా అమలు చేయాలని సూచించింది. అందులో అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, సార్వత్రిక ఆరోగ్య వ్యవస్థ, అందరికీ ఉపాధి, సామాజిక సంక్షేమం, వృద్ధుల సంక్షేమం ఉన్నాయి. ఆ లక్ష్యాల సాధనకు ప్రత్యామ్నాయ విధానాలే సరైన, అసలైన పరిష్కారం.
రచయిత: ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
