నిరసనల సమయంలో విద్యాసంస్థల చుట్టూ భద్రతా వలయాలను ఏర్పాటు చేసే ప్రణాళికలను న్యూయార్క్ పోలీస్ విభాగం బహిరంగపరచాలని ఆదేశించే సిటీ కౌన్సిల్ బిల్లును తాను వీటో చేయనున్నట్లు మేయర్ జోహ్రాన్ మమ్దానీ శుక్రవారం తెలిపారు.
తన వీటో సందేశంలో, “ICEకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కార్మికులకు, లేదా శిలాజ ఇంధనాల నుంచి తమ కళాశాలలు పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు, లేదా పాలస్తీనియన్ల హక్కులకు మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్న వారిపై” ఈ బిల్లును అనుచితంగా వర్తింపజేయవచ్చని తాను భావిస్తున్నట్టు మమ్దానీ పేర్కొన్నారు.
“ఈ బిల్లు కేవలం ఒక సంకుచితమైన ప్రజా భద్రతా చర్య కాదు; ఇది ఈ నగరవ్యాప్తంగా కార్మిక ఉద్యమం, ప్రజాహక్కుల సంఘాలు, వలసల హక్కుల కార్యకర్తలు మరియు ఇతరులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఒక చట్టం. దాదాపు డజను యూనియన్లు, తమ సంఘటితమయ్యే సామర్థ్యంపై దీని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకే నేను ఈ చట్టాన్ని వీటో చేస్తున్నాను” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీ హాల్, కౌన్సిల్ మధ్య ఉద్రిక్తతలు..
మేయర్‌గా మమ్దానీ చేసిన మొదటి వీటో ఇది. మేయర్ పదవీకాలం ప్రారంభంలోనే కౌన్సిల్, సిటీ హాల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతకు ఇది మరో సంకేతం. కౌన్సిల్ స్పీకర్, జూలీ మెనిన్, మమ్దానీ వీటోను అధిగమించడానికి అవసరమైనన్ని ఓట్లను సమీకరించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారని ఆమె ప్రణాళికల గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. వీటోను అధిగమించగల మెజారిటీకి నాలుగు ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
“విద్యార్థులు వేధింపులు లేదా బెదిరింపుల భయం లేకుండా తమ పాఠశాలల్లోకి ప్రవేశించి, బయటకు వెళ్లగలరని నిర్ధారించడం వివాదాస్పదం కాకూడదు. అడ్డంకులు లేదా శారీరకంగా గాయపరిచే ముప్పు ఉన్నప్పుడు, మొదటి సవరణ హక్కులను పూర్తిగా పరిరక్షిస్తూనే, సురక్షితమైన ప్రవేశాన్ని ఎలా నిర్ధారిస్తుందో స్పష్టంగా వివరించాలని ఈ బిల్లు కేవలం ఎన్వైపీడీని కోరుతుంది” అని మెనిన్ అన్నారు.
మెనిన్, మమ్దానీకి డెమోక్రాటిక్ ప్రతిఘటనగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఆసక్తిగా కనిపిస్తుండగా, మేయర్ తన ప్రతిపాదిత బడ్జెట్‌పై ఆమె స్పందనను విమర్శిస్తూ ఒక వీడియోను విడుదల చేయడంతో, నగరంలోని ప్రముఖ డెమోక్రాట్ల మధ్య సంబంధాలు ఆందోళనకరంగా మారాయి.
కౌన్సిల్ ఆమోదం అవసరమైన దర్యాప్తు విభాగానికి నాయకత్వం వహించడానికి ఆయన ఎంపిక చేసిన వ్యక్తికి మెనిన్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితులు చక్కబడినట్లు కనిపించాయి. గురువారం సాయంత్రం, రాబోయే వీటోతోపాటు ఇతర విషయాలపై చర్చించడానికి ఇద్దరూ కలిసి విందు చేశారు.
కానీ, గత శరదృతువులో సినగాగ్ (యూదుల ప్రార్థనా మందిరం) వెలుపల జరిగిన నిరసన తర్వాత తలెత్తిన బఫర్ జోన్ల అంశం, వారి మధ్య ఉన్న ప్రధాన విభేదాలలో ఒకదానిని స్పష్టం చేస్తుంది: ఇజ్రాయెల్‌పై విమర్శలను ఎలా ఎదుర్కోవాలి? ఈ విమర్శలు యూదు వ్యతిరేకతగా పరిణమిస్తాయని కొందరు భావిస్తుండగా, మరికొందరు నిపుణులు మాత్రం జాతి నిర్మూలనతో పోల్చిన ఒక ప్రభుత్వం సైనిక చర్యల పట్ల ఇవి చట్టబద్ధమైన ఆందోళనలని భావిస్తున్నారు.
బిల్లు మద్దతుదారుల వాదనలు, నిబంధనలు..
మమ్దానీ వీటోకు ప్రతిస్పందనగా, ఈ బిల్లును ప్రాయోజితం చేసిన కౌన్సిల్మన్ ఎరిక్ డినోవిట్జ్, దీనికి వ్యతిరేకంగా చేసిన వాదనలు దురుద్దేశంతో కూడినవని సూచించారు.
“పాఠశాలకు వెళ్లే దారిలో విద్యార్థులను వేధించాలా? నా అభిప్రాయంలో సమాధానం ‘కాదు’ అని డినోవిట్జ్ అన్నారు.
తరువాత ఆయన, “ఈ బిల్లులో భావ ప్రకటనా స్వేచ్ఛను పరిమితం చేసే నిబంధన ఏదీ లేదు” అని కూడా జోడించారు.
గత నెలలో పోలీస్ శాఖ ఆమోదించిన బిల్లు 30-19 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీని ప్రకారం మేయర్, స్పీకర్ నిరసనకారుల కోసం ఒక ప్రణాళికను రూపొందించి, వారి మొదటి సవరణ హక్కులను ఉల్లంఘించకుండా ఆన్లైన్లో తప్పనిసరిగా ప్రచురించాలి. నిరసన ప్రదర్శనను అదుపు చేసే ఏ ప్రయత్నానికైనా ప్రజలను సంప్రదించడానికి పోలీస్ కమిషనర్ ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలి.
సినగాగ్ల వద్ద నిరసనలు, ఇతర చట్టాలు..
వామపక్ష రాజకీయాల నుంచి గణనీయమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, మార్చిలో కౌన్సిల్ ఆమోదించిన రెండు సంబంధిత చట్టాలలో ఇది ఒకటి. ఆ ప్యాకేజీలోని మరో బిల్లు, ప్రార్థనా మందిరాల వెలుపల జరిగే నిరసనలకు సంబంధించి పోలీసు శాఖపై ఇలాంటి నిబంధనలనే విధించింది, కానీ, వీటో చేయబడిన బిల్లులాగే, దీనిని కూడా మెనిన్ ప్రవేశపెట్టిన అసలు వెర్షన్/ప్రతిపాదన నుంచి సవరించారు.
గత శరదృతువులో మాన్హాటన్లోని అప్పర్ ఈస్ట్ సైడ్‌లో ఉన్న ఒక ఆధునిక ఆర్థడాక్స్(ఆచారపరులైన) సినగాగ్ వెలుపల జరిగిన సమస్యాత్మక నిరసనను ఉదహరిస్తూ, ప్రార్థనా మందిరాల చుట్టూ 100 అడుగుల వరకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని ఆమె మొదట పోలీసులను కోరారు.
లాభాపేక్షలేని సంస్థ అయిన బి’నెఫెష్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి నిరసనగా కొంతమంది ప్రదర్శనకారులు గుమిగూడారు.
ఈ సంస్థ ఉత్తర అమెరికా యూదులను ఇజ్రాయెల్‌కు, ముఖ్యంగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని సెటిల్మెంట్లకు తరలించడానికి సహాయం చేస్తుంది. ఆ సెటిల్మెంట్లలో పాలస్తీనియన్లపై హింస విపరీతంగా పెరిగిపోతోంది. బయట జరిగిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది, కొందరు “ఐడీఎఫ్‌కు మరణదండన”, “ఇంతిఫాదాను(పాలస్తీనా మద్దతుదారుల ఉద్యమం) ప్రపంచీకరించండి(ప్రపంచమంతా విస్తరించండి)” అని నినాదాలు చేశారు.
అయితే, పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్తో సహా మమ్దానీ పరిపాలనలోని వ్యక్తుల నుంచి ప్రతిఘటన ఎదురైన తర్వాత, మెనిన్ తన బిల్లును కుదించడానికి అంగీకరించారు.
ఈ చట్టం నిరసనలపై అనవసరమైన పోలీసు నిఘాను పెంచడానికి, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని వాదించిన వామపక్ష రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ, ఆ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. కానీ ప్రార్థనా మందిరాలకు సంబంధించిన బిల్లు వీటోను అధిగమించగల మెజారిటీతో ఆమోదం పొందింది, దీనివల్ల అది మేయర్ అభ్యంతరాలకు తక్కువగా ప్రభావితమైంది.
శుక్రవారం నాడు, మమ్దానీ తాను ఆ బిల్లును వ్యతిరేకిస్తూనే ఉన్నప్పటికీ, దానిపై సంతకం చేయనని గానీ, వీటో చేయనని గానీ అనకుండా, దానిని చట్టంగా మారడానికి అనుమతిస్తానని చెప్పారు.
ఎందుకంటే “సంపూర్ణ న్యాయ సమీక్ష తర్వాత, ఇది గతంలో ఉన్నంతటి ప్రమాదాలను ఇప్పుడు కలిగిస్తుందని నేను నమ్మడం లేదు, అందుకే దీనిని చట్టంగా మారడానికి అనుమతిస్తాను” అని మేయర్ ప్రకటనలో పేర్కొన్నారు.
“అయినప్పటికీ, అన్ని నిరసనలను ఒక భద్రతా సమస్యగా చిత్రీకరించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను” అని మమ్దానీ అన్నారు.
పౌర హక్కులు, కార్మిక సంఘాల ఆందోళనలు..
నిరసనలకు సంబంధించిన ఆ రెండు బిల్లులు రాజ్యాంగబద్ధత, పరిధి- భాష పరంగా సారూప్యంగా ఉన్నాయని స్పీకర్ కార్యాలయం వాదించింది.
అయితే “విద్యా సౌకర్యం” అంటే “విద్యా కార్యక్రమాలు జరిగే ఏదైనా భవనం, structure లేదా ప్రదేశం” అని ఆ పదానికి విస్తృత నిర్వచనం ఇవ్వడం వల్ల డినోవిట్జ్ చట్టం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఆ నిర్వచనం కేవలం పాఠశాలలనే కాకుండా ఆసుపత్రులు, గ్రంథాలయాలను కూడా తన పరిధిలోకి తీసుకువస్తుందని పౌర హక్కుల కార్యకర్తలు వాదించారు. వీటోపై తన సందేశంలో మమ్దానీ ఈ ఆందోళనలనే ప్రస్తావించారు.
“పాఠశాలలు, గ్రంథాలయాలు, బోధనా ఆసుపత్రుల వద్ద లేదా వాటి సమీపంలో జరిగే నిరసనల విషయంలో మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని న్యూయార్క్ వాసులకు సందేశం పంపడం ఈ కాలానికి పూర్తిగా తప్పుడు సందేశం. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం నిరసనలపై సుత్తిదెబ్బలలాంటి మాటలతో విరుచుకుపడుతున్న ఈ సమయంలో ఇది మరింత తప్పు” అని న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డోనా లీబర్‌మాన్ అన్నారు.
మమ్దానీ వీటోను ఊహించి, యూజేఏ-ఫెడరేషన్ ఆఫ్ న్యూయార్క్‌తో సహా పలు యూదు సంఘాల కూటమి, ఆయన తీసుకోబోయే చర్య పట్ల నిరాశను వ్యక్తం చేసింది.
“మన నగరవ్యాప్తంగా యూదు, ఇతర వర్గాలు తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటున్న తరుణంలో- ప్రతి పాఠశాల, సామాజిక సంస్థకు మెరుగైన రక్షణ కల్పించే దిశగా ఈ చట్టం ఒక కీలకమైన ముందడుగు వేసింది” అని కూటమి తన ప్రకటనలో పేర్కొంది.
ఊహించిన వీటోను “మన భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని న్యూయార్క్ వాసులందరికీ తెలియజేయడంలో సిటీ హాల్ ఘోరంగా విఫలమవడం”గా అభివర్ణించింది.
ఇటీవలి వారాల్లో ఈ బిల్లుపై చర్చలు ముమ్మరమవుతున్న తరుణంలో, కార్మిక సంఘాలు, ప్రగతిశీల యూదులు, డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా స్థానిక శాఖ బహిరంగంగా ఈ బిల్లును వ్యతిరేకించాయి.
మమ్దానీకి పంపిన లేఖలో, ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి కార్మిక సంఘాల నిరసనలను ఒక కారణంగా వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు.
అయితే, ఈ బిల్లులో కార్మిక చట్టాల కింద “హామీ ఇవ్వబడిన హక్కులను ఉల్లంఘించబోమని” హామీ ఇచ్చే నిబంధన ఉంది.
“సమ్మెలో లేని వారిని పికెట్(నిరసన నిరోధించే) లైన్లో చేరకుండా నిరోధించడం అనేది, కార్మికుల సంఘటనను అణచివేయడానికి యాజమాన్యానికి మరిన్ని సాధనాలను అందిస్తుంది” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖపై నగరానికి చెందిన డీఎస్ఏ శాఖ, యునైటెడ్ ఆటో వర్కర్స్ ప్రాంతీయ శాఖతోపాటు ఇతర కార్యకర్తల బృందాలు, కార్మిక సంఘాలు సంతకాలు చేశాయి.
అనువాదం: సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
