సమాజం మారుతున్నదని, ఈ రోజుల్లోనూ కులం ఎక్కడుందని చాలా మంది అంటూ ఉంటారు. నిజమే కావొచ్చనుకునే వారు కొందరు. మార్పు వస్తున్నట్లుందని భావించే మరి కొందరు ఉండొచ్చు. కానీ కులం వివిధ రూపాల్లో పునరుజ్జీవనం పొందుతున్నదని గుర్తించే వాళ్లు కొందరే కావొచ్చు.
అది కూడా తమ జీవితానుభవాల్లోకి వస్తున్న సందర్భంలో దానిని గుర్తిస్తున్నారు. ఆ చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. కుల దారుణాలపై ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.
గతంలో హోటళ్లలో రెండు గ్లాసుల విధానం అమల్లో ఉండేది. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు చట్టం బాగా పనిచేయడం వలన ఇప్పుడా వ్యవస్థ కన్పించడం లేదు. కానీ ఇంకా అది వివిధ రూపాల్లో వ్యక్తం అవుతూనే ఉన్నది.
నగరాల్లో ఇండ్లను అద్దెలకిచ్చే సమయంలో వారిది ఏ కులమో తెలుసుకున్న తర్వాత గాని ఇళ్లను ఇవ్వడం లేదు. వెజ్, నాన్ వెజ్ రూపంలో, గోత్రాలు తెలుసుకోవడం ద్వారా, బంధువుల గురించి ఆరాలు తీయడం ద్వారా, వారు చేసే వృత్తుల ద్వారా, వారుండే గ్రామాలు తెలుసుకోవడం ద్వారా ఇట్లా పలు విధాలుగా వారి కులం తెలుసుకుంటున్నారు.
నేరుగా అడిగితే చట్ట పరంగా ఇబ్బందులొస్తాయని కొత్త కిటుకుల ద్వారా కుల, గోత్రాల మూలాలు తెలుసుకుంటున్నారు.
భక్తి, పండుగల మాటున కుల వివక్ష: బుద్దారం ఉదంతం..
ఈ మధ్య భక్తి రూపంలో కులాన్ని బలంగా నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు పూర్వం దళితులను గుళ్లోకే కాదు, గుడి పరిసరాల్లోకి రావడాన్ని నిషేధించారు. దీనిపైనా మానవ హక్కుల సంఘాలు, సంస్థలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి.
అయినా గుళ్ల వద్దకు వచ్చినప్పుడు కులకుటిలత్వం బుసలు కొడుతూనే ఉన్నది. ఇప్పుడు పండుగల రూపంలో కులం నిర్మితం అవుతూ ఉన్నది. అట్లా అనే కంటే కులాన్ని కొత్త తరానికి కొత్త రూపంలో తెలియపరుస్తున్నారు.
ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రామాల్లో బొడ్రాయి పండుగలు జరిగాయి. ఇంకా కొన్ని గ్రామాలు జరుపుతున్నాయి. అన్ని గ్రామాల్లోనూ కుల వివక్ష ఉందని చెప్పడం ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు. గత కాలపు దారుణాన్ని కొనసాగించే యత్నం చేస్తున్న వారి గురించే ఈ మాటలు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో ఇదే జరుగుతున్నదని ఆ గ్రామానికి చెందిన దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామంలో ఐదు బొడ్రాళ్లు పాతాలని పెత్తందార్లు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన జర్నలిస్టు పానుగంటి చంద్రయ్య అన్నారు. ఈయన కర్నూలులో నివాసం ఉంటున్నారు. వృత్తి రీత్యా అక్కడే ఉంటున్నా గ్రామానికి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా చురుక్కుగా ఉంటారు.
1990ల నాటికే ఈ గ్రామంలో పూలే, అంబేద్కర్ భావధార అబ్బింది. ఆ రోజుల్లోనే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు ఈ మండలంలో పెద్ద ఎత్తున జరిగాయి. ఆ చైతన్యం ఇక్కడ ఉన్నది. దానికి కొనసాగింపుగానే చంద్రయ్యతోపాటు మరికొంత మంది దళిత యువకులు గ్రామ పెత్తందార్ల నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు.
బొడ్రాయి పండుగ అసలు ఉద్దేశం – ఐదు బొడ్రాళ్ల వెనుక ఆంతర్యం ఏమిటి?
బొడ్రాయి పండుగ గురించి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. గ్రామ నిర్మాణంలోనే బొడ్రాయి ఉంటుంది. గ్రామానికి పొలిమేరలను నిర్ధారించేందుకు, గ్రామ మధ్య భాగంలో అంటే నాభి మాదిరిగా ఉండేలా దీన్ని ప్రతిష్ఠింపజేస్తారు. దక్కన్ సంస్కృతిలో ఇది ప్రధానాంశం. వాస్తవానికి శూద్రకులాల దైవం అనొచ్చు.
గ్రామదేవతలంతా ఉత్పత్తికులాలకు సంబంధించిన వారే. అందునా అమ్మల కొలుపు అంటే మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా భావించవచ్చు. ఈ బొడ్రాయి పండుగకు చుట్టాలను పిలుచుకుంటారు. ఆడబిడ్డలకు ఒడిబియ్యం పోస్తారు. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తారు.
బొడ్రాయి ప్రతిష్ఠించేటప్పుడు గ్రామంలోకి ఎవ్వరినీ రానీవ్వరు. ఊరి వారిని బయటకు పోనివ్వరు. ఇదంతా గ్రామం ఐక్యంగా, ఆరోగ్యంగా ఉండేందుకు చేస్తారు. కానీ కొందరు దీన్ని తమ కుల పెద్దరికానికి, మనుధర్మ పునఃప్రతిష్ఠ చేయడానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.
బుద్దారం గ్రామంలోనే 150 ఏళ్ల కిందటే బొడ్రాయి ప్రతిష్ఠించారు. అప్పటి వరకు ఊరికి ఒకే బొడ్రాయి ఉన్నది. ఇప్పుడు ఐదు ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు? దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? ఇవన్నీ ఆ గ్రామానికి చెందిన దళితుల్లోని కొత్త తరం వేస్తున్న ప్రశ్నలు.
రాజ్యాంగ ఉల్లంఘన – చారిత్రక బుద్దారం గ్రామంలో వివక్ష..
గ్రామంలో కొందరిని దూరంగా ఉంచడం అనేది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఆర్టికల్స్ 13, 14, 15, 16, 17లను పట్టించుకోనట్లే అవుతుంది. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. లింగ, కుల వివక్ష చూపించకూడదు. అంటరానితనం పాటించరాదు. పౌరులు గౌరవప్రదంగా జీవించే హక్కు ఉండాలి. దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తే, భారత రాజ్యాంగ పీఠికనే అవమానించినట్లు అవుతుంది.
ఈ గ్రామంలో చదువుకున్న వారు ఉన్నారు. వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారూ ఉన్నారు. వనపర్తి-హైదరాబాద్ రహదారిపైన ఉన్న గ్రామం ఇది. గోనబుద్దారెడ్డి కాలానికి పూర్వమే అక్కడ బౌద్ధం వెల్లివిరిసింది. బౌద్ధారామమే నేటి బుద్దారం. ఇంతటి చరిత్ర కలిగిన ఈ గ్రామంలో కులం మరో రూపంలో పడగ విప్పడానికి ప్రయత్నిస్తోందని ఆ గ్రామ దళితులు మూకుమ్మడిగా చెప్తున్న మాట.
చైతన్యానికి మారుపేరైన జిల్లాలో మనువాద కుట్రలు – సమాజం స్పందించాలి..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాగా చైతన్యం ఉన్న ప్రాంతం నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతాలు. గతంలో వనపర్తి ఎమ్మెల్యేగా, మంత్రిగా నిరంజన్ రెడ్డి పని చేశారు. ఆయన సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వారు. వీరి కంటే ముందు మహేంద్రనాథ్ ఉమ్మడి పాలమూరు జిల్లా నాటి ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
దళిత ఉద్యమాలకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. వీరందరి ప్రభావం వలన అక్కడ సామాజిక చైతన్యం బాగా వచ్చింది. ఇప్పుడు అక్కడ మనువాద భావజాల వ్యాప్తి చేస్తూ హిందువుల మధ్య విభజనలు తెస్తున్నారని అంటున్నారు. అంతే కాదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఓ మాట చెప్పారు.
హిందువులందరికీ ఒకే గుడి, ఒకే నీళ్ల బావి, ఒకే శ్మశానం ఉండాలన్నారు. ఇక్కడ మాత్రం దళితులను విడిగా ఉంచే కుట్ర చేస్తున్నారని, దీనిపై సమాజం స్పందించాలని అక్కడి వారు కోరుతున్నారు.
అంతే కాదు అధికార యంత్రాంగం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
