ప్రపంచ ప్రభావం లేదా పలుకుబడి అనేది రెండు విభిన్న ప్రవర్తనా విధానాలనే ఆసరాగా చేసుకుని నిర్మితమై ఉంటుంది. తమ ప్రభావాన్ని నిశ్శబ్దంగా, సమర్థవంతంగా ప్రయోగించే దేశాలు బలాన్ని, పొత్తులను నిర్మించుకుంటాయి.
అదే ప్రభావాన్ని ధిక్కార భావంతో ప్రయోగించేవారు లోపలా, బయటా అసంతృప్తిని, విభేదాలను సృష్టిస్తారు. డొనాల్డ్ జే ట్రంప్ ధిక్కారాన్ని ఆయుధంగా మలచుకుని, అవమానాలతో కూడిన ఒక కొత్త ప్రపంచ క్రమాన్ని నిర్వచిస్తున్నారు.
దౌత్యం అనేది పరస్పర ప్రయోజనాలను నిర్వహించే ఒక ప్రక్రియ. కానీ ట్రంప్ దాని స్థానంలో ‘నరకకూప సిద్ధాంతాన్ని’ తీసుకువచ్చారు.
శ్వేతభవనానికి తిరిగి వచ్చినప్పటి నుంచి, దేశాలను లొంగదీసుకునేందుకు ఒక క్రమబద్ధమైన వాచాల దాడిని ఆయన సాధనంగా వాడుతున్నారు. తన ఉంగరాన్ని ముద్దాడే భజనపరులకు గానీ, ట్రంప్‌కు గానీ అమెరికా అధికారం అనే పాత్ర ఆయన నోటివెంట వచ్చే విషపు మాటలనే చిల్లుల ద్వారా కారిపోతోందన్న పట్టింపు ఏమాత్రం లేదు.
వాస్తవాలకు విడాకులు.. దౌత్యపరమైన దాడి..
ప్రతి వారం అధ్యక్ష పీఠం నుంచి ‘నిజాల’ పేరిట అవమానాల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే టారిఫ్ యుద్ధాల నేపథ్యంలో, 7.8 శాతం జీడీపీ వృద్ధితో దూసుకుపోతున్న భారత్‌ను ట్రంప్ “చచ్చిన ఆర్థిక వ్యవస్థ”అని ప్రకటించారు.
భారత్, చైనాలను “నరకకూపాలు”గా ముద్రవేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 63 పాఠశాల కాల్పులు, రోజుకు దాదాపు 200 డ్రగ్ మరణాలకు సాక్ష్యంగా నిలవడంతో పాటు, 44 రోజుల పాటు ప్రభుత్వాన్ని మూసివేసిన(షట్‌డౌన్) రికార్డు ఉన్న పాలకుల నుంచి ఇలాంటి మాటలు రావడం విడ్డూరం.
వాస్తవాలకు దూరంగా, ఉద్దేశపూర్వకంగా దురుసుగా ఉండే ట్రంప్ మాటలు అప్పుడప్పుడూ అజ్ఞానంలో కూరుకుపోయిన మచ్చలేని(ఖాళీ) మెదడులో శాశ్వత వెలుగును ప్రతిబింబిస్తుంటాయి.
ఆయన దూషణలన్నీ ఒకే పంథాలో సాగుతాయి: “నా దారిలో నడువు, లేదంటే తప్పుకో” అనే బెదిరింపులాగా ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో ఇరాన్‌కు అత్యంత కఠినమైన అల్టిమేటం జారీ చేశారు: “ఆ జలసంధిని తెరవండి… లేదంటే మీరు నరకంలో బతుకుతారు.” అంతేకాదు, ఇరాన్ “మొత్తం నాగరికతనే” తుడిచిపెట్టేస్తానని కూడా ఆయన బెదిరించారు!
మిత్రదేశాలపైనా అవమానాల వర్షం..
కెనడాను 51వ రాష్ట్రంగా మార్చాలనుకుంటున్న ట్రంప్.. దానిని “ఇతరుల సొమ్ముపై బతికేది” అని ముద్రవేస్తూ, “చైనా దానిని బతికుండగానే తినేస్తుంది” అని జోస్యం చెప్పారు.
“మెక్సికోను డ్రగ్ మాఫియా(కార్టెల్స్) నడుపుతున్నాయి” కాబట్టి, ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌కు ప్రాధాన్యం లేదన్నారు.
ఎలాంటి మర్యాద పాటించకుండా ఐక్యరాజ్యసమితిలో బ్రెజిల్ అధ్వాన్నంగా తయారవుతుందని వ్యాఖ్యానించారు.
ఎందుకంటే “విఫలమైన సిద్ధాంతాలను ఇష్టపడే వ్యక్తి దానికి నాయకత్వం వహిస్తున్నాడు” అని, సాక్షాత్తూ లులా డ సిల్వా అదే గదిలో ఉన్నప్పుడే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం నాడు, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ను అనుకరిస్తూ ఆయన్ను “బలహీనుడు, నిర్ణయాలు తీసుకోలేని వాడు” అని, స్నేహితులను ఎంచుకోవడంలో అసమర్థుడని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్‌తో సంఘర్షణలో చేరడానికి ఐరోపా నిరాకరించినప్పుడు వారిని “పిరికిపందలు” అని ముద్రవేశారు.
చివరకు వాటికన్‌ను కూడా వదల్లేదు. పోప్ లియో XIVని లక్ష్యంగా చేసుకుని: “ఆయన సరైన పని చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఆయనకు నేరాలంటే ఇష్టం కాబోలు” అని అన్నారు. ఎందుకు? యుద్ధాలను ముగించాలని పోప్ కోరినందుకే.
ఆధిపత్య దాహం వెనుక సామాజిక సిద్ధాంతం..
ఈ ఆధిపత్య దాహాన్ని హెన్రీ తాజ్ఫెల్ ‘సామాజిక గుర్తింపు సిద్ధాంతం’ వివరిస్తుంది.
వ్యక్తులు ఇతరులను కించపరచడం ద్వారా తమ స్వంత గుర్తింపును బలోపేతం చేసుకుంటారు. ఇతరుల కంటే తమ స్థాయి ఉన్నతమైనదని పునర్నిర్వచించుకుంటారు.
ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళనలో ఉన్న స్థానిక ప్రేక్షకుల మనోభావాలను పెంచడానికే ఈ ‘నరకకూప’ వాక్చాతుర్యాన్ని ప్రయోగిస్తున్నారని వాదించవచ్చు.
అది నిజమే కావచ్చు కానీ, ఇలాంటి అవమానాలు భయంకరమైన దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తాయనడంలో సందేహం లేదు.
ట్రంపిస్తాన్లో, దేశాలను పదేపదే బహిరంగంగా భారాలుగా, ఇతరుల సొమ్ముపై బతికేవిగా లేదా ముప్పులుగా ముద్రవేస్తున్నారు.
ఇది సుంకాల విధింపునకు, బలవంతపు ఒప్పందాలకు, ఏకపక్ష నిర్ణయాలకు మార్గం సుగమం చేస్తోంది.
తిరిగి రాబడుతున్న ఈ అధికార నాటకంలో, అవమానమే ప్రారంభ వేలం. ఇది ఆధిపత్య సంకేతాలను పంపే మాస్టర్ క్లాస్ వ్యూహమా? లేక మేధో పతనానికి గజిబిజి సంకేతాలా అని ప్రపంచం ఆశ్చర్యపోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
వ్యూహమా? లేక నియంత్రణ కోల్పోయిన స్థితా?..
ఇది అసాధారణమా కాదా అన్నది ప్రశ్న కాదు- ఇది కచ్చితంగా అసాధారణమే.
ఆధునిక యుగంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా దౌత్యాన్ని పణంగా పెట్టి, ఇంత బరితెగింపుతో, ఇంత తరచుగా మిత్రులను, భాగస్వాములను, నాగరికతలను బహిరంగంగా కించపరచలేదు. ఇదంతా ఎందుకు జరుగుతోందన్నదే అసలు ప్రశ్న.
రాజకీయ విశ్లేషకులు ట్రంప్ ప్రవర్తనలో ఒక వ్యూహాన్ని చూడొచ్చు.
సుంకాలు, వలసలు లేదా యుద్ధాలపై ఆయన హద్దులు దాటిన ప్రతిసారీ మేధావులు ఒక “పిచ్చివాడి సిద్ధాంతాన్ని” తెరపైకి తెస్తుంటారు.
ఆ ‘పిచ్చివాడి’ వేషం ఒక వ్యూహమా లేక మభ్యపెట్టడమా అన్నది ఎవరికీ కచ్చితంగా తెలియదు.
ప్రతి ఒక్కరూ ఆ లక్షణాలను తమకు తోచినట్లు అన్వయించుకుంటున్నారు. న్యూరో సైకాలజిస్టులు రాజకీయ పండితుల కంటే భిన్నంగా దీనిని విశ్లేషిస్తున్నారు.
సైన్స్ ప్రకారం.. ఉద్వేగాలపైన నియంత్రణ, సామాజిక విచక్షణ లేకపోవడం వల్ల “డిస్ఇన్హిబిషన్”(నియంత్రణ కోల్పోయే) అనే స్థితి ఏర్పడుతుంది.
దీని ఫలితంగా ఆమోదయోగ్యమైన నిబంధనలకు విరుద్ధంగా అనుచితమైన మౌఖిక లేదా భౌతిక చర్యలకు పాల్పడతారు.
ప్రాణాంతక నార్సిసిజం ముప్పు..
ట్రంప్ భాషను, వాస్తవాలను తనకనుగుణంగా మెరుగుపెట్టడంలో(సానపట్టడంలో) దిట్ట.
“గేమ్ ఆఫ్ థ్రోన్స్”లో జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసినట్లు, “తాను రాజని పదేపదే చెప్పుకునేవాడు నిజమైన రాజు కాడు.”
తన గురించి తాను పదేపదే అత్యుత్తమ పదాలతో పొగుడుకోవడం ఒక ఆసక్తికరమైన మానసిక స్థితిని తెలియజేస్తుంది.
ఆస్ట్రియన్ మానసిక విశ్లేషకుడు ఒట్టో కెర్న్బర్గ్ ప్రతిపాదించిన ‘ప్రాణాంతకమైన నార్సిసిజం’ భావనలో దీనికి సమాధానాలు దొరుకుతాయి.
ఆయన దీనిని వైరుధ్యాలతో కూడిన సైకోసిస్‌గా వర్ణించారు- ఆత్మస్తుతి, పొగడ్తల పట్ల అంతులేని దాహం, బయటకి కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఉప్పొంగే తీవ్రమైన అసూయ దీని లక్షణాలు.
ట్రంప్ మేధోపరమైన సామర్థ్యంపై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది.
కొంతమంది ఎన్నికైన ప్రతినిధులతో సహా చాలామంది అకస్మాత్తుగా “అధ్యక్షుడి అసమర్థత, వారసత్వ బదిలీకి” సంబంధించిన రాజ్యాంగంలోని 25వ సవరణ గురించి చదవడం, చర్చించడం మొదలుపెట్టారు.
ఈ ప్రశ్నలకు సమాధానాలు అమెరికా ప్రజలే ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇదిలా ఉండగా, ఈ ‘నరకకూప సిద్ధాంతం’ తెచ్చిపెట్టే పరిణామాలపై ప్రపంచం ఆందోళన చెందుతోంది.
మొదలైన బహుళ ధ్రువ ప్రపంచం..
అంతర్జాతీయ సమాజం స్పష్టంగా మనస్తాపం చెంది, తమ పొత్తులను, వ్యవస్థలను తిరిగి పునర్నిర్మించుకుంటోంది.
స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సమీక్షిస్తున్న ఆప్షన్స్‌తో, అంతర్జాతీయ బ్యాంక్ బదిలీల కోసం స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయాలను ఐరోపా సిద్ధం చేస్తోంది.
అమెరికా నుంచి ఫ్రాన్స్ తన బంగారాన్ని వెనక్కి రప్పించుకుంది, జర్మనీ కూడా అదే బాట పట్టొచ్చు.
ఐరోపా అతివాద పక్షాలు ఇప్పుడు ట్రంప్‌ను ఒక విషపూరితమైన ఆస్తిగా చూస్తున్నాయి.
అమెరికా ఇప్పుడు రష్యా, చైనాలతో పాటు ఇరాన్‌తోనూ పోరాడాల్సి వస్తోంది.
దశాబ్దాలుగా అమెరికా అడ్డుకుంటూ వస్తున్న బహుళ ధ్రువ ప్రపంచ క్రమం ఆవిర్భావాన్ని అమెరికా అధ్యక్షుడి చర్యలు మరింత వేగవంతం చేశాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
