గత శనివారం 31 సంవత్సరాల యువకుడు వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరుగుతున్న వైట్ హౌస్ పత్రిక విలేకరుల(కరస్పాండెంట్స్) డిన్నర్ వద్దకు దూసుకుని వెళ్లి కాల్పులు జరిపాడు.
ఆ సమావేశంలో అమెరికన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు జేడీ వాన్స్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్, క్యాబినెట్ సహచరులు లాంటి ప్రముఖులంతా ఉన్నారు.
జనవరి నెలలో ఉపాధ్యక్షుడి ఇంటి కిటికీని ఒక ఉగ్రవాది సుత్తితో పగులగొట్టాడు. మార్చి నెలలో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద దాడికి ప్రయత్నించిన ఇద్దరిపై న్యాయశాఖ విచారణ ప్రారంభించింది.
సీఎస్ఐఎస్ నివేదిక: పెరుగుతున్న ఉగ్రవాద దాడులు..
1994 తర్వాత ఇదే మొదటిసారి ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పేర్కొన్నది.
ఈ ప్రభుత్వ వ్యతిరేకతలో లెఫ్ట్ ఉగ్రవాదులు, రైట్ ఉగ్రవాదులు, సెంట్రిస్టులు కూడా ఉన్నారు. 2025 సంవత్సరంలో జరిగిన 20 దాడులను ఆ సంస్థ వర్గీకరించింది. అందులో 10 లెఫ్ట్ ఉగ్రవాదులు, 8 రైట్ ఉగ్రవాదులు చేసినట్లుగా ఆ సంస్థ విశ్లేషించింది.
కారణాలు, లక్ష్యాలు..
గత సంవత్సరం లెఫ్ట్ ఉగ్రవాదులు చేసిన 10 దాడులలో ఐదు ఇమిగ్రేషన్ అధికారుల కార్యాలయాలపై జరిగిన దాడులే.
అధ్యక్షులు ట్రంప్ తీసుకుంటున్న ఇమిగ్రేషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పై దాడులు జరిగాయి.
మరొకటి డిఫెన్స్ అండ్ కౌంటీ రిపబ్లికన్ కమిటీ ప్రధాన కార్యాలయం(మిచిగాన్) మీద జరిగింది.
రైట్ ఉగ్రవాదుల దాడులు కూడా పెరిగాయి. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఒక నాయకుడిని, అతని భార్యని మిన్నెసోటాలో గత సంవత్సరం జూన్ నెలలో కాల్చి చంపేశారు.
అధికారులపై దాడులు, రాజకీయ నేపథ్యం..
కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి గత సంవత్సరం ఆగస్టు నెలలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ ప్రధాన కార్యాలయం దగ్గర 500 రౌండ్లు కాల్పులు జరిపాడు.
అందులో ఒక పోలీసు అధికారి చనిపోయాడు. ఈ ఉగ్రవాదుల నేపథ్యం అధ్యయనం చేసిన సీఎస్ఐఎస్, ఇవి రాజకీయపరమైన వ్యవహారాలతో ముడిపడిన దాడులుగా గుర్తించింది.
పై వివరాలు చూసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండవ దఫా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు అమెరికా పౌరులను, అమెరికాలో నివసిస్తున్న ఇతరులను తీవ్ర ఆందోళన, ఆవేదనలకు గురిచేస్తున్నాయని పై ఘటనలు రుజువు చేస్తున్నాయి.
న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
