చివరకు అమెరికా ప్రజలను సంతృప్తి పరచడానికి, ప్రపంచంలో తానే మొనగాడినని నిరూపించుకోవడానికి, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఆ యుద్ధం నుంచి బయటపడలేక రోజుకు ఒక మాట మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది ట్రంప్ వ్యక్తిగతంగా చేస్తున్నది కాదు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాద వ్యవస్థ సంక్షోభంలో ఉండటమే ఇందుకు కారణం. ఇది వ్యవస్థ లక్షణం తప్ప వ్యక్తి లక్షణం కాదు.
8 గంటల పని డిమాండ్‌తో పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగ ఫలితమే మేడే. 2026 సంవత్సరం మే డేకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
8 గంటల పని స్థానంలో 12, 14 గంటలు పని చేయించుకునేందుకు యాజమాన్యాలకు వీలు కల్పిస్తూ భారత ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చింది. ఒకవైపు ప్రపంచ కార్మిక వర్గం, వారానికి ఐదు రోజులు, రోజుకు 7 గంటల పని విధానం కావాలని డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి.
భారతదేశంలో 1990 సంవత్సరం నుంచి అమలు జరుగుతున్న సరళీకృత ఆర్థిక విధానాలు పలురూపాలలో కార్మిక వర్గ హక్కుల మీద దాడి చేస్తున్నాయి.
శాశ్వత ఉద్యోగ నియామకాల స్థానంలో ఏ విధమైన హక్కులు లేని క్యాజువల్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఇంకా పలు రకాల పేర్ల మీద నియామకాలు అమల్లోకి వచ్చాయి.
ప్రస్తుతం అనేక ప్రభుత్వరంగ, ప్రైవేటు పరిశ్రమలలో పర్మనెంట్ కార్మికుల కంటే నాన్ పర్మనెంట్ కార్మికుల సంఖ్య అధికమైంది.
ఈ నాన్ పర్మనెంట్ కార్మికులకు ఏ చట్టాలు వర్తించవు. కనీస వేతనాలు కానీ, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్), ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్ తదితర హక్కులేవీ వర్తించవు.
పెరుగుతున్న అభద్రతాభావం..
వీరు పర్మనెంట్ కార్మికుల కంటే ఎక్కువ గంటలు పని చేయాలి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా వీరి పని పరిస్థితులు దిగజారాయి.
పర్మనెంట్ కార్మికులు వారి డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేసినప్పుడు యాజమాన్యాలు కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులను బెదిరించి పర్మనెంట్ ఉద్యోగుల ఆందోళన నుంచి వారిని దూరం చేస్తున్నాయి.
సమ్మె పోరాటాలను నీరు గార్చడానికి నిరుద్యోగులను తాత్కాలికంగా ఉపయోగించుకుంటున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఇటీవల చేసిన సమ్మె ఇందుకు తాజా ఉదాహరణ. ఫలితంగా పర్మనెంట్ కార్మికుల హక్కుల సాధన కూడా క్లిష్టంగా మారింది.
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ తతంగం ఎలా ఉందంటే..
ప్రభుత్వ రంగ పరిశ్రమలను విచ్చలవిడిగా ప్రైవేటు వారికి అప్పగించడం దినచర్య అయింది.
స్వయంగా ప్రధాని మోదీ “ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నది చావడానికే” అని అనడం సమస్య తీవ్రతకు నిలువుటద్దం.
“నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్” పథకం 1, 2 ద్వారా వడ్డించిన విస్తరిలా ఉన్న ప్రభుత్వ మౌలిక సదుపాయాలన్నీ (విమానాశ్రయాలు, పోర్టులు, జాతీయ రహదారులు, విద్యుత్ లైన్లు, గ్యాస్ పైప్లైన్లు, క్రీడా స్టేడియంలు తదితరములు) కారుచౌకగా ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తున్నారు.
వాటిలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం, కార్మికులను నియమించుకోవాల్సిన అవసరం కానీ ఉత్పత్తి, మార్కెటింగ్ లాంటి ఇబ్బందులు ఏమీ లేవు.
స్వాధీనం చేసుకున్న క్షణం నుంచే లాభాలు పొందవచ్చు. పూర్తిగా పీల్చిపిప్పి చేసిన తర్వాత ఆ మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరితే అప్పుడు వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పి వెళ్లొచ్చు. ఇది “నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్” తతంగం.
భూములు, అడవులు, సముద్ర తీర ప్రాంతాలు అదానీ, అంబానీలాంటి సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ శాఖలలో కూడా లక్షలాదిగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఉన్న కార్మికులు, ఉద్యోగుల మీదనే పని భారం విపరీతంగా పెరిగింది.
అత్యవసర పనులు ఉన్నప్పటికీ ఒకరోజు సెలవు దొరకడం అతి కష్టంగా తయారయింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” ఉద్యోగులకు మెడ మీద కత్తిలా తయారయింది.
పెన్షన్ల కోత – వృద్ధాప్యంలో వెతలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న పెన్షన్ స్కీమును 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం రద్దు చేసింది. 2004 నుంచి సర్వీసులో చేరేవారు ప్రతినెలా కొంత డబ్బు చెల్లించి పెన్షన్ కొనుక్కోవాల్సిన “న్యూ పెన్షన్ స్కీము”ను వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చింది.
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం 1995 కింద కనీసపు పెన్షన్ కేవలం 1000 రూపాయలు.
నేడు ప్రతి సరుకు ధర అమాంతంగా పెరిగిన నేపథ్యంలో ఈ 1000 రూపాయలు ఎందుకూ సరిపోక ఉద్యోగ విరమణ చేసిన వారి బాధలు వర్ణనాతీతం.
సోవియట్ యూనియన్ విశిష్టత..
ప్రపంచ మానవాళికి సోవియట్ యూనియన్, సోషలిస్టు శిబిరం దిక్సూచి, ఆశాజ్యోతి అయింది.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రోజుకు 8 గంటల పనిని హక్కుగా చట్టం చేసింది కార్మిక వర్గ రాజ్యం సోవియట్ యూనియన్.
అంతేకాదు సమ్మెను కార్మిక హక్కుగా గుర్తించి చట్టబద్ధం చేసింది. యాజమాన్యంలో కార్మిక భాగస్వామ్యాన్ని అన్ని విషయాలలో ఆచరణలో అమలు చేసింది.
ధరల పెరుగుదల అంటే ఏమిటో తెలియని పరిస్థితిని సృష్టించింది. నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపి చివరి నిరుద్యోగికి ఘనంగా సన్మానం చేసింది.
సోవియట్ యూనియన్ చేస్తున్న ఈ కార్మిక, ప్రజా అనుకూల చట్టాలు ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలను బెంబేలెత్తించాయి.
చివరికి తమ దేశాలలో కూడా కార్మిక వర్గానికి, ప్రజానీకానికి కొన్ని హక్కులు, సదుపాయాలు కల్పించకపోతే తమ దేశ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారని భయాందోళనలు కలిగాయి.
అందులో భాగంగానే అమెరికాలో 1936లో కార్మిక చట్టం అమల్లోకి వచ్చింది.
రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అమెరికా ప్రభుత్వం అమలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ జర్మనీ నియంత హిట్లర్‌ను ఓడించడమే కాక తూర్పు యూరప్‌లోని పలు దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించడానికి సహాయ, సహకారాలు అందించింది.
ఆ విధంగా ప్రపంచంలో ఒక సోషలిస్టు శిబిరం ఆవిర్భవించింది. ఆ తర్వాతనే యూరప్‌లోని మిగతా దేశాలతో సహా అనేక ఇతర దేశాలలో ప్రజాసంక్షేమ చర్యల అమలు ప్రారంభమైంది. ఆ సంక్షేమ పథకాలకు నిధులు కోత పెట్టినా పూర్తిగా వాటిని రద్దు చేయడం నేటికీ సాధ్యం కాలేదు.
ఇది సోషలిస్టు శిబిరం సాధించిన అతి గొప్ప విజయం. ఆ దేశ ప్రజలు, కార్మికులకే కాక మొత్తం ప్రపంచ మానవాళి అభివృద్ధికి ఒక దిక్సూచిగా, ఆశాజ్యోతిగా నిలిచింది.
సోవియట్ పతనం – కార్మిక వర్గానికి అశనిపాతం..
1990లో సోవియట్ యూనియన్, తూర్పు యూరప్‌లోని పలు సోషలిస్టు దేశాలు కుప్పకూలాయి. దాంతో ప్రపంచ పోలీసు పాత్రను అమెరికా పోషించింది. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదని, ఇది ఏకధ్రువ ప్రపంచమని ప్రపంచ దేశాలకు ఆదేశాలు జారీ చేయడం ప్రారంభమైంది. అందులో భాగంగానే భారత దేశంలో 1990 నుంచి నూతన ఆర్థిక విధానాలు అనే విషబీజాలు నాటబడ్డాయి. నేడు ప్రజలు, కార్మికులు అనుభవిస్తున్న బాధలకు ఆ విధానాలే కారణం.
సామ్రాజ్యవాద సంక్షోభం..
ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఆ దేశాల ప్రజలలో అసంతృప్తి, ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో ఇవి బాగా ఎక్కువ అయ్యాయి.
“అమెరికా ఫస్ట్” నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఆ దేశ ప్రజలను సంతృప్తి పరచలేక పోతున్నాయి. “టారిఫ్”ల పేరుమీద తన మిత్ర దేశాలతో సహా మొత్తం ప్రపంచ దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. అవి కూడా బెడిసికొట్టాయి.
చివరకు అమెరికా ప్రజలను సంతృప్తి పరచడానికి, ప్రపంచంలో తానే మొనగాడినని నిరూపించుకోవడానికి, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఆ యుద్ధం నుంచి బయటపడలేక రోజుకు ఒక మాట మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది ట్రంప్ వ్యక్తిగతంగా చేస్తున్నది కాదు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాద వ్యవస్థ సంక్షోభంలో ఉండటమే ఇందుకు కారణం. ఇది వ్యవస్థ లక్షణం తప్ప వ్యక్తి లక్షణం కాదు.
కార్మిక వర్గం ముందున్న కర్తవ్యం..
దీనికి పరిష్కారం ఏంటంటే, కార్మిక వర్గం సంఘటితం కావాలి. విస్తృత స్థాయిలో ఐక్య పోరాటాలు నిర్వహించాలి. కాంట్రాక్టు, క్యాజువల్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను కూడా పర్మనెంట్ కార్మిక సంఘాలు తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. వారి ఆదరణ, మద్దతు కూడగట్టాలి.
ప్రజలందరి సహకారంతో అన్ని వర్గాల ప్రజల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ముందుండి సమరశీల పోరాటాలు నిర్వహించాలి. అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం, వృద్ధులందరికీ సామాజిక పెన్షన్ లాంటి మౌలికమైన సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి. ఈ మే డే సందర్భంగా కార్మిక వర్గం ఆ విధంగా ప్రతిజ్ఞ తీసుకొని, కార్యాచరణకు సన్నద్ధం కావాలి. ఇదే నేటి మే డే ప్రాధాన్యత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
