ఈ సంఘటన కియోంఝర్ జిల్లాలోని ఒడిశా గ్రామీణ బ్యాంక్ మాలిపోసి శాఖలో జరిగింది. జితు ముండా అనే వ్యక్తి, ఈ ఏడాది జనవరిలో మరణించిన తన అక్క బ్యాంక్ ఖాతా నుంచి రూ 20,000 విత్డ్రా చేయాలనుకున్నాడు.
తన అక్క చనిపోయిందని తాను బ్యాంకు అధికారులకు చాలాసార్లు చెప్పినప్పటికీ, వారు ఆమెను బ్యాంకుకు తీసుకురమ్మని పట్టుబట్టారని అతను చెబుతున్నాడు.
దీంతో ఆమె సమాధిని తవ్వించి, సాక్ష్యంగా ఆమె అస్థిపంజరాన్ని అతను బ్యాంకుకు తీసుకురావాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ: ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో సోమవారం ఏప్రిల్ 27న ఒక గిరిజన వ్యక్తి, తన సోదరి పేరు మీద జమ చేసిన డబ్బును విత్డ్రా చేసుకునేందుకు, చనిపోయిన తన సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు చేరుకున్నాడు.
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, కియోంఝర్ జిల్లాలోని పాట్నా బ్లాక్లో ఉన్న ఒడిశా గ్రామీణ బ్యాంక్ మాలిపోసి శాఖలో ఈ సంఘటన జరిగింది.
ఆ వ్యక్తిని దియానాలి గ్రామానికి చెందిన జితు ముండా(50)గా గుర్తించారు.
అతను 2026 జనవరి 26న మరణించిన తన అక్క కల్రా ముండా(56) బ్యాంక్ ఖాతా నుంచి ₹20,000 విత్డ్రా చేయాలనుకున్నాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, జితు ముండా గ్రామీణ బ్యాంకు ముందు అస్థిపంజరాన్ని ప్రదర్శించాడు.
అస్థిపంజరాన్ని చూసి భయభ్రాంతులకు గురైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
నిరక్షరాస్యుడైన గిరిజనుడు.. అర్థంకాని నిబంధనలు..
జితు ముండా నిరక్షరాస్యుడని సమాచారం. అతను విలేకరులతో మాట్లాడుతూ, “నేను చాలాసార్లు బ్యాంకుకు వెళ్లాను, కానీ అక్కడి సిబ్బంది డబ్బులు విత్డ్రా చేయడానికి ఖాతాదారుని నాతో పాటు తీసుకురమ్మని చెప్పారు. నా సోదరి చనిపోయిందని నేను వారికి చెప్పాను, కానీ వారు వినకుండా ఆమెను బ్యాంకుకు తీసుకురమ్మని పట్టుబట్టారు. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో, నేను ఆమె సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని బయటకు తీసి, సాక్ష్యంగా బ్యాంకుకు తీసుకువచ్చాను” అని చెప్పాడు.
పీటీఐ కథనం ప్రకారం, సమాచారం అందుకున్న వెంటనే బ్యాంకుకు చేరుకున్న పాట్నా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్-ఇన్-ఛార్జ్(ఐఐసీ) కిరణ్ ప్రసాద్ సాహు మాట్లాడుతూ, “జితు నిరక్షరాస్యుడు. చట్టబద్ధమైన వారసుడు లేదా నామినీ ఎవరో అతనికి తెలియదు. మరణించిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసే ప్రక్రియను బ్యాంకు అధికారులు అతనికి సరిగ్గా వివరించడంలో విఫలమయ్యారు”అని అన్నారు.
పోలీసుల కథనం ప్రకారం, జితు సోదరి మరణానంతరం, ఆమె ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడానికి అతను బ్యాంకుకు వెళ్లాడు.
అయితే, ఆ ఖాతా అతని సోదరి పేరు మీద ఉన్నందున బ్యాంకు అధికారులు డబ్బు విడుదల చేయడానికి నిరాకరించారు. డబ్బు విత్డ్రా చేసుకోవడానికి మరణ ధృవీకరణ పత్(డెత్ సర్టిఫికేట్), ఇతర పత్రాలను సమర్పించమని అధికారులు అతనికి చెప్పారు. ఇది జితుకు అర్థం కాలేదు.
పోలీసుల జోక్యం.. తిరిగి ఖననం..
అయితే ఈ సంఘటన తర్వాత, మరణించిన తన సోదరి ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడానికి సహాయం చేస్తామని పోలీసులు జితు ముండాకు హామీ ఇచ్చారు. అనంతరం, పోలీసుల సమక్షంలో ఆ అస్థిపంజరాన్ని శ్మశానవాటికలో తిరిగి పూడ్చిపెట్టారు.
ఇదిలా ఉండగా, దివంగత కల్రా ముండా చట్టబద్ధ వారసుడి గురించి తనను ఎవరూ సంప్రదించలేదని స్థానిక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్(బీడీఓ) మానస్ దండపత్ తెలిపారు.
“ఈ విషయం నాకు ఈరోజే తెలిసింది” అని బీడీఓ అన్నారు. “ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమి చేయగలమో చూస్తాము.”
చర్యలు చేపట్టిన అధికారులు..
ఇదిలా ఉండగా, కల్రా ముండా బ్యాంక్ ఖాతాలోని నామినీ కూడా మరణించారని బ్యాంకు వర్గాలు తెలిపాయి. అందువల్ల, ఆమె పేరు మీద జమ అయిన డబ్బుపై హక్కు ఉన్న ఏకైక వ్యక్తి జితు ముండా మాత్రమే.
నిబంధనల ప్రకారం ఏకైక హక్కుదారు అయిన జితు ముండాకు వీలైనంత త్వరగా ఆ సొమ్ము అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక యంత్రాంగం బ్యాంకు అధికారులను ఆదేశించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
