ప్రధాన బొగ్గు గనులు, కర్మాగారాల తనిఖీ వివరాలను, నిర్దేశిత భద్రతా ప్రమాణాల పాటింపును అంచనా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికపై జార్ఖండ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగితంపై పేర్కొన్న భద్రతా ప్రమాణాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని పేర్కొంది.
న్యూఢిల్లీ: బొగ్గు గనులలో క్షీణిస్తున్న భద్రత, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సుమోటోగా విచారణకు స్వీకరించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై జార్ఖండ్ హైకోర్టు సోమవారం ఏప్రిల్ 27న విచారణ జరిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. తదుపరి విచారణకు చీఫ్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, గనుల కార్మికుల జీవించే హక్కుకు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, జస్టిస్ సుజిత్ నారాయణ్ ప్రసాద్, జస్టిస్ సంజయ్ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణను ప్రారంభించింది.
రాతలకూ, వాస్తవాలకూ భారీ వ్యత్యాసం..
సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక సమీక్షా నివేదికను కోర్టుకు సమర్పించింది. ఇందులో ప్రధాన బొగ్గు గనులు, కర్మాగారాల తనిఖీ వివరాలతో పాటు నిర్దేశిత భద్రతా ప్రమాణాల అమలు, అనుగుణ్యత అంచనా వివరాలు ఉన్నాయి.
అయితే, కోర్టు ఆ నివేదికలోని అంశాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగితంపై పేర్కొన్న భద్రతా ప్రమాణాలకు, క్షేత్రస్థాయి వాస్తవానికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని స్పష్టం చేసింది.
తత్ఫలితంగా ప్రమాదకరమైన పనుల సమయంలో కార్మికుల భద్రతను, వారి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకున్నారో వివరించాలని యాజమాన్యాలను కోర్టు ఆదేశించింది.
కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలి..
కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, కనీస వేతన ప్రమాణాల అమలు కోసం ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని కోర్టు కోరింది.
అలాగే, రాష్ట్రంలోని గనుల కార్మికులను రక్షించడంలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై చీఫ్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ తదుపరి విచారణలో వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.
“బొగ్గు గనుల భద్రతా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికతో కోర్టు సంతృప్తి చెందలేదు, అందువల్ల తదుపరి విచారణకు చీఫ్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది” అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది మనీష్ తివారీ స్పష్టం చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
