విశాఖపట్నం దగ్గరలో రెండు భారీ డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ 2026 ఏప్రిల్ 18న రెండు హైపర్‌స్కేల్ డేటా-సెంటర్ పార్కులకు జారీ చేసిన పర్యావరణ అనుమతులను తక్షణమే నిలిపివేయాలని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ డిమాండ్ చేస్తోంది.
ఈ ప్రాజెక్టులను తిరిగి వర్గీకరించాలి. పూర్తి పర్యావరణ ప్రభావ అంచనాల ద్వారా తాజాగా సరిదిద్దాలి.
అంతేకాక ప్రభావితమైన అన్ని గ్రామాలలో చట్టబద్ధమైన ప్రజా విచారణలను నిర్వహించాలి. పర్యావరణ రక్షణ కవచాలను విస్మరించి, స్థానిక సమాజాలను మినహాయించిన అత్యంత లోపభూయిష్టమైన అనుమతి ప్రక్రియ దృష్ట్యా ఈ అత్యవసర చర్యలు అవసరం.
ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పాలన వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనం.
అనుమతులు పొందిన ప్రాజెక్టులు ఇవే..
ఏపీ స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అనుమతి మంజూరు చేసిన ప్రాజెక్టులు:
1) తర్లువాడలో వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్.
2) రాంబిల్లిలో వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్.
నిబంధనల ఉల్లంఘన.. ఒకే ప్రాజెక్టు రెండుగా..
పర్యావరణ అనుమతులు, పృథ్వీ ఎన్విరోటెక్ వారు తయారు చేసిన పర్యావరణ నిర్వహణ ప్రణాళికలను, రాష్ట్ర అప్రైసల్ కమిటీ మినిట్స్‌ను హ్యూమన్ రైట్స్ ఫోరమ్ పరిశీలించింది.
అందులో తేలిందేమిటంటే.. మొదట ‘గూగుల్ లెడ్ హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్’ అనే 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఒకే సంస్థగా చూపారు.
కానీ తర్వాత రెండు సంస్థలుగా, ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం కలవిగా అనుమతులు ఇచ్చారు.
ఇవి పర్యావరణ నియంత్రణ ప్రమాణాలకు భిన్నంగా ఉన్నాయని మా పరిశీలనలో తేలింది. ఈ రెండు వేరువేరు కాదు, ఒకేవిధంగా ఉన్నాయి.
రెండు సంస్థలుగా రెట్టింపు సామర్థ్యంతో అనుమతులు ఇవ్వడంలో అర్థం లేదు. ఇవి అనుమతులిచ్చే విధానాన్ని నీరుగార్చేలా ఉన్నాయి.
పర్యావరణానికి, స్థానికులకు ముప్పు..
ఇవి రెండూ అదానీ గ్రూపు యాజమాన్యంలోనివి. రెండు ప్రాజెక్టులు కలిపి దాదాపు 354 జనరేటర్లతో 2520 లీటర్ల డీజిల్ వినియోగిస్తాయి.
ఏ విధంగా చూసినప్పటికీ ఇవి రెండు భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు. వీటికి విడివిడిగా అనుమతులు తీసుకోవాలి.
కానీ అందుకు భిన్నంగా ఒకే అనుమతితో రెట్టింపు సామర్థ్యం కలిగిన రెండు ప్రాజెక్టులుగా అనుమతించడం చట్ట విరుద్ధం.
మడ అడవులు, అడవి జంతువులు, అడవి మీద ఆధారపడిన నివాసాలు ఉండేవారు, పరిసర ప్రాంతాల వారి జీవనం ప్రమాదంలో పడుతుంది.
ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలకు సంబంధించినవి కావు. భారీ మొత్తంలో ఇంధనం, నీరు వినియోగించుకునే ప్రాజెక్టులు. చాలా కొద్ది మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తాయి.
పర్యావరణ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ఈ రెండు ప్రాజెక్టులు కలిపి కేవలం 1200 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నష్టపోయే ప్రజలను అనుమతులు ఇచ్చేముందు పరిగణనలోకి తీసుకోలేదు.
వీటికి ప్రజల అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని రాష్ట్ర అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
మొత్తంగా పర్యావరణం మీద ప్రభావాన్ని, ప్రజా జీవితాల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం కాలుష్యం అంశానికి పరిమితం కావడం ఆశ్చర్యకరం.
ఈ కారణాలన్నిటి రీత్యా హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది.
ఒక్కొక్క ప్రాజెక్టు విడివిడిగా తీసుకోవాలి, ఆ ప్రాంతంలో ప్రజా జీవితాలు, పర్యావరణం మీద ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలి, సంబంధిత ప్రజలను విచారించాలి, అప్పుడే అనుమతులు మంజూరు చేయాలని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ డిమాండ్ చేస్తున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

