కొత్తగా ప్రారంభం కానున్న సౌత్‌కోస్ట్ రైల్వే జోనులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమరావతి- హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రైన్ కోసం హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను నిర్మించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న రైల్వే జోనులను పునర్నిర్మించి కొత్తగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయనున్నామని 2026 జూను 1 నుంచి ఈ జోను ఉనికిలోకి వస్తుందని కేంద్రమంత్రి ప్రకటించారు.
తాజాగా ప్రతిపాదించిన అమరావతి- హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం పూర్తి అయితే, రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణ సమయం 70 నిమిషాలకు తగ్గిపోతుందని ఆయన తెలియజేశారు.
ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 57 కిలో మీటర్ల నిడివిలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం మొదలుకానున్నదని తెలిపారు.
విశాఖపట్నంలో నిర్మించనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడానికి వచ్చిన వైష్ణవ్‌పై విషయాలను వెల్లడించారు. అమరావతి- హైదరాబాదు మధ్య ఏర్పాటుకానున్న హైస్పీడ్ రైల్ కారిడార్ చెన్నై, బెంగళూరు, పూనే, ముంబైలను కూడా అనుసంధానించనున్నదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరరూపం దాల్చితే హైదరాబాద్ నుంచి పుణేకు 1:55 నిమిషాలలో చేరవచ్చని; పూణే నుంచి ముంబై వరకు 48 నిమిషాలలో చేర వచ్చని; చెన్నై నుంచి బెంగళూరు 73 నిమిషాలలోనూ; హైదరాబాద్ నుంచి బెంగళూరు 2:8 నిమిషాలలోనూ; అమరావతి నుంచి చెన్నైకి 1:52 నిమిషాలలో చేరుకోవచ్చని కేంద్ర రైల్వే మంత్రి వివరించారు.
ఆధునీకరించనున్న మార్గాలు..
“అహ్మదాబాద్-ముంబై మధ్య వేగంగా జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణం పనులకు సంబంధించిన వీడియోలు చూసే ఉంటారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక 500 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 57 నిమిషాలలో పూర్తి చేయవచ్చు.
ఈ ప్రాజెక్టుతో ముంబై, సూరత్, వాపి, బరోడా, అహ్మదాబాద్‌లాంటి ప్రధాన నగరాలన్నీ ఒక సమీకృత ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా మారుతాయి. ప్రస్తుతం అమరావతి- హైదరాబాద్‌ల మధ్య ప్రతిపాదిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా అటువంటి అద్భుతాలే సృష్టించనున్నది” అని వైష్ణవ్ చెప్పారు.
ఈస్ట్‌కోస్ట్ రైల్వే మార్గాన్ని నాలుగు లైన్ల రైల్వే మార్గంగా అభివృద్ధి చేయనున్నామని, ఇందులో భాగంగా రాజమండ్రి, విశాఖపట్నం మధ్య ఇప్పుడున్న రెండు రైల్వే లైన్లను, నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి 9,889 కోట్లతో ఒక ప్రతిపాదనను ఆమోదించామని, ఈ ప్రాజెక్టు ద్వారా కోస్తా తీర ప్రాంతపు రైల్వే నెట్వర్క్ ఆధునీకరించనున్నామని తెలిపారు.
రానున్న కాలంలో చెన్నై నుంచి కలకత్తా వరకున్న రైల్వే మార్గాన్ని నాలుగు లైన్ల మార్గంగా అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. దీంతో ఈ రైల్వే మార్గం గుండా రోజుకు ఐదు వందల కార్గో, ప్రయాణికుల రైల్లు ప్రయాణించనున్నాయని తెలిపారు.
కేంద్ర సిద్ధంగా ఉంది.. రావడమే ఆలస్యం..
ప్రస్తుతమున్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, విశాఖపట్నం రైల్వే డివిజన్లను విలీనం చేసి సౌత్‌కోస్టు రైల్వే జోను ఏర్పాటు చేయనున్నామని ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పరిపాలనా, పర్యవేక్షణా పనులు విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం ఈస్ట్‌కోస్టు రైల్వే జోనులో భాగంగా ఇచ్ఛాపురం నుంచి పలాస వరకున్న 7 రైల్వే స్టేషన్లను కొత్తగా ఏర్పాటు కానున్న సౌత్‌కోస్టు రైల్వే జోనులో కలపనున్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 886 కోట్లు రైల్వే బడ్జెట్ నిధులు కేటాయిస్తే, ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే 10,130 కోట్లు రైల్వే బడ్జేట్ కేటాయించామని రానున్న కాలంలో రాష్ట్రానికి మరో లక్షకోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఆమోదించనున్నామని ఇప్పటికే 74 రైల్వే స్టేషన్లను ఆధునికీరిస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఇండియా ఏఐ మిషన్‌తో ములాఖతయి భారీ కంపెనీలు ఏఐ ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు భారతదేశానికి తరలిరావాలని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఏఐ డెటా సెంటర్ల అభివృద్ధికి అవసరమైన విద్యుత్ సామార్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, మురుగునీటిని శుద్ధిచేసి వినియోగించడానికి కావాల్సిన ప్రాజెక్టులను అనుమతించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని వెల్లడించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
