భవిష్యత్తులో పని స్వరూపం ఎలా ఉండబోతుందో మెటా ప్లాట్‌ఫామ్స్ సంస్థ తాజాగా ఒక సంకేతాన్ని ఇచ్చింది.
గతంలో మీరు చేసే పనులను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిర్వహించేలా వాటికి శిక్షణ ఇవ్వడం, పర్యవేక్షించడం. అయితే, అది కూడా మీకు ఇంకా ఉద్యోగం ఉంటేనే సాధ్యం.
సిలికాన్ వ్యాలీ ప్రమాణాల ప్రకారం కూడా, సోషల్ మీడియా సంస్థ మెటా తన ఉద్యోగుల పని విధానాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టడంలో, అలాగే కార్యకలాపాలను మరింత సరళీకరించి వేగవంతం చేయడంలో అసాధారణ దూకుడును ప్రదర్శిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటికే, మెటా తన ఉద్యోగుల పనితీరు సమీక్షల్లో వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎంతవరకు వినియోగిస్తున్నారనే అంశాన్ని బట్టి గ్రేడింగ్ ఇవ్వడం ప్రారంభించింది.
దాదాపు మేనేజర్లు లేకుండా అత్యంత సరళమైన బృందాలను ఏర్పాటు చేసింది.
అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్‌కు తన విధుల్లో సహాయపడేందుకు “సీఈఓ ఏజెంట్” అనే వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.
చిన్న బృందాలు కూడా పెద్ద బృందాల స్థాయి పనిని వేగంగా పూర్తి చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుందో జుకర్‌బర్గ్, అతని ఉన్నతాధికారులు పదేపదే ప్రస్తావిస్తున్నారు.
మరింత వేగవంతమైన మార్పు ప్రక్రియ.. లేఆఫ్స్..
మెటా సంస్థ తన ఉద్యోగులలో 10% మందిని అంటే సుమారు 8,000 మందిని మే 20న తొలగించనున్నట్టు ప్రకటించింది.
పనితీరులో మరింత సామర్థ్యాన్ని సాధించడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చేస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
అంతకుముందు అదే వారంలో, ఒక అంతర్గత మెమో ద్వారా ఉద్యోగులకు ఒక కొత్త సాఫ్ట్వేర్ టూల్ గురించి సమాచారం అందించింది.
ఈ టూల్ ఉద్యోగుల కీబోర్డ్ కీస్ట్రోక్స్, మౌస్ కదలికలు, క్లిక్ చేసే ప్రదేశాలను నమోదు చేస్తుంది.
తద్వారా “కంప్యూటర్లను ఎలా ఉపయోగించాలో తదుపరి తరం ఏఐ మోడల్స్‌కు నేర్పించడం” దీని ముఖ్య ఉద్దేశం.
మెటా టెక్నాలజీ చీఫ్ ఆండ్రూ బోస్వర్త్ ఒక ప్రత్యేక మెమోలో స్పందిస్తూ- ఏఐ ఏజెంట్లే ప్రధానంగా పనులు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని తెలిపారు.
“మా పాత్ర కేవలం వాటిని నిర్దేశించడం, పర్యవేక్షించడం, అవి మరింత మెరుగ్గా పనిచేసేలా సహాయపడటమే” అని పేర్కొన్నారు.
టెక్ దిగ్గజం మెటా “ఏఐ నేటివ్”గా మారే ప్రణాళికల్లో భాగంగా, తన ఉద్యోగులు, బృందాల పనితీరును సమూలంగా మార్చాలని చూస్తోంది.
ఇందుకోసం ఈ ఏడాది ఏఐ మౌలిక వసతుల కోసం ఏకంగా 135 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని, తన 3.5 బిలియన్ల వినియోగదారుల కోసం ‘పర్సనల్ సూపర్‌ఇంటెలిజెన్స్’ను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పరిణామాలు కొంతమంది సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. “నా ఉద్యోగాన్ని నేనే స్వయంగా ఏఐ పరం చేస్తున్నానా?” అనే సందేహం వారిలో తలెత్తుతోంది.
అమెజాన్.కామ్, బ్లాక్, ఒరాకిల్ వంటి ఇతర టెక్ కంపెనీల లేఆఫ్స్(ఉద్యోగుల తొలగింపు) ప్రకటనల తర్వాత మెటా కూడా తన పరిమాణాన్ని తగ్గించుకుంటోంది.
అయితే, ఈ తొలగింపులకు సంబంధించి ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన కారణాలను చెబుతోంది. వీటిని నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపెట్టిన ఏకైక కంపెనీ బ్లాక్ మాత్రమే.
“మేము తయారు చేస్తున్న, ఉపయోగిస్తున్న ఇంటెలిజెన్స్ టూల్స్, చిన్న, సరళమైన బృందాలతో కలిసి కొత్త పని విధానానికి దారితీస్తున్నాయి. ఇది ఒక కంపెనీని నిర్మించే, నడిపించే పద్ధతినే ప్రాథమికంగా మారుస్తోంది” అని ఆ సంస్థ సీఈఓ జాక్ డోర్సీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
విశ్లేషకులతో జరిగిన ఒక సమావేశంలో డోర్సీ మాట్లాడుతూ “వచ్చే ఏడాదిలోపు, మెజారిటీ కంపెనీలు ఇదే నిర్ణయానికి వచ్చి, ఇలాంటి నిర్మాణపరమైన మార్పులు చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను” అని చెప్పారు.
అయితే ఏఐ ద్వారా వచ్చిన ఉత్పాదకత కంటే, ఇప్పటి వరకు ఏఐ అభివృద్ధి కోసం అయిన భారీ ఖర్చులే టెక్ పరిశ్రమలో జరుగుతున్న లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“బాస్వేర్” నిఘాతో ఉద్యోగుల్లో గుబులు..
రాయిటర్స్ నివేదించిన మెటా కొత్త ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంతర్గత మెమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై పలువురు ఉద్యోగులు మెటా అంతర్గత చర్చా వేదికలో ప్రశ్నలు, ఫిర్యాదులను పోస్ట్ చేశారు.
“ఇది మాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. మేము దీని నుంచి ఎలా తప్పించుకోగలం?” అనేది టాప్ కామెంట్‌గా ఉంది. నిజానికి ఉద్యోగులు దీని నుంచి తప్పుకునే అవకాశం లేదు.
“ఉద్యోగుల వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాలకు మినహాయింపు ఉంటుందా” అని మరొక కామెంట్లో ప్రశ్నించగా దానికి సమాధానం ‘లేదు’ అని వచ్చింది.
ధృవీకరించిన ఉద్యోగులు అజ్ఞాతంగా తమ సంస్థల గురించి సమీక్షలు రాసే ‘బ్లైండ్’ అనే వెబ్సైట్లో, ఒక ఉద్యోగి ఈ ట్రాకింగ్‌ను కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఉత్పాదకతను పర్యవేక్షించడానికి ఉపయోగించే “బాస్వేర్”తో పోల్చాడు.
“తరువాత ఏంటి? మా ఆలోచనలను చదవడానికి మా మెదడుల్లో చిప్స్ అమర్చుతారా? ఇది రాబోయే లే-ఆఫ్స్‌తో సంబంధం లేనిది అని ఎలా అనుకోవాలి?” అని అతను రాశాడు.
మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఇటీవల విడుదల చేసిన కొత్త ఏఐ మోడల్‌కు, ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను నేర్పడానికి మాత్రమే ఈ కొత్త ట్రాకింగ్ టూల్ ఉపయోగపడుతుందని మెటా తెలిపింది.
ఈ డేటాను మరే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబోమని, సున్నితమైన సమాచారాన్ని రక్షించేందుకు తగిన భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
దీనిని పనితీరు సమీక్షల్లో ఉపయోగించరని, మేనేజర్లకు దీనిని చూసే అవకాశం ఉండదని ఆయన చెప్పారు.
పెరుగుతున్న అసంతృప్తి.. ఆందోళన..
బ్లైండ్ వేదికపై మెటా ఉద్యోగులు పెట్టిన పోస్ట్‌ల విశ్లేషణ ప్రకారం, కంపెనీ సిబ్బందిలో అసంతృప్తి మునుపెన్నడూ లేనంతగా పెరిగింది.
2024లో మెటా గురించి వచ్చిన పోస్ట్‌లలో కేవలం 20% మాత్రమే ప్రతికూలంగా ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 80% పైగా పెరిగింది.
మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ మాట్లాడుతూ, ఉద్యోగులకు సమాచారం అందించడానికి నెల రోజుల ముందే లే-ఆఫ్‌ల(తొలగింపుల) గురించి ప్రకటించడం “చాలా ఆందోళన కలిగించే విషయం” అని పేర్కొన్నారు.
అయితే, లీకైన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని అది అవసరమైందని తెలిపారు.
“ఇది స్వాగతించదగ్గ వార్త కాదని, దీనివల్ల ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతారని నాకు తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన మార్గమని మేము భావిస్తున్నాము” అని ఆమె రాశారు.
ఏఐ సామర్థ్యాలపై జుకర్‌బర్గ్ నమ్మకం..
జుకర్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలపై ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అగ్రశ్రేణి పరిశోధకులను నియమించుకోవడానికి గత ఏడాది బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు.
అలాగే తన ప్రకటనల వ్యాపార వృద్ధికి ఈ సాంకేతికత ఎంత కీలకమో ప్రస్తావించారు.
ఇటీవలి నెలల్లో, కంపెనీ లోపల పనితీరును వేగవంతం చేయడంలో, అలాగే ఉద్యోగుల నిర్మాణాన్ని మార్చడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా సహాయపడుతుందనే అంశంపై ఆయన మరింత దృష్టి సారిస్తున్నారు.
“గతంలో పెద్ద బృందాలు అవసరమయ్యే ప్రాజెక్టులను ఇప్పుడు ఒక్క అత్యంత ప్రతిభావంతుడైన వ్యక్తి పూర్తి చేయడాన్ని మనం చూస్తున్నాం” అని జనవరిలో జరిగిన మెటా ఆదాయాల సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
ఆయన ఈ మాటలు చెప్పే సమయానికే, మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 1,500 మంది ఉద్యోగులను తొలగించింది.
మార్చిలో, మెటా ఒక కొత్త ‘అప్లైడ్ ఏఐ ఇంజనీరింగ్’ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతి 50 మంది ఉద్యోగులకు ఒక మేనేజర్ మాత్రమే ఉండేలా అత్యంత సరళమైన నిర్మాణాన్ని రూపొందించారు.
అలాగే ఉద్యోగులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించేలా ప్రోత్సహించడానికి ‘ఏఐ ఫర్ వర్క్’ కార్యక్రమానికి బాస్వర్త్ను నాయకుడిగా నియమించారు.
జుకర్‌బర్గ్ స్వయంగా కూడా తన సమయాన్ని కంపెనీ కోడ్ బేస్ కోసం వెచ్చిస్తున్నారు.
అంతేకాకుండా, సంస్థలోని ఇతర విభాగాల నుంచి తనకు అవసరమైన సమాచారాన్ని సేకరించగలిగే “సీఈఓ ఏజెంట్” అభివృద్ధిలో కూడా ఆయన పాలుపంచుకుంటున్నారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ గతంలో నివేదించింది.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
