1978లో నాటి అమెరికా అధ్యక్షుడు వాటర్‌గేట్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు రికార్డులను తారుమారు చేస్తారేమోనని అమెరికన్ కాంగ్రెస్ భయపడింది. వెంటనే “ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్“ను ఆమోదించింది.
ఆ చట్టం ప్రకారం అధ్యక్షుడి అధికారిక పత్రాలు, కరస్పాండెన్స్, మెయిల్స్ తదితర సమాచారం అంతా అధ్యక్ష భవన సిబ్బంది అమెరికా ప్రభుత్వ ఆర్కైవ్స్‌లో భద్రపరచాలి.
అలాగే సిబ్బంది అధికారిక ఫోన్, లాప్టాప్ తదితర పరికరాలను మాత్రమే విధిగా ఉపయోగించాలి.
ఒకవేళ అత్యవసర పరిస్థితులలో తప్పనిసరిగా తమ వ్యక్తిగత ఫోన్, లాప్టాప్లను వినియోగిస్తే, ఆ కరస్పాండెన్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ తీసి 20 రోజుల్లోపు ఆర్కైవ్స్‌లో భద్రపరచాలి.
లేకుంటే సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడతాయి.
ఆ విధంగా అధ్యక్ష హోదాలో ఉన్న వారు నిర్వహించే అన్ని రకాల కార్యకలాపాలు, వ్యవహారాలు పూర్తిగా పారదర్శకంగా రికార్డుల్లో నమోదయి, భద్రంగా ఉండాలి. ఇది అధ్యక్షుని ఆస్తి కాదు, ప్రజల ఆస్తి అని ఆ చట్టం స్పష్టంగా పేర్కొన్నది.
ట్రంప్ తాజా సవరణలు.. పాత కేసుల రద్దు..
అయితే, ట్రంప్ మెమో రూపంలో ఈ చట్టానికి ఏప్రిల్ 1న సవరణ తీసుకొచ్చారు. ఆయన మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను దొంగిలించాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఆ కేసులపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రంప్ “మార్-ఎ-లాగో” నివాసంపై దాడులు నిర్వహించింది. ఆ కేసు కొనసాగుతున్నది.
ఆ రికార్డులను పొందడానికి నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ అనేక ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే ట్రంప్ రెండవ దఫా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులను రద్దు చేశారు.

మెమోలో లోపాలు.. కోర్టు మెట్లు ఎక్కిన వివాదం..
ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్‌ను ట్రంప్ మెమో రూపంలో 2026 ఏప్రిల్ ఒకటవ తేదీన సవరణలు చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ద్వారా వచ్చిన ఈ మెమోలో చాలా లోపాలు ఉన్నాయి.
గతంలో ఉన్న చట్టం ప్రకారం అధ్యక్ష భవన సిబ్బంది తప్పనిసరిగా ప్రభుత్వ ఫోన్, లాప్టాప్ తదితర పరికరాలను మాత్రమే వినియోగించాలి.
వ్యక్తిగత పరికరాలను వినియోగించకూడదు. విధిగా నిర్వహించాల్సిన విధులను రికార్డుల్లో నమోదు చేసే సిబ్బంది ఎప్పుడూ సాధ్యమైతే అప్పుడు తమ సొంత ఫోన్, లాప్టాప్ తదితర పరికరాలను వాడడాన్ని నివారించాలని సవరణలో పేర్కొన్నారు.
చట్టానికి సవరణ చేసిన ఈ మెమోలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అధికారిక కార్యకలాపాలను ఎలా నమోదు చేయాలి అనేది స్పష్టం చేయలేదు.
ఈ సవరణలపై రెండవ తేదీన జస్టిస్ డిపార్ట్మెంట్ “ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్” తన ఆమోదం తెలియజేయడం ఆందోళనకరం.
ఓఎల్సీ న్యాయ శాఖకు చెందిన విభాగం. ఈ శాఖ కార్యనిర్వాహక శాఖకు న్యాయ సలహాలు ఇస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు ఆ చట్టానికి చేసిన సవరణలపై ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వడంతో, అధ్యక్ష అధికార కార్యకలాపాలను ఎలా నమోదు చేయాలనే సందేహంలో సిబ్బంది పడ్డారు.
ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ చాలా ప్రాముఖ్యత కలిగినదని, దశాబ్దాల చారిత్రాత్మక నేపథ్యం ఉందని, ఆ చట్టానికి చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని వైట్‌హౌస్ సేనేటర్ డేవిడ్ ఆలం కోర్టులో దావా వేశారు.
ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని, అనేక దశాబ్దాలుగా అమలులో ఉన్న కఠిన నిబంధనలను విచక్షణకు అనుగుణంగా మార్పులు చేయడాన్ని ఆయన కేసులో సవాల్ చేశారు.
ఏమైనా దీనిపై న్యాయస్థానమే తుది తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
అయితే అధ్యక్షుడు ట్రంప్ ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ అభ్యంతరాలను తోసిపుచ్చి, తన సవరణలకు అనుగుణంగా రికార్డులు నమోదు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించాడు.
నిపుణుల ఆందోళన: చరిత్రను తిరగరాయడమేనా?..
ఈ సవరణలపై నిపుణులు పలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల రక్షణకు సంబంధించి గతంలో ఉన్న “తప్పనిసరి నమోదు”కు బదులుగా విచక్షణకు అనుగుణంగా నమోదు చేయడం అనేది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ నూతన సవరణ అధ్యక్ష భవన రికార్డులను బాధ్యతాయుతంగా తప్పనిసరిగా చేయాల్సిన వాటిని విచక్షణకు అనుగుణంగా చేసేలా మార్చడాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామని మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాసన్ ఆర్ బారన్ అన్నారు.
వీరు వివిధ ప్రభుత్వ శాఖల ఆర్కైవ్స్, న్యాయ వ్యవహారాల మీద ప్రధానంగా దృష్టి సారిస్తుంటారు. అధ్యక్షుడు జారీచేసిన మెమో గైడ్‌లైన్స్‌గా ఉన్నాయి తప్ప చట్టపరమైన ఆదేశాలుగా లేవు.
బారన్ వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ, అధ్యక్షుడు ట్రంప్ తన మొదటి దఫా అధికారానికి సంబంధించి గాని, ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యేలోగా కానీ అధ్యక్ష భవనానికి సంబంధించిన లక్షల ఈమెయిల్స్, తదితర అధికారిక పత్రాలను బదిలీ చేయకుండా లేదా ధ్వంసం చేయడానికి ఈ సవరణలు ఉద్దేశించబడ్డాయని అన్నారు.
గత చట్టం ప్రకారం రికార్డులు నమోదు చేసే ఉద్యోగులు పొరపాటున తమ వ్యక్తిగత ఫోన్, లాప్‌టాప్‌లలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, తదితర సమాచారాన్ని స్క్రీన్‌షాట్ తీసి అధికారిక ఆర్కైవ్స్‌లో అప్లోడ్ చేయాలి. కానీ నూతన సవరణ తర్వాత అలా వ్యక్తిగత పరికరాలకు వచ్చిన వాటిని తగు మార్పులు చేసి అప్లోడ్ చేయవచ్చు.
అది కూడా అధికారిక నిర్ణయాల ఏకైక సమాచారం, ఇతరత్రా ఎక్కడ అందుబాటులో దొరకని సమాచారం అయితేనే అధికారిక ఆర్కైవ్స్‌లో టైప్ చేసి నమోదు చేయవచ్చు అని బారన్ అన్నారు.
సిబ్బంది వ్యక్తిగత విచక్షణకు వదిలివేయడం అంటే వారి ఇష్టం వచ్చినట్టుగా మార్పు చేయడానికి లైసెన్స్ ఇవ్వడమే అని కూడా బారన్ అన్నారు.
సిబ్బందికి ఇలాంటి అవకాశం ఇవ్వడం చరిత్రను తిరగరాయడానికి అవకాశం ఇవ్వడమే అని కాటో ఇన్స్టిట్యూట్ ఫెలో పాట్రిక్ ఎడింగ్టన్ అన్నారు.
స్వతంత్ర సంస్థల న్యాయ పోరాటం..
లాభాపేక్ష లేకుండా అధికారిక సమాచారం పొందడంపై పనిచేసే అమెరికన్ ఓవర్‌సైట్ అనే సంస్థ, అమెరికన్ హిస్టారికల్ అసోసియేషన్‌తో కలిసి చట్టానికి ట్రంప్ చేసిన సవరణలపై కోర్టులో కేసు వేశారు.
అమెరికన్ ఓవర్‌సైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Chioma Chukwu మాట్లాడుతూ, ఎంపిక చేయబడిన కొన్ని పత్రాలు మాత్రమే భద్రపరచాలనే నూతన సవరణ చట్టవిరుద్ధం అన్నారు.
లాభాపేక్షలేని రెండు సంస్థలైన ‘సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్’, ‘ఫౌండేషన్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్’ కలిసి శుక్రవారం డీసీ జిల్లా కోర్టులో కేసు వేశాయి.
ఈ సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని అందులో కోరాయి.
నూతన సవరణల వల్ల అధ్యక్ష భవన రికార్డులు తిరిగి సంపాదించలేని విధంగా ధ్వంసం అవుతాయని, ఇది చరిత్రకు అతిపెద్ద నష్టం అని వారు తమ పిటిషన్లో వాదించారు.
చేతులెత్తేసిన నేషనల్ ఆర్కైవ్స్..
జాతీయ ఆర్కైవ్స్ ప్రభుత్వ రికార్డులన్నింటినీ భద్రపరచాలి. అయితే ట్రంప్ తన పదవీకాలంలోనే రికార్డులన్నింటినీ యథాతథంగా అప్పగిస్తారా అనే ప్రశ్నకు ఆర్కైవ్స్ అధికారులు సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు.
నేషనల్ ఆర్కైవ్స్‌లో జనరల్ కౌన్సిల్‌గా 26 సంవత్సరాలు పనిచేసిన గారీ స్టెన్ మాట్లాడుతూ, నూతన సవరణ రికార్డుల భద్రతకు సంబంధించి స్పష్టత లేకుండా కలగూరగంపగా ఉందని వ్యాఖ్యానించారు.
జాతీయ ఆర్కైవ్స్ రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థ.
అయితే ట్రంప్ తన మొదటి దఫా అధికారం ముగిసిన అనంతరం రికార్డుల గల్లంతును వెలికి తీయడంలో విఫలం కావడం, ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు నిర్వహించడం, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి తనపైనున్న పాత కేసులను రద్దు చేయడంతో ఆర్కైవ్స్ చేతులుడిగిన సంస్థగా మారింది.
ట్రంప్ రెండవ దఫా అధికారంలోకి వచ్చిన వెంటనే షోగన్ అనే మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎలాంటి కారణాలు లేకుండా తొలగించారు.
ఆర్ లక్ష్మయ్య
(మూలం: వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఏప్రిల్ 25న మాయగాన్ వార్జ్వెజ్ రాసిన వ్యాసం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
