విప్లవం రానిదే కుల నిర్మూలన అసాధ్యం, కుల నిర్మూలన జరగనిదే విప్లవం అసాధ్యం. ఇది కేవలం మాటల గారడీ కాదు, కుల సమాజపు ప్రాథమిక వైరుధ్యం.
(జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో 2026 ఏప్రిల్ 17న ‘బ్రాహ్మణైజేషన్’ అనే అంశం పై జరిగిన సదస్సులో ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే ఆన్లైన్ ద్వారా చేసిన ప్రసంగపు సవరించిన లిఖిత ప్రతి ఇది.)
చాలా కాలం క్రితం, మీలాంటి సభికులను ఉద్దేశించి కుల నిర్మూలన గురించి మాట్లాడుతూ, నా దృక్పథాన్ని ఒక వైరుధ్యం రూపంలో మీ ముందు ఉంచాను:
కుల నిర్మూలన జరగకుండా విప్లవం సాధ్యం కాదు. అలాగే, విప్లవం రాకుండా కుల నిర్మూలన సాధ్యం కాదు.
ఇది వినడానికి ఏదో తెలివిగా అల్లిన వాక్యంలా అనిపించవచ్చు, కానీ అలా కాదు. ఒక నాగరికతగా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతను ఇది అత్యంత కచ్చితంగా వివరిస్తుంది.
భారతీయ సమాజం చిక్కుకుపోయిన వల సజీవ వర్ణన ఇది.
ఈ దేశంలో ప్రతి సామాజిక న్యాయ ఉద్యమం ఎందుకు ఆగిపోయిందో, లేదా ఎందుకు సహకరించుకోబడిందో, ఎందుకు మొగ్గలోనే తుంచబడిందో ఇది మీకు చెబుతుంది.
ఈ రోజు మన చర్చకు కూడా ఈ వైరుధ్యాన్నే ఒక ముసాయిదాగా వాడుకోవచ్చు.
కాబట్టి ఈ రోజు నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది: కులాన్ని ఎందుకు నిర్మూలించాలి?- దాన్ని సంస్కరించలేము, నిర్వహించలేము, సర్దుబాటు చేయలేము, కేవలం నిర్మూలించాలి.
రెండవది: అది ఎలా చేయాలి?- రిజర్వేషన్ రాజకీయాలు లేదా రాజ్యాంగపరమైన మార్పులు అనే సౌకర్యవంతమైన భ్రమల ద్వారా కాదు, మానసికంగా, నిర్మాణాత్మకంగా విప్లవం తీసుకురావడం అనే అత్యంత కఠినమైన, శ్రమతో కూడుకున్న మార్గం ద్వారా.
కులం అంటే ఏమిటి?
కుల నిర్మూలన గురించి మనం మాట్లాడటానికి ముందు, అసలు కులం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి.
కులాన్ని వ్యతిరేకించే వారితో సహా చాలా మందికి దీని గురించి పూర్తిగా అవగాహన లేదని నేను భావిస్తున్నాను.
గడచిన ఐదు దశాబ్దాలుగా ఈ అంశాల పై రాస్తున్న నా అనుభవంతో ఈ మాట చెబుతున్నాను.
అసలు కులం అంటే ఏమిటో వివరించడానికి నేను “ది క్యాస్ట్ కాన్ సెన్సస్” అనే పుస్తకాన్ని ఇటీవల ప్రచురించాను.
సాధారణంగా కులాన్ని ఒక సామాజిక వర్గీకరణగా వివరిస్తారు. ఇదొక సోపానక్రమం. బ్రాహ్మణులు పైభాగంలో, దళితులు అట్టడుగున ఉండి, మిగతా వారందరినీ మధ్యలో అమర్చిన ఒక నిచ్చెన ఇది.
అంతస్తులను కలిపే మెట్లు లేని ఒక బహుళ అంతస్తుల భవనంగా అంబేడ్కర్ దీనిని పోల్చారు. ఈ రూపక వర్ణన తప్పు కాదు, కానీ ఇది ఏమాత్రం సరిపోదు.
ఇది కులాన్ని జీవం లేని, శిలాజంగా మారిన, స్తబ్దమైన వ్యవస్థగా చూపిస్తుంది. బ్రాహ్మణులను తిట్టడం, అవసరం మేరకు అంబేడ్కర్‌ను ఉటంకించడంతోనే మొదలై, అక్కడే ముగిసే అనేక కుల వ్యతిరేక ఉద్యమాల ఆలోచనా విధానం ఇదే. కానీ కాదు, కులాలు పరిణామం చెందాయి, ఇంకా చెందుతున్నాయి: బుద్ధుడి కాలంలో ఉన్న కులాలు ఇప్పుడు లేవు.
మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో, మధ్యయుగంలో లేదా వలసవాద కాలంలో ఉన్నట్లుగా అవి లేవు. అంబేడ్కర్ మాట్లాడిన, రాసిన లేదా పోరాడినప్పటి కులాలు కూడా ఇప్పుడు లేవు.
మన సమకాలీన కులాలు ఎంతో పరిణామం చెందాయి. అవి ప్రధానంగా రాజ్యాంగం, వలసవాద అనంతర రాజకీయ-ఆర్థిక వ్యవస్థల ద్వారా రూపుదిద్దుకున్నాయి.
అందుకే నేను వాటిని “రాజ్యాంగ కులాలు” అని పిలుస్తాను. నా “రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్” పుస్తకంలో మీరు దీనిని చూడవచ్చు. మనం ఎదుర్కొంటున్నవి ఈ సమకాలీన కులాలనే.
కులాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే, అది భారతీయ సమాజంతో ఏకరూపత కలిగిన ఒక నిర్మాణం అని గ్రహించాలి. ఏకరూపత అంటే ఏమిటి? భారతీయ సమాజంలో కులం అనేది అనేక సంస్థలలో ఒకటిగా మాత్రమే లేదని దీని అర్థం.
కులం, భారతీయ సమాజం ఒకే ఆకారాన్ని, ఒకే అస్తిపంజరాన్ని పంచుకుంటున్నాయని అర్థం. అంటే, మీరు భారతీయ సమాజం నుంచి కులాన్ని తీసేస్తే, మిగిలేది ‘కులం లేని భారతీయ సమాజం’ కాదు; అది మూలాల నుంచే భిన్నంగా ఉండే, ఇంతవరకు ఉనికిలో లేని సరికొత్త సమాజం అవుతుంది.
దీని అర్థం ఏమిటో ఆలోచించండి. కులం అనేది భారతీయ సమాజపు ఒక లక్షణం కాదు, అది భారతీయ సమాజపు వాస్తుశిల్పం. కులం అనేది సమాజం లోపల కూర్చునేది కాదు, సమాజమే కులం పునాది పై కూర్చుంది. 
సమాజపు అణువణువునా కులం..
ఆర్థిక వ్యవస్థను చూడండి: కుల ఆధారిత శ్రమ విభజన అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రమాదవశాత్తూ జరిగిన పరిణామం కాదు. వృత్తులను వారసత్వంగా కేటాయించడం – అంటే ఊడ్చడం, చర్మం పదును చేయడం, మలమూత్రాలు ఎత్తడం, బట్టలు ఉతకడం, చేపలు పట్టడం, వ్యవసాయం చేయడం వంటి పనులకు కొన్ని వర్గాలను మాత్రమే పరిమితం చేయడం– ఇది మార్కెట్ నిర్ణయించిన ఫలితం కాదు. ఇది స్వచ్ఛంద నైపుణ్యం అంతకంటే కాదు. ఇది బలవంతంగా రుద్దబడిన ఆర్థిక వాస్తుశిల్పం.
ఇందులో మీ పుట్టుక మీ పనిని నిర్ణయిస్తుంది, మీ పని మీ ఆదాయాన్ని నిర్ణయిస్తుంది, మీ ఆదాయం మీ జీవన అవకాశాలను నిర్ణయిస్తుంది. తరతరాలుగా ఈ అసమానతలను కొనసాగించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ అవకాశాలను అసమానంగా ఉంచారు.
భూమిని చూడండి: భారతదేశంలో భూ యజమాన్యం అనేది ఎప్పుడూ కులానికి సంబంధించిన విషయంగానే కొనసాగుతోంది. ఈ దేశపు వ్యవసాయ నిర్మాణం – ఎవరికి భూమి ఉంది, ఎవరు దున్నుతారు, ఎవరు భూమి లేని వారు- ఇవన్నీ ఇప్పటికీ కచ్చితంగా కుల మార్గాలనే అనుసరిస్తున్నాయి.
యూపీ, బీహార్, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని గ్రామాల్లో దళితులకు భూహక్కులు నిరాకరించబడుతున్నాయంటే, మీరు చూస్తున్నది కేవలం పక్షపాతంతో కూడిన చెదురుమదురు సంఘటనలను కాదు. కులం తన ఆర్థిక నిర్మాణాన్ని పునరుత్పత్తి చేసుకోవడాన్ని మీరు చూస్తున్నారు.
వివాహాన్ని చూడండి: స్వకుల వివాహం- అంటే సొంత కులంలోనే పెళ్లి చేసుకోవడం అనేది కులాన్ని తరతరాలుగా బతికించే ఒక జీవశాస్త్రపరమైన యంత్రాంగం. అంబేడ్కర్ కులానికి కీలకమైనదిగా గుర్తించింది దీనినే. అంటరానితనాన్ని కాదు, మైలను కాదు, ఆఖరికి సోపానక్రమాన్ని కూడా కాదు. స్వకుల వివాహాన్నే!
ఎందుకంటే ప్రజలు తమ కులంలోనే వివాహం చేసుకున్నంత కాలం కులం పునరుత్పత్తి అవుతుంది. కులం పునరుత్పత్తి అవుతున్నంత కాలం, దానితో ముడిపడి ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు, సాంస్కృతిక ఆధిపత్యం అన్నీ పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి.
మతాన్ని చూడండి: సిద్ధాంతపరంగా ఎలా వర్ణించినప్పటికీ, చారిత్రాత్మకంగా ఆచరణలో ఉన్న హిందూమత ఆచారాల క్రమం పూర్తిగా కుల ఆధారితమైనదే.
గుడిలోకి ఎవరు వెళ్లాలి, పూజ ఎవరు చేయాలి, శాస్త్రాలు ఎవరు చదవాలి, చట్టాన్ని ఎవరు అన్వయించాలి? శతాబ్దాలుగా ప్రధాన స్రవంతి హిందూ ఆచారాల నిర్మాణం అంతా కుల విశేషాధికారాల నిర్మాణమే.
రాజకీయాలను చూడండి: ఓటు బ్యాంకు, కుల సమీకరణాలు. చాలా భారతీయ ఎన్నికలలో ఓటింగ్ సరళిని అంచనా వేయగల ఏకైక శక్తివంతమైన సాధనం కులం. రాజకీయ పార్టీలన్నీ సిద్ధాంతాల ముసుగులో ఉన్న కుల సమాఖ్యలే అనడం వాస్తవం.
కులాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునే పార్టీలు కూడా అధికారం కోసం కులాల ఆధారంగానే సమీకరణాలు చేసుకుంటాయి. భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో కుల గణాంకాలను మీరు విస్మరించలేరు. బహుజన్ సమాజ్ పార్టీ ఎదుగుదలను, పతనాన్ని గమనించండి!
కుటుంబాన్ని చూడండి: వంటగదిని చూడండి. ఎవరు ఎక్కడ కూర్చోవచ్చు, ఎవరు ఎవరిని ముట్టుకోవచ్చు, ఏ బావి నుంచి నీరు తోడుకోవచ్చు, ఎలాంటి బట్టలు వేసుకోవచ్చు, సొంత పెళ్లిలో గుర్రం ఎక్కి ఎవరు ఊరేగవచ్చు వంటివి గమనించండి.
కులం ప్రతిచోటా ఉంది. ఆర్థిక వ్యవస్థలో, రాజకీయాల్లో, మతంలో, పెళ్లిలో, కుటుంబంలో, వంటగదిలో, శరీరంలో కూడా ఉంది. ఇది సమాజం లోపల పనిచేసే వ్యవస్థ కాదు, ఇది సమాజం నడిచే ‘ఆపరేటింగ్ సిస్టమ్’. అందుకే, అంతగా వినాశనాన్ని సృష్టించే ఈ వ్యవస్థను పడగొట్టడం అంత కష్టం.
మానసిక బానిసత్వం – బ్రాహ్మణిజం పాత్ర..
కానీ, కేవలం నిర్మాణం మాత్రమే కులపు పూర్తి మొండితనాన్ని వివరించలేదు. కులం కేవలం ఒక నిర్మాణాత్మక ఏర్పాటు మాత్రమే అయితే – అంటే ఎవరికి ఏమి ఉండాలి, ఎవరు ఏమి చేయాలి అనే దానికి మాత్రమే పరిమితమైతే – దాన్ని భూసంస్కరణలు, సంపద పునఃపంపిణీ, ఆర్థిక పునర్నిర్మాణం ద్వారా సిద్ధాంతపరంగా ధ్వంసం చేయవచ్చు. అది కష్టమే, కానీ ఊహించదగినదే.
అయితే, ప్రాచీన సమాజాలలో ఉండి కాలక్రమంలో కనుమరుగైన ఇతర సామాజిక అంతరాల కంటే కులాన్ని గుణాత్మకంగా భిన్నమైనదిగా చేసేది ఏమిటి? బహుశా ప్రపంచంలోనే అత్యంత బలమైన సామాజిక నియంత్రణ వ్యవస్థగా దీనిని మార్చింది ఏమిటి? శతాబ్దాల తరబడి చేసిన బ్రెయిన్ వాషింగ్ వల్ల ఇది సామాజిక నిర్మాణంలోనే కాకుండా, సామాజిక మనస్తత్వ శాస్త్రంలో కూడా పాతుకుపోయింది.
ఇది శరీరాన్ని మాత్రమే కాదు, మెదడును కూడా వలస రాజ్యంగా మార్చుకుంది. ప్రవర్తననే కాదు, నమ్మకాన్ని కూడా. ఆచరణనే కాదు, గుర్తింపును కూడా. ఇక్కడే నేడు హిందుత్వ ముసుగులో ఉన్న బ్రాహ్మణిజం పాత్ర ముందుకొస్తుంది!
కులపు ‘తెలివితేటలు’- ఈ పదాన్ని నేను పూర్తి వ్యంగ్యంగా, పూర్తి భయానకార్థంలో వాడుతున్నాను- తన స్వంత బాధితులనే తన చట్టబద్ధతను నమ్మేలా చేయడంలో ఉంది.
పీడితులలోనే “శ్రేణీకృత అసమానత”ను ఇది సృష్టించిందని అంబేడ్కర్ చెప్పారు. అంటే, ఈ సోపానక్రమంలో ప్రతి స్థాయికీ, దాని కింది స్థాయిపై కొద్దిపాటి ఆధిపత్యాన్ని ఇస్తూ వ్యవస్థలో వారిని భాగస్వాములను చేస్తుంది.
శూద్రుడు అతిశూద్రుడిని తక్కువ చేసి చూడగలడు. కింది స్థాయి ఓబీసీ దళితుడిని తక్కువ చేసి చూడగలడు. దళితుడు సైతం తనకంటే అట్టడుగున ఉన్న మరొకరిని చూసి ఆధిక్యతను ప్రదర్శించగలడు.
ప్రతి ఒక్కరికీ ఈ వ్యవస్థ కూలిపోతే ఏదో ఒకటి కోల్పోతామనే భయం ఉండటం వల్లే, ఈ పిరమిడ్ పగలకుండా నిలబడింది.
తమ దరిదాపుల్లో ఉండే కులాల మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం జరిగే పరస్పర విధ్వంసక పోరాటం, మొత్తం నిర్మాణాన్ని ఎవరూ సవాలు చేయకుండా కాపాడింది.
కుల వ్యవస్థ దీర్ఘాయువు వెనుక ఉన్న రహస్యం ఇదే. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యధిక కాలం మనుగడ సాగిస్తున్న మానవ నిర్మిత వ్యవస్థగా నిలిచింది. ఈ సామాజిక మనస్తత్వమే స్వయంచాలక సామాజిక నియంత్రణగా మారింది. దీని ప్రభావం ఎంత లోతైనదంటే, అణచివేతకు గురైన వారే, తమ సొంత అణచివేతను అమలు చేసే సాధనాలుగా మారారు.
ఈ పరిస్థితి ఆధిపత్య వర్గాలను కూడా వదిలిపెట్టలేదు. పవిత్రత-మైల అనే ఆచారబద్ధమైన తర్కాన్ని, ఈ సోపానక్రమం సహజమైనదే అని నిజంగా నమ్మే అగ్రకుల వ్యక్తి, కేవలం ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుంటున్న విలన్ మాత్రమే కాదు; వారు కూడా శతాబ్దాల ఈ సామాజిక కండిషనింగ్ కు ప్రతిరూపమే.
కులం పీడితుల మానవత్వాన్ని ఎలాగైతే నిరాకరించిందో, ఆధిపత్య వర్గాల మానవత్వాన్ని కూడా అలాగే వికృతం చేసింది. అది వేరొక రూపంలో ఉండవచ్చు, కానీ వికృతం కావడం మాత్రం నిజం.
నేను వారి భాగస్వామ్యాన్ని సమర్థించడానికి ఈ మాట చెప్పడం లేదు. భాగస్వామ్యాన్ని నిలదీయాలి, బాధ్యత వహించేలా చేయాలి. ఈ మానసిక సమస్య లోతును మనం తప్పుగా అర్థం చేసుకుంటే, సరైన పరిష్కారాలను చూపలేము అనే ఉద్దేశ్యంతోనే చెబుతున్నాను.
ఇలాంటి పెను సంక్షోభంలో సరిపోని పరిష్కారాలు చూపించడం, అసలు పరిష్కారం లేకపోవడం కంటే ప్రమాదకరం.
ఎందుకంటే, మూల నిర్మాణం అలానే ఉన్నప్పటికీ మనం పురోగమిస్తున్నామనే భ్రమను అవి సృష్టిస్తాయి.
కమ్యూనిస్టు ఉద్యమంలో లోపించిన దానిని మీలో కొందరు గుర్తించి ఉండవచ్చు: వారు నిర్మాణాత్మక విప్లవంపై దృష్టి పెట్టారు కానీ, బ్రాహ్మణిజం సృష్టించిన సామాజిక మనస్తత్వాన్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారు.
దళిత ఉద్యమం గురించి కూడా ఇదే చెప్పవచ్చు: వారు సామాజిక మనస్తత్వాన్ని ప్రశ్నించారు కానీ, నిర్మాణాత్మక అంశాన్ని విస్మరించారు. ఈ రెండింటినీ కలిపి ఎదుర్కోవాలి.
నా వైరుధ్య సిద్ధాంతం కుల నిర్మూలనను విప్లవంతో సమానం చేస్తుంది. విప్లవం అంటే వర్గ పోరాటాల పరాకాష్ట ద్వారా మార్క్స్ భావించిన సమూల పరివర్తన. ఆ వర్గ పోరాటం ఏమిటన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
రాజ్యాంగం – కులాల పటిష్ఠత..
అంటరానితనం రద్దు, సమాన హక్కులు, దళితులు, ఓబీసీలకు సానుకూల వివక్ష(రిజర్వేషన్లు) వంటి రాజ్యాంగ సంస్కరణలు విప్లవాత్మక చర్యలనే భ్రమను ప్రజల్లో సృష్టించాయి.
అవును, చారిత్రక పరిణామక్రమంలో అవి ముఖ్యమైనవే కావచ్చు, కానీ అవి కచ్చితంగా విప్లవాత్మకమైనవి కావు.
రాజ్యాంగాన్ని బూర్జువా వర్గాల సాధనంగా నేను కొట్టిపారేయను. అప్పటి శక్తుల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే, బహుశా అంతే సాధ్యపడి ఉండవచ్చు.
అయితే, ఆ బూర్జువా చట్రంలోనే అయినా, అనేక ఇతర దేశాలు చేసినట్లుగా కులాలను బలహీనపరచడం, అసమానతలు తగ్గించడం, ప్రజల సామర్థ్యాలను పెంచడం వంటి సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రాజ్యాంగంలో పొందుపరిచే అవకాశం ఉండింది. కానీ, రాజ్యాంగంలో జరిగింది దీనికి పూర్తిగా విరుద్ధం; అది కులాలను పటిష్ఠం చేసింది, అసమానతలను పెంచింది, ప్రజల సామర్థ్యాలను కుంగదీసింది.
ప్రజలు ఎంతో కీర్తించే రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియ, వాస్తవానికి ఒక ఆత్మవంచన. నేను దీనిని పైపైన మాత్రమే స్పృశించగలను.
మరింత వివరణ కావాలనుకునే వారు నా తాజా పుస్తకం “దళిత్స్ అండ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్”, రాబోయే నా పుస్తకం “వి ది నాన్-పీపుల్ ఆఫ్ ఇండియా” చదవవచ్చు.
రాజ్యాంగంలో ఎంతో విప్లవాత్మక చర్యగా భావించే ‘అంటరానితనం రద్దు’ నే తీసుకుందాం. పాశ్చాత్య నాగరికతతో సంబంధాలు ఏర్పరచుకున్న అగ్రకుల సంస్కరణవాదులంతా, అంటరానితనం అనే అమానవీయ ఆచారం పట్ల సిగ్గుపడి, దాన్ని రద్దు చేయాలని కోరుకున్నారన్నది చారిత్రక సత్యం. కానీ, పొరపాటున కూడా వారు కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. గాంధీ ఈ ధోరణికి ప్రసిద్ధ ప్రతినిధి. సహజంగానే, రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు వారు ఏకగ్రీవంగా అంటరానితనాన్ని రద్దు చేశారు.
భారతదేశంలో ‘నన్ను ముట్టుకోకు’ అనే తరహా అంటరానితనం అత్యంత బలహీనంగా ఉన్న బెంగాల్‌కు చెందిన కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే దీనిని ప్రశ్నించారు. వారిలో మొదటి వ్యక్తి మతువా ఉద్యమ వ్యవస్థాపకుడు హరిచంద్ ఠాకూర్ మునిమనవడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన మొదటి బారిస్టర్ ప్రమథ రంజన్ ఠాకూర్.
కులాలు సజీవంగా ఉన్నప్పుడు అంటరానితనాన్ని ఎలా రద్దు చేయగలరో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
భద్రలోక్ వర్గానికి చెందిన మరో ఇద్దరు బెంగాలీలు ఆయనకు మద్దతు పలికారు. వీరు తప్ప ఇంకెవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తమను తాము అభినందించుకునే కోరస్లో మునిగిపోయారు.
కులాన్ని రద్దు చేయడం సాధ్యం కాదా? కులాలను రద్దు చేస్తే వారి రిజర్వేషన్లు పోతాయనే వ్యూహాత్మక వాదనతో షెడ్యూల్డ్ కులాల సభ్యులను మౌనంగా ఉంచారు. అది నిజమేనా?
1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా, వలస పాలకులు పరిపాలనా సౌలభ్యం కోసం సృష్టించిన “షెడ్యూల్డ్ క్యాస్ట్” అనే వర్గం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. అది హిందూ కులం కాదు. కాబట్టి, వారు నిజంగా కోరుకుంటే, ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి భంగం కలగకుండా హిందూ కుల వ్యవస్థను రద్దు చేసి ఉండవచ్చు.
లేదు, వారు కులాన్ని వదులుకోవాలనుకోలేదు. బ్రిటిష్ వారి ‘విభజించి పాలించు’ వ్యూహంలో కులం, మతం తమ సత్తా చాటాయి. వలసవాద అనంతర పాలకులు కూడా ఆ ఆయుధాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు. పై కుట్రలతో కులాలు పరిరక్షించబడ్డాయి.
నిజమైన లౌకికవాదం నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ మతం పరిరక్షించబడింది. రాజ్యాంగం మనకు లౌకికవాదాన్ని ఇచ్చిందనే అభిప్రాయం ఉన్నప్పటికీ, రాజ్యాంగ పీఠిక దాటితే ఎక్కడా ఈ పదం కనిపించదు. ఈ పీఠికలో కూడా 1976 ఎమర్జెన్సీ కాలంలో ఇది అక్రమంగా చేర్చబడింది.
పాలకులకు నిజాయితీ ఉండి ఉంటే, రిజర్వేషన్లు సైతం కుల నిర్మూలన ప్రాజెక్టుకు సహాయపడేవి. దళితులను ఉద్ధరించడానికి ఇచ్చే ‘సహాయ హస్తం’లా కాకుండా, సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షను అడ్డుకునే శక్తిగా దాని వెనుక ఉన్న తర్కాన్ని మార్చి ఉండాలి.
ఇలా చేసి ఉంటే, వీలైనంత త్వరగా ఈ అసాధారణ విధానాన్ని తొలగించేలా తమను తాము సరిదిద్దుకునే బాధ్యతను సమాజం పై మోపినట్లు అయ్యేది.
కానీ ప్రస్తుత నిబంధన దళితులను పరోక్షంగా అసమర్థులుగా ముద్ర వేస్తోంది. పాలకులు ఇందుకు బదులుగా, “సామాజిక, విద్యాపరమైన” వెనుకబాటుతనం అనే వింత ప్రమాణంతో “వెనుకబడిన కులాలకు” రిజర్వేషన్లను విస్తరించారు.
నేటికీ అత్యంత వెనుకబడిన దేశాలలో ఒకటిగా ఉన్న భారతదేశంలో ఏ వర్గం ఈ ప్రమాణానికి సరిపోదు? “మేము సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాము” అని చెబుతూ, రిజర్వేషన్ల కోసం దాదాపు అన్ని వర్గాలు డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు.
ప్రజలను అణచివేయడానికి వలస పాలకులు ఉపయోగించిన పూర్తి రాజ్య యంత్రాంగాన్ని, వలసవాద అనంతర పాలకులు కూడా యథాతథంగా స్వీకరించారనే వాస్తవంలోనే దీని మర్మం దాగి ఉంది.
సార్వత్రిక ఓటు హక్కు, న్యాయస్థానాల ద్వారా అమలు చేయగల ప్రాథమిక హక్కులు, అమలు చేయలేని ఆదేశిక సూత్రాలు వంటి కొన్ని సానుకూల మార్పులను కాలానుగుణంగా చేర్చారు. కానీ అవి ఈ విశాల నిర్మాణాత్మక తర్కంలో కొట్టుకుపోయాయి.
ఎంతో ఆర్భాటంగా రూపొందించిన రాజ్యాంగం, తన కంటెంట్‌ను ఎక్కువగా 1935 చట్టం నుంచే తీసుకుంది. వలస ప్రభుత్వ మౌలిక సదుపాయాలను చట్టబద్ధం చేసింది. కాబట్టి ఈ రాజ్యాంగ రాజ్యం అనేది, వలస రాజ్యానికి తోడుగా బ్రాహ్మణీయ కుటిలత్వం తోడై, భారతీయ ప్రజలను అణచివేయడానికి తయారైన అద్భుత యంత్రం. ఈ రోజు మనం ఆచరణాత్మకంగా అనుభవిస్తున్నది ఇదే.
ఓటు బ్యాంకు రాజకీయాలు – ప్రజాస్వామ్య లోపాలు..
అత్యంత విప్లవాత్మకమైన సార్వత్రిక ఓటు హక్కు నిబంధననే తీసుకోండి. ఎన్నికల వ్యవస్థగా ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానాన్ని ఎంచుకోవడం వల్ల దాని సానుకూల సారాంశం అంతా తుడిచిపెట్టుకుపోయింది.
ప్రజా భాగస్వామ్యం అనే భ్రమను కల్పిస్తూనే, నిర్మాణాత్మకంగా ఎక్కువ ఓట్లను వృథా చేసే వ్యవస్థ ఇది. భారతదేశాన్ని పాలించిన ఏ పార్టీ కూడా 50% పైగా ప్రజాదరణ ఓట్లను సాధించలేదు, అయినా తాము అజేయులమని ప్రకటించుకున్నాయి. దీని అర్థం ఏమిటి? పాలకులకు పాలించేందుకు ఏ క్షణంలోనూ 50% కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ సమ్మతిని తెలుపలేదనే కదా.
ఎన్నికల తంతు మినహాయించి, ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి ప్రజలకు వేరే మార్గం లేదు. వాస్తవానికి ఈ ఎఫ్‌పీటీపీ ఎన్నికలకు కనీస ప్రమాణం ఏమీ లేదు. కాబట్టి భారతీయ ప్రజాస్వామ్యంలో నిర్ణయాత్మకమైనది ప్రజల ఓట్లు కాదు, రాజకీయ పార్టీల వ్యూహాలు.
దీనికి ప్రత్యామ్నాయం లేదా? 1919లో మాంటేగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల ద్వారా ఎన్నికల విధానాన్ని ప్రతిపాదించినప్పుడు, భారతదేశ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సెలెక్ట్ కమిటీ దామాషా ప్రాతినిధ్య విధానాన్ని సూచించింది. కానీ దానిని పక్కనపెట్టి, వెస్ట్మిన్స్టర్ (బ్రిటిష్) వ్యవస్థను భారతీయ ఎన్నికలకు డిఫాల్ట్‌గా తీసుకున్నారు. అప్పటి నుంచి భారతీయ రాజకీయ నాయకులంతా ఈ వ్యవస్థకే అలవాటు పడ్డారు.
రాజ్యాంగ రచన సమయంలో ఎన్నికల విధానంపై తీవ్ర చర్చ జరిగింది. ఎక్కువ మంది ముస్లిం సభ్యులు, కొందరు ముస్లిమేతర నాయకులు కూడా పీఆర్ విధానానికి మద్దతు ఇచ్చారు. కానీ దాన్ని విస్మరించారు.
ప్రముఖ ఆర్థికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీఆర్ గాడ్గిల్ సైతం పీఆర్ విధానానికి మద్దతు తెలిపారు. కానీ, గ్రాన్విల్లే ఆస్టిన్ ‘ఆలిగార్కీ’ (కొద్దిమంది పాలన) గా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకులు దీన్ని ఎప్పటికీ అంగీకరించరని ఆయన బహిర్గతం చేశారు.
కేంద్రంలో ఒకే పార్టీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుకున్నారు, అది కేవలం ఎఫ్‌పీటీపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
పీఆర్ విధానం ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది అనుకూలీకరించదగిన వ్యవస్థ. ఎఫ్‌పీటీపీ మాత్రం చాలా దృఢమైనది. దేశ పరిస్థితులకు తగ్గట్టుగా పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి దగ్గరగా పీఆర్‌ను తీర్చిదిద్దుకోవచ్చు. కులాల నేపథ్యంలో చూస్తే, పీఆర్ విధానం కుల రాజకీయాలను చాలా మటుకు తగ్గించి ఉండేది.
స్వాతంత్ర్య పోరాట ప్రభావంతో వచ్చిన కాంగ్రెస్ తొలి దశాబ్దపు ఆధిపత్యం తర్వాత, రాజకీయ-ఆర్థిక ముఖచిత్రంలో వచ్చిన మార్పులు ఎన్నికల పోటీని మరింత తీవ్రం చేశాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల రాజకీయాల్లో కుల ఆధారిత ఓటు బ్యాంకులు కేంద్ర బిందువుగా మారాయి. ఆధునిక ప్రభుత్వ నిర్వహణలో కులానికి సాధనపరమైన జీవాన్ని ఇవి తిరిగి అందించాయి.
రాజకీయ అధికారం కులం ద్వారా సమీకరించబడినప్పుడు, అది కులాల మధ్య అధికారాన్ని పునఃపంపిణీ చేస్తూనే, ఒక వర్గంగా కులాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు కులపు తర్కాన్ని బలహీనపరచడం లేదు. మీరు పూర్తిగా ఆ తర్కం లోపలే పనిచేస్తున్నారు.
కుల గుర్తింపును రాజకీయ అధికారానికి కరెన్సీగా మార్చడం ద్వారా, మీరు ఒక రకంగా ఆ గుర్తింపును బహుకరిస్తున్నారు. అలా చేయడం ద్వారా సామాజిక జీవితంలో కులాన్ని తక్కువ చేయాల్సింది పోయి, మరింత ప్రధానమైనదిగా మారుస్తున్నారు.
విప్లవమే ఏకైక మార్గం..
కులం దుర్మార్గం గురించి, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం గురించి తగినంత మాట్లాడుకున్నాం. ఇప్పుడు కఠినమైన ప్రశ్న వైపు వెళ్దాం: దానిని ఎలా నిర్మూలించాలి? నా ప్రాథమిక వైరుధ్య సిద్ధాంతానికి అనుగుణంగా, ఈ దేశంలో విప్లవం గురించి ఎలా ఆలోచించాలి?
ఇది వినడానికి ఏదో గొప్ప వాదనలా అనిపించవచ్చు – అంటే నిమిషాల్లో భారతీయ విప్లవం కోసం ఏదో రహస్య మంత్రం ఉపదేశించబోతున్నట్లుగా. అలాంటిదేమీ లేదు. నేను చేయదలుచుకున్నది చాలా చిన్న ప్రయత్నం: కొన్ని కీలకమైన విధానాలను సూచించడం మాత్రమే. ప్రస్తుతం ఉన్న ఈ గందరగోళ పరిస్థితుల్లో, కనీసం అది కూడా విలువైనదేనని నా నమ్మకం.
నేను విప్లవం అన్నప్పుడు, దానికి అర్థం కేవలం రాజ్యధికారాన్ని కైవసం చేసుకోవడం మాత్రమే కాదు. అది విప్లవంలో ఒక భాగం కావచ్చు.
విప్లవం అంటే అత్యంత సంపూర్ణమైన, సమగ్రమైన అర్థంలో నేను చెబుతున్నాను – నిర్మాణాలు, సంబంధాలు, చేతన అన్నింటిలో ఏకకాలంలో వచ్చే సమూల పరివర్తన. ఇవన్నీ వేర్వేరు విభాగాలు కావు, ఇవన్నీ వర్గ పోరాట ప్రక్రియలో అంతర్భాగం కావాలి. అసలు ఈ వర్గ పోరాటం అంటే ఏమిటి? బహుశా ఆ ప్రశ్నలోనే కీలకమైన పరిష్కారం దాగి ఉండవచ్చు.
వర్గం అనగానే దానికి ఆర్థిక విషయాలతో సంబంధం ఉంటుందని చాలామంది అనుకుంటారు. మన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ భావనను మరింత లోతుగా నాటుకునేలా చేశాయి.
వర్గాలు అనేవి ఎవరో ఊహించుకున్న ఆదర్శవంతమైన పరిస్థితుల ఆధారంగా కాకుండా, సమాజంలో అప్పటికప్పుడు ఉన్న వాస్తవిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్భవిస్తాయి.
“ఇప్పటి వరకు ఉన్న సామాజిక చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే” అన్న కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకటన కూడా వర్గాలు ఇతర అన్ని వైరుధ్యాలను కలుపుకుని ఉంటాయని సూచిస్తుంది.
ఏ సమాజంలోనైనా వర్గాలు కులం, లింగం, జాతులు, తెగలు తదితర అంశాలతో మిళితమై ఉంటాయి. వీటన్నింటికి సంబంధించిన వైరుధ్యాలను చేతనతో కూడిన పోరాటాల ద్వారా పరిష్కరించాలి.
దానిని వర్గ పోరాటంలో అంతర్భాగంగా చూడాలి. మనం పొరబడ్డాం. ప్రపంచం పొరబడింది. ఆ పొరపాటు మనల్ని విప్లవాలకు దూరం చేసింది.
పెరుకుపోయిన ఈ గందరగోళాన్ని తొలగించడానికి మనం తీవ్రంగా కృషి చేయాలి. కులాన్నే తీసుకుందాం: గతంలో ఎన్నడూ లేనంతగా నేటి భారతదేశం కులమయంగా మారిపోయింది.
రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు, ఎన్నికల రాజకీయాలే ఇందుకు కారణం. నేడు ప్రతి కులం, ఉప కులం గర్వంగా తమ గుర్తింపును చాటుకుంటున్నాయి.
ఆశ్చర్యకరంగా, తీవ్ర అణచివేతకు గురైన కులాలే తరచుగా ఈ గుర్తింపు ప్రదర్శనలో ముందుంటున్నాయి.
ఈ రకమైన ఐడెంటిటీ పాలిటిక్స్(గుర్తింపు రాజకీయాలు) ఒక బలమైన మత్తు లాంటివి. అవి ప్రజలను సమీకరించగలవు అనేది నిజమే, కానీ మనం ఏ సంకెళ్లనైతే ఛేదించుకోవాలనుకుంటున్నామో, తిరిగి అవే గడులలో ఇవి మనల్ని బంధించే ప్రమాదం ఉంది.
దానిని మనం చేతనతో ఎదుర్కోవాలి: దాన్ని పూర్తిగా విస్మరించకూడదు, అలాగని అతిగా ఆదర్శీకరించకూడదు.
మన ముందున్న కర్తవ్యం కఠినమైనది. కానీ తప్పనిసరి. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయాన్ని మనం అంగీకరించలేము: సమాజాన్ని ఇలాగే కుళ్లిపోనివ్వలేము, అత్యధిక ప్రజలు మానవ గౌరవం లేని పరిస్థితుల్లో బతుకుతున్నారనే వాస్తవాన్ని అంగీకరించి మిన్నకుండలేము, ఆ అన్యాయం వల్ల కొద్దిమంది లబ్ధి పొందుతూ, దాన్ని అమలు చేస్తూ ఉంటే మౌనంగా చూస్తూ ఊరుకోలేము.
మన ముందు ఒకటే ఎంపిక ఉంది– ఈ వాస్తవాన్ని ఎదుర్కొని దాన్ని మార్చడం, లేదా ఈ దుస్థితి కొనసాగడంలో మనమూ భాగస్వాములం కావడం.
(ఆనంద్ తేల్తుంబ్డే పీఐఎల్ మాజీ సీఈఓ; అలాగే ఐఐటీ ఖరగ్‌పూర్, గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్. ఆయన రచయిత, పౌర హక్కుల కార్యకర్త కూడా. ఆయన అనుమతితో ఈ ప్రసంగాన్ని ఇక్కడ తిరిగి ప్రచురించాము.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
