“జై హింద్” అనే నినాదాన్ని ఆర్ఎస్ఎస్, జనసంఘ్, బీజేపీ వారెవరూ సృష్టించలేదు. దేశభక్తి.. దేశభక్తి.. అని గొంతులు ఎండిపోయే విధంగా అరిచి గీ పెడుతున్న వారికి ఎవరికీ ఆ ఆలోచనే రాలేదు.
దేశం గర్వించదగ్గ ఏ చిన్న పనీ వారు చేసింది లేదు. అయితే, మరి ఆ పని ఎవరు చేశారూ? “జై హింద్” అనే మాటని ఎవరు వాడుకలోకి తెచ్చారూ? ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలి.
అవి స్వాతంత్ర్య పోరాటం సాగుతున్న రోజులు. సుభాష్ చంద్రబోస్ ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని రూపొందించుకున్న రోజులు. ఆ ఆర్మీలో దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉండేవారు. పరిచయస్తులు, మిత్రులు ఎవరైనా కలిస్తే వారు వేరువేరు రకాలుగా అభివాదం చేసుకునే వారు. కొందరు నమస్కార్ అని, మరికొందరు రామ్రామ్ అని, ఇంకొందరు అస్సలాము అలైకుం అని సంబోధించుకునే వారు.
సుభాష్ చంద్రబోస్ సెక్యులర్ భావాలు కలిగిన వారు గనక, తన ఆజాద్ హింద్ ఫౌజ్(ఆర్మీ)లో ఇన్ని రకాల పలకరింపులు ఉండడాన్ని ఆయన ఇష్టపడలేదు.
దేశభక్తి ఉట్టిపడేలా, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా, అందరూ ఒకే రకంగా పలకరించుకోవాలని ఆయన కోరుకున్నారు. అందుకు ఒక మాటను లేదా నినాదాన్ని రూపొందించమని మిత్రులకు, తన ఆర్మీలోని ముఖ్యులకు సూచించారు.
అలా ఎందరో ఎన్నో రకాల మాటల్ని బోస్‌కు చెబుతూ వచ్చారు. అవేవీ ఆయనకు నచ్చలేదు. ఒక రోజు తన ఆర్మీలోని మేజర్ ఒకతను వచ్చి, ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు “హలో” అని పలకరించుకోవాలని సూచించారు.
సుభాష్‌చంద్రబోస్‌కు అది నచ్చలేదు. ఎందుకంటే అది మన దేశానికి సంబంధించిన పలకరింపు కాదు. ఆ మాట ఇతర దేశాలలో కూడా ఉంది. ఒకరికొకరు అభివాదం చేసుకోవడానికి ఎలాంటి మాట కావాలో అతనికి బోస్ చెప్పారు.
ఒకటి- “జై హిందుస్థాన్” అని, మరొకటి “జై హింద్” అని! వినగానే “జై హింద్” అన్నది బోస్‌కు బాగా నచ్చింది. చిన్న మాటైనా అది బలంగా ఉందనిపించింది. “జై హింద్” అంటే భారతదేశానికి జయము కలుగుగాక అని అర్థం.
జాతీయ నినాదంగా ఆవిర్భావం..
అప్పటి స్వాతంత్రోద్యమ కాలానికి అది బాగా సరిపోతుందని బోస్ అనుకున్నారు. అదే “జై హింద్” అనే మాటను తన నేషనల్ ఆర్మీలో ప్రవేశపెట్టారు. ఆ మాటలో స్వాతంత్ర్యం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం ఉంది. దేశభక్తి ఉంది. పలకడానికి సులువుగా ఉంటూనే, మనోబలాన్ని పెంచే శక్తి కూడా ఆ మాటలో ఉంది.
సుభాష్ చంద్రబోస్ అన్నీ బాగా ఆలోచించి తన ఉపన్యాసాలలో కూడా ఆ మాట తరచూ ఉపయోగించేవారు. ఆ విధంగా “జై హింద్” అనతి కాలంలో ఒక జాతీయ నినాదం అయ్యింది.
హైదరాబాద్ ముద్దుబిడ్డ – ఆబిద్ హసన్ సఫ్రానీ..
ఇంతకూ జైహింద్‌కు రూపకల్పన చేసిన ఆ నేషనల్ ఆర్మీ మేజర్ ఎవరూ? అంటే, ఆయన మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ వ్యక్తే. పేరు ఆబిద్ హసన్ సఫ్రానీ. ఆయన చిన్నప్పటి పేరు జైనుల్ అబ్దీన్ హసన్. చిన్నప్పుడే ఆనాటి శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా సఫ్రానీ పాల్గొన్నారు. దాంతో చదువు ఆగిపోయింది.
కొంతకాలం తర్వాత ఇంజనీరింగ్ చదువుదామని జర్మనీ వెళ్లారు. అక్కడే నేతాజీని కలుసుకున్నారు. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీలో ఉన్నారు. అక్కడే ఆబిద్ జీవితం మలుపు తిరిగింది.
చివరి దశలో ఉన్న ఇంజనీరింగ్ చదువును కూడా వదిలేసి, నేతాజీకి వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు. అప్పటికే ఆబిద్ జర్మన్ భాషపై కొంత పట్టు సాధించి ఉండడం వల్ల, జర్మన్ భాష అనువాదకుడిగా కూడా నేతాజీకి సహాయపడ్డారు.
ఇండియాకు తిరిగి వచ్చాక ఇక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్)లో చేరారు. 1942-45 మధ్య ఆబిద్ హసన్ మేజర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్) సాధించారు.
1948-1969 మధ్య కాలంలో డెన్మార్క్‌కు, ఆ తర్వాత ఈజిప్ట్‌కు భారత రాయబారిగా సేవలు అందించారు. 1984 ఏప్రిల్ 5న తన డెబ్భై రెండవ యేట హైదరాబాదులోనే కన్ను మూశారు. జీవితాన్ని దేశానికి అర్పించిన మహోన్నతుడిగా నిలిచిపోయారు.
మత సామరస్యానికి ప్రతీకగా “సఫ్రానీ”..
“జై హింద్” నినాదానికి రూపకల్పన చేయడమే కాదు, ఆయన గొప్పతనాన్ని శ్లాఘించడానికి మరో విశేషం కూడా ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ఉన్నప్పుడే ఆబిద్ హసన్ తన పేరుకు “సఫ్రానీ” అని తగిలించుకున్నారు.
సాఫ్రాన్ అంటే కాషాయ రంగు. దాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి దాన్ని ఆయన స్వీకరించి తన పేరుకు చివర “సఫ్రానీ” అని చేర్చుకున్నారు.
మత సామరస్యానికి గుర్తుగా, హిందువుల పట్ల తన సోదర భావాన్ని ప్రకటించుకోవడానికి ఒక ముస్లిం యువకుడు ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. మధ్యలో కొంతకాలం కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నా, అందులో ఎక్కువకాలం ఉండలేదు. దేశ విభజన జరిగి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఐఎఫ్ఎస్ పూర్తి చేయడానికి పూర్తి సమయం కేటాయించాడు.
నేతాజీకి ఆత్మీయుడిగా.. సురయా హసన్ విశేషాలు..
నేతాజీకి కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ఆబిద్ ఆయన వెన్నంటే ఉండేవారు. ఆయన నౌకలో ఏ దేశం వెళ్లినా వెంట వెళుతూ ఆయనకు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునేవారు. తర్వాత కాలంలో నేతాజీకి, ఆబిద్ హసన్‌కు చుట్టరికం కూడా కలిసింది. నేతాజీ మేనల్లుడు అరబిందో బోస్, ఆబిద్ హసన్ అన్న కూతురు సురయా హసన్‌ను పెండ్లి చేసుకున్నారు. ఆబిద్ హసన్ అన్న బద్రుల్ హసన్ గాంధీజీతో కలిసి పని చేసినవారు.
ఇక్కడ సురయా హసన్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 1928లో పుట్టిన సురయా ఆ రోజుల్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి, అక్కడ టెక్స్టైల్ డిజైనింగ్‌లో డిగ్రీ తీసుకుని వచ్చారు.
హైదరాబాద్‌లోనే స్థిరపడి ఇక్కడి నుంచే తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకున్నారు. అంతేకాకుండా, అంతరించిపోతున్న ఒకనాటి చేనేత కళని పునరుద్ధరించారు. బిద్రి, హిమ్రు, ఇక్కత్, కలంకారీ వంటి వాటిని, గద్వాల్, ఉప్పాడవంటి వస్త్రాల్ని ఇక్కడి నుంచే ఖండాంతరాలకు అందించారు.
ఖాదీ ఉద్యమకారిణిగా, కాంగ్రెస్ కార్యకర్తగా జీవితాంతం కృషి చేసిన సురయా హసన్ బోస్(93) 2021లో హైదరాబాద్‌లో తుది శ్వాస వదిలారు.
హిందుస్థానీలో “జనగణమన”- శుభ్ సుఖ్ చైన్..
ఇక ఆబిద్ హసన్ విషయానికి వస్తే- ఆయన సైన్యంలో మేజర్గాను, విదేశాలలో భారత రాయబారిగాను పని చేయడమేగాక ఉర్దూ, పర్షియన్ కవిత్వమంటే గొప్ప అభిరుచిని పెంచుకున్నారు.
విశ్వకవి రాసిన “జనగణమన అధినాయక జయహే” గీతాన్ని ఆయన హిందుస్థానీ(హిందీ- ఉర్దూలు కలిసి ఏర్పడిందే హిందుస్థానీ భాష. అది చాలా ప్రాచుర్యం పొందింది)లోకి అనువదించారు. దానికి కెప్టెన్ రామ్‌సింగ్ ఠాకూరి సంగీతం సమకూర్చారు.
అయితే, అది మిలట్రీ మార్చింగ్ పాటలా ఉంటుంది. దీనికి కూడా మళ్లీ ఒక ప్రాధాన్యత ఉంది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించిన మరునాడే నాటి తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండాను ఎగరేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ సందర్భంగా ఆ కార్యక్రమంలో కెప్టెన్ ఠాకూరి సంగీత సారథ్యంలో ఈ గీతాన్ని ప్రపంచానికి వినిపించడం జరిగింది.
ఆబిద్ హసన్ సఫ్రానీ “జనగణమన” గీతాన్ని హిందుస్థానీలోకి భావం, లయ ఏ మాత్రం చెడకుండా అద్భుతంగా ఈ కింది విధంగా ఆవిష్కరించారు:
శుభ్ సుఖ్ చైన్‌కి బర్ఖా బర్సే / భారత్ బాగ్ హై జాగా
పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠ / ద్రావిడ ఉత్కళ్ వంగా
చంచల్ సాగర్ వింధ్య హిమాలయ్ / నీలా యమునా గంగా
తేరే నిత్ గాయే / తుఝ్ సే జీవన్ పాయే / సబ్ తన్ పాయే ఆశా
సూరజ్ బన్కర్ జగ్పర్ చమ్కె / భారత్ నామ్ సుభాగా
జయహో జయహో జయహో / జయజయ జయహో భారత్ నామ్ సుభాగాసబ్కి దిల్ మే ప్రీత్ బసాయే / తెరీ మీఠా వాణీ
హర్ సుబేక రహనే వాలే / హర్ మహ్జబ్ కే ప్రాణి
సబ్ ఖేద్ ఔర్ ఫరక్ మిటాకె
సబ్ గోద్ మె తేరీ ఆకే- బాంథే ప్రేమ్ కి మాలా
సూరజ్ బన్కర్ జగ్పర్ చమ్కె భారత్ నామ్ సుభాగాసుభ్ సవేరే పంఖ్ పకేరే తెరేహి గుణ్ గాయె
బాస్ భరీ భర్పూర్ హవాయే
జీవన్ మె రుత్లాయే / సబ్ మిల్కర్ హింద్ పుకారే
జయ్ ఆజాద్ హింద్కి నారే / ప్యారా దేశ్ హమారా
సూరజ్ బన్కర్ జగ్పర్ చమ్కే / భారత్ నామ్ సుభాగా..
జయహో జయహో జయ జయహో భారత్ భాగ్ హై జాగా..
గీతం తెలుగు సారాంశం..
భారతదేశ భాగ్యోదయం జరిగింది. ఈ దేశంలో శుభం, సుఖం, ప్రశాంతత వర్షంలా కురవాలి. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, బంగాళ ప్రాంతాలు; వింధ్య, హిమాలయ పర్వతాలు; యమున, గంగా నదుల అలలు నీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తున్నాయి.
ప్రతి ఉదయం అన్ని మతాలు, అన్ని ధర్మాల ప్రజలు తమ హృదయాల్లో నీ మధురమైన వాక్కులనే నిలుపుకుంటున్నారు. భేదాభిప్రాయాలను, తారతమ్యాలను తొలగించుకుని ప్రజలంతా నీ ఒడికి చేరి ఏకమై ప్రేమమాలగా అల్లుకున్నారు.
భారతదేశం సూర్యుడిలా ప్రపంచమంతటా వెలుగులు పంచాలి. ఉషోదయపు పక్షులు నీ గుణగణాలను కీర్తిస్తున్నాయి. వీస్తున్న సుగంధ పవనాలు చక్కని రుతువులను మోసుకొచ్చి ప్రాణం పోస్తున్నాయి. అందరం కలిసి మన ప్రియమైన భారతావనికి జయం కలగాలని, ‘జై ఆజాద్ హింద్’ అని నినదిద్దాం. సూర్యుడిలా ప్రకాశించే భారతదేశం వర్ధిల్లాలి.
చరిత్రను కాపాడుకుందాం..
గీతం చరిత్రలోంచి ఎలుగెత్తి సగర్వంగా చెప్పుకోవాల్సిన ఇలాంటి ఘట్టాలు మనం చెప్పుకోం. వచ్చే తరాల వారికి అందించం. అనవసరమైన వాటికి ప్రాధాన్యమిస్తుంటాం.
ఇక సమకాలీన పరిస్థితులలోనైతే అవివేకపు అంశాలే, విద్వేషాలు పెంచే అంశాలే ఎంతో ప్రాధాన్యమైనవిగా ప్రభుత్వ పెద్దలు గొప్పగా ప్రచారం చేస్తున్నారు.
దేశ ప్రజలు ఎంతో అప్రమత్తతతో మెలగాల్సిన సమయం వచ్చింది. నిజాయితీగా ఆలోచించే వారికైతే ఈ విషయం బోధపడుతుంది.
(వ్యాస రచయిత త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
