డిసెంబర్ 10వ తేదీ కేంద్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ను నియమించేందుకు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ పదవికి మాజీ ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ పేరును ప్రస్తావించగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమావేశపు మినిట్స్ వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నాయకత్వంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ను ఎన్నుకోవడానికి ఏర్పాటైన త్రిసభ్య కమిటీలో రాహుల్ గాంధీ ప్రతిపాదనలు వీగిపోయాయి.
ఈ పదవికి మాజీ ఐఏఎస్ అధికారి సుమితా దావ్రా లేదా ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ లేదా ప్రముఖ న్యాయ విద్యా మేధావి ఫైజాన్ ముస్తఫాలను ప్రతిపాదించారని; కానీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపాదన మేరకే ప్రధాని కూడా మొగ్గు చూపారని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి.
సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రధానమంత్రి, హోంమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలతో కూడిన త్రిసభ్య కమిటీ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ను ఎంపిక చేస్తుంది.
కేంద్ర సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించిన సంప్రదింపుల వివరాలను వెల్లడించాలంటూ సమాచార హక్కు ఉద్యమకారుడు, కమాండర్ లోకేశ్ బాత్రా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర సిబ్బంది- శిక్షణ మంత్రిత్వ శాఖ పై వివరాలను వెల్లడించింది.
రాజ్ కుమార్ గోయెల్ ఎంపిక..
దక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా కేంద్ర మాజీ న్యాయశాఖ కార్యదర్శి రాజ్ కుమార్ గోయెల్ పట్ల త్రిసభ్య కమిటీలో ఇద్దరు సభ్యులు (ప్రధానమంత్రి, హోంమంత్రి) ఓటు వేశారు.
దీంతో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ పోస్టు భర్తీ కానున్నది.
9 సంవత్సరాల పాటు కేంద్ర సమాచార కమిషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
ఈ ప్యానెల్ ప్రతిపాదించిన ఎనిమిది పేర్లలో ఒక పేరును రాహుల్ గాంధీ పూర్తిగా వ్యతిరేకించారని తెలుస్తోంది.
ఈ కమిటీలో ప్రభుత్వానికే మెజారిటీ ఉండడంతో ప్రతిపక్ష నాయకుడు మెరుగైన, ప్రత్యామ్నాయ పేర్లను ప్రతిపాదించినా ప్రభుత్వం మొండిగా వ్యతిరేకించిందని సమాచార హక్కు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
మినిట్స్ వివరాలు..
అందుబాటులోని వివరాల ప్రకారం, కేంద్ర సమాచార కమిషన్ పోస్టును భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన ఇవ్వగా దానికి స్పందించిన పలువురు దరఖాస్తులు పెట్టుకున్నారు.
క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ, ఈ దరఖాస్తుదారుల నుంచి కొన్ని పేర్లను ఎంపిక చేసి తుది ఆమోదానికి త్రిసభ్య కమిటీ ముందుంచింది.
రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ పేర్లు..
గోయల్‌ను కేంద్ర హోంమంత్రి ప్రతిపాదించగా, దీంతో విభేదించిన రాహుల్ గాంధీ మరో మూడు పేర్లను ప్రత్యామ్నాయంగా చర్చకు పెట్టారు.
రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఐఏఎస్ అధికారి దావ్రా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
రాహుల్ గాంధీ ప్రతిపాదించిన మరో పేరు జస్టిస్ మురళీధర్. మాజీ ఒరిస్సా ప్రధాన న్యాయమూర్తి, పలు సున్నితమైన న్యాయ వివాదాలపై విలువైన తీర్పులు వెలువరించిన క్రియాశీలక న్యాయమూర్తిగా ఈయనకు గుర్తింపు ఉన్నది.
రాహుల్ గాంధీ ప్రతిపాదించిన మూడో వ్యక్తి ఫైజాన్ ముస్తఫా. ఈయన న్యాయశాస్త్ర ప్రొఫెసర్.
నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. చట్టం, న్యాయం, పౌర సేవల వంటి రంగాలకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తిగా ఫైజాన్ ముస్తఫాకు గుర్తింపు ఉంది.
ఏడు పేర్ల తుది పరిశీలన..
అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ త్రిసభ్య కమిటీ ఏడు పేర్లను పరిశీలనకు స్వీకరించగా, రాహుల్ గాంధీ ఒక వ్యక్తి విషయంలో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
