మౌలిక భావనలైన ‘సామర్థ్యం’, ‘ఉత్పాదకత’ వంటి పదాలను పక్కనపెట్టి, యూరప్ పారిశ్రామిక విప్లవం ఆర్థిక వ్యవస్థ, కొలమానాల గురించి ఎలాగైతే అర్థవంతమైన విద్యావిషయక విశ్లేషణ చేయలేమో; అలాగే ‘దోపిడీ’, ‘లూటీ’ వంటి పరిణామాలను కనిపించకుండా చేస్తూ, వలసవాద కాలంలోని అసమానతల గురించి కూడా అర్థవంతంగా రాయలేము.
ఇతర విద్యావేత్తల రచనలను జాగ్రత్తగా చదవడం, విశ్లేషించడం— చరిత్రకారులు, ఇతర విద్యావేత్తలు ప్రావీణ్యం సంపాదించాల్సిన అతి ముఖ్యమైన నైపుణ్యాలలో ఒకటి. దీనినే “విమర్శ” అంటారు.
ఈ సమీక్షలు రచయితలకు అవసరమైన ప్రతిస్పందనను అందించి వారి ఆలోచనా విధానాన్ని, రచనలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయి.
ఇవి కేవలం పరిశోధనా పత్రికలలో మాత్రమే కాకుండా, బహిరంగ వేదికలపై చర్చకు వచ్చినప్పుడు, సామాన్య ప్రజలకు కూడా ఆయా రచనలలోని బలాలు, పరిమితులను పరిచయం చేస్తాయి.
అయితే, విమర్శ అనేది ఎప్పుడూ తుది నిర్ణయం కాదు; అది కేవలం అనేక కోణాల్లో ఒకటి మాత్రమే. కాబట్టి, దానిని విజ్ఞతతో స్వీకరించాలి.
ఇపుడు మనం చూడబోయేది, గత ఏడాది ప్రచురితమైన “అసమాన మార్పిడి, ఉత్తర-దక్షిణ సంబంధాలు: ప్రపంచ వాణిజ్య ప్రవాహాలు, ప్రపంచ చెల్లింపుల సమతుల్యత 1800–2025 నుంచి ఆధారాలు” అనే అద్భుతమైన పరిశోధనా పత్రంపై సమీక్ష.
ఐరోపాకు చెందిన ఆర్థికవేత్త, సహ రచయిత థామస్ పికెట్టి ఈ పత్రాన్ని విడుదల చేస్తూ, వలసవాద దోపిడీ, అసమాన మార్పిడి అనేవి రెండు శతాబ్దాలుగా ఉత్తర-దక్షిణ అసమానతలు రూపుదిద్దుకోవడానికి కారణం అయ్యాయి అన్నారు.
ఇది ఇప్పటికే అందరికీ తెలిసిన చారిత్రక వాస్తవమేనని సామాజిక మాధ్యమాలలో కొందరు స్పందించారు.
అయితే, ఈ పత్రంలో పికెట్టి, ప్రధాన రచయిత గాస్టన్ నీవాస్ మాట్లాడుతూ, వీటిలో కొన్ని వాస్తవాలు సాధారణ స్థాయిలో అందరికీ తెలిసినవే అయినప్పటికీ, తాము ఒక క్రమబద్ధమైన గణాంక అధ్యయనాన్ని కొత్తగా అందించామన్నారు.
పికెట్టి పరిశోధనా పత్రం – నవ్యత, తెలిసిన వాస్తవాలు..
సాధారణంగా అకడమిక్ ప్రపంచంలో నవ్యత ఎంతో అభినందించదగ్గ విషయం.
పికెట్టి, అతని సహచరులు రూపొందించి, నిర్వహిస్తున్న కొత్త ప్రపంచ దత్తాంశ నిధి- “ప్రపంచ చారిత్రక చెల్లింపుల సమతుల్యతా దత్తాంశ నిధి”- వారి పరిశోధనా పత్రానికి వెన్నుముకగా నిలవడమే కాకుండా, అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది.
కొత్త ఆధారాలు, కొత్త విశ్లేషణలు ఎప్పుడూ కూడా గతానికి అలాగే వర్తమానానికి మధ్య ఉన్న సంబంధాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
అయితే ఆ నవ్యత వాస్తవికంగా ఉండాలి, వాదన పటిష్టంగా ఉండాలి, రచయితలు తమకంటే ముందు పనిచేసిన, సమకాలీన మేధావుల కృషిని(మేధోపరమైన రుణాలను) నిజాయితీగా గుర్తించాలి.
కాబట్టి, ఈ దత్తాంశ నిధి, అది సాధ్యం చేసిన గణాంకాలు(ప్రపంచ చెల్లింపుల సమతుల్యతలోని “అదృశ్య ప్రవాహాలను” చేర్చడంతో సహా) ప్రపంచ చరిత్రను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయనేది నిజం.
అయినప్పటికీ, తాత్విక, మేధోపరమైన కోణంలో చూస్తే నివాస్— పికెట్టిల ఈ పత్రం మనకు ఇప్పటికే తెలిసిన విషయాన్నే మళ్ళీ నొక్కి చెబుతోంది.
అదేమిటంటే నేడు యూరో-అమెరికా దేశాల వద్ద ఉన్న అపారమైన సంపదకు ప్రధాన కారణం- ఆ దేశాలు గతంలోనూ, అలాగే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల(దక్షిణార్థ గోళ) ప్రజల శ్రమను, సహజ వనరులను దోచుకోవడమే.
అసమానతలకు చారిత్రక మూలాలు..
చరిత్రాత్మక దృష్టితో అసమానతలను అధ్యయనం చేసే ఒక పరిశోధకుడిగా, నీవాస్, పికెట్టిల పరిశోధనా పత్రం నా ఆసక్తిని రేకెత్తించింది.
అందులోని ఐదవ పేజీలో వారు చెప్పదలచిన అంశాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా- “దేశాల మధ్య తులనాత్మక అభివృద్ధిలోని అసమానతలు ప్రధానంగా అసమాన మార్పిడి వల్లే ఉత్పన్నమవుతాయి. అంటే, ఒకవేళ గతంలో వాణిజ్య నియమాలు, వ్యవస్థలు వేరుగా ఉండి ఉంటే, అభివృద్ధి మరోలా ఉండేది. భవిష్యత్తులో కూడా ఇవి మార్పు తీసుకురాగలవు”అని పేర్కొన్నారు.
ఈ వాక్యం కామాలతో విడదీయబడి వర్తమానం, గతం, భవిష్యత్తు— ఈ మూడింటినీ ఒకేసారి స్పృశిస్తుంది.
గతంలో వాణిజ్య నియమాలు, వ్యవస్థలు వేరేగా ఉండి ఉంటే ప్రస్తుత అభివృద్ధి నమూనా భిన్నంగా ఉండేదనేది చాలా ముఖ్యమైన విషయం.
ఇది చరిత్రకారులు నేర్చుకునే ప్రాథమిక ఆలోచనలలో ఒకటైన “సంభావ్యత”(అంటే ఏదీ ముందుగా నిర్ణయించబడలేదు, అనివార్యమైన దానికి వ్యతిరేకం) అనే సూత్రానికి సంబంధించింది.
రచయితల ప్రధాన వాదన ఏమిటంటే—నేడు మనం చూస్తున్న ‘అభివృద్ధి చెందిన’, ‘అభివృద్ధి చెందుతున్న’ లేదా ‘వెనుకబడిన’ దేశాల మధ్య వ్యత్యాసం అనేది ఏదో అనివార్యంగా జరిగింది కాదు.
అది ప్రతి దేశం సహజమైన రాజకీయ-ఆర్థిక వికాసం వల్ల ఏర్పడినది కాదు; బదులుగా, గతంలోనూ, ఇప్పటికీ కొనసాగుతున్న దేశాల మధ్య ‘అసమాన మార్పిడి’ ఫలితంగా ఏర్పడింది.
నిజానికి, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలను, మార్కెట్ శక్తులపై ఉన్న మితిమీరిన నమ్మకాన్ని విమర్శిస్తూ(ఆ పదాలను వాడకపోయినప్పటికీ) రచయితలు ఒక మాట అన్నారు: “ప్రపంచ ఆర్థిక సంబంధాలు అనేవి శక్తివంతమైన దేశాల ఆధిపత్యం, అసమతుల్యతతో కూడి ఉన్నాయి తప్ప, స్వయంచాలకంగా సమతుల్యాన్ని సాధించే మార్కెట్ సూత్రాల మీద ఆధారపడి లేవు.”
వలసవాద క్రూరత్వాన్ని దాచే పదజాలం..
అయితే వలసరాజ్యాల కాలం నాటి, అలాగే ప్రస్తుత ఉత్తర-దక్షిణ దేశాల మధ్య ఉన్న అసమానతలను వాస్తవికంగా వివరించడంలో రచయితలు వెళ్ళిన పరిమితి ఇంతవరకే. కనీసం “అధికార అసమతుల్యతలు” అనే పదాన్ని కూడా వాడకుండా, కేవలం “అధికార సంబంధాలు” అని మాత్రమే వాడటం గమనార్హం.
కాబట్టి, ఇక్కడ ప్రముఖ పండితులు రాసిన ఒక సుదీర్ఘమైన పరిశోధనా పత్రం మన ముందు ఉంది.
దీనిలో యూరప్ విదేశీ సంపద పెరగడంలో “వలస రాజ్యాల బదిలీల పాత్ర” వంటి అంశాలతో సహా ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థను చాలా సూక్ష్మంగా లెక్కలతో వివరించారు. కానీ, వలస రాజ్య వ్యవస్థల అసలు స్వరూపాన్ని బలంగా, ఖచ్చితంగా వివరించే ప్రయత్నం మాత్రం ఎక్కడా కనిపించదు.
ఈ పత్రం మొత్తం కూడా శ్వేతజాత్యహంకారం, వర్ణవివక్ష, వలస పాలనలోని హింస, దోపిడీ, సంపద తరలింపు, ఆక్రమించి కొల్లగొట్టడం వంటి కీలకమైన పదాలను ఎక్కడా ప్రస్తావించదు.
వాస్తవానికి రచయితలు చెప్పిన “అసమతుల్యతలు, అధికార సంబంధాలకు” ఇవే ప్రధాన పునాదులు.
వలస పాలనలో జరిగిన దోపిడీని సూచించడానికి రచయితలు సమయం, సందర్భానికి ఏమాత్రం పొంతన లేని “వలస రాజ్యాల బదిలీలు” అనే పదాన్ని వాడారు.
దీనిని సమర్థించుకోవడానికి వారు చెప్పిన కారణం ఎలా ఉందంటే- అభివృద్ధి చెందిన ఉత్తరార్థ గోళ విద్యావ్యవస్థ ఎప్పుడూ పట్టుబట్టే ‘తటస్థ’ వైఖరికి లోబడిపోయినట్లుగా ఉంది.
వారు ఏమన్నారంటే, ‘ఎక్కువ వివాదాస్పదం కాని పదంగా మేము బదిలీలు అనే పదాన్ని వాడుతున్నాం’ అని చెప్పారు.
ఈ వింత ధోరణి వల్ల విమర్శలు వస్తాయని ముందే ఊహించి ‘నేటి కాలపు ఆలోచనలతో చూస్తే, ఈ వలస రాజ్యాల బదిలీలు అనేది ఖచ్చితంగా వలసవాద దోపిడీ లాగే కనిపిస్తుంది’ అని ఒక పసలేని వివరణ కూడా ఇచ్చారు.
యూరప్ పారిశ్రామిక విప్లవ ఆర్థిక కొలమానాలు, వ్యవస్థపై అర్థవంతమైన అకాడమిక్ విశ్లేషణ రాయాలంటే “సామర్థ్యం”, “ఉత్పాదకత” వంటి మౌలిక భావనలను ఎలాగైతే విస్మరించలేమో- అదే విధంగా, వలసవాద కాలంలోని అసమానతల గురించి రాయాలంటే, ఆ అసమానతలకు పునాదిగా ఉన్న “దోపిడీ”, “లూటీ” వంటి పరిణామాలను పక్కనపెట్టి అర్థవంతమైన విశ్లేషణ చేయడం సాధ్యం కాదు.
అవినీతి, “అదృశ్య ప్రవాహాలు..
నిజానికి, నీవాస్-పికెట్టి పత్రంలో “అదృశ్యం” అనే పదం చాలా కీలకంగా కనిపిస్తుంది. దక్షిణాది దేశాల నుంచి యూరోపియన్ శక్తులు వనరులను తరలించిన “కనిపించే” మార్గాలకు(ఉదాహరణకు వస్తు వాణిజ్యం) అతీతంగా వెళ్ళినందుకు రచయితలు ఒకవైపు ప్రశంసలు పొందినా, వారు ఇచ్చిన “అదృశ్య ప్రవాహాల” నిర్వచనం మాత్రం నిజాలను వెల్లడించడం కంటే ఎక్కువగా దాచిపెడుతోంది.
వారు వీటిని “సేవారంగంలో వాణిజ్యం, విదేశీ ఆదాయం, విదేశీ బదిలీలు” అని పేర్కొన్నారు. ఆ “అదృశ్య ప్రవాహాలను” దక్షిణాది నుంచి ఉత్తరాదికి తరలించడంలో ఉన్న క్రూరత్వం, దురాశ, అవినీతి గురించి సాధారణ పాఠకులకు ఇది ఎటువంటి అవగాహనను కలిగించదు.
వలస పాలకుల అధికారులలో అవినీతి రాజ్యమేలేది. వారిలో చాలామంది డబ్బు, సరుకులు, కళాఖండాలు, విలువైన పత్రాలు, నిధులు వంటి అనేక సంపదలను దోచుకుని యూరప్‌కు తరలించారు. నా అవగాహన ప్రకారం, ఈ విధమైన విభిన్నమైన, కుటిలమైన అవినీతి దోపిడీలన్నిటినీ రచయితలు “విదేశీ బదిలీలు” అనే విభాగంలో చేర్చినట్లు కనిపిస్తుంది.
ఆ పత్రం శీర్షికలో పేర్కొన్న “అసమాన మార్పిడి” గురించి ఖచ్చితమైన అవగాహన కోసం చదివే పాఠకులకు ఇది న్యాయం చేయదు. నిజానికి, వలస చరిత్రకు నిబద్ధంగా ఉంటూనే ఆ కాలం నాటి ఆర్థిక విశ్లేషణ చేయడం అస్సలు కష్టమైన విషయం కాదు.
ఉదాహరణకు నీవాస్, పికెట్టి తమ వ్యాసంలో విస్తృతంగా ఉదహరించిన పత్రాల్లో ఒకటైన పిలార్ నోగ్యుస్-మార్కో రచించిన “వలసవాద దోపిడీ అంచనా: ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, సంపద పారుదల(1757–1858)” పత్రాన్ని తీసుకుందాం. ఆ పత్రం శీర్షికలోనే “దోపిడీ”, “సంపద పారుదల” అనే పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పత్రం సారాంశం మరింత ముందుకు వెళ్లి ఇలా పేర్కొంటుంది: “అందుబాటులో ఉన్న గణాంకాలు మార్క్సిస్ట్ దృక్కోణానికి అనుగుణంగా ఉన్నాయని నేను నిర్ధారిస్తున్నాను- వలసవాదం నిరంతర సంపద తరలింపుకు కారణమైందని, ఈ తరలింపే భారతదేశంలో కరువులు, పేదరికం, అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనానికి దారితీసిందని నేను ముగిస్తున్నాను.”
పెట్టుబడిదారీ విధానం – వలసవాద సంబంధం..
నీవాస్, పికెట్టి తమ పరిశోధనా పత్రం ఉనికికి కారణమైన మార్క్సిస్ట్ స్ఫూర్తిని గానీ, కార్ల్ మార్క్స్ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాకుండా ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ వ్యాసంలో “పెట్టుబడిదారీ విధానం” అనే పదమే లేదు. నిజానికి వలసవాదం, పికెట్టి చేసిన గత పరిశోధనలు రెండూ ఈ ఆర్థిక-సాంస్కృతిక వ్యవస్థతోనే ముడిపడి ఉన్నాయి.
వలసవాద ఆర్థికాంశాలను లెక్కగట్టిన మెజారిటీ పండితులు వలసవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని చాలా స్పష్టంగా నొక్కి చెప్పారు. ఉదాహరణకు, నోగ్యుస్-మార్కో రాసిన సారాంశం మొదటి వరుస ఇలా ఉంటుంది: “ఈ పత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో(1757-1858) బ్రిటిష్ ఇండియా ఉదాహరణను పరిశీలించడం ద్వారా పెట్టుబడిదారీ విధానానికి, వలసవాదానికి మధ్య ఉన్న సంబంధాన్ని పునఃసమీక్షిస్తుంది.”
అలాగే వారు ఉదహరించిన ఆదిత్య ముఖర్జీ వ్యాసం “సామ్రాజ్యం: వలసవాద భారతదేశం ఆధునిక బ్రిటన్ను ఎలా నిర్మించింది” ప్రధాన వాదన ఏమిటంటే, “యూరప్‌లో పెట్టుబడిదారీ విధానం పుట్టుక అనేది 15వ శతాబ్దం నుంచి మిగిలిన ప్రపంచంతో యూరప్‌కు ఉన్న వలసవాద దోపిడీ సంబంధంతో దగ్గరగా ముడిపడి ఉంది.”
నివాస్-పికెట్టిల పరిశోధనా పత్రం గణాంకాల పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, అందులోని మందకొడి భాష, పైకి “తటస్థంగా” అనిపించే చారిత్రక విశ్లేషణ – వలసవాదాన్ని గ్రహించడానికి అభివృద్ధి చెందిన ఉత్తరాది దేశాల(కొందరు దక్షిణాది దేశాల) పండితులు చూపుతున్న అయిష్టతను ప్రతిబింబిస్తోంది.
సరిగ్గా 40 ఏళ్ల క్రితం, మార్క్సిస్ట్ పండితుడు ఇర్ఫాన్ హబీబ్ ‘వలసవాదాన్ని గుర్తించకుండా వలస ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేయడం’ అనే వ్యాసంలో కేంబ్రిడ్జ్ పాఠశాల పండితుల మధ్య ఉన్న ఇటువంటి ధోరణినే విమర్శించారు. అలాగే గుర్మీందర్ భంబ్రా కూడా పికెట్టిని విమర్శిస్తూ కొంతమంది పండితులు “అసమానతలను వివరిస్తున్నారు కానీ సామ్రాజ్యవాదాన్ని విస్మరిస్తున్నారు” అన్నారు.
గణాంకాల వ్యామోహమా, వాస్తవాల గుర్తింపా?..
చివరికి మనం అడగాల్సిన, సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న ఇదే: మనం ప్రతిదానికీ ఒక అంకెను కేటాయించాలనే వ్యామోహం కొద్దీ గతాన్ని లెక్కిస్తున్నామా? లేక మానవ, సామాజిక అనుభవాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో ఒకటిగా ఈ గణాంకాలను చూస్తున్నామా?
ఒకవేళ మన ఆసక్తి కేవలం అంకెలకే పరిమితమై, మానవ అనుభవంతో సంబంధం లేకపోతే.. మన విశ్లేషణలు, మనం సూచించే “పరిష్కారాలు” క్షేత్రస్థాయి వాస్తవాలకు, ప్రజల జీవితాలకు చాలా దూరంగా ఉంటాయి.
అంతిమంగా చెప్పాలంటే, “శ్వేతజాతీయుల భారం” అనే కల్పిత భావన వల్ల ఏర్పడిన వినాశకరమైన పరిణామాలను ఎంతో శ్రద్ధగా గణాంకాలుగా లెక్కగడుతూ, అదే సమయంలో శ్వేతజాతీయుల సున్నితమైన భావోద్వేగాలను కాపాడుతూ బుజ్జగించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు.
