ఎన్ఎంఎంఎస్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతిని అంతం చేయలేదు. అంతేకాక అది దాని స్వరూపాన్ని మార్చి, కార్మికులను బయటకు నెట్టివేసింది.
ఎంజీఎన్ఆర్ఈజీఏ(ఉపాధి హామీ) స్థానంలో భారతదేశం ఒక కొత్త ఉపాధి విధానం వైపు పయనిస్తున్న తరుణంలో, అది కేవలం చెప్పుకోలేని అసౌకర్యాలు మాత్రమే కాకుండా, ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఒక పని స్థలం వద్ద సుమారు 30 మంది కార్మికులు ఐదు గంటల పాటు నిలబడి ఉన్నారు.
పని కోసం కాదు, తమ హాజరును నమోదు చేయించుకోవడం కోసం. పదేపదే ప్రయత్నించినప్పటికీ, దాదాపు 45 నిమిషాలలో కేవలం ఒక కార్మికుడి హాజరు మాత్రమే విజయవంతంగా నమోదైంది.
చివరికి చాలామంది తమ హాజరు నమోదు కాకుండానే వెళ్ళిపోయారు.
ఇది ఒక చిన్న సాంకేతిక లోపం గురించిన కథ కాదు. పని చేసే చట్టపరమైన హక్కు, ఒక కార్మికుడు ఉన్నాడా లేదా అనే దానిపై కాకుండా, ఒక డిజిటల్ వ్యవస్థ వారిని గుర్తించగలదా లేదా అనే దానిపై ఆధారపడేలా షరతులతో కూడినదిగా ఎలా మార్చబడుతుందో క్లుప్తంగా తెలియచేసే ఒక ప్రయత్నమే ఈ వ్యాసం.
ఎంజీఎన్ఆర్ఈజీఏలో అధికారిక మార్పు జరగక ముందే, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) ద్వారా ఒక మార్పు ఇప్పటికే ప్రారంభమైంది.
ది వైర్లో ఇంతకుముందు వచ్చిన వార్తలలో పేర్కొన్నట్లుగా, ఎన్ఎంఎంఎస్ వ్యవస్థ అప్పటికే మనిషి హాజరును ఒక కఠినమైన సాంకేతిక అవసరంగా మార్చేసింది.
దీనిని కార్మికులు తరచుగా “రెండు ఫోటోలు లేదా జీతం లేదు”గా భావించేవారు(పనిలోకి వచ్చినప్పుడు ఒక ఫొటో, పని అయిపోయి వెళ్ళేటప్పుడు మరొక ఫొటో).
ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్నది అంతకంటే పెద్ద మార్పు. కార్మికులు ఈ షరతులన్నింటినీ నెరవేర్చినప్పటికీ, కంప్యూటర్ వారిని గుర్తించడంలో విఫలమవుతున్నది.
క్షేత్రస్థాయి పరిశోధనలతో పాటు, వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలలోని ప్రాంతీయ మీడియా కవరేజీని సమీక్షించగా, ఈ సమస్యలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాదని, దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇలాంటి సమస్యలే వస్తున్నాయని తెలుస్తోంది.
అవినీతిని అరికడతామనే పేరుతో ప్రవేశపెట్టబడిన ఎన్ఎంఎంఎస్, మనిషి హాజరు నమోదు చేసే పద్ధతి స్థానంలో జియోట్యాగ్(ఖచ్చితమైన సమయం, ప్రదేశంతో నమోదు) చేయబడిన ఫోటోగ్రాఫిక్ రికార్డులను ప్రవేశపెట్టింది.
దీని వెనుక ఉన్న తర్కం సూటిగానే తెలుస్తుంది. ఎక్కువ డేటా, కఠినమైన ధృవీకరణ, అవకతవకలకు తక్కువ అవకాశం.
అయినప్పటికీ, ఎన్ఎంఎంఎస్ గమనం ఒక భిన్నమైన ఫలితాన్ని సూచిస్తోంది. ఇది అవినీతిని తగ్గించలేదు. దాని రూపాన్ని మార్చింది.
అదే సమయంలో కార్మికులను తగ్గించింది. ఇలా చేయడం ద్వారా, అదిఎంజీఎన్ఆర్ఈజీఏను చట్టపరమైన హక్కు నుంచి, డిజిటల్ ధృవీకరణ లభ్యతపై ఆధారపడే వ్యవస్థగా మార్చడం ప్రారంభించింది.
ఈ మార్పు యాదృచ్ఛికమైనది కాదు. ఇది సంక్షేమ పరిపాలనలో ఒక విస్తృతమైన ధోరణిని ప్రతిబింబిస్తుంది. దీనిలో సాంకేతికతను, కార్మికుల లభ్యతను విస్తరించడానికి కాకుండా, దానిని నియంత్రించడానికి, షరతులకు లోబడి ఉంచడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
హాజరును డిజిటలైజ్ చేయడం నుంచి అవినీతిని పునర్నిర్మించడం వరకు..
ప్రారంభంలో ఎన్‌ఎంఎంఎస్‌ను తారుమారు చేయడం చాలా సులభంగా ఉండేది.
నమోదు చేయబడిన వ్యక్తులు నిజంగా హాజరయ్యారా లేదా అనే దానిపై ఎలాంటి అర్థవంతమైన ధృవీకరణ లేకుండా, సంబంధం లేని ఫోటోలు, పొలాల, చెట్ల చిత్రాలు లేదా అస్తవ్యస్తంగా ఉన్న సమూహాలను ఉపయోగించి హాజరును నమోదు చేయవచ్చు. ఈ వ్యవస్థ అవినీతిని నిర్మూలించలేదు. అది కేవలం దానిని డిజిటలైజ్ చేసింది.
దానిలో తర్వాత చేసిన మార్పుతో అదనపు తనిఖీలను ప్రవేశపెట్టారు. వాస్తవంగా పనికి హాజరైన వారి సంఖ్యను లెక్కించడం కాకుండా, హాజరును ఎవరు నమోదు చేయవచ్చనే దానిపై కఠినమైన నియంత్రణలు వచ్చాయి.
ఆ తర్వాత, ఆధార్ ఆధారిత eKYC, పరికర-స్థాయి పరిమితులతో పాటు, ముఖ ధృవీకరణను కూడా జోడించారు.
ప్రతి కొత్త మార్పు లోపాలను సరిదిద్దడానికే ఉద్దేశించబడింది. కానీ జరిగిన ప్రతి మార్పు ఈ వ్యవస్థను మరింత సంక్లిష్టంగానూ, మరింత బలహీనంగా మార్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలలో, కార్మికులు భౌతికంగా హాజరైనప్పటికీ వారి హాజరును నమోదు చేయకుండా నిరోధించే వైఫల్యాల సరళి బయటపడింది.
దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలే ఇతర ప్రాంతాలలో తలెత్తుతున్నాయని స్థానిక మీడియాలో వస్తున్న నివేదికలు సూచిస్తున్నాయి.
ఒక దశాబ్దానికి పైగా ఎంజీఎన్ఆర్ఈజీఏలో పనిచేస్తున్న ఒక కార్మికుడు, ముఖ ధృవీకరణను ప్రవేశపెట్టిన తర్వాత తన హాజరును నమోదు చేయడం సాధ్యపడలేదు.
అతని eKYC స్థితి పూర్తయినట్లు చూపించినప్పటికీ, కంప్యూటర్ అతని ముఖాన్ని నమోదు చేసిన ఫోటోతో సరిపోల్చడంలో విఫలమైంది.
వరుసగా మూడు రోజుల పాటు, అతను పని చేయలేకపోయాడు. దానికి కారణం అతను గైర్హాజరు కావడం కాదు. కంప్యూటర్ అతన్ని గుర్తించలేకపోవడమే.
ఇది కేవలం ఒక ప్రత్యేక సమస్య కాదు. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద నమోదైన సుమారు 27.3 కోట్ల మంది కార్మికులలో, కేవలం 14.7 కోట్ల మంది మాత్రమే eKYC పూర్తి చేశారు.
దీనివల్ల పెద్ద సంఖ్యలో కార్మికులు ఇప్పటికే పని పొందే అవకాశాన్ని కోల్పోయారు. కానీ సమస్య ఇక్కడితో ముగియలేదు.
eKYC పూర్తి చేసిన వారిలో కూడా, కార్మికులు పదేపదే సాంకేతిక వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు. దాంతో వారి హాజరు నమోదు కావడం లేదు.
ఆ విధంగా అంచెలవారీగా కార్మికులను పని జాబితా నుంచి తొలగించడం లాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి.
మొదట అర్హత నిబంధనల వల్ల, ఆ తర్వాత మళ్లీ కంప్యూటర్ వైఫల్యాల వల్ల కార్మికులు పనికి దూరమవుతున్నారు.
కార్మికులను మినహాయించి, అక్రమాలు చేయడానికి అనుమతించే వ్యవస్థ..
ఈ నూతన విధానం కార్మికులను తొలగించడమే కాదు, అది పనిచేసే విధానంలో కూడా అస్థిరత ఉంది.
భౌతికంగా హాజరైన కార్మికుల హాజరు కూడా పదేపదే సాంకేతిక వైఫల్యాల కారణంగా తరచుగా తిరస్కరించబడుతున్నది. ఈ వైఫల్యాలు ఊహించలేనివి, వాటిని సరి చేయడం కష్టం.
తెలంగాణలో ఒక కార్మికుడు పనికి హాజరయ్యాడు. కానీ కంప్యూటర్లో హాజరు నమోదు చేయడం ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు.
అప్పుడు ఆ కార్మికుడు తన ముఖానికి టాల్కం పౌడర్ రాసుకోగా, సిస్టమ్ అతని హాజరును అంగీకరించింది. ఈ ఘటన మీడియాలో వెల్లడైంది.
ఇది దానికదే అలా జరిగిందా లేక దాని వెనుక ఏదైనా కథనం దాగి ఉందా అని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
పని దొరకడం అనేది అతను పని చేశాడా లేదా అనే దానిపై ఆధారపడలేదు, కానీ సిస్టమ్ అతని రూపాన్ని ఎలా అర్థం చేసుకుంది అనే దానిపై ఆధారపడి ఉందనే విషయాన్ని ఈ సంఘటన వెల్లడిస్తుంది.
మార్కాపురం జిల్లాలో నమోదైన ఒక కేసుతో సహా, ఆంధ్రప్రదేశ్‌లోని వార్తాపత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం- eKYC పూర్తి చేసిన తర్వాత కూడా కార్మికుల హాజరు నమోదులో పెద్ద ఎత్తున సాంకేతిక వైఫల్యాలను ఎదుర్కొన్నారు.
క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం, సిస్టమ్ అవసరాలను తీర్చినప్పటికీ, సుమారు 30–40% మంది కార్మికులు తమ హాజరును సరిగ్గా నమోదు చేసుకోలేకపోయారు. దీనివల్ల వారు పనిని కోల్పోయారు.
ఇలాంటి వైఫల్యాలు, పని పొందేందుకు జరిపే చర్యల నిబంధనలను పునర్నిర్వచిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయి పరిశోధనల సమయంలో ఒక గ్రామంలో, ఎన్ఎంఎంఎస్ సంబంధిత వైఫల్యాల కారణంగా సుమారు 150 మంది కార్మికులు పని కోల్పోయారు.
దాన్ని సరిచేయమని వారు స్థానిక అధికారులను సంప్రదించినప్పుడు, వారి హాజరు నమోదు కావడానికి లంచం చెల్లించమని అడిగారు.
ఇది వాస్తవానికి ఒక వ్యవస్థలోని వైఫల్యం కార్మికులను పనిలోంచి తీసివేయడానికి ఒక కారణంగా మార్చింది. ఆ విధంగా ఒక సాంకేతిక వైఫల్యం డబ్బులు గుంజే కార్యక్రమంగా మారింది.
దీనికి అదనంగా, క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ ఒక కార్మికుడి ముఖం వీడియో రికార్డింగ్‌లను కూడా పనికి హాజరైనట్లు అంగీకరించగలదని తెలుస్తోంది. అంటే, కార్మికుడు భౌతికంగా అక్కడ లేనప్పటికీ హాజరును నమోదు చేయడం. ఇది ఆచరణలో అక్రమాలు, దుర్వినియోగం చేయగల అవకాశాలకు నిదర్శనం.
ఈ నూతన పద్ధతి ఆశ్చర్యకరంగా కార్మికులకు పని నిరాకరించేందుకు రూపొందించిన ఒక పథకంలా తయారయింది.
అది నిజాయితీ గల కార్మికులను మినహాయిస్తూనే, అవకతవకలకు ఆస్కారం కల్పిస్తుంది. అందువల్ల, సమస్య కేవలం సాంకేతిక వైఫల్యం మాత్రమే కాదు, అది సమగ్రతను కాపాడకుండా, కార్మికులకు పని హక్కును రక్షించకుండా ఉండే ఒక పథకం.
రాజేష్ వీరరాఘవన్ తన విశిష్టమైన పుస్తకం ‘ప్యాచింగ్ డెవలప్మెంట్’లో చెప్పినట్లు ఇటువంటి సాంకేతిక ఆవిష్కరణలు విధానంలోని అంతర్లీన సమస్యలను తొలగించవు. కానీ ఆచరణలో అనధికారిక స్థానిక సర్దుబాట్లు, అక్రమ పద్ధతుల ద్వారా వాటిని “తాత్కాలికంగా” సరిచేస్తారు.
సాంకేతికత జవాబుదారీతనానికి ప్రత్యామ్నాయం కాలేదు..
ఈ ధోరణులు ఒక ప్రధాన సమస్యను సూచిస్తున్నాయి. ఎంజీఎన్ఆర్ఈజీఏ వంటి కార్యక్రమాలలో అవినీతి అనేది కేవలం తగినంత సమాచారం లేకపోవడం లేదా బలహీనమైన ధృవీకరణ సమస్య మాత్రమే కాదు. దాని మూలాలు అధికార సంబంధాలు, పరిపాలనా ప్రోత్సాహకాలు, సమర్థవంతమైన స్థానిక జవాబుదారీతనం లేకపోవడంలో ఉన్నాయి.
‘హిందూ పత్రిక’తో సహా గతంలో జరిగిన విశ్లేషణలు ఒక విస్తృతమైన ధోరణిని సూచించాయి. సంక్షేమ పథకాలలో సాంకేతిక మార్పులు జవాబుదారీతనాన్ని బలోపేతం చేయకుండా, తరచుగా అర్హత నిరూపించుకోవలసిన భారాన్ని కార్మికులపైకి నెట్టివేస్తాయి.
అయితే, ఎన్ఎంఎంఎస్ తన పరిశీలనను వ్యవస్థలో కనిపించే బలహీనులైన కార్మికులపై కేంద్రీకరిస్తుంది.
ఇది సామాజిక తనిఖీల వంటి సంస్థలను బలోపేతం చేయదు. ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరచదు.
అధికార స్థానాల్లో ఉన్నవారి ప్రోత్సాహకాలను మార్చదు. ఈ సాంకేతికత మరింతగా డేటా కేంద్రీకరణకు తోడ్పడుతుంది. కానీ మరింత జవాబుదారీగా మాత్రం మారదు.
దీని నుంచి ఉద్భవించే లోపాలను సాంకేతిక సమస్య అని పిలవలేము. ఎందుకంటే ఇది పరిపాలనలోనే ఒక మార్పు. ఇందులో జవాబుదారీతనం పెంచకపోగా నిఘా పెరుగుతుంది.
ప్రతి సాంకేతిక మార్పు ఒకే విధమైన నమూనాను అనుసరించింది. తొలి వెర్షన్లు స్థూలమైన తారుమారుకు వీలు కల్పించాయి.
తర్వాతి వెర్షన్లు ఈ అవకాశాలలో కొన్నింటిని తగ్గించి, బహిష్కరణను పెంచాయి. కొత్త వెర్షన్లు కఠినమైన నియంత్రణకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ అవి దోషపూరితంగా, తప్పించుకోదగినవిగా కొనసాగుతున్నాయి.
పని పొందడం చట్టపరమైన హక్కుగా రూపొందించబడిన ఒక పథకంలో తెచ్చిన ఈ మార్పు తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంది.
పని పొందే హక్కు, పని చేసే కార్మికుడి ప్రమాణాలపై ఆధారపడినప్పుడు, అది చట్టం ద్వారా హామీ ఇవ్వబడిన హక్కు నుంచి ఒక మధ్యవర్తి వ్యవస్థ ద్వారా లభించేలా మారుతున్నది.
చట్టపరమైన హక్కు నుంచి డిజిటల్ అనుమతికి?..
కంప్యూటర్ అప్లికేషన్ల ద్వారా అవినీతి మార్గాలను తొలగించలేమని ఎన్ఎంఎంఎస్ ప్రయోగం చివరికి తెలియచేస్తుంది.
వ్యవస్థీకృత జవాబుదారీతనం లేకుండా, సాంకేతికత మాత్రమే అవినీతిని నిర్మూలించదు. కానీ అది అవినీతిని పునర్వ్యవస్థీకరిస్తుంది.
గుర్తించడం కష్టతరమైన, అట్టడుగున ఉన్నవారికి మరింత హానికరమైన మార్గాల్లో, మరీ ముఖ్యంగా, ఇది సంక్షేమం స్వభావాన్నే మార్చే ప్రమాదం ఉంది.
సార్వత్రికంగా అమలు చేయదగినదిగా ఉండాల్సిన హక్కు, చట్టం ద్వారా కాకుండా, కంప్యూటర్ కార్మికుడిని గుర్తించగలదా లేదా అనే దానిపై ఆధారపడేలా చేస్తుంది.
MGNREGAలో అవినీతిని పరిష్కరించాలంటే, అది స్థానికంగా ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడ జవాబుదారీతనం బలోపేతం చేయాలి. అంటే సామాజిక తనిఖీలను పటిష్టం చేయడం, కార్మికులకు ధృవీకరించదగిన రికార్డులు అందుబాటులో ఉండేలా చూడటం, తప్పులను త్వరగా సరిదిద్దగల ఫిర్యాదుల వ్యవస్థలను నిర్మించడం, డిజిటల్ వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అందించడం వంటివి చేయాలి.
సాంకేతికత ఈ ప్రక్రియలకు మద్దతు ఇవ్వగలదు. కానీ అవన్నీ సాంకేతిక పరిజ్ఞానమే చేయడం అంటే స్వచ్ఛమైన పరిపాలన కాదు. ఆ పారదర్శకతపై కప్పబడిన బహిష్కరణ మాత్రమే అవుతుంది. ఈ ధోరణి కొనసాగితే, హక్కు అర్థమే మారిపోతుంది.
(వెంకటేశ్వర్లు కురువ, చక్రధర్ బుద్ధలు CORD(కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ డిస్సెమినేషన్)లోని ఒక కేంద్రమైన లిబ్టెక్ ఇండియాలో సీనియర్ పరిశోధకులు.)
అనువాదం: సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
