మూడు బిల్లుల ప్యాకేజీని పార్లమెంట్లో ఆమోదింపజేయలేకపోయినందుకు “భారతదేశ తల్లులు, కుమార్తెలకు” క్షమాపణ కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 18న చేసిన తన ప్రసంగంలో చెప్పారు. మోదీ క్షమాపణ చెప్పాల్సిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి.
మొదట ఒక విషయం: ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 3 బిల్లులు..
1. 131 రాజ్యాంగ సవరణ బిల్లు -2026
2. డిలిమిటేషన్ బిల్లు -2026
3. యూనియన్ టెరిటరీస్లా అమెండ్మెంట్ -2026.
ప్రతిపక్షాలు తిరస్కరించిన 3 బిల్లులలో మహిళల రిజర్వేషన్ బిల్లు -2026 లేనే లేదు.
మహిళా రిజర్వేషన్ బిల్లు – వాస్తవాలు..
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్‌ను డిలిమిటేషన్ ద్వారా అమలు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు-2026.
అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని మోదీ ప్రభుత్వం సాధించలేకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేదు.
ఈ బిల్లు లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఈ బిల్లు వల్ల తూర్పు- దక్షిణాది రాష్ట్రాల దామాషా ప్రాతినిథ్యం గణనీయంగా పడిపోతుంది, హిందీ భాషా రాష్ట్రాల వాటా బాగా పెరుగుతుంది.
ఆశ్చర్యకరంగా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళల బిల్లును ఆమోదింపజేయడానికి తాము పూర్తిగా ప్రయత్నించామని, ప్రతిపక్షాలు సహకరించలేదని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా పెద్ద యాగీ చేస్తున్నది.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సంవత్సరంలోనే ఆమోదించబడిందని, ప్రతిపక్షాలు దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయనే విషయాన్ని బీజేపీ నేతలు కప్పిపుచ్చుకున్నారు.
మహిళల బిల్లును డిలిమిటేషన్‌తో రహస్యంగా కలిపిన మోదీ ప్రభుత్వ చర్యకే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు..
అయినా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ టెలివిజన్‌ను పార్టీ రాజకీయాల కోసం వినియోగించకూడదనే నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ, ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శల ప్రసంగాన్ని రాష్ట్రాల ఎన్నికల సమయంలో జాతీయ టెలివిజన్ ద్వారా ప్రసారం చేశారు.
దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ఒక వారంలో ఎన్నికలు ఉండగా టీఎంసీ- డీఎంకేలను లక్ష్యంగా చేసుకుని, ఈ పార్టీలపై “స్త్రీ భ్రూణహత్య”దారులుగా మోదీ ఆరోపణలు చేశారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, మోదీ “భారతదేశ తల్లులు, కుమార్తెలకు” క్షమాపణ కోరుతూ, “ఒక మహిళ అన్నింటినీ మర్చిపోవచ్చు కానీ తనపై జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోదు” అని అన్నారు.
బహుశా దేశానికి, మహిళలకు మేలు జరగాలంటే, మోదీ తన ఈ ధార్మిక ప్రవచనాల ద్వారా మహిళలను క్షమాపణ కోరడం కాదు.
నిజానికి మోదీ భారత మహిళలకు క్షమాపణ చెప్పాల్సిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్..
మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేసిన లైంగిక వేధింపులు. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కావు.
రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత వినేశ్ ఫోగట్, ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పునియాలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చేశారు.
ఆరు సార్లు బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, వెంటాడటం వంటి తీవ్రమైన ఆరోపణలపై మోదీ ప్రభుత్వం చర్యలు నిరాకరించింది.
పైగా చర్య తీసుకోవాలని నిరసన వ్యక్తం చేసినందుకు వీరిని వీధుల్లో ఈడ్చి పోలీసు వ్యాన్లలోకి వేసిన ఘటన గుర్తుందా?
ఏడుగురు మహిళా రెజ్లర్లు కేసులు దాఖలు చేశారు. ప్రారంభంలో ఒక మైనర్ కూడా ఇందులో భాగమయ్యింది.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బాహుబలి అయిన సింగ్, అప్పట్లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నాడు.
పోలీసు రికార్డుల ప్రకారం, 1974 నుంచి 2007 మధ్య సింగ్‌పై దొంగతనం, దోపిడీ, హత్య, హత్యాయత్నం, క్రిమినల్ బెదిరింపులు వంటి ఆరోపణలతో మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఎక్కువ కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యాడు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కూడా ఆయనను అరెస్ట్ చేశారు. అలాగే దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన షూటర్లకు ఆశ్రయం కల్పించాడనే ఆరోపణలతో తీవ్రవాద నిరోధక చట్టం ‘టాడా’ కింద కేసు నమోదు చేశారు. అయితే తరువాత ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు విముక్తి లభించింది.
ఆశ్చర్యకరం కాని విషయం ఏమిటంటే, దాదాపు ఏడాది తరువాత, 2024లో ఢిల్లీ కోర్టు ఆయనపై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా లైంగిక దాడి, వేధింపుల కేసుల్లో అభియోగాలు నమోదు చేసింది.
పోక్సో చట్టం కింద నమోదైన మరో కేసు తరువాత ఉపసంహరించబడింది. దీనివల్ల బెదిరింపుల నీడ ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తమ పార్టీకి చెందిన సభ్యుడిపై చర్యలు తీసుకోకపోవడంపై మోదీ, కేంద్ర హోంమంత్రి “షా”లపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ, వారి వైఖరిలో మార్పు లేదు.
2024 సాధారణ ఎన్నికల్లో కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు “మోదీ&షా” పార్టీ టికెట్ ఇచ్చారు.
అంతేకాకుండా, 2023లో సింగ్‌కు సన్నిహితుడైన సంజయ్ కుమార్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
కొత్త అధ్యక్షుడి నియామకం అనంతరం “ఫోగట్” తన రిటైర్మెంట్ను ప్రకటించింది.
ఇలా బ్రిజ్ భూషణ్‌కు “మోదీ-షా”ల రాజకీయ మద్దతు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజకీయ పట్టు కలిగిన కుమారుడికి బదిలీ అయింది.
అంతేకాకుండా, అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం విచారణ కోరినప్పటికీ, కోర్టు కేసులు కొనసాగుతున్న సమయంలోనే గత సంవత్సరం ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో బ్రిజ్ భూషణ్ “గెస్ట్ ఆఫ్ ఆనర్”గా హాజరయ్యాడు. ఇది ఢిల్లీ నుంచి అతనికి లభిస్తున్న రాజకీయ మద్దతు.
స్వయం ప్రకటిత స్వాములు, గురువులకు బెయిల్స్ – ఆసారాం బాపు..
దోపిడీ స్వభావం కలిగిన స్వయం ప్రకటిత స్వాములు, గురువుల జాబితా చాలా పెద్దది.
గుజరాత్‌కు చెందిన ఆసారాం 2013లో ఒక మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో 2018లో దోషిగా తేలాడు.
అలాగే 2001 నుంచి 2006 మధ్య జరిగిన మరో అత్యాచార కేసులో 2023లో జీవిత ఖైదు విధించబడింది. 2023 జనవరిలో గాంధీనగర్ కోర్టు ఆసారాంకు జీవిత ఖైదు విధించినప్పటికీ, ఆరోగ్య కారణాలను చూపుతూ అతనికి పలుమార్లు తాత్కాలిక బెయిల్లు మంజూరయ్యాయి.
2025లో సుప్రీంకోర్టు కూడా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌లను అనేకసార్లు సమర్థించింది. 2025 నవంబరులో మళ్లీ ఆరోగ్య కారణాలతో ఆరు నెలల పాటు “ఆసారాం” విడుదలయ్యాడు.
ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2026 మార్చిలో “ఆసారాం” అయోధ్యకు వీఐపీగా వెళ్లి దర్శనం అనంతరం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనం చేసుకున్నాడు. ఈ యాత్ర “నరకానికి” వెళ్లకుండా కాపాడుతుందని ఆసారాం చెప్పాడు. దోషిగా తేలిన “లైంగిక నేరస్థుడు” స్వేచ్ఛగా తిరగడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఎన్నికల వేళ పెరోల్ – గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్..
డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 2017లో ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
ఆశ్రమంలోని కార్యకలాపాలను బయటపెట్టినందుకు, ఒక “జర్నలిస్టు” హత్య కేసులో జీవిత ఖైదు కూడా అనుభవిస్తున్నాడు.
అయినప్పటికీ, ఈ ఏడాది జనవరిలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 40 రోజుల పెరోల్ మంజూరైంది.
ఇది హర్యానాలోని రోహ్తక్లో ఉన్న సునారియా జైలు నుంచి అతనికి లభించిన “15వ” తాత్కాలిక విడుదల. 2017 నుంచి 2025 కాలంలో అతను మొత్తం “406” రోజులు జైలు బయట గడిపాడు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో స్థానిక లేదా రాష్ట్ర ఎన్నికల సమయాల్లోనే అతనికి పలుమార్లు పెరోల్ లభించడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి.
ఆధ్యాత్మిక ముసుగులో ఆకృత్యాలు – వీరేంద్ర దేవ్ దీక్షిత్..
82 ఏళ్ల స్వయం ప్రకటిత గురువు వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఇద్దరు మైనర్ “బాలికలపై” అత్యాచారం చేసినట్లు, అలాగే ఢిల్లీలోని రోహిణిలో ఉన్న అతని “ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం”లో అనేక మంది మైనర్ బాలికలు, మహిళలను అక్రమంగా నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
చివరికి 2018లో అతనిని అరెస్టు చేశారు. తరువాత తప్పించుకున్నాడు. “సీబీఐ” లుకౌట్ నోటీసు ఉన్నప్పటికీ పరారీలో ఉన్నాడు.
చివరకు 2023లో సీబీఐ ప్రత్యేక కోర్టుకు, దీక్షిత్ ఆ సంవత్సరంలోనే మరణించినట్లు తెలియజేసి, కేసులో తదుపరి చట్టపరమైన చర్యలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
గుజరాత్ అత్యాచార దోషులకు పూలమాలల స్వాగతం – బిల్కిస్ బానో కేసు..
2002లో గుజరాత్లో జరిగిన గోధ్రా అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మూడు సంవత్సరాల కుమార్తెతో సహా కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులకు లభించిన స్వాగతంపై ఆగ్రహం ఎక్కడ కనిపించింది? ఆమెపై జరిగిన క్రూర దాడి ఇక్కడితో ముగియలేదు.
గుజరాత్ పోలీసులు నేరస్థులపై కేసును తక్షణమే కొట్టివేశారు. న్యాయమైన విచారణ కోసం 2004లో కేసును మహారాష్ట్రకు బదిలీ చేశారు.
చివరకు 2008 జనవరిలో అభియోగాలు నమోదు కాగా, 2017లో బాంబే హైకోర్టు వాటిని సమర్థించింది.
2022 మార్చిలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ బీజేపీ కౌన్సిలర్, బీజేపీ మహిళా విభాగానికి చెందిన ఒకరు దోషులకు “శిక్ష తగ్గింపు” కోరారు.
అదే సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు, మంచి ప్రవర్తన కారణంగా ఆ 11 మంది దోషులను విడుదల చేశారు. వారికి పూలమాలలతో, స్వీట్లు పంచుతూ ఘనంగా స్వాగతం పలికారు.
గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వ అనుమతితో, అమిత్ షా ఆధ్వర్యంలోని హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందామని తెలిపింది.
దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవడంతో, “తప్పుదారి పట్టించిన వాస్తవాల” ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టు శిక్ష తగ్గింపు ఉత్తర్వును రద్దు చేసింది.
అయినప్పటికీ, ఆ 11 మంది దోషులు మళ్లీ జైలుకు చేరేందుకు 2024 జనవరి వరకు, అంటే రెండు సంవత్సరాలు పట్టింది.
కథువాలో స్పందన..
దోషులకు రాజకీయ ఆశ్రయం లభించడం అరుదుగా అనిపించవచ్చు. కానీ, లైంగిక హింసకు పాల్పడిన నేరస్థులకు మద్దతు పలికిన ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ముస్లిం సంచార గిరిజన సమాజానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో, దోషులుగా శిక్షించబడిన వారికి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేశారు.
ఆ బాలికను అపహరించి, మత్తు మందులు ఇచ్చి, అనేక రోజుల పాటు అత్యాచారం చేసి, చివరికి ఒక దేవాలయంలో క్రూరంగా హత్య చేశారు.
ఈ కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారు. అందులో ఒకరు మైనర్. అతను ఆలయ పూజారి కుమారుడు.
అత్యాచార నిందితులకు మద్దతుగా బీజేపీ అనుచరులు, నాయకులు జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో, బీజేపీ మహిళా కార్యకర్తలు బాలిక పక్షాన పోరాడుతున్న న్యాయవాదిపై నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. అత్యాచార నిందితుల అరెస్టును వ్యతిరేకిస్తూ నిర్వహించిన “హిందూ ఐక్యత” ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ రాష్ట్ర మంత్రులు ప్రజల ఆగ్రహం నేపథ్యంలో రాజీనామా చేయాల్సి వచ్చింది.
చివరికి, మూడు సంవత్సరాల తరువాత “ప్రత్యేక కోర్టు” ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు వ్యక్తులకు జీవిత ఖైదు విధించింది.
సాక్ష్యాలను నాశనం చేసినందుకు ముగ్గురు పోలీసు అధికారులను దోషులుగా తేల్చి, వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మైనర్‌ను కోర్టు విముక్తి చేసింది.
ఉన్నావ్ అత్యాచార నేరస్థుడు – కుల్దీప్ సింగ్ సెంగర్..
లైంగిక నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడంలో బాధితుల దృఢ సంకల్పమే కీలకంగా నిలిచింది. అదే విధంగా, మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కేసులో కూడా ఇది స్పష్టమైంది.
ఒక మైనర్ బాలికను అపహరించడం, అత్యాచారం చేయడం, అక్రమంగా నిర్బంధించడం వంటి ఆరోపణలు వచ్చినప్పుడు సెంగర్ అప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.
బాధితురాలు అతని పేరును స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, అతను ఆమెను వేధించడం కొనసాగించాడు. మొదట ఆ బాలిక నెలల తరబడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది.
సెంగర్ అనుచరులు, పోలీసుల బెదిరింపులు, ఒత్తిళ్లతో అలసిపోయిన ఆమె, పోలీసులు తన కేసును నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ ముఖ్యమంత్రిగారి నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేసింది.
జాతీయ మాధ్యమాల దృష్టి ఈ ఘటనపై పడింది. దీంతో స్థానిక అధికార యంత్రాంగం ఆశ్చర్యకరంగా ఆమె తండ్రిని అరెస్టు చేసి, నేరస్థుడిగా చూపిస్తూ జైలుకు పంపించారు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన మరుసటి రోజే, పోలీసు అదుపులో గాయాల కారణంగా ఆమె తండ్రి ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు మరణించినట్లు తేలింది. చివరికి పోలీసులు సెంగర్‌పై కేసు నమోదు చేశారు. అయితే, బాలిక వాంగ్మూలంలో వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతూ ముందుగా కేసు నమోదు చేయలేదని తెలిపారు.
అయినా, ఆ బాలిక కేసును పట్టుదలతో కొనసాగిస్తున్న సమయంలో, మరో ఘోర ఘటన జరిగింది.
స్థానిక కోర్టులో సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు, ఆమె తన ఇద్దరు పిన్నిలు, న్యాయవాదితో ప్రయాణిస్తున్న కారును అనుమానాస్పదంగా ఒక లారీ ఢీకొట్టింది.
ఆ ప్రమాదంలో పిన్నిలు మరణించగా- ఆమె, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు అప్పటికే రెండేళ్లకు పైగా సాగింది.
చివరకు సుప్రీంకోర్టు న్యాయమైన విచారణ కోసం కేసును ఢిల్లీకి బదిలీ చేసింది. సీబీఐ సెంగర్‌పై అత్యాచారం కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
అలాగే ఆమె తండ్రిపై తప్పుడు కేసు పెట్టడం, పోలీసు అదుపులో మరణానికి కారణమవడం విషయంలో సెంగర్, అతని సోదరుడు, సహచరులపై మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
నేరం జరిగిన మూడు సంవత్సరాల తరువాత, సెంగర్ అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పొందాడు. మరో సంవత్సరం తరువాత, బాలిక తండ్రి హత్య కేసులో అతనితో పాటు ఇతర నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ప్రస్తుతం, సెంగర్ జైలులోనే ఉన్నాడు. అతని శిక్షను నిలిపివేయాలనే అప్పీల్‌పై సుప్రీంకోర్టు సమీక్ష కొనసాగుతోంది.
మణిపూర్ దారుణం..
మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించారు.
పైన తెలిపినవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘోర కృత్యాలు దైనందిన చర్యగా మారాయి. అయ్యా మోదీ, ముందుగా ఆ ఘోరాలకు, వాటికి తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చినందుకు దేశ మహిళలకు క్షమాపణ చెప్పండి. ఆ విధంగా పాప ప్రక్షాళనకు ప్రయత్నించండి.
అనువాదం: J. నాగేశ్వర రావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
