తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె రెండవ రోజు కూడా కొనసాగుతోంది. కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కారం చేయడానికి బదులుగా ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపిస్తున్నది. ఇది అత్యంత ప్రమాదకరం.
ఆర్టీసీలో డ్రైవర్‌గా విధుల్లోకి తీసుకోవడానికి ముందు యాజమాన్యం మొదటగా రిక్రూట్మెంట్ దశలోనే ఫిల్టర్ చేస్తుంది. అలా ఫిల్టర్ చేసిన వాళ్లకి కొంతకాలం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే వారిని విధుల్లోకి తీసుకుంటారు. ఇన్ని చర్యలు తీసుకుంటుంది కాబట్టే, ఆర్టీసీలో ప్రమాదాల రేటు చాలా, చాలా స్వల్పం.
ఎవరినంటే వారిని తీసుకువచ్చి బస్సులు నడపటం అంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం తప్ప మరొకటి కాదు. ఏవైనా జరగరాని సంఘటనలు జరిగితే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లడమేకాక, సంస్థ ప్రతిష్ట మసకబారుతుంది. ప్రభుత్వం కూడా అప్రదిష్ట పాలవుతుంది. కాబట్టి తక్షణమే ఈ చర్యలు మానుకోవాలి.
వాస్తవాలను బహిరంగపరచాలి.. భేషజాలు వీడాలి..
డిమాండ్లలో రెండు మూడు మినహా అన్నీ పరిష్కారం చేశామని ప్రభుత్వం మీడియా ద్వారా పెద్ద ప్రచారం చేస్తున్నది. పరిష్కారం చేసిన సమస్యలేమిటో, పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న సమస్యలేమిటో బహిరంగంగా ప్రభుత్వం ప్రజలందరికీ తెలియజేయాలి.
మార్చి 13న కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. అంతకుముందు సమ్మె డిమాండ్లపై పలు రకాల ఆందోళనలు నిర్వహించారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కార్మిక సంఘాలతో చట్టరీత్యా చర్చలు జరపాలి, ఇది బాధ్యత కూడా. అలా చేయకపోడం చట్ట ఉల్లంఘనకు పాల్పడడంతోపాటు బాధ్యతారాహిత్యం కూడా అవుతోంది.

అయితే 21వ తేదీ వరకు ప్రభుత్వం నిద్రపోయింది. అకస్మాత్తుగా 21వ తేదీ నలుగురు అధికారులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేసిన చర్య తప్ప మరోటి కాదు. కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం మాత్రమే పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలపై రాజకీయ కోణంతో నిర్ణయం తీసుకోవాలి తప్ప.. అందులో అధికారుల ప్రమేయం గానీ, పాత్ర గానీ ఎంతమాత్రం ఉండదు.
ప్రభుత్వంతో సంబంధం లేని ఆర్టీసీ యాజమాన్యం అంతర్గతంగా పరిష్కరించాల్సిన సమస్యలను- యాజమాన్యం ప్రభుత్వం దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, తానే పరిష్కరించి తీరాలి. ప్రభుత్వం, యాజమాన్యం తమ బాధ్యతలను విస్మరించి 24 రోజుల వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ కార్మిక సంఘాలు అంగీకరించకుండా మొండిగా సమ్మెలోకి వెళ్లాయని అభాండాలు వేస్తున్నారు. ఇది దొంగే “దొంగా..దొంగా..” అని అరిచినట్టుగా ఉంది. ప్రభుత్వానికి ఇటువంటి ధోరణి ఎంతమాత్రం తగదు.
కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లు పరిష్కరించలేని గొంతెమ్మ కోరికలేమీ కావు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి గౌరవప్రదమైన ఒప్పందానికి రావడం ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అలా చేయకుండా సమ్మె సాగదీసి భేషజాలకు పోతే రాజకీయంగా ప్రభుత్వం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గత అనుభవాలు దీన్నే తెలియజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాలన్నిటినీ సక్రమంగా అర్థం చేసుకోవాలి. సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. సమస్యలు పరిష్కరించి కార్మికుల, ప్రజల ఆమోదాన్ని పొందాలి. ఇదే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.
కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు..
పాఠకుల సౌలభ్యం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు 13వ తేదీన యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఇచ్చిన సమ్మె నోటీసులోని డిమాండ్లను యథాతథంగా దిగువన ఇస్తున్నాము:
1. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
2. ఆర్థికపరమైన అంశాలన్నిటినీ పరిష్కరించి, ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి.
3) 2017 నుంచి అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంచాలి. వేతన సవరణ బకాయిలను చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయాలి.
4. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేస్తూ, ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి.
5. కొత్త బస్సులను సంస్థ ద్వారా కొని ఆర్టీసీని అభివృద్ధి పరిచి, ఆధునీకరించాలి.
6. సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేసి, రాయితీలకు, సంస్థ అభివృద్ధికి ప్రతియేటా బడ్జెట్లో 3% కేటాయించాలి.
7. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులకు సరిపడా కొత్త డిపోలను ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు ఈవీ బస్సులకు ఇవ్వరాదు.
8. యాజమాన్యం వాడుకున్న సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేస్తూ, సీసీఎస్‌లో పాలకమండలి ఎన్నికలు నిర్వహించాలి.
9. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు టికెట్లెస్ స్మార్ట్ కార్డు ఇవ్వాలి. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఈ స్కీమ్‌లో జరుగుతున్న సీ అండ్ టీ కేసులలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.
10. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బులు 400 కోట్లు ప్రతినెల కోత విధించకుండా చెల్లించాలి. పాత బకాయిలు 2500 కోట్లు వెంటనే ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలి.
11. బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ జీవో ఎంఎస్ నెం.30, తేది 08-07-2024 ప్రకారం వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలి. ఈ స్కీమ్‌లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి పోస్టులను కూడా ఇవ్వాలి.
12. అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి అర్హులైనవారికి ప్రమోషన్లు ఇవ్వాలి.
13. ప్రతి కార్మికునికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. బస్ బాడీ బిల్డింగ్‌తో పాటు మిగిలిన వర్క్‌షాపులను బలోపేతం చేయాలి. ప్రొడక్షన్ యూనిట్లలో 2013 నుంచి రావలసిన మ్యాన్ అవర్ రేట్లను అమలు చేయాలి.
14. తార్నాక హాస్పిటల్లో అన్ని విభాగాలలో సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. రోగులు, వారి వెంట వస్తున్న అటెండర్లకు భోజన, వసతి సౌకర్యం కల్పించాలి.
15. ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ, ఉద్యోగి ఫ్యామిలీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వారి తల్లిదండ్రులకు కూడా వైద్య సౌకర్యం కల్పించాలి.
16. సంస్థలో రిటైరైన ఉద్యోగులకు సరిపడా మందులు సరఫరా చేయాలి. వైద్య పరీక్షలయ్యే ఖర్చు యాజమాన్యమే భరించాలి.
17. రిటైరైన ఉద్యోగులకు రావలసిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలి. రిటైర్ కాబోతున్న ఉద్యోగులకు అదేరోజు అన్ని సెటిల్మెంట్ మొత్తాలను చెల్లించాలి.
18. అకౌంట్స్ విభాగంలో సెంట్రలైజేషన్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలి.
19. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు, సూపర్వైజర్లను తీసివేసి వారి స్థానంలో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి.
20. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్‌ల నియామకాలు మానుకోవాలి. ఆర్టీసీ సంస్థ ద్వారానే నియామకాలు చేపట్టాలి.
21. ఉద్యోగులకు 300 ఎర్న్డ్ లీవులు దాటితే ఆ లీవులను ఆ ఉద్యోగి రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా వాడుకునే అవకాశం కల్పించాలి.
22. అన్ని యూనిట్లలో మహిళలతో పాటు పురుషులకు కూడా అన్ని వసతులతో పాటు తాగునీరు, వాహనాల పార్కింగ్‌కు సరిపడా షెడ్స్ నిర్మించాలి.
23. పాత రెగ్యులేషన్స్ మార్చి డ్రైవర్, కండక్టర్- మెయింటెనెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
24. అక్రమ సస్పెన్షన్, రిమూవల్ అయినవారిని, అప్పీల్ రిజెక్ట్ అయినవారిని విధుల్లోకి తీసుకోవాలి. ఈ ప్రక్రియ ఇంకా వేగవంతంగా జరగాలి.
25. జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాస్ అయి ఉన్నవారికి పోస్టింగ్ ఇవ్వాలి. మిగిలిన ఖాళీలకు డిపార్ట్మెంట్ టెస్టులు నిర్వహించి భర్తీ చేయాలి.
26. హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు రిజెక్ట్ అయినవారికి మరొక అవకాశం ఇవ్వాలి. డిమాండ్ నోటీసులు రానివారందరికీ ఈపీఎఫ్ నుంచి డిమాండ్ నోటీసులు ఇప్పించాలి.
27. 2019వ సంవత్సరం సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తివేయాలి.
28. అద్దె బస్సులను, అద్దె బస్సుల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఆర్టీసీ సంస్థ విలీనం చేసుకోవాలి.
29. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంటల పనిదినాలు(సిటీ సర్వీసులలో 7 గంటలు) అమలు చేసి మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు పూర్తయ్యేలా డ్యూటీలు ఇవ్వాలి. ప్రతి మహిళా ఉద్యోగికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలి.
30. టీజీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని ఏపీఎస్ఆర్టీసీకి బదిలీ చేయాలి.
31. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో ఆల్కహాల్ తీసుకున్నట్లు రిజల్ట్ చూపిస్తే, సదరు డ్రైవర్ ఆక్షేపణ చెప్పినచో మరో బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించి నిర్ధారించాలి. అయినా సరిగా నిర్ధారణ కాకపోతే బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షకు పంపించి సరైన నిర్ధారణ చేయాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
