“ఖైదీలు ఒకరికొకరు పసిపిల్లలవుతూ ఓదార్పును పొందుతారు” అని ఓ బెంగాలీ కవి అంటారు. ఎంతటి ఖైదీలకైనా ఓదార్పును పొందే జీవితాన్నివ్వాలి.
నేరస్థుడికి శిక్ష పడాలని పోరాడటంతో పాటు మార్చుకోడానికి అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ సమాజానిదే.
నేరస్థుడు అనగానే క్రూరమైన వ్యక్తిగా చూస్తాం.
అసలు మనిషిలో క్రూరత్వం ఎలా ఏర్పడుతుందో, ఎలా పాకురుపడుతుందో, ఎలా నిర్మూలన చెందుతుందో ఆ ప్రక్రియలోకి వెళ్ళకుండా కేవలం మనుషులను చంపడం సమస్యకి పరిష్కారం కాదు.
మరణశిక్ష విధించడమంటే న్యాయస్థానం చేతులారా అన్యాయం చేస్తుందని అర్థం.
మనుషుల్లో ఉండే నేర స్వభావాన్ని తగ్గించే దిశగా కోర్టు తీర్పులు ప్రభావం చూపాలి. నేరస్థులను తగ్గించడమంటే మనుషులను తగ్గించడం కాదని గుర్తు చేసుకోవాలి.
జీవించే హక్కు – వాస్తవాలు..
మరణశిక్ష అన్ని హక్కుల్లో ప్రధానమైన జీవించే హక్కును ఉల్లంఘిస్తుంది. ఇది అత్యంత క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన శిక్ష.
కన్నుకి కన్ను అనే సిద్ధాంతాన్ని గెలిపించే ప్రతీకార చర్య. పరిష్కారం ఉరితాడులో లేదని ఇప్పటికే అనేక దేశాలు గుర్తించి మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రకారం మరణశిక్ష జైలుశిక్ష కంటే ఎక్కువగా నేరాలను తగ్గిస్తుందని ఎటువంటి నమ్మదగిన ఆధారాలు లేవు.
మరణశిక్షను రద్దు చేసిన దేశాల్లో నేరాల సంఖ్య పెరగలేదు. కొన్ని సందర్భాల్లో తగ్గింది కూడా.
ఉదాహరణకు, కెనడాలో 2008లో హత్యల రేటు 1976లో ఉన్నదాని కంటే సగానికి తక్కువగా ఉంది. మరణశిక్ష నేరాలను తగ్గిస్తుందని ప్రజలు సైతం నమ్ముతుంటారు.
అవగాహన లేకపోవడం, భావావేశంలో వాస్తవికతకు దూరంగా ఆలోచించడం వల్లే ప్రజలు తమకు అలవాటైన చూపులో, అలవాటైన ధోరణిలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంటారు.
కానీ మానవ హక్కులు మంచి వారికే కాదు, చెడ్డవారికీ వర్తిస్తాయి. అందుకే మరణదండన వంటి నిర్ణయాలు కేవలం ప్రజాభిప్రాయం ఆధారంగా తీసుకోకూడదు.
కఠిన శిక్షలతో నేరాలు తగ్గుతాయా?..
మరణదండన వంటి కఠినమైన శిక్షలు లేకుంటే నేరాలను అదుపు చేయటం సాధ్యం కాదని నమ్మేవారున్నారు.
నేరాలను అరికట్టడానికి, ముఖ్యంగా హత్యానేరాన్ని అరికట్టడానికి ఉరిశిక్ష అవసరమని వారు నమ్ముతారు. కానీ నేరాలను అదుపు చేయడంలో క్రూరమైన శిక్షలకు ఉండే పాత్ర చాలా తక్కువేనని అన్ని పరిశోధనలూ తెలుపుతున్నాయి.
నేరాలని అదుపు చేయడానికి ఆయా సామాజిక రంగాలలో కృషి చేయవలసి ఉంటుంది.
ఇదంతా విడిచిపెట్టి శిక్షల కాఠిన్యంపై దృష్టి పెట్టడం ఈ కర్తవ్యం నుంచి తప్పించుకోవడమే అవుతుంది. దాని వల్ల శిక్షాస్మృతి క్రూరంగా, అనాగరికంగా తయారవుతుందే తప్ప ఏ సమస్యా పరిష్కారం కాదు.
న్యాయవ్యవస్థలో పొరపాట్లు- ప్రాణానికి తిరుగులేదు..
నేరస్థులకు ఉరిశిక్షలు కొనసాగిస్తే ఏ నేరం చేయని ఖైదీలకూ ఉరిశిక్ష పడదనే గ్యారంటీ లేదు. న్యాయవ్యవస్థ తప్పులు చేయదని, తప్పుడు తీర్పులు ఇవ్వదని చెప్పలేం.
ఖైదీ జైలుశిక్ష అనుభవిస్తున్న కాలంలో నేరం చేయలేదనో, నేరంలో తక్కువ పాత్ర ఉందనో నిర్ధారణ జరిగితే శిక్షను తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ మరణశిక్ష అమలైన తర్వాత ప్రాణాన్ని తిరిగి తేలేము.
ఉదాహరణకు, 1973 నుంచి అమెరికాలో మరణశిక్షకు గురైన వారిలో 200 మందికి పైగా నిర్దోషులని తేలింది.
ఇంకా కొంతమంది తమ నేరంపై తీవ్రమైన అనుమానాలు ఉన్నప్పటికీ మరణశిక్షకి బలయ్యారు.
కొన్ని దేశాల్లో అధికారులు రాజకీయ ప్రత్యర్థులను శిక్షించడానికి లేదా ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
ఇరాన్, సౌదీ అమెరికా వంటి దేశాల్లో ఈ విధమైన ధోరణి ఇంకా కొనసాగుతుంది.
అంతర్జాతీయంగా మారుతున్న ధోరణి..
కజకిస్తాన్(2021), జాంబియా(2022), జింబాబ్వే(2025) వంటి దేశాలతో పాటు ఇప్పటికే 113 దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి.
యూరప్‌లో దాదాపుగా మరణదండన లేదు. అమెరికాలో కూడా దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది. మరికొన్ని దేశాలు మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయం తీసుకున్నాయి.
కుటుంబాలపై సామాజిక, మానసిక ప్రభావం..
మరణదండన ఒక వ్యక్తికే కాదు, అతని కుటుంబం, స్నేహితుల మీద కూడా ప్రభావం చూపుతుంది.
శిక్షకు గురైన వ్యక్తుల బంధువులు, సాధారణంగా ఆ నేరంతో సంబంధం లేకపోయినా, మరణశిక్ష వల్ల తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన బాధను అనుభవిస్తారు.
ఈ బాధ, బాధితుని కుటుంబం తమ ప్రియమైనవారిని కోల్పోయినప్పుడు అనుభవించిన బాధతో సమానం.
ప్రతి మనిషిలో ఒక ప్రపంచం ఉంటుంది, ప్రతి జీవితం ఒక సంపూర్ణ ప్రపంచం.
ఎవరైనా ఒక ప్రాణాన్ని నాశనం చేస్తే, అది ఒక మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసినట్టే. అలాగే ఎవరు ఒక ప్రాణాన్ని రక్షిస్తారో వారు ఒక సంపూర్ణ ప్రపంచాన్ని రక్షించినట్టే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
