వివిధ వార్తా కథనాల ప్రకారం, పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌పై కూడా దాడులు జరిగాయి.
మిత్తల్ లవ్లీ గ్రూప్ యజమాని, ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఛాన్సలర్‌గా ఉన్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిత్తల్ రాజ్యసభ ఉప నాయకుడిగా నియమితులైన కొద్ది రోజులకే ఆయనకు సంబంధించిన ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు దాడులు జరిపింది.
పార్లమెంటరీ బాధ్యతల్లో రాఘవ్ చద్దా స్థానంలో మిత్తల్ వచ్చారు.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సోదాలు..
ఇతర స్థలాలతో పాటు పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌పై కూడా దాడులు జరిగినట్టు కథనాలు వెల్లడించాయి.
మిత్తల్ లవ్లీ గ్రూప్ యజమాని కాగా, విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఛాన్సలర్ కూడా. ఆయన సోదరులు రమేశ్, నరేశ్‌లు ఈ విశ్వవిద్యాలయానికి సహ-యజమానులుగా ఉన్నారు.
రాజ్యసభకు 2022లో ఎన్నికైన 10 మంది ఆప్ ఎంపీలలో మిత్తల్ ఒకరు. పార్లమెంటరీ రక్షణ, ఆర్థిక కమిటీల్లో ఆయన భాగమై ఉన్నారు.
దాడులకు కారణం గోప్యం..
మిత్తల్‌పై ఇప్పుడెందుకు దాడులు జరుగుతున్నాయన్న దానిపై డైరెక్టరేట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. “ఈ సమాఖ్య దర్యాప్తు సంస్థ స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి సహాయాన్ని కోరలేదని” పేరు చెప్పని అధికారి ఒకరు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
గడిచిన 10 సంవత్సరాలలో రాజకీయ నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 190కి పైగా కేసులను నమోదు చేయగా, అందులో కేవలం రెండింటిలో మాత్రమే నేరం నిరూపితమైందని ఈడీని నియంత్రించే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంట్లో చెప్పింది.
బీజేపీకి ప్రతిపక్షంగా ఉన్న ఆప్ నాయకులే, ఈ ఆర్థిక దర్యాప్తు- చట్ట అమలు సంస్థల(ఈడీ) సాధారణ లక్ష్యంగా మారుతున్నారు.
విపక్షాల విమర్శలు..
దీనిపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, “పంజాబ్‌లో ఎన్నికల ఏర్పాట్లను మోదీ జీ మొదలుపెట్టారు. కానీ పంజాబ్ ప్రజలు దీన్ని సహించరు. వారు బీజేపీకి ధీటుగా సమాధానం చెబుతారు” అని రాశారు.
ఆప్కే చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందిస్తూ “ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిత్తల్ ఇంటిపై, విశ్వవిద్యాలయంపై ఈడీ దాడులు- ఇది మోదీ అలవాటైన శైలే(టిపికల్ మోదీ స్టైల్)” అని రాసుకొచ్చారు.
పశ్చిమ బెంగాల్లో మరో అరెస్ట్..
మరోవైపు, పశ్చిమ బెంగాల్లో బొగ్గు చోరీకి సంబంధించిన మనీలాండరింగ్(పీఎంఎల్ఏ) కేసులో ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్‌కు సలహాలు ఇస్తున్న పోల్ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐ-ప్యాక్'(I-PAC) డైరెక్టర్ వినేశ్ చందేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్ 13న అరెస్టు చేసింది.
బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
