సామాజిక బాధ్యతతో రాసే రచయితలు కొందరు. పేరు కోసం రాసే వారు మరి కొందరు. ఆచరణాత్మక రచనా వ్యాసాంగం చేసే వారు మరి కొందరు. ఈ మూడో కోవకు చెందిన రచయిత స్కైబాబా.
తాను పుట్టిన పెరిగిన సామాజిక నేపథ్యం నుంచి సాహిత్య సృజన చేయడంతో పాటు సమూల సమాజ మార్పు కోసం తపన ఉంటుంది ఆయనలో.
కాలంతో అందరు నడుస్తారు. ఆ నడకను ముందు తరాల వారికి అందించే చర్య చాలా వేగంగా ప్రతిభావంతంగా చేస్తున్న ఆచరణశీలి స్కై. మూడు దశాబ్దాలుగా ఆయన తన జీవిత కోణం నుంచే తెలంగాణ సమాజాన్ని చూస్తున్నారు.
తెలంగాణ సమాజం నుంచి తన జీవిత నేపథ్యాన్ని అంచనా వేసుకుని రచయితగా రాణిస్తున్నారు.
మన రాష్ట్రంలోనే కాదు ఏపీలో కూడా ముస్లిం జీవిత నేపథ్యాల నుంచి సాహిత్యాన్ని సృజనాత్మకంగా వెలువరించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు.
అందులో స్కైబాబా తొలి వరుసలో ఉంటారు.
సమాజపు రాజకీయ అంశాలు, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాల కేంద్రంగా చాలా మంది రాశారు, రాస్తున్నారు. కానీ స్కై నడుస్తున్నది, నడిపిస్తున్నది ‘‘దునియాదారి’’. అంటే గుడ్డి, ఎడ్డి పోకడ కాదు.
ఉన్నతమైన మానవీయ కోణం కలిగిన సమాజ స్వాప్నికత వైపు అందరితో సమానంగా తాము ఉండాలనే ఆకాంక్షను కలిగి ఉండటం. దాన్నే ముస్లిం సమాజపు ఆలోచనలను మరింత మెరుగుపెట్టే ప్రయత్నం చేస్తున్న రచయిత ఈయన.
అస్తిత్వవాద సాహిత్యం- ముస్లిం వాద గొంతుక..
1990ల తర్వాత తెలుగునాట అస్తిత్వవాద సాహిత్యం చాలా బలంగా వచ్చింది. ఈ దశాబ్దంలో ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం, దళిత, బహుజన సాహిత్య గొంతుకలు చాలా బలంగా వ్యక్తీకరణ అయ్యాయి.
పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, వేళ్లూనుకుని పోయిన కుల వ్యవస్థ, దాని చుట్టూ అల్లుకుని ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవితాలు దళితులను, బహుజనులను రాసేలా చేశాయి.
కొత్త తరాన్ని రాసేందుకు పురికొల్పిందా వాతావరణం. ఈ సందర్భంలోనే ముస్లిం వాద కవిత్వం చాలా బలంగా వచ్చింది.
ముస్లిం సమాజంలో గ్రామీణ తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ పనికి పూనుకున్నారు. అందులో తొలి వరుసలో ఉన్నది స్కైబాబా. ఆయన వెలువరించిన “అధూరే” కథల సంపుటి పెను సంచలనం కలిగించింది.
అంతేకాదు ఆయన వెలువరించిన ‘‘తెహజీబ్’’ ప్రధాన స్రవంతి సమాజానికి ముస్లిం జీవితపు కోణాలను పరిచయం చేసింది. ముస్లింల ఆర్థిక, రాజకీయ, ఆలోచనా అంశాలను బలంగా వ్యక్తీకరించారు స్కైబాబా.
ఏ సమాజాన్నైనా సాంస్కృతిక అంశాలు ఏకం చేసేందుకు దోహదం చేస్తాయి. ఆయా సామాజిక సమూహాల మధ్య రాజకీయపరమైన ఆలోచనల ఏకరూపతకు దారి చూపుతాయని కూడా చెప్పొచ్చు.
మనకు దరిదాపుల్లోనే ఉంటున్న సాటి మనుషుల విషయంలో మిగతా వారి స్పందన భిన్నంగా ఎందుకు ఉన్నదో, ఎట్లా ఉండాలో కూడా స్కైబాబా రచనల్లో వ్యక్తమవుతూ ఉంటుంది.
తినే తిండి, కట్టుకునే బట్టలు, రాజకీయాల వంటి విషయాల్లో ముస్లింలు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదనతో చెప్తారు.
సామాజిక చైతన్యం – ముస్లిం సోషల్ మూవ్మెంట్..
దళిత, బహుజన సాహిత్యకారులు చాలా మందే గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు సాహిత్య రంగస్థలంపైకి వచ్చారు. కానీ ముస్లిం సమాజం నుంచి రావాల్సినంత మంది రాలేదు. వచ్చిన కొద్ది మందిలో వారి వారి పరిమితులు, పరిధులు వారికి ఉన్నాయి.
ముస్లిం సమాజం ఏ ఆలోచనలు మార్చుకోవాలో చాలా సూటిగా సూచనప్రాయంగా చెప్తున్నారు.
‘‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’’ కార్యక్రమం ద్వారా తమ సమూహాలను చైతన్యపరిచే ఆలోచనలు చేస్తున్నారు. వీరితో పాటు వారి జీవిత సహచరి షాజహానా కూడా రచయితగా రాణిస్తున్నారు.
‘‘నఖాబ్’’ తెలుగు సాహిత్యంలో పెను సంచలనం కలిగించింది. వీరితో పాటు నస్రీన్ ఖాన్, మహ్మద్ వహిద్ తదితరులు సోషల్ మూవ్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు.
ముస్లిం సత్యశోధక్ మండల్ 1970ల్లో తీసుకున్న సామాజిక చైతన్య కార్యక్రమానికి కొనసాగింపుగా మన దగ్గర వీరు చేస్తున్నారని చెప్పొచ్చు.
మహాత్మ జ్యోతిరావు ఫూలేను ఆదర్శంగా తీసుకుని హమీద్ దల్వాయి ఈ సంస్థను స్థాపించారు.
ప్రధాన స్రవంతికి దూరంగా తమ ఆలోచనలు, ఆచరణ ఉండొద్దనే భావాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు.
మనుషులంతా ఒక్కటే, సర్వమానవ సమానత్వ, సౌభ్రాతృత్వ భావనను కలిగి ఉండాలనే తాత్విక ఆలోచనకు ఆచరణ కావాలని తపన పడే సంస్థ ఇది. దీన్నే మన దగ్గర స్కైబాబా, వారి సహ ఆలోచనా మిత్ర బృందం చేస్తున్నది.
ఆధునికతను అందుకున్న రచయితగా, జాతీయ సమైక్యతా ఆలోచనా ధారను కలిగిన రచయితగా తన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం – బహుజన సాహిత్య సృజన..
స్కైబాబా కేవలం ముస్లిం వాద రచనల దగ్గర్నే ఆగిపోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కూడా.
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, డాక్టర్ పసనూరి రవీందర్ తదితరులతో కలిసి బహుజన సాహిత్య సృజన కూడా బలంగా చేస్తున్నారు.
తెలంగాణ ఉనికి, అస్తిత్వాలకు సంబంధించిన పరిశోధనాత్మక రచనల్లో కూడా స్కై తనదైన పాత్ర పోషిస్తున్నారు. 2001 నుంచి 2014 వరకు జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన భాగస్వామి అయ్యారు.
కరపత్రాల పంపిణీ నుంచి మొదలుకుని బహిరంగ సభలకు, రచనల రూపంలో తన మద్దతునిచ్చారు.
కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ఆందోళనకూ పూనుకున్నారు. సమూహంలో ఒకరుగా ఉన్నారు. విడిగా తన ఉనికిని, అస్తిత్వాన్ని నిలుపుకున్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా వెలువడిన అనేక గ్రంథాలకు పరిశోధకులుగా, సహరచయితగా స్కై ఉన్నారు.
తెలంగాణ భాషా, నుడికారాలను వ్యక్తీకరించడంలో ఈయనది ప్రత్యేక ముద్ర. తాను పుట్టి పెరిగిన నల్గొండ జిల్లా నేటివిటీ సాహిత్యంలో బలంగా కనిపిస్తూ ఉంటుంది.
సాంస్కృతిక మార్పుల ఆవశ్యకత – విశ్వనరుడు..
ఆయా సమాజాల సాంస్కృతిక జీవిత ఆచరణల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చాలా మంది చెప్తున్నారు. దాంట్లో మరింత నిర్దిష్టంగా చెప్తున్న వారు చాలా తక్కువ. స్కైబాబా మాత్రం తాను పుట్టి పెరిగిన సామాజిక స్థితి, దాన్ని ఆవరించి ఉన్న సమూహాలు తమ ఆలోచనలు మార్చుకోవాల్సిన అనివార్యతను నొక్కి చెప్తున్నారు.
అంతే కాదు ప్రధాన స్రవంతి కూడా అందరినీ కలుపుకుపోవాలని బలంగా కోరుకుంటున్నారు. మనమంతా ఒక్కటే అనే భావనను కలిగి ఉండాలని అంటారు. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా వ్యక్తీకరించినట్లుగా తాను విశ్వనరుడనని స్కై భావించడమే కాదు, ఆచరణలోనూ ఆ విధంగానే ఉంటున్నారు.
(జాతీయ సమైక్యతా అవార్డుకు స్కైబాబా ఎంపికైన సందర్భంగా..)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
