రాష్ట్రంలో పలుకుబడిని విస్తరించుకోవడంలో భాగంగా క్రైస్తవ ఓటర్లను ఆకర్షించాలన్న బీజేపీ కేరళ రాష్ట్ర శాఖ ప్రయత్నం పెద్దగా ఫలించినట్టు లేదు.
కీలకమైన రాజకీయ సందర్భాలలో గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి ప్రయత్నాలతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
క్రైస్తవ ఓటర్లను ఆకర్షించాలన్న బీజేపీ ప్రయత్నాలు వరుసగా జరిగిన అనేక పరిణామాల కారణంగా చిక్కుల్లో పడ్డాయి.
కేరళలో బీజేపీ విస్తరణకు క్రైస్తవ ఓటర్లలో చొచ్చుకుపోవడం అనివార్యమని ఆ పార్టీ ప్రగాఢంగా నమ్ముతోంది.
ఈ ప్రయత్నాలలో తాజా చర్య కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్సీఆర్ఏ(విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ.
ప్రతిపాదిత ఈ సవరణ ప్రకారం, ఏదైనా ఒక సంస్థ విదేశీ ఆర్థిక సహాయంతో, విరాళాలతో ఆస్తులు సమీకరించుకున్నప్పుడు- అటువంటి సంస్థ ఎఫ్సీఆర్ఏ లైసెన్సును పునరుద్ధరించుకోకపోతే ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సాధికార సంస్థ స్వాధీనం చేసుకోవచ్చు.
ఈ చట్ట సవరణను సరిగ్గా కేరళ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో తీసుకురావడం రాష్ట్ర బీజేపీ శాఖ ఆశలపై నీళ్లు చల్లింది.
తాత్కాలికంగా ఈ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.
కేరళ బీజేపీ శాఖ ఒత్తిడి మేరకే కేంద్రం ఈ చట్ట సవరణపై జాప్యం చేస్తోందనే అభిప్రాయం సర్వత్రా ఉన్నది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ సవరణ చట్టం ద్వారా తమకు వచ్చే విదేశీ ఆర్థిక సహాయ సహకారాలను, విరాళాలను రానియ్యకుండా అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అంచనాకు వచ్చిన వివిధ శ్రేణులకు చెందిన క్రైస్తవ సంస్థలు ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకించాయి.
పార్లమెంట్ ఆమోదాన్ని ఈ సవరణ పొందితే అప్పటి వరకు తాము సమీకరించుకున్న ఆస్తులను కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకుంటుందన్న భయాందోళనలు క్రైస్తవులలో మొదలయ్యాయి.
ఈ ఆందోళనలను సర్దిచెప్పేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు షోన్ జార్జ్ ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.
యూడీఎఫ్‌కు మద్దతుగా మత పెద్దల పిలుపు..
గత కొన్ని రోజులుగా బీజేపీ, క్రైస్తవ ఓటర్ల మధ్య దూరం తీవ్ర స్థాయికి చేరింది.
కేరళలో క్రైస్తవ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకైనా జయాపజయాలను ప్రభావితం చేయగలిగిన సంఖ్యలో ఉన్నారు.
క్రైస్తవ సమాజానికి ప్రాతినిధ్యం వహించే ‘దీపిక’ పత్రిక ద్వారా విశ్వాసులైన క్రైస్తవులందరూ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు ఓటు వేయాలని మత పెద్దలు పిలుపునిచ్చారు.
కేరళ బీజేపీ నాయకుడు షోన్ జార్జ్ తండ్రి పీసీ జార్జ్ పోటీ చేస్తున్న పున్జార్, పాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రైస్తవ సమాజం బాహాటంగానే యూడీఎఫ్‌కు అనుకూలంగా ప్రచారం చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో నన్‌లు, మత బోధకుల అరెస్టుల ప్రభావం..
ఛత్తీస్‌గఢ్‌లో బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై కేరళకు చెందిన ఇద్దరు క్యాథలిక్ నన్‌లు “సిస్టర్ ప్రీతీ మేరీ, సిస్టర్ వందన ఫ్రాన్సిస్”లను 2025 జూలై 25న అరెస్టు చేయడం మరో రాజకీయ దుమారానికి కారణమైంది.
క్యాథలిక్ నన్‌లు ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ మహిళలను బలవంతంగా మతం మార్పించడం, అక్రమంగా తరలించుకుపోవడం లాంటి పనులకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆరోపిస్తుంటే- మరోవైపు కేరళ బీజేపీ శాఖ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఆ ఆరోపణలను తిప్పికొడుతూ, నన్లను సమర్థించారు.
రాష్ట్రంలో తన రాజకీయ పలుకుబడికి ఛత్తీస్‌గఢ్ బీజేపీ శాఖ ప్రచారం గండికొడుతోందని రాజీవ్ చంద్రశేఖర్ ఆందోళన చెందారు.
ఆ తర్వాత కొన్ని నెలలకు 2025 డిసెంబరు 30న మహారాష్ట్రలోని అమరావతిలో కేరళకు చెందిన క్రైస్తవ మత బోధకుడు, మరో ఆరుగురిని బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై అరెస్టు చేశారు.
ఈ అరెస్టులపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు కాంగ్రెస్ నాయకత్వం కూడా ధ్వజమెత్తింది.
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సమస్య ముందుకు రావడం రాష్ట్ర బీజేపీ శాఖకు తలనొప్పిగా మారింది.
అమరావతిలో అరెస్టైన క్రైస్తవ బోధకులను విడిపించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి ఏకంగా కేరళ బీజేపీ శాఖ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది.
ఈ రెండు పరిణామాలు రాష్ట్ర బీజేపీ శాఖను గందరగోళంలోకి నెట్టాయి.
బీజేపీ పాలిత ఉత్తరాది రాష్ట్రాలలో క్రైస్తవులపై దాడులు, అణచివేత పెరుగుతున్నాయన్న ఆరోపణల నుంచి బయటపడడానికి రాష్ట్ర బీజేపీ శాఖ భారీ కసరత్తే చేయాల్సి వచ్చింది.
బెడిసికొట్టిన మునంబం వక్ఫ్ భూముల వ్యూహం..
మునంబంలోని వక్ఫ్ భూముల్లో నివసిస్తున్న క్రైస్తవులను మచ్చిక చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
కొందరు ముస్లింలు 2025 వక్ఫ్ చట్టం ఆధారంగా ఈ భూములను తిరిగి ముస్లిం సమాజానికి అప్పగించాలన్న డిమాండ్‌ను ముందుకు తీసుకురావడంతో, రాష్ట్రంలో ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులను నిలబెట్టే వ్యూహంతో మునంబం వక్ఫ్ భూముల వివాదంలో బీజేపీ తలదూర్చింది.
చివరికి బీజేపీ భారీ ఎత్తున ప్రచారం చేసిన వక్ఫ్ చట్టం వల్ల ముస్లింలకు ఒరిగిందేమీ లేదని తేలింది.
సొంత ఓటు బ్యాంకులో అసంతృప్తి.. నూతన వ్యూహాల ఆవశ్యకత..
ఇదిలా ఉండగా కేరళలో మైనారిటీలైన క్రైస్తవులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ చేస్తోన్న ప్రయత్నాలు ఆ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న హిందువులలో వ్యతిరేకతకు కారణమవుతోంది.
క్రైస్తవులు కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నారని, వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో సొంత ఓటు బ్యాంకైన హిందువులను దూరం చేసుకోరాదని పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు అభిప్రాయపడుతున్నారు.
కేరళలో తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ తన రాజకీయ ప్రభావాన్ని విస్తరించుకునేందుకు సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
అనువాదం: కొండూరి వీరయ్య
ది హిందూ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
