♦ ‘కొంటె ప్రయత్నాలే’ అని తేల్చిచెప్పిన భారత్
తప్పుడు వాదనలు, నిరాధారమైన కథనాలతో అరుణాచల్ ప్రదేశ్ సహా ఈ ప్రాంతాలు, భూభాగాలు భారతదేశంలో అంతర్భాగమనే కాదనలేని వాస్తవాన్ని మార్చలేరని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లను కేటాయించడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ తోసిపుచ్చింది.
ఇలాంటి “కొంటె ప్రయత్నాలు”, “తప్పుడు వాదనలను ప్రవేశపెడుతూ నిరాధారమైన కథనాలను అల్లడం” వల్ల ఆ రాష్ట్రం దేశంలో అంతర్భాగమనే వాస్తవాన్ని మార్చలేరని స్పష్టం చేసింది.
కల్పిత పేర్లను తీవ్రంగా ఖండించిన భారత్..
భారత భూభాగంలో భాగమైన ప్రాంతాలకు కల్పిత పేర్లను కేటాయించేందుకు చైనా చేస్తున్న కొంటె ప్రయత్నాలను భారత్ వర్గీకృతంగా తిరస్కరిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు.
“అరుణాచల్ ప్రదేశ్‌తో సహా ఈ ప్రాంతాలు- భూభాగాలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ విడదీయరాని భారత అంతర్భాగమే. చైనా తప్పుడు వాదనలను ప్రవేశపెడుతూ, నిరాధారమైన కథనాలను అల్లుతూ చేసే ఇలాంటి ప్రయత్నాలు ఈ తిరుగులేని వాస్తవాన్ని మార్చలేవు” అని ఆయన అన్నారు.
చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 10న 23 ప్రాంతాలకు కొత్త పేర్లను ప్రకటించిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖపై విధంగా స్పందించింది.
ఈ చర్యలు “భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తాయి”అని జైస్వాల్ చెప్పారు.
“సంబంధాలలో ప్రతికూలతను నింపే, మెరుగైన అవగాహనను సృష్టించే ప్రయత్నాలను దెబ్బతీసే చర్యలకు చైనా దూరంగా ఉండాలి” అని ఆయన సూచించారు.
చైనా ఆరో జాబితా విడుదల..
అరుణాచల్ ప్రదేశ్‌ను “జాంగ్నాన్”గా ప్రస్తావిస్తూ చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ 23 “ప్రామాణిక” ప్రదేశాల పేర్లతో ఆరవ జాబితాను విడుదల చేసింది. 2017 నుంచి కాలానుగుణంగా చేపడుతున్న పేర్ల మార్పు ప్రక్రియలో భాగంగా ఈ తాజా చర్యకు పాల్పడింది.
గత ఏడాది మేలో, చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రామాణిక భౌగోళిక పేర్లతో ఐదవ జాబితాను విడుదల చేసింది.
అంతకుముందు 2025 మార్చిలో 30 పేర్లు, 2023 ఏప్రిల్‌లో 11, అంతకుముందు జాబితాలో 15, అలాగే 2021, 2017లో విడుదల చేసిన మొదటి జాబితాలలో వరుసగా ఆరు పేర్లను విడుదల చేసింది.
ఏప్రిల్ 10న విడుదల చేసిన తాజా జాబితాలో వివిధ భౌగోళిక ప్రాంతాలు ఉండగా, అందులో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి.
ఈ 23 పేర్లలో కనీసం ఎనిమిది పర్వత కనుమలు కాగా, వాటితో పాటు పలు శిఖరాలు, నదులు, కొన్ని జనావాసాలు ఉన్నాయి.
గత జాబితాల మాదిరిగానే, ప్రతి పేరును చైనీస్ అక్షరాలు, టిబెటన్ లిపి- పిన్యిన్లలో అందించారు.
అలాగే అసలు నోటిఫికేషన్లో ఖచ్చితమైన అక్షాంశ, రేఖాంశ కోఆర్డినేట్లను పొందుపరిచారు.
మునుపటి జాబితాలలో కూడా తవాంగ్, పశ్చిమ సియాంగ్, సుబన్సిరి, అంజావ్ జిల్లాలను కలుపుకొని అరుణాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రాంతాలను ఇదే విధంగా మ్యాపింగ్ చేశారు.
జిన్జియాంగ్లో కొత్త కౌంటీల ఏర్పాటు..
మరోవైపు మార్చి 26న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల సమీపంలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో చైనా ‘సెన్లింగ్’అనే పేరుతో కొత్త కౌంటీని ఏర్పాటు చేసింది.
గత ఏడాది కాలంలో జిన్జియాంగ్లో ఏర్పాటు చేసిన మూడవ కొత్త కౌంటీ ఇది.
అక్సాయ్ చిన్‌లో భారత్ తమదిగా వాదిస్తున్న అధిక భూభాగాన్ని కలుపుకుంటూ, జిన్జియాంగ్లోని హోటన్ ప్రిఫెక్చర్లో రెండు కౌంటీలను సృష్టించినట్లు 2024 డిసెంబర్లో చైనా ప్రకటించింది.
దీనిపై “దౌత్య మార్గాల ద్వారా తీవ్ర నిరసనను” నమోదు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ తర్వాత తెలియజేసింది.
“ఈ ప్రాంతంలో భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని భారత ప్రభుత్వం ఎన్నడూ అంగీకరించలేదు. కొత్త కౌంటీల సృష్టి వల్ల ఈ ప్రాంతంపై భారత్‌కు ఉన్న దీర్ఘకాలిక, స్థిరమైన సార్వభౌమాధికార వాదనపై ఎలాంటి ప్రభావం పడదు, అలాగే చైనా బలవంతపు అక్రమ ఆక్రమణకు ఇది చట్టబద్ధత కల్పించదు” అని స్పష్టం చేసింది.
షక్స్‌గామ్ లోయలో చైనీయుల మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను జనవరిలో భారత్ విమర్శించింది. ఆ లోయ భారత భూభాగంలో ఉన్నందున, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చిచెప్పింది.
2024లో వాస్తవ నియంత్రణ రేఖ వెంట సైనిక ప్రతిష్టంభన ముగియడం, ఘర్షణాత్మక ప్రాంతాల వద్ద బలగాల ఉపసంహరణ జరిగిన తర్వాత భారత్-చైనాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఈ తాజా ప్రకటన వెలువడింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
