తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా తొలి అడుగు వేస్తూ, తన మొదటి పదవీకాలం ముగిసేలోగా మాన్హాటన్లోని ఈస్ట్ హార్లెమ్‌లో న్యూయార్క్ నగరం ఒక కిరాణా దుకాణాన్ని ప్రారంభిస్తుందని మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఏప్రిల్ 12న ప్రకటించారు.
ప్రధానంగా లాటినోలు నివసించే ప్రాంతంలో, ఎలివేటెడ్ రైలు పట్టాల కింద ఉన్న నగర యాజమాన్యంలోని మార్కెట్ అయిన లా మార్కెటాలో దుకాణాన్ని నిర్మించడానికి మేయర్ సుమారు 30 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలనుకుంటున్నారు.
మేయర్‌గా తన మొదటి 100 రోజులను పురస్కరించుకుని ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో మమ్దానీ ఈ ప్రణాళికను ప్రకటించారు.
ప్రణాళిక, లక్ష్యాలు..
ఇబ్బందుల్లో ఉన్న న్యూయార్క్ వాసులకు ఆహార ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో ప్రతి బరోలో ఒకటి చొప్పున నగర యాజమాన్యంలో ఐదు కిరాణా దుకాణాలను ఏర్పాటు చేస్తానని మమ్దానీ అభ్యర్థిగా ఉన్నప్పుడు చెప్పారు.
మరో బరోలో ఇప్పటికే ఉన్న భవనంలో ఇటువంటి రెండో స్టోర్ వచ్చే సంవత్సరం ఆఖరు నాటికి ప్రారంభమవుతుందని మేయర్ కార్యాలయం తెలిపింది. 2029లో తన పదవీకాలం ముగిసేలోపు ఐదు స్టోర్లనూ ప్రారంభించాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
“న్యూయార్క్ వాసులు తమ కుటుంబాన్ని పోషించుకోవడాన్ని మేము సులభతరం చేయబోతున్నాము” అని ర్యాలీలో మమ్దానీ అన్నారు. “మా స్టోర్లలో గుడ్లు చౌకగా లభిస్తాయి. బ్రెడ్ కూడా చౌకగా ఉంటుంది” అని తెలిపారు.
లా మార్కెటా: నూతన స్టోర్ వేదిక..
దశాబ్దాలుగా, పార్క్ అవెన్యూ వెంబడి మెట్రో-నార్త్ రైల్రోడ్ ట్రాక్‌ల కింద “లా మార్కెటా” వ్యాపారులకు ఆతిథ్యం ఇచ్చింది. ఐదు సిటీ బ్లాక్‌ల విస్తీర్ణంలో ఉండేది.
ఇక్కడ చాలా మంది వ్యాపారులు ఉండేవారు. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ ఇది ఇబ్బందులను ఎదుర్కొంది.
ఇప్పుడు ఒక గార్డెన్ సెంటర్, ఒక వీగన్ సోల్ ఫుడ్ షాప్‌తో సహా తక్కువ దుకాణాలతో చిన్న ప్రదేశంగా మిగిలిపోయింది.
మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించబోయే కొత్త కిరాణా దుకాణం ప్రాథమిక సరుకులపై రాయితీలు ఇవ్వాలని, అలాగే “నాణ్యమైన ఉద్యోగాలను” కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు మమ్దానీ చెప్పారు.
ఆ దుకాణానికి అద్దె, రియల్ ఎస్టేట్ పన్నులను మునిసిపల్ కార్పొరేషన్ రద్దు చేస్తుంది. ఆ దుకాణం ఒక ఖాళీ స్థలంలో నిర్మిస్తారు. దీనివల్ల ప్రస్తుత వ్యాపారులు స్థానభ్రంశం చెందరు అని మమ్దానీ చెప్పారు.
నిరుపేదలకు నాణ్యమైన ఆహారం..
ఈస్ట్ హార్లెమ్ పేదలు అత్యధికంగా నివాసముంటున్న ఒక వైవిధ్యభరితమైన ప్రాంతం.
స్థానిక నగర మండలి సభ్యురాలు ఎల్సిక్ ఎన్కార్నేషన్, ఆ దుకాణం గురించి తాను ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.
“దీని అర్థం, సాంస్కృతికంగా కూడా ప్రాసంగికంగా ఉండే, సరసమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఆ దుకాణంలో అందుబాటులో ఉంటుంది”అని ఆమె అన్నారు.
ధరలను తగ్గించడానికి, సూపర్ మార్కెట్లు అరుదుగా ఉండే ‘ఫుడ్ డెజర్ట్స్’ అని పిలవబడే ప్రాంతాల సమస్యను పరిష్కరించడానికి, నగరాలచే నిర్వహించబడే కిరాణా దుకాణాల ఆలోచన జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.
అట్లాంటా గత సంవత్సరం తన మొదటి మునిసిపల్ కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. చికాగోలో ఒక దుకాణానికి సంబంధించిన ప్రణాళికలు నిలిచిపోయాయి.
విమర్శలు, సవాళ్లు..
నగరపాలక సంస్థ దుకాణాలు నిర్వహిస్తే ప్రైవేట్ వ్యాపారాలకు నష్టం కలిగిస్తాయని మమ్దానీ విమర్శకులు హెచ్చరించారు. వారిలో ఒకరు, నగరంలో రెండు సూపర్ మార్కెట్ల యజమాని అయిన రిపబ్లికన్ జాన్ కాట్సిమాటిడిస్, ఇవి “పాత సోవియట్ యూనియన్ నాటి రొట్టె కోసం బారులు తీరే పరిస్థితికి” దారితీయవచ్చని కూడా విమర్శించారు.
నగర యాజమాన్యంలోని కిరాణా దుకాణాలు ధరలను గణనీయంగా తగ్గించగలవా? ఎనిమిది మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో ఐదు దుకాణాలు కొంతైనా మార్పు తీసుకురావడానికి సరిపోతాయా? అని మరికొందరు ప్రశ్నించారు.
నగరం తీవ్రమైన బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నందున, మమ్దానీ ఈ దుకాణాలను తెరవాలని చూస్తున్నారు.
దుకాణాల నిర్మాణం కోసం ఆయన 70 మిలియన్ డాలర్ల మూలధన నిధులను ప్రతిపాదించారు. దీనికి నగర మండలి ఆమోదం అవసరం.
కౌన్సిల్ స్పీకర్ జూలీ మెనిన్ తరఫు ప్రతినిధి మాట్లాడుతూ, ఆమె ఈ ప్రణాళికను సమీక్షించి, “వినియోగదారులు, బోడెగాస్తో సహా స్థానిక చిన్న వ్యాపారాలపై” దాని ప్రభావాన్ని పరిశీలిస్తారని తెలిపారు.
“మన నగరం ఆర్థిక, జీవన వ్యయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నందున, ఖర్చులను తగ్గించడానికి, ఆహార అభద్రతను పరిష్కరించడానికి నగర మండలి బాధ్యతాయుతమైన పరిష్కారాలను గుర్తిస్తోంది” అని మమ్దానీ అన్నారు.
ఆర్థిక అంచనాలు, భవిష్యత్ కార్యాచరణ..
ఐదు దుకాణాలను నిర్వహించడానికి సంవత్సరానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఎన్నికల ప్రచార సమయంలో మమ్దానీ అన్నారు.
కార్మికుల వేతనాలతో కలుపుకొని ఈ ఖర్చు సంవత్సరానికి కనీసం వంద మిలియన్ డాలర్లు ఉండవచ్చని ఆహార నిపుణులు అంచనా వేశారు.
ఆహార వ్యాపారాలపై దృష్టి సారించే కొలంబియా బిజినెస్ స్కూల్లోని అనుబంధ అసోసియేట్ ప్రొఫెసర్ స్టీఫెన్ జాగోర్ మాట్లాడుతూ- కిరాణా దుకాణాలను నడపడం కష్టమని, వాటికి తక్కువ లాభాలు వస్తాయని అన్నారు.
ఆమ్ట్రాక్ వంటి ఇతర ప్రభుత్వ-మద్దతుగల సేవల మాదిరిగానే, ఈ దుకాణాలకు కూడా సంవత్సరాల తరబడి ఆర్థిక సహాయం అవసరమవుతుందని ఆయన చెప్పారు.
అదే సందర్భంలో “ఈ దుకాణాలు ధరల స్థిరత్వాన్ని అందించడంతో పాటు, ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నగరవాసులకు నాణ్యమైన పండ్లు, కూరగాయలను అందించగలవు”అని ఆయన చెప్పారు.
“ఇది ఒక రాజకీయ వివాదాంశం కాబోతోంది. దీనికి సబ్సిడీ ఇవ్వడాన్ని వ్యతిరేకించే వారు ఉంటారు” అని విమర్శకులను ఉద్దేశించి మమ్దానీ అన్నారు.
ఆహార లభ్యతను మెరుగుపరచడానికి పనిచేసే లాభాపేక్షలేని సంస్థ అయిన కమ్యూనిటీ ఫుడ్ అడ్వకేట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిజ్ ఆక్లెస్ మాట్లాడుతూ, “ఈ స్టోర్ ఒక కీలకమైన మొదటి అడుగు” అని అన్నారు.
భవిష్యత్తులో నగరంలో 20 మునిసిపల్ యాజమాన్యంలో స్టోర్ల నెట్వర్క్ ఏర్పడుతుందని ఆమె అన్నారు. “వివిధ ఆదాయ వర్గాల న్యూయార్క్ వాసులు నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్నారు” అని ఆమె అన్నారు.
దుకాణాన్ని నడపడానికి ఒక నిర్వాహకుడిని ఎంపిక చేయాలని నగరం యోచిస్తోంది. ఈ వేసవిలో కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తుంది.
సైనిక సభ్యులకు, మాజీ సైనికులకు తక్కువ ధరలకు సరుకులు అందించేందుకు రక్షణ శాఖచే నడపబడే కమీషనరీ కిరాణా దుకాణాలతో సహా వివిధ నమూనాలను నగర అధికారులు పరిశీలించారు.
ఈస్ట్ హార్లెమ్‌లోని మార్కెట్ మొదట 1936లో ప్రారంభమైంది. అప్పట్లో అది వేరే పేరుతో పనిచేస్తూ, తోపుడుబండి వ్యాపారులకు కేంద్రంగా ఉండేది.
నగర ఆర్థిక అభివృద్ధి సంస్థ ఈ మార్కెట్‌ను నిర్వహించేది.
“నగరవ్యాప్తంగా ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు ఉన్నాయి. ధరలను అదుపులో ఉంచే ప్రయత్నాలలో భాగంగా నగర మండలి ఈ ప్రణాళికకు మద్దతు ఇస్తుంది”అని తాను నమ్ముతున్నట్టు శ్రీమతి ఎంకార్నేషన్ చెప్పారు.
“మా జిల్లా అంతటా క్యూలు పెరుగుతున్నాయి” అని ఆమె అన్నారు. “ఆ క్యూల పట్ల ఇప్పటికీ ఒక రకమైన అపనమ్మకం ఉంది. అలాగే అది బహిరంగంగా ఉన్నప్పుడు సహాయం కోరడానికి సంకోచం కూడా ఉంది” అని ఆమె అన్నారు.
(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఏప్రిల్ 14న ఎమ్మా జీ ఫిట్జ్సిమన్స్ రాసిన వార్తకు స్వేచ్ఛానువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
