తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు గత మూడు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె ముగిసింది. 24వ తేదీ రాత్రి దాకా కార్మిక సంఘ నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలలో ఒక ఒప్పందం కుదరటం హర్షనీయం.
ధైర్యంగా, వీరోచితంగా పోరాడి విజయం సాధించిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సోదర, సోదరీమణులందరికీ జేజేలు. వారికి నాయకత్వం వహించిన కార్మిక సంఘ నాయకులకు హృదయపూర్వక అభినందనలు.
కొంత తాత్సారం చేసిన ఒప్పందానికి సహకరించిన మంత్రివర్గ ఉప సంఘానికి, మొత్తంగా ప్రభుత్వానికి అభినందనలు.
ఒక విషాదం మిగిల్చినప్పటికీ పోరాటం విజయవంతం కావడం ఆహ్వానించదగినది. కార్మికులు సమైక్యంగా పోరాడితే తప్పనిసరిగా విజయాలు సాధిస్తారని ఈ పోరాటం మరొకసారి కార్మిక వర్గానికి రుజువు చేసింది.
యాజమాన్య వైఖరి – చట్టబద్ధమైన క్రతువు..
చట్ట ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కార్మిక శాఖ కన్సిలియేషన్ నిర్వహించాలి. సమ్మె నోటీసు ఇచ్చిన సంఘాలు, ఆర్టీసీ యాజమాన్యం దానికి హాజరు కావాలి.
ఆ కన్సిలియేషన్లో సమస్యలు పరిష్కారం అయిన దాఖలాలు దాదాపు లేవు. అయినా అది చట్టం ప్రకారం నిర్వహించాల్సిన ఒక క్రతువు. కానీ ఆర్టీసీ యాజమాన్యం సమావేశాలకు హాజరు కాలేదు.
గత ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లు లేవని చెప్పిన పరిస్థితి యథాతథంగా కొనసాగుతూ ఉండటం కారణమా? లేక సంఘాలన్నీ ఐక్యంగా లేవు, కొన్ని సంఘాలు మాత్రమే సమ్మె నోటీసు ఇచ్చాయి అని భావించారా? తెలియదు.
కారణం ఏమైనప్పటికీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కన్సిలియేషన్ సమావేశాలకు రాకుండా ఉండే అవకాశం లేదు.
ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఆర్టీసీ యాజమాన్యం ఆ వైఖరి తీసుకొని ఉండాలి.
ఆచరణలో జరిగిందేమిటి?..
కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం లేకపోయింది. అయినప్పటికీ, సంస్థ, కార్మికుల ప్రయోజనాలను ప్రధానంగా గమనంలోకి తీసుకొని సమ్మె నోటీసు ఇవ్వని సంఘాలు కూడా సమయస్ఫూర్తితో సమ్మెకు మద్దతును తెలియజేసి సమ్మెలో పాల్గొన్నాయి.
ఆ విధంగా ప్రభుత్వ ఎత్తుగడల్లో ప్రారంభంలోనే ఒక ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోయినప్పటికీ, తమను వేధిస్తున్న సమస్యలు పరిష్కారం కావాలని ఆందోళన, ఆవేదన, అకుంఠితమైన దీక్షతో కార్మికులు ఉన్నారు.
సమ్మె నూటికి నూరు శాతం జయప్రదం కావడమే దానికి నిదర్శనం.
ప్రభుత్వ ఎత్తుగడలు – పెరిగిన ఒత్తిడి..
అందుకే ప్రభుత్వం మేల్కొని 21వ తేదీ రాత్రికి అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ కార్మిక సంఘాలతో మాట్లాడటం జరిగాయి.
కమిటీ ఏర్పాటు చేశాం, ఒక నెల రోజులు గడువు అడిగాం, అయినా వినకుండా కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయి అని కార్మిక సంఘాల మీద నెపం నెట్టి తప్పుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది.
సమ్మె విజయవంతం కావడం, పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలియజేయడం కార్మికులకు ధైర్యాన్ని ఇచ్చింది.
కార్మికులను ఒంటరి పాలు చేయాలనే ప్రభుత్వ పన్నాగం బెడిసి కొట్టింది.
ఈ దశలో శంకర్ గౌడ్ ఆత్మహత్య పరిస్థితిని మరింత ఉధృతంగా మార్చింది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దాని ఫలితమే మంత్రివర్గ ఉపసంఘ నియామకం, ఒప్పందం సాధ్యమైంది.
అమలులో చిత్తశుద్ధి – భవిష్యత్ కర్తవ్యం..
కార్మిక సంఘాలు కూడా ఈ అనుభవాలను గమనంలోకి తీసుకుంటాయని ఆశిద్దాం. చర్చలలో అంగీకరించిన అంశాలు యథాతథంగా వ్రాతపూర్వక ఒప్పందంలో రావాలి.
ఇది ఉద్యమంలో మరొక ముఖ్యమైన అంశం. రాతపూర్వక ఒప్పందంలో అంగీకరించిన అంశాలు నిజమైన స్ఫూర్తితో నిర్ణీత సమయంలోగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
కార్మిక సంఘాలు అందుకు అవసరమైన కసరత్తును చేయాలి. కార్మికులు కూడా నిరంతరం జాగృతితో ఉండాలి.
అప్పుడే సమ్మె పోరాట విజయం నిజమైన ఫలితాలను ఇస్తుంది. అదే డ్రైవర్ శంకర్ గౌడ్‌కు అర్పించగలిగిన నిజమైన నివాళి అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
